25, ఏప్రిల్ 2022, సోమవారం

మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై పాట | డాక్టర్‌ చక్రవర్తి సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ |

పాటలో ఏముంది?

తమపైన తమకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం!, ఎవరికివారు తమతో తాము ఎంత సేపని మాట్లాడుకుంటారు? జీవితానుభూతులన్నింటినీ తన ఒక్క మనసులోనే నింపుకుంటూ ఎంత కాలమని ప్రయాణిస్తారు? ఇది బాగా విసుగు పుట్టించే విషయమే! అందుకే, మనసు పంచుకునే మరో మనిషి కోసం ప్రతి ఒంటరి మనసూ వీలు చిక్కినప్పుడల్లా వెతుక్కుంటూనే ఉంటుంది. చీకటి వెలుగుల్లోనూ, కష్టసుఖాల్లోనూ వెన్నదన్నుగా ఉండే ఒక   నిండు ప్రేమమూర్తి కోసం ఎడతెగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటుంది. కాకపోతే, పక్కా చిరునామా ఏదీ లేని ఈ వెతుకులాట కొంత కష్టమైనదే! అయితే, ఒకటి మాత్రం నిజం! ఒక మహా తపస్సులా సాగిన  ఏ అన్వేషణా ఎప్పటికీ  వృధా పోదు. తాను అంతగా కోరుకున్న ఆ ప్రేమమూర్తి కాస్త ఆలస్యంగానే అయినా,  ఎక్కడో, ఎప్పుడో ఎదురుబడకుండా ఉండదు. మనసంతా వ్యాపించకుండా ఉండదు. ఆ తర్వాత అయినా జీవితం తాలూకు వ్యధలూ బాధలూ అసలే ఉండవని కాదు గానీ, మొత్తంగా చూస్తే ఆశించిన ఆ ఆనందానుభూతి ఏదో ఒక స్థాయిలో లభించే తీరుతుంది. అప్పటిదాకా ఆమె కోసమైన అతని అందమైన కల కొనసాగుతూనే ఉంటుంది. నిలువెల్లా పెనవేసుకుపోయిన ఆ అందమైన కలే 1964లో విడుదలైన ’డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాలోని ఈ  పాటలో కనిపిస్తుంది.
                 
 శ్రీశ్రీ రాసిన ఈ పాటను సాలూరి రాజేశ్వరరావు స్వరబద్దం చేస్తే, జీవితపు మధుర జ్వాలల్ని తన గొంతులో ఎంతో మనోహరంగా పలికించాడు ఘంటసాల. ఆ రసానంనద  ఝరుల్లో తేలాడటం తప్ప ఇప్పుడు మన కింక వేరే ధ్యాస ఏముంది? ఎవరు ఏమనుకుంటే ఏమవుతుందిలే గానీ,  భూమ్యాకాశాలను ఏకం చే స్తున్న ఆ రసానందసీమే ఇప్పుడు మనకున్న ఏకైక  లోకం!

మనసున మనసై...!!

మనసున మనసై ....,  బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ ...,  అదే స్వర్గమూ // మనసున //

బ్రతుకు ... నేల, 
మనసు ... ఆకాశం.

మట్టితో మట్టి కలిసిపోయినట్లు  బ్రతుకుతో బ్రతుకు సునాయాసంగానే కలిసిపోతుంది. కానీ, మనసుతో మనసు కలిసిపోవడమే ఎంతో కష్టమవుతుంది.  ఎందుకంటే ఏ మన సైనా ఒక మహా అంతులేని ఆకాశం కదా! ఆకాశం అంటే ఉత్తి శూన్యం అని కూడా కాదు! అది కోటానుకోట్ల గ్రహాల సమేతం. అనంత కోటి నక్ష త్రాల ఆవాసం. అందులోని,  దాన్నో దీన్నో మన సౌకర్యార్థం, అటో ఇటో కదల్చడం,  నేల మీదున్న వాగుల్నో, వంపుల్నో పక్కదోవ పట్టించినంత సులభం కాదు మరి! మానవుడి హృదయాకాశం పరిస్థితి కూడా దాదాపు ఇదే! ఎందుకంటే,  ప్రతి వ్యక్తీ  వేవేల అభిప్రాయాల్నీ ఆలోచనలల్నీ, ఆశయాల్నీ,  అన్నింటినీ మించి అనేకానేక లక్ష్యాల్నీ, సిద్ధాంతాల్నీ తన హృదయాకాశంలో ఎంతో బలంగా ప్రతిష్టించుకుని ఉంటాడు. ఎవరైనా ఏ కారణంగానో వాటిని కదిల్చే ప్రయత్నం చేస్తే అది అంత సులభంగా జరిగే పని కాదు. ఒక రకంగా ఆ ప్రయత్నం,  ఉప్పెనను ఎగదోయడం లాంటిది. అగ్ని సరస్సును జీవన స్రవంతిలో కలిపేయడం వంటిది. వింత ఏమిటంటే, ఆకాశం అంత గొప్పదే అయినా, ఎప్పుడైనా తనకు తానుగా ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, ఆ మార్చుకునే శక్తి మాత్రం ఆ  ఆకాశానికి ఉండదు. కానీ, అంతో ఇంతో ఉంటే ఆ అవకాశం మనిషికే ఉంటుంది. ఆ సావకాశాలన్నింటినీ ప్రోగు చేసుకుని, తన ప్రేమమూర్తిని గుండెల్లోకి తీసుకునే ప్రయత్నంలో అతని మనసు ఏ మాత్రం వెనుకాడదు. తన సర్వ శక్తులూ వెచ్చించి ఆ ఆనంద మూర్తిని సాధించే తీరతాడు. అప్పుడింక మనసూ, బ్రతుకూ ఆనందంగా కలగలిసిపోయిన ఆ  మహా సౌభాగ్యాన్ని అతడు  తనివితీరా ఆస్వాదిస్తాడు. ఆ మాధురీ హృదయ నాదంలో ఓలలాడుతూ జీవితమంతా హాయిగా గడిపేస్తాడు.  

ఆశలు తీరని ఆవేశములో - ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

కలగన్న ఆశలు గానీ, ఆశయాలు గానీ,  మొత్తంగా నెరవేరిన దాఖలాలు ఏ జీవితంలోనైనా ఉన్నాయా? అంటే,  అసలే లేవు.  ఏ ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా,   ఎంత గొప్ప అనుభపజ్ఞుడైనా సరే అతడు కలగన్న వాటిలో పది శాతమైనా నెరవేరవు. సమస్య ఏమిటంటే, చాలా మందిలో ఆ నెరవేరిన సంతోషమేమీ  పెద్దగా ఉండదు గానీ,  నెరవేరని వాటి తాలూకు వ్యధల్లో మాత్రం వారు బాగా కూరుకుపోతారు. ఇది మనసు సహజ గుణం. అయితే ఎవరి ఆశలు ఎందుకు నేరవేరలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెబుతాం? ఎవరి వైఫల్యాల వెనుక ఏ బలమైన కారణాలు ఉన్నాయో వాటి గురించి ఎవరికి వారు తెలుసుకోవలసిందే తప్ప అవి ఎదుటివారు చె ప్పగలిగేవి కాదు. ఎవరి అంచనాల మాట ఎలా ఉన్నా, నెరవేరని ఆశలు, చేజారిపోయిన విజయాలు, ఏ మనసునైనా కలత పెట్టకుండా ఉండవు. జీవితాన్ని ఏదో ఒక మేరకు అల్లకల్లోలం చేయకుండా ఉండవు.  ఆ కల్లోల హృదయంలో నిజంగా ఒక లావాలాంటి ఆవేశమే  పుడుతంది.  ఆక్రోశమే కాదు దాని వెనకాల అంతులేని ఆవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిసిన ఒకానొక దశలో లోకమంతా ఏదో  కారుచీకట్లు కమ్మేసినట్లే  అనిపిస్తుంది.. మనసు అయోమయంలో పడిపోతుంది. ఇలాంటి పరిణామాల్లో  చాలా మందిని  ఏకాంతం కాదు, ఒక కీకారణ్యం లాంటి  ఏకాకితనం కమ్ముకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మహా కాంతిపుంజంలా  ఒక హృదయ మూర్తి  ఎవరైనా, తన ఒంటరి లోకంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది?  ఎప్పటికీ వీడని ఒక తోడై నిలిస్తే ఎలా ఉంటుంది? వారి జీవితాల్లో  అక్షరాలా అది ఒక మహోత్సవమే ... వారి జీవనయానంలో అదో స్వర్గధామమే! 

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు - నీ కోసమే కన్నీరు నింపుటకు 
నేనున్నానని నిండుగ  పలికే 
తోడొక రుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

కాదనడానికి ఏముంది? ప్రతి వ్యక్తీ ఒక ప్రత్యేక ప్రపంచమే! అలా  ఒక ప్రపంచంగా విరాజిల్లే ఆ వ్యక్తిలో కచ్ఛితంగా కొన్నయినా ఇతరులు అతన్ని ప్రేమింపచేసేవిగా ఉంటాయి.  ఆ మాటకొస్తే, అతన్ని  ద్వేషింపచేసే అంశాలు కూడా ఏదో ఒక మేర అతనిలో ఉంటాయి. కాకపోతే,  లోకంలో నీ సామర్థ్యాల్ని ప్రశంసించే వాళ్లు అతి స్పలం్పగానూ, నీ  లోపాల్ని చూసి నిన్ను విమర్శించేవాళ్లు అత్యధికంగానూ ఉంటారు. అలాంటప్పుడు జీవన నేస్తాలు, కుటుంబ సభ్యులు, అయినవాళ్లూ, ఆత్మీయులు  కూడా ఆ ద్వేషించే వారి గుంపులో చేరిపోవడం అవసరమా? అతని వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే, సానుభూతితో వాటిని అధిగమించే సాయం అందించాలి గానీ, అతన్ని, దోషిలా చూస్తూ ఉండిపోతే ఎలా? ఇప్పటిదాకా  నీవాళ్లుగా, నీ ఆత్మీయులుగా చలామణీ అయిన వారు, నీ లోపాలకు అతీతంగా  నిన్ను చూడగలగాలి! నిన్ను నిన్నుగా ప్రేమించగలగాలి. లోకానిది ఏముంది?  దానికి వేయి నాలుక లు. . ఒక్కో సమయాన. అది ఒక్కోలా మాట్లాడుతుంది. నిన్న మొన్నటిదాకా నిన్ను ఎంతగానో శ్లాఘించిన  ఆ వర్గమే ఉన్నట్లుండి, నీ పైన కత్తికట్టవచ్చు. దారుణంగా హింసించనూవచ్చు.. దాంతో అప్పటిదాకా  అందరిలా నేనూ ఈ ప్రపంచంలో సమ భాగస్తుణ్ణే అనుకుంటూ వచ్చిన వాడు కాస్తా,  నాకెవరూ లేరు. ఈ ప్రపంచానికి నేను పూర్తిగా  పరాయివాణ్ననుకునే స్థితికి వచ్చేస్తాడు. కొందరైతే లోకాన్ని మొత్తంగానే  ఏవగించుకుని,  లోకాన్నే వదిలేయాలనుకుంటారు!  సరిగ్గా ఆ స్థితిలో ఎవరో వచ్చి, నీకు దాపుగా నిలబడి, ఎప్పటికీ నీకు  అండదండగా ఉంటానంటూ ఒక పూర్తి స్థాయి భరోసా ఇస్తే అప్పుడింక అంతకన్నా ఏం కావాలి? ఆరోహణలోనూ, అవరోహణలోనూ, జీవితపు అన్ని దశల్లోనూ, అన్ని దారుల్లోనూ, నీతో కలిసి నడుస్తానన్న ఆ  మనిషి ఏకంగా  నీ జీవితంలోకే ప్రవేశిస్తేనో...! అప్పటి వారి మనస్థితిని ఆనందమనే ఆ అతిసాధారణమైన మాటతో  కాకుండా దానికి  వేయింతలు గొప్పదైన మరే మాటైనా చెప్పుకోవాలి!    

చెలిమియె కరువై, వలపే అరుదై  - చెదరిన హృదయమే శిలయైు పోగా
నీ వ్యధ తెలిసి, నీడగ నిలిచే 
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే అది నిత్య పరిణామశీలి. ఒకసారి అది పూవులా ఉంటుంది. ఒకసారి అగ్ని గుండంలా ఉంటుంది.  ఒక్కోసారి,  ఇంకాసేపట్లో వ ర్షించి మహోత్పాతాన్నే సృష్టిస్తుందనిపించే భీకర ఆకాశంలా ఉండి మరికాసేట్లో అదేమీ లేని ఒక  మహా యోగినీ హృదయంలా దర్శనమిస్తుంది.  ప్రేమ ఒక్కోసారి మహోత్తుంగ తరంగంలా ఎగిసినట్లే  ఎగిసి అంతలోనే సముద్రంలో కలిసిపోయి, పరమ నిర్మలత్వాన్నీ, నిశ్చలత్వాన్నీ ప్రదర్శిస్తుంది. ఏమైనా, అప్పటిదాకా ఆకాశ వీధుల్లో విహరించిన ప్రేమ ఏ కారణంగానో అక్కడి నుంచి దిగిరావడానికి పూనుకున్నా, కనీసం అది నే లపైనైనా ఉండిపోవాలి కదా! అలా కాకుండా నేరుగా అది పాతాళంలోకే జారిపోతే ఎలా? నిన్నమొన్నటి దాకా  హృదయంలో హృదయంగా, జీవితంలో జీవితంగా ఉన్న ఇలాంటి అనేక మంది, ఒక్కోసారి  హఠాత్తుగా ఇలా ఎందుకు దూరమైపోతారు? ... అంటే ఏం చెబుతాం?  ఎవరి పరిస్థితులు వారివి! నిజానికి, ఇరువురూ ప్రేమలో పడిన నాడు ఇవన్నీ లేవు మరి! అప్పుడు  లేని  ఈ తరహా పరిణామాలెన్నో ఆ తర్వాత ఒక్కొక్కటిగా వచ్చిపడుతుంటాయి. వాస్తవానికి, అలా మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోవాలి. కానీ, అవి అలా పోకపోగా,  ఇంకా లోలోతులకు పాతుకుపోతాయి. వాటిని  నిరోధించే ఏ ప్రయత్నమూ ఏ వైపునుంచీ ఎవరూ చేయకపోతే,  ఇలా కాక ఇంకేమవుతుంది? ఇదంతా చాలదన్నట్లు,, కొందరు నిలువెత్తు విద్వేషాలూ, ఆగ్ర హాలూ ఎగజిమ్ముతారు. . నిజానికి హృదయ బంధాల్ని  పైపైనే చూస్తూ  రగిలిపోయేవారే  తొందరపడి బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతారు. అలా కాకుండా,  అంతరంగపు లోలోతుల్లోకి  వెళ్లి , వ్యధను, అంతర్వేదననూ ఆమూలాగ్రం అర్థం చేసుకున్న వారైతే అలా వెళ్లలేరు.  పైగా నీ సమస్త క్షోభల్ని  రూపుమాపి  పూర్వవైభవంతో మళ్లీ నిన్ను నిలబెట్టడానికి తమ సర్వశక్తులూ ధారవోస్తారు. ఆ ప్రయత్నంలో రోజులూ నెలలే కాదు. జీవితకాలమంతా నీతోనే,  నీలోనే ఉండిపోతారు. ఆ క్రమంలో సమస్త సంకెళ్ల నుంచి  నీకు విముక్తి కలిగించి,  నీకు  నీడనిస్తారు. నీ మనసుకు ఓదార్పునిస్తారు. నీ చుట్టూ వేల ప్రభాకరుల్ని నిలబెట్టి,  నీ దారిపొడవునా ఒక ఉజ్వల కాంతినీ, నీ జీవితానికి ఒక నిండు శాంతినీ  ప్రసాదిస్తారు. ఒక మహోజ్వలమైన భావనా స్రవంతిలో మనసున మనసైపోవడం అంటే ఇదే మరి!!

- బమ్మెర 

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా

      

20, ఏప్రిల్ 2022, బుధవారం

ఈ జీవన తరంగాలలో పాట | జీవన తరంగాలు సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ |

పాటలో ఏముంది? 

చిత్రం: జీవన తరంగాలు (1973), గీతం: ఆత్రేయ, సంగీతం: జె.వి. రాఘవులు, గానం: ఘంటసాల 

లోకంలో ఏదీ ఎవరికీ సొంతం కాదు. ఏదీ ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోదు. ఇది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఎవరైనా వేటితోనో మరీ గాఢంగా పెనవేసుకుపోతుంటే, అంత మమకారం సరికాదని లోకం అప్పుడో ఇప్పుడో  చెబుతూనే ఉంటుంది. ఆ మాటలు సరిగా మనసుకు పట్టాలే గానీ, అప్పటిదాకా బిగదీసుకుపోయిన జీవన బంధాలు కచ్ఛితంగా ఎంతో కొంత సడలిపోతాయి. కాకపోతే, బంధాలన్నీ అలా  సడలిపోయాక జీవితం పట్ల ఆసక్తిగానీ, ఆరాటం గానీ ఏముంటాయి? అనిపించవచ్చు. నిలువెల్లా నైరాశ్యం కమ్ముకుంటుందేమోనన్న బెంగ కూడా పట్టుకోవచ్చు. అలా అని జీవితం నుంచి ఎవరూ పారిపోలేరు. పారిపోకూడదు కూడా. అలాంటప్పుడు ఇదంతా ఒక ఆట, ఇదో చదరంగం అనుకుంటే అప్పుడు సరదాగానే అడేయవచ్చు. ఆటలో ఎవరు ఓడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరి జీవితం ఆనందమయం అవుతుందో, ఎవరి జీవితం  విషాదకరం అవుతుందో ఏదీ ఊహించలేం! కాకపోతే ఇదో ఆట అని ముందే అనుకుంటే, ఓటమి కూడా కుంగదీయదు. విషాదం కూడా బాధించదు. ఏది ఏమైనా,  ఓటమి గెలుపులతో గానీ, సుఖ దుఃఖాలతో గానీ,  సంభందం  లేకుండా ఎవరికి వారు ఎంతో బాధ్యతగా  జీవన చదరంగాన్ని ఆడాల్సిందే! ఫలితాలు ఎలా ఉన్నా,  అన్నింటికీ  సిద్దం కావలసిందే!
                       1973 లో విడుదలైన ’ జీవన తరంగాలు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాటను జె. వి. రాఘవులు స్వరపరిస్తే, స్వరధుని ఘంటసాల జీవన గాంభీర్యాన్నంతా పొదిగి ఈ పాటను గానం చేశారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ఈ పాటను ఈ పూట మరోసారి వినేద్దాం మరి!!

ఈ జీవన తరంగాలలో...

ఈ జీవన తరంగాలలో.... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము - ఎంతవరకీ బంధ ము // ఈ జీవన తరంగాలలో //

ఎగిసి ఎగిసి పడుతూ సాగే తరంగాలు, పైపైన చూస్తే,  దేనికది వేరేవేరేమో అనిపిస్తాయి. కానీ, అవన్నీ ఆ నదిలో లేదా సముద్రంలో అంతర్భాగమే కదా! నిజానికి ఆ ఎగిసి పడే తరంగాల్లో  అహం ఏమీ ఉండదు. సముద్రమే లేకపోతే, తమకు ఈ అస్తిత్వమే లేదనే మూలసత్యాన్ని ఎగిసి ఎగిసినట్లే ఎగిసి మళ్లీ పడిపోయిన ప్రతిసారీ గుర్తు చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే, ఉన్నట్లుండి ఒక్కోసారి నది నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా పలు  రకాల విన్యాసాలు చేసిన అలలన్నీ కనిపించకుండా పోతాయి. ఉన్నట్లుండి అవి హఠాత్తుగా అదృశ్యమైపోవడం చూసిన వాటి మనసు ఎంతో కొంత అలజడికి గురికావచ్చు. అయితే,   నీటి ప్రవాహంలోకి గాలి చొరబడినప్పుడే ఈ అలలు అవతరిస్తాయనే అసలు నిజం కాస్త ఆలస్యంగానైనా  స్పురించకపోదు. చొరబడిన గాలి వెనుదిరిగిన ఫలితమే ఈ నిశ్చలత్వానికి కి కారణమని బోధపడకుండా ఉండదు. మనిషి ప్రాణమైనా అంతే కదా! ఊపిరి ఉన్నంత సేపే మానవాళిలో ఉరుకూ పరుగులు ఉంటాయి. ఊపిరి ఒక్కసారి ఆగిపోగానే అంతా నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా మహోత్తుంగ తరంగంగా సాగిన జీవనది  మైదాన భూమిలా మారిపోతుంది. ఎడారిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత క్రమం ఉండనే ఉంటుంది.  జీవమే ఆగిపోయాక జీవన బంధాలన్నీ సమసిపోతాయి. అయినా,  ఎవరెంత ఆశపడితే మాత్రం ఏముంది?  భూమ్మీద మొదలైన బంధాలు మనిషి భూమ్మీద సచైతన్యంగా ఉన్నంత కాలమే ఉంటాయి. ఆ ఉపరితలం వదిలేసి, పాతాళంలోకో, ఆకాశంలోకో వెళ్లిపోయాక అన్ని బంధాలూ ఒక్క ఉదుటున తెగిపోతాయి. ఇవి ఎంత చేదునిజాలైతే మాత్రం ఏముంది? అందరూ ఈ పరిణామాలను స్వీకరించాల్సిందే. మనసును నిబ్బర పరుచుకోవలిసిందే!

కడపు చించుకు పుట్టిందొకరు - కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు - ఆ పై నీతో వచ్చేదెవరు
ఆపై నీతో వచ్చేదెవరు //ఈ జీవన తరంగాలలో // 

బిడ్డలు చెట్టంత అయ్యేదాకా కన్నవాళ్లు కళ్లల్లో పెట్టుకుని పెంచుతారు. కానీ, ఉన్న్డట్లుండి వారు హఠాత్తుగా కనిపించకుండా పోతే వాళ్లకెలా ఉంటుంది? కడుపున పుట్టిన వాడు తాము కడతేరే దాకా  తమ పంచనే ఉండాలని ఏ కన్నవాళ్లయినా కోరుకుంటారు. అది  అత్యంత సహజం!  కానీ, అందుకు భిన్నంగా తమ కళ్లముందే వాళ్లు జీవచ్ఛవాలైపోతుంటే ఎలా జీర్ణించుకోగలరు? మనసు మండినప్పుడు మనిషి చిత్రమైన వాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాం కానీ,  నిజానికి, ఆ చిత్రమైన స్థితి ఆ మనిషిది కాదు, అతని చుట్టూ ఆవరించి ఉన్న అతని జీవితానిది! అది బాహ్య ప్రపంచానికీ, అంతర ప్రపంచానికీ మధ్య నిరంతరం ఒరుసుకుపోతూ  సాగే  బండిచక్రపు ఇరుసు కదా! ఆ ఒరుసులాటలో జీవితం  ఎప్పుడు ఏ వైపు ఒరిగిపోతుందో తెలియదు.  చివరికి ఆ ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఆకులు దేనికది ఊడిపోయి ఎక్కడ  పడిపోతాయో కూడా  ఎవరూ ఊహించలేరు. విధి భీషణంగా మారినప్పుడు రక్తబంధాలన్నీ, కన్నబిడ్డలతో సహా ఎండుటాకుల్లా ఎటో కొట్టుకుపోవచ్చు. ఒక్కొక్కటిగా శూలాలై దిగుతుంటే,  త ట్టుకోలేని గుండె తడారిపోయి ప్రాణం ఆవిరైపోదా? అంతిమంగా స్మశానానికి చేరుకోవలసిందేగా, అయితే, అక్కడికి చే రవేయడానికైనా, కనీసం ఓ నలుగురైనా ఉండాలి! కన్నబిడ్డలెవరూ లేకపోయినా, ఉన్న ఆ నలుగురే  మానవ ధర్మంగా  కర్మకాండలన్నీ పూర్తి చేసి, అశ్రునయనాలతో ఆత్మకు వీడ్కోలు పలుకుతారు. మనసులో ఎవరికెంత ప్రేమ ఉంటేనేమిటి?  బహుదూరపు బాటసారి వెన్నంటి ఎవరు మాత్రం కడదాకా వెళ్లగరు? అందుకే చివరికి ఎవరికి వారు ఆ అనంతలోకాల్లోకి ఏకాకి ప్రయాణం చేయాల్సిందే!

మమతే మనిషికి బంధిఖానా - భయపడి తెంచుకు పారిపోయినా 
తెలియని పాశం వెంటబడి - రుణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది // ఈ జీవన తరంగాలలో //

కూడూ, గూడూ, గుడ్డా ఇవి భౌతికమైన బతుకునే ఇస్తాయి. కానీ అసలు మనిషి, అంటే అంతరాత్మ బతికేది మమతానురాగాల మధ్య. అయితే మధ్యలో మనసులోకి ఏ భయాందోళనలో జొరబడి మరే ఇతర కారణాల వల్లో ఈ బంధాలన్నింటికీ దూరంగా వెళ్లిపోవాలనీ అనిపించవచ్చు. తాత్కాలికంగా ఏమో గానీ, శాశ్వతంగా దూరం కావడం ఎవరికీ  సాధ్యం కాదు. భౌతికంగా ఒక వేళ దూరమైనా ఆత్మగతంగా నిరంతరం వాళ్ల మధ్యనే ఉంటారు. మనసుకలా అనిపించకపోయినా జరిగేది మాత్రం అదే! మమతల, ప్రేమపాశాల ఎత్తూ లోతుల గురించి గానీ,  వాటికున్న అపారమైన శక్తి గురించి గానీ, మనలో చాలా మందికి పెద్దగా ఏమీ తెలియదు. నిజంగా అవి అంత బలమైనవే కాకపోతే,  బంధాలకు దూరమై ఎటో వెళ్లిపోయిన వాళ్లల్లో చాలామంది చివరికి తిరిగి తిరిగి మళ్లీ  వెనక్కి వచ్చేస్తారు ఎందుకని?  ఎవరో రెక్కలు కట్టేసి,  లాక్కొచ్చినట్లు వదిలేసి వెళ్లిపోయిన చోటే వాలిపోతారెందుకుని? ఒక విషయం ఇక్కడ గమనించాలి! ప్రాణంలేని విమానాలో రాకె ట్లో  ప్రపంచాన్నంతా  చుట్టివస్తాయి కదా! పంచభూతాత్మకమై, జాజ్వల్యమానమైన ఈ  మహాప్రాణానికి ఇంకెంత వడి ఉండాలి? ఆ ప్రాణధారతో అఖండంగా వెలిగిపోతున్న ప్రేమశక్తికి ఎంత బలం ఉండాలి. కాకపోతే, ఇవేవీ, మేదోజ్ఞానానికి గానీ,  దాని తర్కానికి గానీ అంత సులువుగా అందేవి కావు.  అన్ని తర్కాలకూ అతీతమైన అంతర జ్ఞానానికీ, అందులోంచి దేదీప్యంగా వెలిగే అంతర చైతన్యానికి మాత్రమే ఇవి బోధపడతాయి! ఎవరికి వారు తమ మనసును అందుకు సిద్ధపరుచుకుంటే సరే సరి! లేదంటే  జీవితమంతా ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతారు. 

తాళి కట్టిన మగడు లే డని - తరలించుకుపోయే మృత్యువాగదు
ఈ కట్టెలు కట్టెను కాల్చక మానవు - ఆ కన్నీళ్లకు చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు // ఈ జీవన తరంగాలలో //

లోకాన్ని నడిపించే శక్తులు ఎన్నయినా ఉండవచ్చు. వాటన్నింటిలోకెల్లా అత్యంత బలీయమైనది మృత్యువేశ్రీ గమనించాలే గానీ, మృత్యువుకో నిర్దిష్టమైన విధానం,  నిఖార్సయిన తాత్వికతా కనిపిస్తాయి. ఆకాశంలోకి మేఘాలు రావచ్చు పోవచ్చు.. నక్షత్రాలు మొలవొచ్చు కనిపించకుండా పోవచ్చు. రుతువులు మారొచ్చు. వత్సరాలు మారొచ్చు. కానీ, ఉదయాస్తమయాలు మారవు కదా! వాటికో మొక్కవోని లెక్క  ఒకటుంది. ఆ మాటకొస్తే, మనిషి ఆలోచనా రీతులు మారొచ్చు. అతని మాట మారొచ్చు. మనసు ఆరాటాలు మారొచ్చు. అతని పోరాటాలు మారొచ్చు. కానీ, జనన మరణాలు మారవు కదా! వీటికి కూడా అంతే నిర్థిష్టమైన ఓ లెక్క ఉంటుంది. నిక్కచ్చితమైన ఘడియలు ఉంటాయి. అందుకే తాళి కట్టిన వాడు లేడనో, తలకొరివి పెట్టేవాడు లేడనో, మృత్యువు, అంతిమ ఘడియల్ని వాయిదా వేయదు.  అలా  ఎన్నో తెలిసి, ఎంతో ఆలోచించగలిగే మృత్యువే తన విధినిర్వహణలో ఏ సడలింపూ ఇవ్వకుండా  కఠినంగా,  అంత కచ్ఛిత ంగా ఉంటే,  ఏ ఆలోచనాలేని కట్టెలు, ఈ దేహపు కట్టెను కాల్చడంలో ఎందుకు వెనక్కి తగ్గుతాయి? అయిన వాళ్లూ, ఆత్మీయులూ కొండశోకం పెడుతున్నారని చితిమంటలు వాటికవే ఆరిపోతాయా? ఆప్తుల  కన్నీళ్లతో అవేమైనా చల్లారిపోతాయా? కాకపోతే ఇక్కడొకటి గమనించాలి. ఎంతసేపూ నిప్పు, ఒక మానవరూపాన్ని నిలువునా కాల్చి బూడిద చే స్తోంది కదా అనుకుంటామే గానీ, నిప్పు ఆ మనిషికి అలా ఓ పునర్జన్మను ప్రసాదిస్తోందన్న అసలు విషయాన్ని మనం మరించిపోతాం! కాదా మరి! లోకంలో ఏ రూపమైనా  కావచ్చు.  కాలి బూడిదైతేనే కదా అది మట్టిలో కలిసిపోతుంది! మట్టిలో కలిసిపోతేనే కదా ఎప్పుడో ఒకప్పుడు ఏదో  పాదులో కలిసి మొక్క మొలవడానికి ఆలంబన అవుతుంది. అలా ఆలంబన కావడం అంటే, అది మొక్కలో భాగం కావడమే కదా! అది  పునర్జన్మ కాక మరేమిటి?  అలా మళ్లీ మళ్లీ జన్మించి, జీవన పరంపరను అలా కొనసాగించడానికి మించి లోకంలో ఏ అస్తిత్వమైనా ఇంకా ఏం కోరుకుంటుంది? 

- బమ్మెర




8, ఏప్రిల్ 2022, శుక్రవారం

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ |

పాటలో ఏముంది? 

చిత్రం: బ్రతుకు తెరువు, గీతం: జూనియర్‌ సముద్రాల, సంగీతం: సుబ్బరామన్‌ - ఘంటసాల, గానం: ఘంటసాల 

అందమె ఆనందం....!


అందం... ఆనందం ... ఇవి మనందరం రోజూ వినే మాటలే! 

ఒద్దికైన రూపురేఖలే కావచ్చు. మనసుపడే మనోహరత్వం కావచ్చు. ఆక ర్షించేదీ, ఆహ్లాదపరిచేదీ,  పారవశ్యంలో ఓలలాడించేదే కావచ్చు. మొత్తంగా అందమంటే ఇవే కదా మన దృిష్టిలో...!  జ్ఞానుల దృష్టిలో మాత్రం వీటి అర్థాలు పూర్తిగా వేరు. ’ఇప్పటికి నిగనిగలాడుతున్నట్లే  అనిపించినా మరి కాసేపట్లోనే వడలి, వాడిపోయేది అదేమంత గొప్ప అందం? ఎప్పటికీ చెక్కుచెదరకుండా,  దినదిన ప్రవర్థమానమయ్యేదే అసలు సిసలైన అందం’ అంటారు వారు. ఈ రోజు ఎంత అపూరూపంగా అనిపించినా, ’ఏరోజుకారోజు క్షీణిస్తూపోయే భౌతిక సౌందర్యాల వల్ల ఒరిగేదేముంది? అవి ఎంతోకాలం నిలబడలేవు. దేన్నీ నిలబెట్టలేవు’ అని కూడా అంటారు. అయితే,  దినదిన ప్రవర్థమానమయ్యే ఆ లక్షణం లోకంలో సత్య జ్ఞానానికీ, సౌందర్య జ్ఞానానికే తప్ప మరిదేనికీ ఉండదని  కూడా వారు నొక్కి చెబుతారు. నిజానికి,  సత్య జ్ఞానమూ, సౌందర్య జ్ఞానమూ ఈ రెండూ ఒకటే. ఒకవేళ ఏ కారణంగానో ఈ రెండింటినీ వేరువేరే అనుకున్నా, ఈ రెండింటి మూలతత్వం మాత్రం చైతన్యమే! ఈ క్రమంలోనే ’ సత్యం - శివం - సుందరం’ అంటూ ఒక మహా వ్యాఖ్య చేస్తారు.  సర్వ సమగ్రమైన చైతన్యమే సౌందర్యం అనేది ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. అంటే ఏమిటి? దేన్నించి అయితే  ఏదీ పక్కకు వెళ్లదో, , ఏదైతే సర్వకాల,  సర్వావస్థల్లోనూ సచేతనంగా నిలిచి ఉంటుందో అదే సుందరమనేది వారి భావన.

ఏమైనా,  ’అందమె ...ఆనందం’ ఆంటూ. అలతిపొలతి మాటలతో మొదలై ....అనంతమైన ఆధ్యాత్మిక దిశగా నడిపించే  ఈ పాట సినీగీత సాహిత్యంలో ఒక కలికితురాయి.  1953 లో విడుదలైన ’బ్రతుకు తెరువు’ సినిమా కోసం జూనియర్‌ సముద్రాల  రాసిన  ఈ పాటకు.. సి.ఆర్‌. సుబ్బరామన్‌ - ఘంటసాల సంయుక్త సంగీత సారధ్యంలో ఆపాత మధురమైన బాణీయే సమకూరింది. ఈ పాటను పాడటంలో ఘంటసాల గొంతులో  నిజంగా అమృత ధారలే ఒలికాయి. అందుకే ఈ పాట ఆవిర్భవించి. ఇప్పటికి ఏడు దశాబ్దాలు కావస్తున్నా  తెలుగు వారి గుండెల పైన అది ఇప్పటికీ తేనె జల్లు  కురిపిస్తూనే ఉంది. నిజానికి, దశాబ్దాలు, శతాబ్దాలే కాదు, ఎప్పటికీ ... ఎప్పటికీ ఒక్క మాటలో  చెప్పాలంటే... భూమ్మీద తెలుగు హృదయాలు ఉన్నంత కాలం,  ఈ పాట రసఝరులు ఒలికిస్తూనే ఉంటుంది.  

అందమె ఆనందం .....
ఆనందమె జీవితమకరందం // అందమె //

నిజానికి, ’సౌందర్యమే సత్యం... సత్యమే సౌందర్యం’  అన్న వేదాంత వ్యాఖ్యానమే ఈ  పాటలోని ’అందమె ఆనందం’ అన్న పాదానికి ప్రాణమయ్యింది.  ఉన్నదంతా సత్యమే.. లేనిదే అసత్యం. ఉండడం అంటే  ఈ రోజు ఉండి, రేపటికి కనుమరుగైపోవడం అని కాదు. అనాదిగా, ఆద్యంతంగా, అజరామరంగా నిలిచి వెలగడం.  అందం అనే కాదు. అనందం కూడా అలాంటిదే! ’ఆనందం’ అన్నది అనంతం అన్న మాటలోంచే కదా  ఆవిర్భవించింది.  ఏది క్షణికం కాదో, ఏది శాశ్వతమో, ఏది అనంతమో  అదే ఆనందాన్నిస్తుందనే కదా ఈ మాటకు అర్థం? లోకంలోని సర్వ వస్తు సముదాయం, భౌతికమైన సమస్త వసతులు, సకల సౌకర్యాలూ, ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ ఇస్తూ,  మనిషికి తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలనైతే ఇవ్వగలవు. అంతే గానీ, వీటిల్లో ఏ ఒక్కటీ  శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషికి అసలు సిసలైన ఆనందాన్ని ఇవ్వగలిగే ది అభౌతికమైన,  శాశ్వతమైన, అనంతత్వ జ్ఞానమొక్కటే! ఒకటి మాత్రం నిజం! సత్యానికైనా, సౌందర్యానికైనా అంతిమ లక్ష్యం ఆనందమే!  అందుకే ఆనంద పిపాసులు ఎటెటో తిరిగి తిరిగి చివరికి  అనంతత్వాన్ని ప్రభోదించే ఆధ్యాత్మిక విషయాల్లోకే ప్రవేశిస్తారు. జీవిత మకరందమైన ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు. 

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం // అందమె //

నిజమే! రూప సౌందర్యాలూ, ప్రకృతి సౌందర్యాలూ క్షణికమైనవే, తాత్కాలికమైనవే, కాకపోతే మనిషి వాటినుంచి కూడా స్పూర్తి పొందవచ్చు. తన మనసును కూడా పడమట సంధ్యారాగమంత సుశోభితం చేసుకోవచ్చు. పూలపరాగాల్లో హృదయాన్ని పరిమళ భరితం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం విశ్వమంతా సమస్త ప్రాణికోటిలో చైతన్యం నింపే స్పూర్తికుండమే కదా! ఆ వరుసలో చూస్తే, చంద్రుడు నీ మనసును తనలా ఎప్పుడూ చల్లచల్లగా, వెన్నెల కురిపిస్తూ ఉండేలా చూసుకొమ్మంటాడు. సూర్యుడేమో అన్నివేళలా అలా ఉంటే కుదరదు నాయనా! జీవితం అన్నాక అప్పుడప్పుడైనా నాలా భగభగా మండడం కూడా అవసరమే అంటాడు. నదులూ, సముద్రాలేమో, జడ త్వాన్ని ఽఎప్పుడూ దరి చేరనీయకుండా ఒక ప్రవాహంలా ఉండాలంటూ తమవైన పాఠాలు చెబుతాయి. అదే సమయంలో అందుకు భిన్నంగా  నిరంతరం తరంగాల్లా ప్రతిదానికీ తల్లడిల్లిపోతే ఎలా? నిశ్చలంగా, నిబ్బరంగా తమలా నిలిచి ఉండాలంటూ, పర్వతాలు తమ అస్థిత్వాన్ని చాటి చెబుతాయి. మోహన రాగాలనేవి చెలిచెంత నుంచే కాదు పురుషోత్తమా! ముగ్దమనోహరమైన నీ అంతరంగమే అనంతకోటి మోహన రాగాలు వినిసిస్తుంది ఒకసారి విని చూడు! అంటూ గాలి ఈలలు వే స్తూ, నీ భుజాలు కుదుపుతుంది. అవునూ.... చెంతనే   ఇన్నిన్ని రసస్పూర్తులు అందుతుంటే, ఎవరికైనా, లోకం మహత్తరంగా, జీవితం మధురాగనురాగంగా అనిపించక ఏంచేస్తుంది?  

పడిలేచే కడ లితరంగం
వడిలో జడిసిన సారంగం 
సుడిగాలిలో..... సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం // అందమె //

నిలువెల్లా చైతన్య దీప్తులు నింపుకున్న జీవితం ఎక్కడా రాజీ పడదనేది నిలువెత్తు నిజం!  తరంగంలా అది ఎన్నిసార్లు పడిపోతే, అన్ని సార్లూ మళ్లీ లేచే ప్రయత్నమే చేస్తుంది..  ఏ పక్షి అయినా అనుకోని  వాన వడిలో తడుస్తూ,  ముందు కొంత భయభ్రాంతికి గురైతే కావచ్చు కానీ, ఆ వెంటనే, జవసత్వాలు నింపుకుని తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు పతంగం,  మేఘాలను తాకితే  అందులో అంత గొప్పేముంది? అందుకు భిన్నమైన సుడిగాలిలో కూడా పతంగం ఉవ్వెత్తున ఎగురుతుంది. అన్నింటికీ ఎదురీదుతుంది.  కాకపోతే ఈ పోరాటాలన్నీ మన మేమిటో మనకు పూర్తిగా అవగతమైనప్పుడే చెయ్యగలం!  పంచభూతాత్మకమైన మొత్తం ప్రపంచం సూక్ష్మరూపంలో మనలో వసిస్తున్నదన్న అసలు సత్యం బోధపడినప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం కాగలం! కాకపోతే, ఉన్నట్లుండి,  ఏదో ఒక రోజున ఒక నైరాశ్యం, ఒక వైరాగ్యం మనసును ఆవహించవచ్చు. ఎందుకంటే,  ఇంతా చేసి చివరికి మిగిలేదేమిటి?  ఏదో ఒక రోజున అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి లోకం నుంచి నిష్క్రమించాల్సిందే కదా అనిపించవచ్చు. ఆ స్థితిలో రంగస్థలం మీది నుంచి బయటికి వె ళ్లిపోతున్న నటీనటుల్లాగే మనకు మనం కనిపించవచ్చు. ఆ మాటకొస్తే  మొత్తం జీవితమే ఒక నాటకంలా కూడా అనిపించవచ్చు. అవునూ! ఒకవేళ నాటకమే అయితే మాత్రం ఏమిటి? ప్రదర్శనకు సిద్ధమైనప్పుడు వేదికపై ఉన్నంత సేపు మన భూమికను మనం అద్భుతంగా పోషించగలిగితే చాలదా? జీవన వేదికా, నటనా వేదికా అన్నది ఇక్కడ విషయమే కాదు. నీ పాత్రకు నువ్వు పూర్తి స్థాయిలో న్యాయం చేశావా లేదా అన్నదొక్కటే అత్యంత కీలకమవుతుంది. ఆ నిర్శహణా పటిమే హృదయంలో మొక్కవోని అందాన్నీ, నిండైన ఆనందాన్నీ నింపుతుంది. అన్నింటినీ మించి  జీవితానికి ఒక పరిపూర్ణమైన సార్థకతనిస్తుంది. ఏ  మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలి!! 

- బమ్మెర  


18, మార్చి 2022, శుక్రవారం

పాలకడలివంటి పాండ వాగ్రజు మదిన్‌ పద్యం | వీరాభిమన్యు సినిమా పద్యాలు | తెలుగు పద్యాలు | ఘంటసాల పద్యాలు |

పద్య మాధురి

సంకల్పమే ... మహా సమర శక్తి

రాయబారిగా వచ్చిన కృష్ణుడు, పాండవులకు అర్దరాజ్యం ఇవ్వకున్నా, ఐదూళ్లయినా ఇవ్వమని కోరినప్పుడు, దుర్యోధనుడు ఎంత హేళనగా మాట్లాడాడు? దయ తలచి, పాండవులను ప్రాణాలతో వదిలేసినందుకు అదే మహా భాగ్యమనుకుని సంబరపడకుండా, రాజ్యంలో భాగమివ్వమని అడుగుతారా? పెద్దమనిషివని ఏదో ఆహ్వానం పంపితే  కృష్ణా! ఈ మతితప్పిన మాటలేమిటి? అంటూ కృష్ణుణ్ని చులకన చేసి మాట్లాడాడు. అయితే, అందుకు కృష్ణుడు బాధపడిందేమీ లేదు. ఎందుకంటే వారి సంస్కార స్థాయి ఏమిటో కృష్డుడికి తెలియనిదేమీ కాదు. అన్నీ తెలిసి  తెలిసే ఆ రాయబారానికి పూనుకున్నాడు. ఆయా వ్యక్తుల స్వభావాలూ, ప్రవర్తనలు ఎలా ఉన్నా, రాయబారిగా వెళ్లినప్పుడు చెప్పవలసినవన్నీ చెప్పాల్సిందేగా! ఒక వ్యవహార విధానంగా ఆ ప్రస్థావన తేవడమే తప్ప,  ఐదూళ్లు కాదు దుర్యోధనుడు ఐదడుగుల  స్థలం కూడా ఇవ్వడన్న నిజం కృష్ణునికి తెలియనిదేమీ కాదు. అలాగని, రాయబార విషయాలను మతితప్పిన మాటలంటూ ఎద్దేవా చేసిన దుర్యోధనుడి అహంకారానికి, సరిధీటు సమాదానం చెప్పకుండా కృష్టుడు ఏమీ వదల్లేదు ..
1965లో విడుదలైన ’వీరాభిమన్యు’ సినిమా కోసం సీనియర్‌ సముద్రాల రాసిన ఈ పద్యాన్ని కె. వి. మహాదేవన్‌ సంగీత సారధ్యంలో ఘంటసాల మృదుగంభీరంగా గానం చే శాడు. ఎవరికి వారు విని తరించాల్సిందే తప్ప,  ఆస్వాదించే మరో మార్గం లేదు మరి! ఇంతకూ కృష్ణుడు ఏమన్నాడు? 

పాలకడలివంటి పాండ వాగ్రజు మదిన్‌

       కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు

గంధ గజేంద్రమ్ము  కరణి భీముడు నిన్ను

       నీ సహోదరుల మ్రదించునాడు

పరమేశునోర్చిన పార్థుడు గాండీవ

       మంది కర్ణుని దునుమాడునాడు

మాయారణ విదుండు మా ఘటోద్గజుడు నీ 

       బలగమ్ము గంగలో కలుపునాడు


ఎదిరి గెలువంగ నేర్తురే ఇందరేల

అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు 

ఒక్కడే చాలు సంగరమోర్చి గెలువ

ఈ మహావీరులందెవ్వరేని అడ్డు

రారు, నిను గావగా లేరు, రాజరాజా 

నీ బలాన్నీ బలగాన్నీ చూసుకుని విర్రవీగుతున్నావు గానీ ... ధుర్యోదనా! నువ్వు చివరికి ఏమైపోతావో నీకేమైనా అంచనా ఉందా? అంటూ నిలదీశాడు కృష్ణుడు.  నీకు తెలియనిదేమీ కాదు ఎప్పుడూ పాలసముద్రంలా ప్రశాంతంగా ఉండే వారికే కనక రాకరాక కోసం వస్తే పరిణామాలు పరమ భయంకరంగా ఉంటాయి. ఆ పరమ శాంత మూర్తి ధర్మజుడే ఆగ్రహానికి గురైననాడు నీ గతీ మహా దారుణంగా ఉంటుంది. ధర్మజుడు ఒక్కడే కాదుగా! భీముడు, అర్జునుడు, ఘటోద్గజుడు యుద్దభూమిలో అరివీర భయంకరులే అవుతారు. అయినా .... వాళ్లంతా ఎందుకు? రణరంగంలో నిన్ను రక్తపు మడుగులో దొర్లించడానికి ఒక్క అభిమన్యుడు చాలు.దుర్యోధనా! భ్రమలు వీడి  వాస్తవాల్లోకి రా! అది నీకూ ... నీ బలగానికీ క్షేమదాయకం అంటాడు కృష్ణుడు.

ఎంతో మందికి కలిగే ధర్మసందేహం ఇక్కడ  ఒకటుంది. యుధ్ధరీతుల్లో అతి కీలకమైన పద్యవ్యూహంలోకి వెళ్లడమే గానీ, మళ్లీ బయటికి వచ్చే విద్య అభిమన్యుడికి తెలియదు కదా! అయినా కృష్ణుడు అభిమన్యుడి విషయంలో అంత ధీమాగా ఎందుకు మాట్లాడినట్లు అనిపించవచ్చు. అయితే, సర్వజ్ఞుడు  కదా కృష్ణుడు ...అవన్నీ తెలియకుండా ఎందుకు మాట్లాడతాడు? సాధ్యాసాధ్యాల గురించిన సత్యాలు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు మరి! అందుకే ఆ ధీమా! లోకాన కొన్నింటిలో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో ముందే తెలిసిపోతుంది. అయితే, ఒక్కోసారి అప్పటిదాకా అసాధ్యమైనవిగా అనిపించినవే అనూహ్యంగా సాధ్యమవుతుంటాయి. ఒకవేళ  అసాధ్యమని ముందే తెలిసినా, ఒక్కోసారి తెగించి రంగంలోకి దూకడమే తప్ప మరో దారి కనిపించదు. అలాంటప్పుడు మనిషి మేదోశక్తి వేయింతలు  శక్తివంతంగా పనిచే స్తుంది. అనివార్యమైన  తన సంకల్ప బలం, తన ఆత్మశక్తి , ఆత్మవిశ్వాసం అప్పటిదాకా తనను నిర్భంధించిన పరిమితుల్ని చేధిస్తుంది. అవరోధాల్ని అధిగమిస్తుంది. ఆత్మ విశ్వాసం ఒక దశలో  మనిషికి  పైకి కనిపించని వేయి చేతులనిస్తుంది. వే యి గుండెలు మొలిపిస్తుంది. ఫలితంగా అప్పటిదాకా అసాధ్యంగా, అసంభవంగా అనిపించినవే సాధ్యమై  ... సంభవంగా మారుతుంటాయి. వాస్తవానికి  అభిమన్యుడి మీద తనకున్న అనంతమైన ఆ నమ్మకమే కృష్ణుడిని అలా మాట్లాడించింది. అయితే ఎదుటి వ్యక్తిమీద తనకున్న నమ్మకానికీ, ఎదుటి వ్యక్తికి తన  మీద తనకున్న  నమ్మకానికీ మధ్య ఒక్కోసారి పొంతన కుదరకపోవచ్చు. పొంతన కుదరని ఆ వైరుధ్యాలే ఒక్కోసారి మహా మహా విషాదాలకు మూలమవుతాయి. ఏమైతేనేమిటి? ఒక వీర మరణం, వేయి విజయాల కన్నా ఎక్కువేనన్న నిజాన్ని ఎవరికి వారు ఒప్పుకోవలసిందే! ముందు తరాలకు ఆ స్పూర్తినీ, ఆ సంకల్ప జ్ఞానాన్నీ ఎప్పటికప్పుడు అందించవలసిందే!!

                                                           - బమ్మెర 

21, ఫిబ్రవరి 2022, సోమవారం

నిదురపోరా తమ్ముడా పాట | సంతానం (1955) సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

చిత్రం: సంతానం (1955) గీతం: అనిసెట్టి, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, గానం: లతా మంగేష్కర్‌.

కళ్లు మూసుకుంటేనే అని కాదు. కళ్లు తెరిచే ఉన్నా తన్మయత్వంతో నిదుర కాని నిదురలోకి జారిపోయే వరాన్ని కళలు అందిస్తాయి. కాకపోతే, కళల శిఖరాగ్రాన్ని చేరుకున్న కళా కంఠీరవుల వల్ల మాత్రమే ఆ బాగ్యం కలుగుతుంది.  అయితే, ఆ శిఖరాగ్రాన్ని చే రుకోవడమే కాదు, దాని పైనున్న ఆకాశాన్నే అందుకున్న మహా కళాకారిణి గాన విధుషీమణి లతామంగేష్కర్‌. ఎప్పుడో  6 దశాబ్దాల క్రితం ’సంతానం’ సినిమా కోసం ఆమె పాడిన  పాట తెలుగు హృదయాలను గగన వీధుల్లో  విహరింపచేసింది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ పాట సంగీత లోకంలో ఇప్పటికీ ఒక వజ్రంలా నిలిచే ఉంది.  అనిసెట్టి రాసిన ఈ గీతానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందిస్తే, లతామంగేష్కర్‌ అనితర సాధ్యంగా పాడారు.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత రస హృదయాల్ని ఉర్రూతలూగించిన గాన సామాజ్ఞిని ఇటీవలే గందర్వలోకానికి వెళ్లిపోయింది. ఆ కళా తపస్వికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలం? అమ్మా! జన్మజన్మలకూ మీకు రుణపడే ఉంటామని అశ్రునయనాలతో అంజలి ఘటించడం తప్ప!!

నిదురపోరా తమ్ముడా !!


నిదురపో .... నిదురపో .... నిదురపో ....
నిదురపో ... నిదురపో ... నిదురపో ...
నిద్దురపోరా తమ్ముడా...  నిదురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముసమైనా మరచిపోరా // నిదురలోన //
కరుణ లేని ఈ జగానా - కలత నిదురే మేలురా // నిదుర //

దేవుడే అని కూడా కాదు. మౌలికంగా మనిషి కూడా కరుణా మూర్తే. కారణం ఏమైనా రావచ్చు గానీ, కాలగతిలో ఆ కారుణ్యం చాలా మందిలో కనుమరుగైపోతుంది . కరుణ తత్వం సన్నగిల్లిపోవడమే కాదు ... కొందరిలో పాషాణం లాంటి  ఒక కసాయితనం కూడా పేరుకుపోతుంది. వాటివల్ల అవతలి వారి మనసు అనేకానేక గాయాలపాలవుతుంది.  ఇలాంటి స్థితిగతుల్లో ఏ మనిషికైనా కమ్మకమ్మని నిదుర ఎలా సాధ్యం? కాస్తో కూస్తో పట్టినా అది కలత నిదురే! అదే నిజమైతే ఏంచేస్తాం మరి? ఆ కలత నిదురే ప్రాణానికి మోక్షదామమనుకుని నిద్రకు ఉపక్రమించాల్సిందే! పరిపూర్ణ ఆనందాన్నీ, పరిపూర్ణ ప్రశాంతతనూ కోరుకునే వారెవరూ లోకంలో నిండైన నిదురకు నోచుకోలేరు. ఎందుకంటే,  గుండెను సలిపే గాయాల నెలవైన గతాన్ని ఎవరూ, ఎప్పటికీ సంపూర్ణంగా మరిచిపోలేరు. గతం తాలూకు అనేకానేక  ఘటనలు అను నిత్యం గుండెల్ని పిండేస్తూనే ఉంటాయి. వాస్తవం ఏమిటంటే,  లోకంలో ఏదైనా సగం - సగమే లభిస్తుంది... ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు.  నచ్చిన సగం, నచ్చని సగంతో సమ్మిళితమయ్యే ఉంటుంది. ఎవరైనా దాన్ని  జీర్ణించుకోలేకపోతే,  గతం  ఏనాడూ వారిని,  గాఢనిద్రలోకి జారనివ్వదు. నిజానికి,  గతం తాలూకు ఆ జాడలే లేని జగత్తు ఎంతటి వారికైనా లభించదు. సగం తెరిచి, సగం మూసి ఉంచే రుషుల అర్ద నిమీలిత నేత్రాలు బహుషా అందుకు సంకేతమేమో మరి!. ఏది ఏమైనా, లోకంలో అన్నీ సగం సగమే లభిస్తాయన్న పరమ సత్యాన్ని ఎవరికి వారు అర్థం చేసుకోవలసిందే!. లేదంటే లోకంలో ఎవరికీ కంటిమీద కునుకు పట్టదు కంటి నిండా నిదుర మాట ఎలా ఉన్నా .. కనీసం కునుకైనా పట్టదు. !


కలలు పండే కాలమంతా - కనుల ముందే కదలిపోయే ఆ .....
లేత మనసున చిగురుటాశ - పూతలోనే రాలిపోయే // నిదుర //

అప్పుడెప్పుడో నిర్మించిన జీవన సౌధాలు, ఆ తర్వాతెప్పుడో కూలిపోవడం మనం చూస్తూ వస్తున్నదే! అయితే,  ఎప్పుడో జీవితారంభంలో కన్న కలలు ఇంకెప్పటికీ నెరవేరవని, ఏ జీవన మధ్యమంలోనో, లేదా చరమాంకంలోనో తేలిపోవడం ఎంతో మందికి అనుభవమే! అయితే,  అలా దీర్ఘకాలిక వ్యవధానంలో విషయాలు విషాదకరంగా మారడాన్ని ఎవరైనా తట్టుకోగలరు గానీ, కలలు పండే నిండు యవ్వనంలోనే అంతా చెల్లాచెదురైపోతే ఎలా ఉంటుంది? ఏమీ చేయకుండానే , ఏదీ చేతికి రాకుండానే కాలమంతా నిష్పలంగా, నిరర్ధకంగా కరిగిపోతే ఆ  హృదయం ఏమైపోవాలి? జీవితంలో ఎంతో చేయాలనీ , ఏవేవో చేయాలని ఉవ్విళ్లూరుతున్న లేలేత మనసు కదా! చిగురులాంటి ఆశ ఆదిలోనే నానా అగ్ని పరీక్షలకు ఆలవాలమైపోతుంటే ఏమిటా పరిస్థితి? పూవై పరిమళాల్ని వెదజల్లాల్సిన తరుణంలో, పండై ప్రపంచాన్ని మాధురీమయం చేయాల్సిన కాలంలో కారుమబ్బుల్లో కాటగలిగిన పక్షిలా జీవితం నిరాశా నిస్పృహల పాలై  ఊపిరాడని స్థితిలో పడిపోతే ఏమైపోవాలి? 

జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితి ఆయే 
నీడ చూపే నెలవు  మనకూ - నిదురయేరా తమ్ముడా // నిదుర //

ఎన్నో తెలిసిన మానవ సమాజంలోకి ఏమీ తెలియని శిశువు వచ్చినప్పుడు సాటి మనుషులకు కాస్తంత సానుభూతి, జాలీ ఉండాలి కదా! ఊహ తెలిసీ తెలియని వయసులోనే, నానా అగచాట్లూ పడుతుంటే, పెద్దవారు ఆ పసిప్రాణానికి ఆలంబనగా నిలబడాలి కదా! అదేమీ లేకుండా,  నిప్పుల్లోకి తోసేయాలని చూస్తే ఎలా? నిలువెల్లా చితికిపోయిన జీవితం జీవితంంలా ఉండదు కదా! ఆ జీవితం నిజంగా చితిపై చేర్చిన శవంలా ఉంటుంది.  ఈ స్థితిలో జీవన దుర్భరత్వాన్ని కాసేపైనా మరిపింపచేసే ఒక ప్రాణాధారం  కావాలి కదా! ఆ ఆధారం నిదురేమరి! అయితే ఆ నిదురే లోకంలో చాలా మందికి కరువైపోతోంది. పరిశీలిస్తే, ఈ నిదుర పట్టని పరిస్థితి వెనుక అసంతృప్తి, అసంతోషాలే ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఎన్ని అసంతృప్తులున్నా, ఎన్ని అసంతోషాలున్నా, ఒక బలమైన జీవిత లక్ష్యం ఉన్నవారిలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే, వర్తమానంలో తన ఎదురుగా ఏమున్నా, లేకపోయినా, లక్ష్య సాధుకుడైన మనిషి చేతిలో అద్భుతమైన  భవిష్యత్తు ఉంటుంది కదా ! ఆ భవిష్యత్తు గురించిన అందమైన ఊహలు, అందుకు ఎప్పటికప్పుడు వేసుకున్న కట్టుదిట్టమైన ప్రణాళికలూ ఉంటాయి. అవి కష్టాలకూ, కన్నీళ్లకూ అతీతంగా మనిషికి నిదురపట్టేలా చేస్తాయి.పెద్దవాళ్ళ విషయంలో అది సరేగాని, పసివాళ్ల మాటేమిటి? ఈ మాట పసివాళ్లకు చెప్పగలమ! అసలు అది జీవిత లక్ష్యాల గురించి ఆలోచించే వయసేనా? కాదనే అనిపిస్తుంది ఎవరికైనా! కానీ, ఒకటి మాత్రం నిజం! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు, ఆ వయసుకు తగ్గ లక్ష్యాలు ఆ వయసులో ఏర్పడితేనే మంచిది. కాకపోతే,  వాటిని తమకు తామే నిర్ణయించుకునే వయుసు కాదది . అయిన వాళ్లూ, ఆత్మీయులూ, కన్నవాళ్లూ, పెద్దవాళ్లూ,  వాళ్ల స్థాయి లక్ష్యాల బీజాలను వారి గుండెల్లో సున్నితంగా నాటాలి. అవి వారిలో గొప్ప గుండె నిబ్బరాన్ని నింపుతాయి. కలత నిదురతోనే సంతృప్తి పడేలా చేస్తాయి. కునుకుపాటు నిదురతో కూడా అవసరమైన శక్తినంతా పుంజుకునేలా చేస్తాయి!!

                                                                    - బమ్మెర 



9, ఫిబ్రవరి 2022, బుధవారం

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ పాట | రాజా సినిమా | తెలుగు పాత పాటలు | సౌందర్య పాటలు

పాటలో ఏముంది?


చిత్రం: రాజా, గీతం: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ , సంగీతం: ఎస్‌. ఏ రాజ్‌కుమార్‌, గానం: చిత్ర

గతం, వర్తమానం, భవిష్యత్తు ... వీటిల్లో రాగాలు ఆలపించని కాలమేముంది? కాకపోతే, రేపన్నది మన చేతుల్లో లేదు. మనదాకా అది రానేలేదు. వర్తమానమేమో సగం మన చేతుల్లో ఉన్నా, మిగతా సగం మన చేతుల్లో ఉండదు.  ఒక్క గతమే నిశ్చలంగా, నిర్దిష్టంగా ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉండిపోతుంది. అందుకే, అత్యధిక భావాలు, రాగాలు,  గతం మీదే ఎక్కువగా తారట్లాడుతుంటాయి. ఒక వేళ గతం వేదనాపూర్వకమే అయినా అదిప్పుడు మనల్ని వేధించదు. ఎందుకంటే దాన్నించి మనం చాలా దూరం వచ్చేశాం! అందుకే తీయని సంఘటనలే కాదు, హృదయం,  చేదు సంఘటనల్ని కూడా ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటుంది.  ఆనందంగా  పాడుకుంటుంది..  అన్ని దశల్లోనూ ఆనందంగా ఉండడమే కదా మానవ జీవితంలోని అత్యున్నత స్థితి. దాన్నే మనం అతీత స్థితి అంటాం. కారణం ఏదైనా,  కళలన్నింటికీ మనిషిని ఆ అతీత స్థితికి చేర్చడమే అంతిమ లక్ష్యమైపోయింది. 

1999 లో విడుదలైన ’ రాజా’ సినిమా కోసం ఎస్‌. ఏ. రాజ్‌కుమార్‌ సంగీత సారధ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి  రాసిన  ఈ పాటను గాయనీమణి చిత్ర ఎంత మధురంగా పాడిందీ అంటే అది ఎవరైనా విని తీరాల్సిందే!


ఏదో ఒక రాగం పిలిచిందీవేళ..!!



ఏదో ఒక రాగం పిలిచిందీ ఈవేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా 
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా 
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా 
జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు // ఏదో ఒక రాగం//

మాట ... మాటగా ఉన్నంత కాలం .... అది మిగతా అన్ని శబ్దాల్లో ఒక శబ్దమే అనిపిస్తుంది.  ఒకసారి ఆ మాట పాటగా మారిన తర్వాత, దాని లోకమే మారిపోతుంది! పాటగా మారినంత మాత్రాన అప్పటిదాకా ఉన్న భావోద్వేగాలేవీ తారుమారైపోవు. అదృశ్యమైపోవు. కానీ, అవి రూపాంతరం చెందుతాయి. ఎంతో అందంగా, మరెంతో అపురూపంగా మారిపోతాయి. ఒక్కోసారి,  అంతకు ముందున్న భావోద్వేగాలూ... ఇవీ పూర్తిగా వేరువేరేమో అన్నంతగా మారిపోతాయి. ఎలా అంటే, ఎంత చేదు కాకర అయినా, కాస్తంత బెల్లం కలపగానే కమ్మని పాకంగా మారినట్లు, ఎన్ని గాయాలున్నా, సంక్షోభాలున్నా, గతం ఒకసారి రాగబద్దమైన తర్వాత అదెంతో శ్రావ్యంగా, మధురమైన కావ్యంగా మారిపోతుంది. ఆ కావ్యగానం,  గతం.., పరిమళాల్ని వెదజల్లే కుసుమాలుగా  కావచ్చు. దీపాలు వెలిగించే తైలంగానే కావచ్చు. పెదవుల పైన చిరునవ్వుల పేరంటంగా  కావచ్చు. రాగం ఒకసారి రసాత్మకం అయిన తర్వాత, అది అమృతాత్మకం అవుతుంది.  నిట్టూర్పులు, ఓదార్పుల ఎల్లలు దాటి, భావాతీతమైన భాస్కర దీప్తిగా మారిపోతుంది. అందుకే జీవితంలో ఎన్ని ఉన్నా, ఏమైపోయినా లోకం రాగమయ ప్రపంచం నుంచి వేరైపోదు. విశ్వవీణపై నాట్యమాడే దివ్యజీవనాన్ని వదులుకోదు. 

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే 
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే 
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం // ఏదో ఒక రాగం //

మనిషికి లోకం తాలూకు జ్ఞాపకాలు వేలు, లక్షలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ, వాటన్నిటిలోకెల్లా అద్భుతమైనవి, ప్రాణాత్మకమైనవి అమ్మ జ్ఞాపకాలే .  ఎందుకంటే, మిగతా జ్ఞాపకాలన్నీ  మధ్యలో ఎప్పుడో మొదలై, మధ్యలోనే పోవచ్చు కూడా! అమ్మ జ్ఞాపకాలు మాత్రం పుట్టుకతోనే మొదలవుతాయి. ఇంకో నిజం ఏమిటంటే, పుట్టడానికన్నా ముందు అంటే, అమ్మ గర్భంలో ఉన్నప్పుటి నుంచే జ్ఞాపకాల పందిరి అల్లుకుంటుంది. మిగతా అందరి జ్ఞాపకాలు జీవితపు ఏదో ఒక సందర్భానికి సంబంధించి,లేదా ఏదో వ్యవహారానికే పరిమితమై ఉండవచ్చు. కానీ, అమ్మ జ్ఞాపకాలు మాత్రం,  మొత్తం జీవితంతో ముడివడి ఉంటాయి. జీవితమంతా వెంటాడుతూనే ఉంటాయి. ఆమె బతికున్నంత కాలమే కాదు, ఆమె గతించిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలుగా కొనసాగుతాయి.  కాకపోతే, పుట్టీపెరిగిన దేశం వదిలి ఏ విదేశాల్లోనే స్థిరపడిపోయిన కొందరి విషయంలో ఆమె తదనంతరం కాదు, ఆమె బతికుండగానే జ్ఞాపకాల్లో  చూసుకోవాల్సి రావచ్చు. ఏది ఏమైనా,  ఎంతటి మహా సౌధమైనా, సింహద్వారాల  వెనుక బంధీ అయిపోయేట్లు,  ఎంత గొప్ప గతమైనా,  అంతిమంగా అది జ్ఞాపకాల్లో బందీ కావలసిందే! 

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే 
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే 
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే 
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం  // ఏదో ఒక రాగం //
 

జీవితమంతా విస్తరించిన జ్ఞాపకాలన్నీ  ఒక ఎత్తయితే, బాల్య కౌమారాలకే పరిమితమైన జ్ఞాపకాలు మరో ఎత్తు. ఎందుకంటే, పలుమార్లు రాసి పదే పదే కొట్టేసిన కాగితం మీద మళ్లీ ఏదో రాస్తే ఎలా ఉంటుంది?  ఆ అక్షరాలు అక్కడ ఉన్నా  లేనట్లే ఉంటాయి. ఒక్కోసారి మరీ మరీ  చిట్లించి చూస్తే తప్ప ఏ వాక్యమూ స్పష్టంగా కనిపించదు. అదే తెల్ల కాగితం పైన అయితే, ఏ అక్షరానికి ఆ అక్షరం ఆణిముత్యంతా కనిపిస్తుంది. బాల్య  హృదయం తెల్లకాగితమే కదా మరి! ఆ మనోఫలకం పై పడిన ప్రతి జ్ఞాపకం అంత విస్పష్టంగా, అంత మనోహరంగా ఉంటుంది. బాల్య కౌమారాలు దాటాక పరిస్థితి వేరు.  ఒక సంఘటన జరిగిన వెనువెంటనే ఇంకెన్నో సంఘటనలు చోటుచేసుకోవచ్చు. అందుకే అవన్నీ కలగాపులగంగా ఉండిపోతాయి.బాల్యంలో అయితే  దేనికది విడిగానే ఉంటాయి. అందుకే, యవ్వనంలోనే అని కాదు, మధ్య వయసు, చివరికి వృద్ధాప్యంలో కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితం నాటి ఆ బాల్య లేదా కౌమార  సంఘటనలే తాజాగా కదలాడుతుంటాయి. కాకపోతే,  హాయిగా గాల్లో తేలుతున్నట్లుండే ఆ బాల్యంలో మనసును బరువె క్కించే ఏ హరికథలో  వినాలంటే కష్టమనిపిస్తుంది. అందుకే ఎంత వద్దనుకున్నా, కధాగానం   మధ్యలోకి కళ్లు వాలి పోతాయి. పుస్తకాలు గొప్ప భవిష్యత్తునిస్తాయని ఎవరెంత చెబుతున్నా, కొంత మంది పిల్లలకు పుస్తకాల్ని చూస్తేనే భయమేస్తుంది. చదువంటే పారిపోవాలనే అనిపిస్తుంది. ఆ వయసులో బ్రతుకు భద్రత, , జీవనాధారాల సోది లేని ఆటపాటలే అమితంగా పరవశింపచేస్తాయి. వాగూ వంపు ఒడ్డుల్లోనో, కాలువ అంచుల్లోనో దొరికే గవ్వలన్నీ ఏరుకోవడం అన్నది ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్నిస్తుంది. వాటన్నింటి తాలూకు జ్ఞాపకాలు ఒక మహా చిత్రకారుడు గీసిన కళాకండా లకు సరిసమానం . ఆ అపురూపాల్ని  అందమైన ఫ్రేముల్లో బిగించుకుని, మన హృదయ సౌధంలో ఘనంగా అలంకరించుకోవచ్చు. పగలూ రేయీ వాటిని చూస్తూ జీవితమంతా పండగ చేసుకోవచ్చు !!

                                                                   - బమ్మెర 

30, జనవరి 2022, ఆదివారం

ఆగదు ఏ నిమిషము నీ కోసమూ పాట | ప్రేమాభిషేకం సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది? 

విశ్వానికన్నా అతీతమైనది  కాలం! ఈ మహా విశ్వాన్నంతా నడిపించేది కాలమే కదా ! అయితే, అనంతంగా,  నిరంతరాయంగా సాగిపోయే కాలం, తన  సహజతత్వానికి బిన్నంగా ఎప్పుడూ ఆగిపోదు. దీనికి తోడు నిత్యనూతనత్వం కోసమైన ఒక దివ్యకాంక్ష ఒకటి కాలం అంతరంగంలో కదలాడుతూ ఉంటుంది. ఉన్న తరం ఉన్నట్లే ఉండిపోతే ఆ  ఆకాంక్ష నెరవేరేదెట్లా? అందుకు అనుగుణంగానే కాలం ప్రతి ప్రాణికీ  ఒక నిర్ధిష్ట  కాల పరిమితి విధిస్తూ ఉంటుంది.  ఆ గడువు తీరగానే పాత తరాన్ని మృత్యునౌకను ఎక్కించి భూమ్మీది నుంచి సాగనంపుతుంది.  జనన నౌక మీద మరో నవ తరాన్ని నేల మీదికి రప్పిస్తుంది.  కాలపు ఈ మనోభీష్టాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే!  ఇష్టమైనా, కష్టమైనా ఆ పరిణామాల్ని సాదరంగా ఆహ్వానించాల్సిందే!

1981 లో విడుదలైన ’ ప్రేమాభిషేకం’  సినిమా కోసం దాసరి  నారాయణ రావు రాసిన తాత్వికమైన ఈ పాటను చక్రవర్తి  సంగీత సారధ్యంలో బాలు  ఎంతో భావోద్వేగంగా పాడారు. పల్లవి వినగానే  మనసేదో బరువెక్కుతున్నట్లు అనిపించినా ఒక్కో చరణమే దాటుతూ  లోలోతుల్లోకి వెళ్లే కొద్దీ మనసు ఎంతో తేలికపడుతుంది. ఎవరూ కాదనలేని ఆ జీవిత సత్యాల ప్రవాహాల్లో మరోసారి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ అనుభూతి మళ్లీ మళ్లీ ఆస్వాదించాలని కూడా అనిపిస్తుంది. మనలోని ఆ భావనను భుజానేసుకుని ఆ పాటను మరోసారి వినేద్దామా మరి!!

ఆగదు ఏ నిమిషము నీ కోసమూ ....!


ఆగదూ ... ఆగదూ ...  ఆగదూ .....
ఆగదు ఏ నిమిషము నీ కోసము
ఆగితే సాగదు .. ఈ లోకము ... 

కాలానికి ఆదీ - అంతం అంటూ ఏమీ లేవు కదా! అయితే,  తూనికల్లోనో,  కొలమానికల్లోనో పెట్టనిదే మనిషి దేన్నీ పరిగణనలోకి తీసుకోడు! అందుకే ఉదయాస్తమయయాలు మనిషికి  ఆ వెసులుబాటు కలిగించాయి. వాస్తవానికి  అనంతమైన సృష్టి చైతన్యంలో భాగమైన ఈ  మనిషి కూడా  అనంతుడే! కానీ, ఆ అనంతత్వం కూడా కొన్నాళ్లకు  విసుగుపుట్టిస్తుందేమో! కాల పరిమితులంటూ లేకపోతే మనిషి మహా బద్ధకస్తుడైపోతాడేమో కూడా అనుకుని,  కాలం,  మనిషి ప్రాణశక్తికి  కొన్ని పరిమితులు విధించాలనుకుంది. ఆ వెంటనే జనన మరణాలంటూ కొన్ని సరిహద్దు రేఖల్ని గీసి ఎంతో మంచి పని చేశాననుకుంది. కానీ, ఇదే మనిషి హృదయాన్ని మహా వేదనామయం చేసింది. కాకపోతే,  ఆ వేదనే అతని జ్ఞానిని చేసింది, అతనిలో వేగాన్ని పెంచింది. విధినిర్వహణకు పురికొల్పింది. ఉన్నది పరిమిత కాలమే కాబట్టి,  ఉదయానికీ, అస్తమయానికీ మధ్య జరగాల్సినవన్నీ త్వరత్వరగా జరిగిపోవాలనుకున్నాడు మనిషి!  పరిమిత ప్రాణశక్తే కాబట్టి, జననానికీ మరణానికీ మధ్య నెరవేర్చాల్సినవన్నీ వెంటవెంట నెరవేర్చాలని కూడా అనుకున్నాడు. ఏమైతీనేమిటి ? చీకటి వెలుగుల మధ్య, జీవుల చేతన - అచేతనల మధ్య ఎక్కడా  ప్రతిష్టంబన ఏర్పడకూడదని  కాలం క్షణమాగకుండా సాగిపోతూనే ఉంటుంది. కాలం ఆగితే లోకమే ఆగిపోతుంది కదా మరి! అసలు నిజానికి , ఒకవేళ కాలమే కాసేపు ఆగాలనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే, కాలం ఆగడం అన్నది కాలం చేతుల్లో కూడా లేదు మరి!. అందుకే అనంత ంగా నిర్విరామంగా కాలం అలా కొనసాగుతూనే ఉంది.  జీవితం అంటేనే కొనసాగడం కదా మరి! 

జాబిలి చల్లననీ ... వెన్నెల దీపమనీ .... 
తెలిసినా ... గ్రహణము ... రాకమానదు
పూవులు లలితమనీ ..తాకితే రాలుననీ 
తెలిసినా ... పెనుగాలి .. రాక ఆగదు
హృదయము అద్దమనీ, పగిలితే అతకదనీ 
తెలిసినా .. మృత్యువు రాక ఆగదూ.... // ఆగదు ఏ నిమిషము //

సృష్టిలో ప్రతిదానికీ నిర్దిష్ట కాలపరిమితులు ఉన్నాయి. అవి కచ్ఛితంగా అమలై తీరుతాయి. ఎవరైనా ఇంకాసేపు వెలుగు ఉంటే బావుణ్ణు అనుకున్నంత మాత్రాన సూర్యుడు అస్తమించకుండా  తాత్సారం చేయడు  కదా!. చేయవలసిన పనులేవో పూర్తి కాలేదని కారణంగా లోకంలో మరికొంత కాలం ఉండిపోవాలని మనిషి ఆశపడితే మాత్రం? మృత్యువు ఆ సడలింపు ఇవ్వదు కదా! తెరపడాల్సిన సమయంలో తెరపడితీరాల్సిందే!! జాబిలి చల్లదనాన్నే కదా ఇస్తోందని...., వెన్నెల వెలుగులే కదా పంచుతోందని  రావాల్సిన సమయాన గ్రహణం రాకుండా ఆగిపోదు కదా! పూలు లోకానికి పరిమళాలు పంచుతూ,  ప్రాణికోటికి సున్నితత్వాన్ని అందిస్తాయని ప్రకృతికి తెలియదా? అయినా వడగాలులూ, పెనుగాలులూ, అసలే రాకుండా ఉండవు కదా! అవెందుకూ అంటే  వాటి ద్వారా, సమస్త ప్రాణికోటికీ , ప్రతేక్యించి మనిషికి విశ్వం కొన్ని పాఠాలు చెప్పాలనుకుంటుంది. వాటివల్ల ఎవరికెంత బాధ  కలిగినా అది ఆ పాఠాలు చెప్పే తీరుతుంది.  రాళ్ల వర్షం పడి,  అద్దాల మేడ వ్రకలైపోవచ్చు. ఏదో విధ్వంసం జరిగి, జీవన సౌధం నేల మట్టం కావచ్చు.  అయినవాళ్లూ, ఆత్మీయులూ ప్రాణాలు పోయి, మట్టిలో కలిసిపోవచ్చు.... దహనమై ఆకాశంలో కలిసిపోవచ్చు. పోయిన వాళ్లుపోగా  వాటిద్వారా  ఉన్నవాళ్లందరికీ కాలం జీవితపాఠాలో,  మృత్యుపాఠాలో చెబుతూనే ఉంటుంది. మనిషి వాటిని వినితీరాల్సిందే! అలా జన్మ తరించాల్సిందే!

జీవితమొక పయనమనీ ... గమ్యము తెలియదనీ .... 
తెలిసినా ...ఈ మనిషీ పయనమాగదు 
జననం ధర్మమనీ ... మరణం ఖర్మమనీ 
తెలిసినా జనన మరణ చక్రమాగదు... 
మరణం తధ్యమనీ ... ఏ జీవికి తప్పదనీ 
తెలిసినా .. ఈ మనిషి ... తపన ఆగదు // ఆగదు ఏ నిమిషము //

జీవిత ంలో గమనమే తప్ప గమ్యం ఉండదు ఇది వాస్తవం! ఎందుకంటే, అదేదో గమ్యం అనుకుని ఎంతో కష్టపడి తీరా అక్కడికి చేరుకునే సరికి అది గమ్యమే కాదనీ,  గమ్యానికి చేరే అనంత కోటి ద్వారాల్లో  ఇది ఒకటి మాత్రమేనని  తేలిిపోతూ ఉంటుంది.   జీవనయానమంతా మజిలీలు మజిలీలుగానే ిసాగిపోతూ ఉంటుంది ఇది నిజం . కాకపోతే ప్రతిసారీ మనిషి, మజిలీనే గమ్యమని పొర బడుతుంటాడు. పోనీ,  చివరికి మరణాన్నే గమ్యం అనుకుందామా అంటే అదీ కుదరదు. ఎందుకంటే, ’మరణం అంతిమ దశ ఏమీ కాదు, మరణించేది శరీరమే తప్ప ఆత్మ కాదు,  అసలు ఆత్మకు మరణమే లేదు అని చెప్పే అనేక వాదనలూ, సిద్ధాంతాలూ లోకంలో అనాదిగా ఉన్నాయి. అందులో భాగంగా మరణం తర్వాతే కాదు. ఇప్పటి ఈ జన్మకు ముందు కూడా  ఆయా జన్మల ఖర్మానుసారం  ఆత్మ ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ వచ్చిందనీ వాదన కూడా ఉంది . పూర్వ జన్మలూ, పునర్జన్మల విషయం పక్కనబెడితే, ఇప్పటి ఈ జన్మలోనైతే మరణం తప్పదనే సత్యం  అందరికీ తెలిసిందే! ఎన్ని చేసినా మనిషి జీవితకాలాన్ని  కాస్త పొడిగించుకోగలడే గానీ, మరణాన్ని పూర్తిగా అధిగమించలేడుగా! ఈ క్రమంలో జననమే కాదు మరణం కూడా మనిషి చేతిలో లేదనే విషయం కూడా స్పస్టమవుతుంది  . అయితే, మనిషి చేతిలో ఉన్నదేమిటి మరి? జననానికీ మరణానికీ నడుమ నడిచే  ఆ మధ్య కాలమొక్కటే అతని చేతిలో ఉంటుంది.   ఆ నాలుగు రోజల మధ్య  కాలాన్ని మనిషి ఎంత అర్థవంతంగా, ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటాడన్న దాని పైనే అతని జీవిత ఔన్నత్యమూ, అతని ఆత్మానందమూ అన్నీ ఆధారపడి ఉంటాయి. అంతే!!

                                                                                     - బమ్మెర 

13, జనవరి 2022, గురువారం

మత్తు వదలరా నిద్దుర పాట | శ్రీకృష్ణపాండవీయం సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

ప్రతిదాన్నీ ఒక ప్రపంచంగా చూడటం అనాదిగా మనిషికి అలవాటే! ఈ ధోరణి ఒక రకంగా మనిసికి మేలే చేస్తుంది. విషయాల విశ్వరూపాన్ని చూడటం ద్వారా వాటిలోని అణవణువునూ చూడగలుగుతాం. ఇది ప్రయోజనకరమే! కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా విధ్వంసం జరిగినప్పుడు  మొత్తం ప్రపంచమే ధ్వంసమైనట్లు అనుకుంటేనే సమస్య. అలా అనుకుంటే,  ఇక దాన్నుంచి బయటపడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సమస్యలో కూరుకుపోవడం కాకుండా, దాన్నించి బయటపడే దిశగా మనిషి ఆలోచనలు సాగాలి. సర్వశక్తులూ వెచ్చించి ఆ వైపే అడుగులు వేయాలి అంటారు పెద్దలు.

1966లో విడుదలైన ’ శ్రీకృష్ణపాండవీయం’ సినిమా కోసం కొసరాజు రాసిన ఈ పాటలో మనిషికి అవసరమైన ఆ స్పూర్తి నిండుగా లభిస్తుంది. టీ.వీ. రాజు సంగీత సారధ్యంలో ఘంటసాల పాడిన ఈ పాట దాదాపు 60 ఏళ్లుగా మానవాళికి అలాంటి జీవితపాఠాలు చెబుతూనే ఉంది. ప్రతి రోజూ వినాల్సిన ఈ పాటను ఈ రోజు మనం మరోసారి ప్రత్యేకంగా విందాం మరి!!

మత్తు వదలరా నిద్దుర !!


అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలిమినపుడు వెలుతురుకై వెతకాలి
ముందుచూపు లేనివాడు ఎందులకూ కొరగాడు
సోమరియైు కునుకువాడు సూక్ష్మమ్ము గ్ర హించలేడు

అప్పటిదాకా థీరగంభీరుడిగా కనిపించిన వాడు కూడా,  అనుకోని అపాయం ఎదురైనప్పుడు, లేదా కటిక చీకట్లు కమ్ముకున్నప్పుడు  బెంబేలెత్తిపోతాడు. ఎందుకంటే, ఆ క్షణాన అతనికి ఆ అపాయం తాలూకు విధ్వంసమే అంతటా కనిపిస్తుంది. దాన్ని అదిగమించే మార్గమే ఇక లేదనిపిస్తుంది. అంధకారం కమ్ముకున్నప్పుడూ అంతే! లోకమంతా చీకటిమయమే అనిపిస్తుంది. చీకటి కాక లోకంలో మరేమీ లేద నే అనిపిస్తుంది. ఎందుకంటే అపాయాలైనా, అంధకారాలైనా స్థూలంగా, బండబండగా ఉంటాయి. అయితే, వాటిని అధిగమించే మార్గాలేమో పరమ సూక్ష్మంగా ఉంటాయి. అందువల్ల  ఎంతో సూక్ష్మబుద్ది ఉంటే గానీ, అవి గోచరించవు. బోధపడవు. అందుకే ఇక్కడ ఉండి ఇంకేమీ చేయలేమని,  కొందరు ఊరొదిలేసి, మరికొందరు దేశం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్లిపోతారు మరికొందరేమో తనువే చాలిస్తారు. జీవితాన్నే ముగిస్తారు. జీవితంలో సుఖసంతోషాలే కాదు, ఒక్కోసారి అనుకోని విపత్తులు వచ్చిపడతాయని, వాటిని ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సంసిద్దంగా ఉండాలనే  ముందుచూపు లేని తనమే  ఆ విషాదాంతాల వెనుకున్న  మూలాంశం!  ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుందనీ,  ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనే జ్ఞానం కొరవడటమే అందుకు అసలు కారణం!

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన బడితే, గమ్మత్తుగ చిత్తవుదువురా // మత్తు వదలరా //

మనిషిని మత్తులో ముంచెత్తడానికి మద్యం, మాదక ద్రవ్యాలే అవసరం లేదు, వేళాపాళనకుండా నిద్రాదేవి ఒడిలో వాలిపోయినా అంతే! ఒంటినిండా నీరసం, గుండెనిండా నిరత్సాహం కమ్ముకుంటే,  మనిసికి పగలూ, రాత్రన్న తేడాయే ఉండదు కదా!.  తనువో,  మనసో అలసిపోయి నిద్రపటట్టడం వేరు! దేనిపైనా ఆసక్తి లేక, అవసరమైన ఏ శక్తీ, యుక్తీ లేక నిర్జీవంగా పడి ఉండడం వేరు. నిజానికి శక్తియుక్తులనేవి పుట్టీపుట్టడంతోనే ఎవరికీ  వచ్చేయవు. జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన ఎన్నో బోధనలు వినాలి! వాటిని ఆచరించేందుకు  ఎంతో సాధన చేయాలి! అదేమీ లేకుండా, ఉన్నదే మహాసామ్రాజ్యం, కూర్చున్నదే శిఖరాగ్రం అనుకుంటే జీవితం అక్కడికక్కడే స్థంభించిపోతుంది.  నీరు పళ్లం వైపే  పరుగెత్తునట్లు,  శరీరం సహజంగా నిద్రావిరామాల్నే ఎక్కువగా కోరుకుంటుంది.  అన్ని వేళలా మనం శరీరం మాటే వింటే మనపని అధోగతే! చివరికి  మనం పడిపోతున్నామనిగానీ, పతనమైపోతున్నామని గానీ, తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. 

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు 
అతినిద్రాలోలుడు, తెలివిలేని మూర్ఖుడు
పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు // మత్తు వదలరా //

నూరేళ్ల జీవితమని ముక్తాయింపులు ఇస్తుంటాం గానీ, దానికి ఏమిటి గ్యారెంటీ?  ఒకవేళ అనుకున్నట్టే నూరేళ్లూ  ఊపిరి సాగినా, అందులో నిజంగా బతికున్న కాలం ఏబై ఏళ్లే కదా! నిద్రా కాలం,  మేలుకున్నాక కూడా ఆ మగతనుంచి పూర్తిగా బయటపడి, కార్యరంగానికి అన్ని విధాలా సంసిద్దం కావడానికి పట్టే కాలం అదెంత?  ఆ కాలాన్నంతా మినహాయిస్తే, మిగిలేది అందులో సగం కాక ఇంకెంత? పోనీ ఆ మిగిలిన సగం కాలమైనా, ఒక లక్షం్యమంటూ ఏర్పడేదెప్పుడు? ఆ దిశగా వడివడిగా అడుగులు వేయడానికి పట్టే కాలమెంత? నిజానికి, నిన్ను బంధించిన అజ్ఞానపు సంకెళ్లు తెగిపోవడానికే జీవితంలో మేలుకున్న కాలంలోనే  మరో సగం పోతుంది. వీటికి తోడు శారీరక మానసిక ఆనారోగ్యాలూ, ప్రాకృతిక విపత్తులూ, సామాజిక కల్లోలాలు ఇవీ కొంత సమయాన్ని తినేస్తాయిగా!, అంతా పోను నీకు మిగిలింది ఎంత? నీ లక్షానికి తోడ్పడింది ఎంత? ఈ లెక్కలన్నీ వేసుకుంటే  జీవితం చాలా చాలా చిన్నదనే మహా సత్యం,  మన కళ్లముందు కొండంత ఎత్తున నిలబడుతుంది. అంతేగా మరి!

సాగినంత కాలం నా అంతవాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలంతోటే ఘనకార్యము సాధించలేరు
బుద్దిబలం తోడైతే విజయమ్ము వరించగలదు // మత్తు వదలరా //

పరిస్థితులెన్నో అనుకూలించి, జీవితం సాఫీగా సాగిందే అనుకోండి, భూమ్మీద తనను మించిన వాడే  లేడనిపించవచ్చు. అలాగని జీవితమంతా అలా గడిచిపోతుందనేమీ కాదు కదా! ఒక్కోసారి పెద్ద ఉప్పెనలే వచ్చిపడతాయి. ఉన్నట్లుండి నిప్పుల వర్షమే కురుస్తుంది. వాటినుంచి కాపాడుకునే ఏర్పాట్లేవీ లేకపోతే, అప్పుడు ఆ సమయంలో తానెంత శక్తిహీనడో, ఎంత కొరగానివాడో  భూతద్దంలో కనిపిస్తుంది. కొందరిలో మరో రకం అమాయకత్వం ఉంటుంది. నాకేమిటి? రాయిలాంటి శరీరం ఉంది, సంచినిండా రాళ్లున్నాయి అని మురిసిపోతుంటారు. ఆ రాళ్లను ఎంత దూరమని విసురుతావు? ఎంత కాలం విసరుతావు? అవతలి వాడు తెలివైన వాడైతే, తన గదిలోంచి బయటికి రాకుండానే నీ గుండె గతుక్కుమనేలా చేస్తాడు అసలు నీ ఉనికే లేకుండా చేస్తాడు. అందుకే  మనిసి  వెయ్యేనుగుల బలం నింపుకోవాలి? ఆ బలంతో నువ్వు పంచే వెలుగులు వెయ్యేళ్లకు వ్యాపించేలా ఉండాలి! పుట్టిన ప్రతిదీ చచ్చేదాకా బతుకుతుంది. కానీ, చనిపోయిన తర్వాత కూడా బతికుండగలిగేది నిజానికి, మనిషొక్కడే! అలా చిరంజీవిగా బతకడమనేది ఉత్తి దేహబలంతోనే సాధ్యం కాదు, దానికి కొండంత  బుద్దిబలం కూడా కావాలి!

చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా 
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా 
కర్తవ్యము నీ వంతు, కాపాడుట నావంతు
చెప్పడమే నాధర్మం - వినకపోతే నీ కర్మం // మత్తు వదలరా //

రాబోయే ఆపదల గురించి, వాటి పరిణామాల గురించిన అవగాహన దాదాపు అందరికీ ఎంతో కొంత ఉంటుంది. కానీ, ఆ పరిణామాలు మోసుకువచ్చే ఆ తరువాయి విపరిణామాల గురించిన అంచనా మాత్రం, ఎక్కడో  అరుదుగా తప్ప చాలా మందికి ఉండదు. నిజానికి, ఆ రెండవ దఫాగా వచ్చిపడే దాడులే మనిషిని  అమితతంగా కుంగ దీస్తాయి. అలాంటి దాడులే వెంటవెంట జరిగితే, దిక్కుతోచక మనిిషి ఒక్కోసారి  బిక్కచచ్చిపోతాడు. క్రమంగా పిరికివాడవుతాడు. నిజానికి  సంఘటనలు కాదు వాటి పరిణామాల పరిణామాలను కూడా పసిగట్టగలిగే వాడే జీవనపోరాటంలో నిలబడతాడు. వ్యూహాలకు ప్రతివ్యూహాలే కాదు, చక్రవ్యూహాలు సైతం తెలిసినవాడే విజయభేరి మోగిస్తాడు. అలాగని, ఆ జ్ఞానమంతా నీలోంచే పుడతుందని కాదు. కొంత బయటినుంచి కూడా అందుతుంది. ఎవరైనా ఆ జ్ఞానాన్ని అందించడానికి వచ్చినప్పుడు వినమ్రంగా స్వీకరించాలి. విజయసారధ్యంలో దాన్నీ భాగ ం చెయ్యాలి! ఆ అందించిన వారినీ ఆ విజయానందంలో శాశ్వత భాగస్వాములను చేయాలి!!

                                                                  - బమ్మెర

4, జనవరి 2022, మంగళవారం

‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, | ఘంటసాల ప్రైవేట్‌ పద్యాలు |

పద్యమాధురి

‘అంజలి’ శీర్షికన ఒక ప్రైవేటు రికార్డుగా వచ్చిన కావ్య ఖండిక, రచన: ‘ కరుణశ్రీ’ జంద్యాల పాపయ్య శాసి్త్ర , స్వరకల్పన, గానం: ఘంటసాల 

ప్రేమాంజలి...!

వ్యక్తి ప్రేమలోనైనా, భగవద్భక్తిలోనైనా, నిబద్దత, నిజాయితీలకే ఎప్పుడూ సమున్నత స్థానం ఉంటూ వచ్చింది. అయినా,  లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లూ చెప్పడం ద్వారా ఎవరేం సాధిస్తారు?  ఆ మాటకొస్తే, లోకువైపోవడం తప్ప బాపుకునే భాగ్యం ఏమీ ఉండదు. నిజానికి, 'ఎవరికైనా ఏమిస్తావనేదాని కన్నా, ఎలా ఇస్తావన్నదే ఎంతో ముఖ్యమవుతుంది. కలుషితమైన మనసుతో, స్వార్థబుద్ధితో వజ్రవైఢూర్యాలను సమర్పించుకున్నా  అందులో  సార్థకత ఉండదు! నిర్మలమైన,  నిస్వార్థమైన మనసుతో పత్రీపుష్పాలు సమర్పించుకున్నా దివ్యపథం ప్రాప్తిస్తుంది.' ఇది ఆధ్మాత్మికుల  నోట ఎల్లవేళలా వినిపించే సత్యఘోష! చివరికి అర్చనలో అతి ముఖ్యమనుకునే ఆ పత్రీపుష్పాలు కూడా లేకుండాపోతే, ఏమిటి గతి? అని ప్రశ్నిస్తే, వగపెందుకు?  భక్తి పారవశ్యంలో అంజలి ఘటించే రిక్త హస్లాలే చాలు అవి భూమ్యాకాశాలను తాకే పూల కొండలు అంటారు రాజర్షులు, మహర్షులు! 

కూర్చుండ మా యింట కురిచీలు లేవు, నా 

     ప్రణయాంకమే సిద్ధపరచనుంటి

పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు, నా 

     కన్నీళ్లతో కాళ్లు కడనగనుంటి, 

పూజకై మా వీట పుష్పాలు లేవు, నా 

     ప్రేమాంజలులె సమర్పించనుంటి

నైవేద్యమిడ మాకు నారికేళము లేదు

     హృదయమే చేతికందీయనుంటి 


లోటు రానీయ నున్నంతలోన నీకు 

రమ్ము దయసేయుమాత్మ పీఠమ్ము పైకి

అమృతఝరి చిందు నీ పదాంకముల యందు

కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండి!


ఈ భక్తుడు అవి లేవు... ఇవి లేవు అంటూ ఏకరువు పెడుతున్నాడు గానీ, అవేవీ లేకపోవడమే ఒక రకంగా అతనికి  మేలయ్యంది! ఎందుకంటే,  ఇంట్టో కుర్చీలే ఉంటే, ఇంటికొచ్చిన విశ్వచక్రవర్తికి అందరిలా కుర్చీలే వేసేవాడు కదా! కుర్చీలు లేకపోవడం వల్లే ఆయనను తన ఒడిలో కూర్చోబెట్టుకునే ఆలోచన చేశాడు. అదెంత ధన్యత? దైవార్చనకు తన వద్ద పన్నీరు లేకపోతే మాత్రం ఏమయ్యింది? ఆ లేకపోవడం వల్లే,  కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగే సౌభాగ్యం అతనికి అబ్బింది! పూజ కోసం కనీసం నా వద్ద పూలైనా లేవు కదా అంటూ అతని మనసు కలత పడుతోంది గానీ, ఆ కలతే కదా పూలకు బదులుగా ప్రేమాంజలులు సమర్పించేందుకు సంసిద్ధం చేసింది! పళ్లూ, పాయసాల మాట ఎలా ఉన్నా,  నైవేధ్యం కోసం కడకు కొబ్బరికాయ అయినా లేదే .! అని అతని మనసు లోలోపల కొండశోకం పెడుతోంది కానీ, ఆ శోకమే ఆ కాయకు బదులుగా హృదయాన్నే సమర్పించుకోవడానికి ఉద్యుక్తుణ్ని చేసింది. ఎక్కడో ఏదో లేదనే భావన రాకుండా ఒకదానికి ప్రత్యామ్నాయంగా మరొకటి సమర్పించుకుంటూ, మిగతా అందరికీ సరిధీటుగా  అని కాదు, వారందరికన్నా సమున్నతుడిగా  నిలిచాడీ భక్తాగ్రేసరుడు. అందుకే ఉన్నంతలో ఎక్కడా లోటు రానీయనంటూ అంత ధీమాగా చెప్పాడు. నిజానికి అనాదిగా మానవాళిని అతలాకుతలం చేస్తున్నది తన దగ్గర ఏదో లేదనే బావనే! నిజమే భౌతిక జీవితంలో వస్తుపరమైన లోటు లోటుగానే కనిపిస్తుంది. కానీ, ఆధ్యాత్మిక జీవనంలో ఆ లోటు లోటే కాదు! విశ్వంలోని అణువణువునా జీవిస్తున్న సర్వేశ్వరుడికి అన్నీ ఒకటే కదా!

ఏదో లేని కారణంగా మనమింక నిలబడలేమేమో, ఎక్కడ  పాతాళానికి జారిపోతామో అని చాలా సార్లు  కొందరు  బెంబేలెత్తి పోతుంటారు,  కానీ ఆ లేని తనమే ఒక్కోసారి అంతకు ముందెప్పుడూ కలగని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది. అదే వారిని ఆకాశానికి చేరుస్తుంది. అనంతమైన ఆధ్యాత్మికానందానికి పాత్రుల్ని చేస్తుంది. చరితార్థుల్ని చేస్తుంది! కాకపోతే, ఆ శిఖరాన్ని అందుకోవడానికి సిరిసంపదల కన్నా కోటి రెట్లు  విలువైన జ్ఞాన సంపన్నత కావాలి! ఆ సంపన్నత ఒకటీ రెండూ కాదు  కోటి స్వర్గాల్ని నీ ముందు నిలబెడుతుంది !! ఇది  తపోధనుల, జ్ఞానర్షుల దివ్యవాక్కు!!!

                                                                - బమ్మెర  

18, డిసెంబర్ 2021, శనివారం

నిదురించే తోటలోకి పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?


కమ్మటి కల ఏదో కంటావు. జీవితం ఆ కలలాగే సాగిపోవాలనుకుంటావు! అయితే, నీ జీవితం పూర్తిగా నీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ కల సగమైనా నెరవేరుతుంది. అలా కాకుండా జీవితం మరొకరి చేతుల్లోకి వెళితే మాత్రం, కథే మారిపోతుంది. అప్పుడింక నువ్వు నువ్వుగా ఉండవు. నువ్వు నీకోసం కాకుండా, మరెవ్వరి కోసమో పడి ఉంటావు. అప్పటిదాకా నీ అంతరంగానికి తెలిసిన నువ్వే నువ్వు! నీ జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత,  నువ్వేమిటన్నది ఎదుటి వాళ్లు నిర్ణయిస్తారు, వాళ్లకు ఏదనిపిస్తే అదే నువ్వవుతావు? వాళ్లకున్న ఆ స్వేచ్ఛతో అప్పటి దాకా నిన్ను దేవతవని కీర్తించిన నోటితోనే భూతం అనేయగలరు! ద్వేషం పెంచుకుని నీ పైన ఎంత బురదైనా చల్లగలరు! ఒకటి మాత్రం నిజం....., జీవితానికి సంబంధించిన అందమైన పార్శ్వన్ని మాత్రమే చూస్తూ ఉండిపోతే, ఒక్కోసారి మరో పార్శ్వం నుంచి  ఎదురయ్యే పాశవిక చర్యల పర్యవసానాల్ని తట్టుకోవడం కష్టమవుతుంది. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలోని ఈ పాట ఆ నిజాన్నే చెబుతోంది. కె.వి. మహాదేవన్‌ సంగీత సారధ్యంలో సుశీల గొంతు నిండా ఆవేదన  నింపుకుని ఆలపించిన బాణీ ఇది! ఈ పాట మరో ప్రత్యేకత ఏమిటంటే, అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ,  ఏనాడూ సినిమా పాటలు రాయని  విప్లవ కవి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైన వియోగ గీతమిది! నిలువెల్లా గాయాలే అయినా, అన్యాయాన్ని నిలదీయాల్సిందేనని చెప్పే ఆ కవిగళం ఎంతో మందికి నిలువెత్తు స్పూర్తి!!. 

నిదురించే తోటలోకి....!


నిదురించే తోటలోకి - పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి - కమ్మ్డ్డ్డటి కల ఇచ్చింది

ప్రశాంతంగా ఉంటేనే అని కాదు, తనువు అలసిపోయినా, మనసు అలసి పోయినా, నిదురపడుతుంది. ఆ నిదురలో నిన్ను నువ్వు  మరిచిపోనూ వచ్చు., లేదా ఏవో కలలు వచ్చి నీ గతాన్నంతా తిరగదోడనూ వచ్చు. ఆ గతంలో అందమైన కథలూ ఉన్నట్లే,  విషాద గాధలూ ఉంటాయి. ఆ కలలో ఒక్కోసారి,  తేనెలు కురిపించే పాటలూ వినిపిస్తాయి. పాటలాంటి మనసులూ కనిపిస్తాయి. ఒకవేళ ఎదుటివారి గుండెనిండా దుఃఖమే ఉంటే ఓ మనసు  ఆ కన్నీరు తుడవనూ వచ్చు. మరో కమ్మటి కలకు జీవం పోయనూవచ్చు. నిజానికి, ఆశే లేని వారికి నిరాశలూ త క్కువే!,  కలలే కనని వారికి కన్నీళ్లూ తక్కువే! అయితే మాత్రం, ఎక్కడ కన్నీటి పాలవుతామేమోనని ఎవరైనా కలలు కనకుండా ఉంటారా? అదీకాక, కలలనేవి మన అనుమతి తీసుకునేమీ  రావుకదా! ప్రత్యేకమైన హక్కులూ అధికారాలేమీ లేకపోయినా, మన అనుమతి లేకుండానే మనసులోకి చొరపడే స్వేచ్ఛ, చొరవా కలలకు పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే అవి మన మనసుతో ఎలాగైనా ఆటాడుకుంటాయి. 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది // నిదురించే //

ఏ కారణంగానో బోసిపోయిన ఒక ఇంట, ఎవరో వచ్చి, హరివిల్లులను తలపించే రంగవల్లులు అల్లితే ఎంత బావుంటుంది? దీనంగా పడి ఉన్న లోగిలిలో దీపాలు వెలిగిస్తే ఎంత బావుంటుంది? అయినా, రోజురోజంతా  సమూహంలో, సందడిలో తిరిగే వాళ్లుకు ఆ బోసితనం, ఆ దైన్యం ఏంతెలుస్తుంది? జీవితమే తలకిందులైన తాలూకు ఆ దైన్యం, కొందరిని  వారి చుట్టూ ఎందరున్నా ఏకాకిగానే నిలబెడుతుంది. ఆ నిలువెత్తు ఏకాకితనంలో హృదయవేణువు శూన్యమే అవుతుంది. కాకపోతే, కాలం కలిసొచ్చి,  ఒంటరి బాటసారికి మరో బాటసారి తోడైనట్లు, మౌనంగా పడి ఉన్న ఆ హృదయవేణువులోకి ఒక మమతల ఝరి ప్రవేశిస్తే మాత్రం, రసరమ్యంగా ఉంటుంది. ఆకు రాలే కాలంలో హఠాత్తుగా వసంతం వచ్చి పడినట్లు, ఆ జీవితాల్లో అద్భుతమేదో జరగాలి! అలా ఏదో జరగకపోతే, గుండెనిండా పరుచుకున్న ఆ బరువైన వ్యధలూ , బాధల్ని ఎన్నోరోజులు మోయలేం! నిజానికి, ఈ ఆత్మవే దనలూ, ఆత్మక్షోభలూ గుండె గోడల మధ్య సాగే యుద్ధాలే మరి! ‘యుద్దంలో గెలిచిన వాడి కన్నా, యుద్ధం జరగకుండా ఆపినవాడే నిజమైన విజేత’ అంటూ ఉంటారు. కానీ,  దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపడం కన్నా, మానవ హృదయాల మధ్య  సాగే యుద్ధాలను ఆపడమే ఎక్కువ కష్టం! ఎందుకంటే,  దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు బయటికి కనిపిస్తాయి.  కానీ,  మానవ అంతరంగ యుద్దాలు బయటికి కనిపించవు. ఇదే పెద్ద సమస్య! అందుకే వాటిని ఆపడం అంత కష్టం! ఒకవేళ ఎవరైనా ఆపగలిగితే, అంతకన్నా హర్షదాయక విషయం మరేముంటుంది? 

విఫలమైన నా కోర్కెలు -  వ్రేలాడే గుమ్మంలో 
ఆశల అడుగులు విననబడి - అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న, నావను ఆపండీ ....
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి.... నావకు చెప్పండి ...!!

ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన అవి కురుస్తాయన్న గ్యారెంటీ లేదుగా! కమ్ముకున్నంతసేపట్లోనే అవి కనుమరుగైపోవచ్చు కూడా! ఆత్మీయులైనా అంతే..., ఇంటి ముందు ఎదురుపడ్డంత మాత్రాన వారు ఇంట్లోకి వస్తారనేమీ లేదుగా! మనం, ఆహ్వానించినా మాట వినకుండా, చూస్తుండగానే మలుపు తిరిగి మరోదారి పట్టవచ్చు. అప్పటిదాకా ఈ వెలుగులో ఈ జీవనయానం నిశ్చింతగా కొనసాగిపోతుందిలే అని,  ఎంతో ధీమాగా ఉన్న సమయంలో ఒక్కోసారి హఠాత్తుగా చిమ్మచీకట్లు కమ్ముకోవచ్చు. అప్పటిదాకా మమతల ఝరీనాదమేదో వినిపించినట్లే వినిపించి, హఠాత్గుగా కర్ణపేయంగా భీకర ధ్వనులేవో మారుమ్రోగవచ్చు. అయితే  ఊహించని గాయాలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న ఇలాంటి సమయంలో ఒక్కోసారి ఓ అమృతమూర్తి వచ్చి ఊపిరిపోస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే, అంతలోనే ఆ రూపం మాయమైపోనూవచ్చు. ఎంత గుండె నిబ్బరం ఉంటే మాత్రం, అన్నీ అనుకున్న దానికి విరుద్ధంగానే వెళుతుంటే ఆ మనిషి ఏమైపోవాలి? వాస్తవానికి లోకంలో నేరుగా వెళ్లే దారుల కన్నా, మలుపు తిరిగేవే ఎక్కువ! దారులే కాదు కొంత మంది మనుషులూ అంతే! చిత్తచాంచల్యం వారిని స్థిరంగా ఉండనివ్వదు. నమ్ముకున్న వారిని నిలకడగా సాగనీయదు.  ఎదుటి వారి జీవితాల్ని అల్లకల్లోలం చేసే అమానుషమైన  ఇలాంటి దోరణులను ఎవరు మాత్రం ఎల్లకాలం భరించగలరు? అప్పటిదాకా నదీతరంగాలతో కాలం గడిపి, చివరికి ఆ నదికే ముప్పు తలపెట్టే వారిని  నిలదీయాల్సిన అవసరం లేదా? వాళ్లు విసిరిన బాణాలతో గాయపడిన నదీహృదయం,  ఎంత కొండశోకం పెడుతోందో గుండె బద్దలయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదా? ప్రతిసారీ పోనీలే అనుకునే వాడు,  సమాజంలో ఎలా మనగలుగుతాడు? నిజానికి  అమానుషత్వాన్ని నిలదీసే వాడే, న్యాయం కోసం పోరాడే వాడే  నిలబడతాడీ లోకంలో... !

                                                                 - బమ్మెర 

11, డిసెంబర్ 2021, శనివారం

వినిపించని రాగాలే పాట | చదువుకున్న అమ్మాయిలు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

పంచేంద్రియాలకు తెలిసిందే ప్రపంచమైపోయింది మానవాళికి. కానీ, ఇంద్రియాలు ఎంత పరిమితమైనవో, వాటి పరిధి ఎంత చిన్నదో ఒకసారి తెలిస్తే ఆశ్చర్యపోతాం! కంటికి కనిపించేంత దూరమే ఈ నేల ఉంది అనుకోవడం ఎంత అమాయకత్వమో, ఇంద్రియాలకు తెలిసిందే సమస్తం అనుకోవడం కూడా అంతే అమాయకత్వం! మన అమాయకత్వం గురించి మనకు ఒకసారి తెలిసిపోతే ఎల్లలు ఎరుగని విషయాలు లోకంలో ఎన్నో  ఉన్నాయని బోధపడుతుంది. అప్పుడింక,  అప్పటిదాకా వినిపించని రాగాలెన్నో కొత్తగా వినిపించడం మొదలవుతుంది. అప్పటిదాకా కనిపించని అందాలెన్నో కనిపించడం మొదలవుతుంది. 
1963లో విడుదలైన ‘ చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ పాట ఇంద్రియాలకు అతీతమైన ఆ వినూత్న ప్రపంచం గురించి ప్రస్తావిస్తుంది. ఈ పాటను  స్వరపరిచిన రాజేశ్వరరావు హృదయం రాగాలు విరితేనెల వెన్నెల ఎలా కురిపిస్తాయో అక్షరాలా ఆవిష్కరిస్తుంది. అంత మధురమైన బాణీని తేనెల సోనను తలపించేలా సుశీల గానం చేసింది. త్రివేణి సంగమంలా అవతరించే ఇలాంటి అరుదైన పాటల్ని వినగలగడం నిస్సందేహంగా రసజ్ఞుల అదృష్టం!

వినిపించని రాగాలే.....!


వినిపించని రాగాలే - కనిపించని అందాలే 
అలలై మదినే కలచే - కలలో ఎవరో పిలిచే // వినిపించని //
‘తెలిసింది గోరంత ... తెలియనిది కొండంత’ అన్నట్లు, లోకంలో వినిపించే రాగాలు కొన్నే అయితే...,  వినిపించని రాగాలు లెక్కలేనన్ని! ఎంతసేపూ మనం,  కర్ణపుటాలను తాకిన వాటినే విని తాదాద్మ్యం చెందుతూ ఉంటాం. అవైనా కొన్నే! అయితే, హృదయ పుటాలను తాకే రాగాలు కోకొల్లలు.  మనసు పెడితే అవన్నీ వినవచ్చు. కానీ ఎంత మందికి అంత సమయం ఉంది? చాలా అరుదుగా కొందరు ఆ పనిచేస్తారు. హృదయ పుటాలపైన కదలాడే వాటిని  వారు హృదయంతోనే వింటారు! అందాల విషయానికి వస్తే...,  బాహ్యనేత్రం చూడగలిగే  సౌందర్యాలే సమస్తం కాదు కదా! అయినా అవి మాత్రం ఎన్ని? బహు స్వల్పం. అంతర్నేత్రంతో చూడగలగాలే గానీ, అవి అనంతం!  అత్యంత నవీనమైన రాగాలూ, అప్పటిదాకా కనీవినీ ఎరుగుని అందాలూ, మన రసాత్మను తాకినప్పుడు లోలోంచి ఏవో అలల్లాంటి ప్రకంపనలేవో పుట్టుకొస్తాయి. అలజడి రేపుతాయి. కమ్మకమ్మగా గుండెను కలచివేస్తాయి. మనో ఆకాశంలో  కలల మేఘాలు కమ్ముకుంటాయి. ఒక్కోసారి ఆ కలల్లో  ఎవరో పిలిచిన అలికిడి వినబడుతుంది. ఎవరా పిలిచినది? అంటే ఏ  రాకుమారుడో ఏమో మరి ! 

తొలిచూపులు నాలోనే - వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే - చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు // వినిపించని  //
గుండె నిండా కాంతిపుంజాలు నింపుకన్న ఆ రాకుమారుడి తొలి చూపులు,  దీపాలు వెలిగించక ఏం చేస్తాయి?  ఆ దీపాలు కళ్లముందే కాదు,  ఎదలోనూ వెలుగులు నింపుతాయి. ఆ అంతరంగ కాంతిలో  మోడువారిన కోరికలు కూడా చిగురించడం మొదలెడతాయి. అలా ఎదనిండా ప్రేమభావాలు మోసులెత్తిన తర్వాత ఏమవుతుంది? మేఘావృతమైన ఆకాశం వర్షించడానికి సిద్ధమైనట్లు, ప్రేమావృతమైన హృదయం వలపుల వర్షం కురిపిస్తుంది. వర్షాలు లేకపోతే నేల ఎడారిగా మారిపోయినట్లు,  వలపులే కురవకపోతే, మానవలోకం పొడిబారిపోతుంది. హృదయాల గొంతు తడారిపోతుంది. నిజానకి  యుగయుగాలుగా ఈ జీవచైతన్యయాత్ర ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది! అయినా తొలి చూపులు ... తొలి ప్రేమ అంటూ ఉంటాం, అవునూ...,  తొలిచూపులోనే ప్రేమ పుట్టడం సాధ్యమయ్యే పనేనా? అందులో ఉన్న నిజం ఏపాటి? మనకు తెలిసి అవి తొలిచూపులే కావచ్చు కానీ, మనకు తెలియకుండా అవి ఒక సుదీర్ఘకాలంగా సాగుతూ ఉండి ఉండాలి!  వాటి ఉనికి అంత  సుదీర్ఘమైనదే కాకపోతే,  అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న వారితో ఏకంగా జీవితబంధానికి సిద్ధమైపోవడం ఎలా సాధ్యం? ఇదీ అని చెప్పలేకపోవచ్చు. కానీ, ఆ చూపుల ఆగమనం మనం అంచనా వేయలేనంత  సుదీర్ఘమైదే!

వలపే వసంతములా - పులకించి పూచినదీ
చెలరేగిన తెమ్మెరలే - గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు // వినిపించని //
వలపు అంటే అదేదో ఒక పూవు పూచినట్లు, ఒక  కోయిల కూసినట్లు, ఒక కొమ్మ చిగురించినట్లు, అలా ఏదో ఒకదానితో ముడివడిన విషయమేమీ కాదు! అది మొత్తం వసంతాన్నే పొదువుకున్న వైనం! నిజానికి, ఒక హృదయం కోటి నందనాలకు సమానం! గమనించాలే గానీ, ఎద లోలోపల  కోటానుకోట్ల పూల రాసుల కోలాహలం వినిపిస్తుంది. వందలాది సెలయేర్లు ముప్పిరిగొని ఎదమీదుగా  పారుతున్నట్లుగా హొరు  వినిపిస్తుంది.  అసలు ఈ పులకింతలు ఎప్పుడొస్తాయి? పట్టరాని పారవశ్యంతో  గుండె ఉబ్బితబ్బిబ్బయినప్పుడే  కదా! ఈ స్థితిలో చల్లచల్లగా సాగే తెమ్మెరలు కూడా అగ్ని సరస్సుల్లా చెలరేగిపోతాయి. గిలిగింతలూ, .పులకింతలూ  కలగాపులగం అవుతాయి. వయసూ వయసూ అంటాం గానీ, తొలి శ్వాస నుంచీ తుది శ్వాసదాకా సాగే  మొత్తం జీవితాన్నంతా పరిగణనలోకి తీసుకోలేం!  దీపం వెలిగిన కాలమే దీపంతె జీవితమన్నట్లు,  ఏరు దాటించే కాలమే పడవ ఆయువన్నట్లు, హృదయం స్పందిచే కాలమే దాని వికాస కాలం! తనువూ, మనసు  అన్ని రకాలుగా విరబూసే కాలమే అసలు సిసలైన వయసు కాలం!

వికసించెను నా వయసే - మురిపించు ఈ సొగసే 
విరితేనెల వెన్నెలలో - కొరతేదో కనిపించే 
ఎదలో ఎవరో మెరిసే // వినిపించని //
ఎంతో బలమైనదే అయినా ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా! యువరాజు ఎంత పరాక్రమ శాలి అయినా యువరాణి లేకపోతే అది కొరతే కదా! యువరాణి పనీ అంతే మరి!! ఆమె ఎంత గొప్ప సౌందర్యరాశి అయితే మాత్రం ఏమిటి? యువరాజు లేకపోతే ఆమె ప్రేమ అంతా అడవి కాచిన వెన్నెలేగా! అందుకే మిగతా ఎన్ని ఉన్నా, ఎవరి తోడు వారికి దొరకకపోతే, అదో పెద్ద లోటుగానే ఉంటుంది! తనువూ మనసుల మధ్య ఆ వలపేదో తారట్లాడుతూ ఉంటేనే పరువం వికసిస్తుంది. సొగసులు మురిపిస్తాయి. ఎదలో విరితేనేలే కురుస్తాయి.!! అప్పుటిదాకా తన హృదయపు అంతరాంతరాల్లో ఒదిగి ఒదిగి ఉండిపోయిన  ఆ యువకిశోరుడెవరో అదును చూసుకుని  మెరుపులా వస్తాడు. చేతిలో చేయి వేసి ఎదలోకి  పిలుస్తాడు. నిండు నూరేళ్ల జీవితంలోకి కొండంత మనసుతో  ఆహ్వానిస్తాడు!! అప్పుడింక వినిపించని లక్షలాది రాగాలు వినిపిస్తాయి. అప్పటిదకా చూడని కోటానుకోట్ల సౌందర్యాలు దర్శనమీస్తాయి!!

                                                              - బమ్మెర 

4, డిసెంబర్ 2021, శనివారం

అందమైన తీగకు - పందిరుంటే చాలును పాట | భార్యాబిడ్డలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

శరీరాలైనా, మనసులైనా వాటికవిగా ఏమీ కావు. వాటి  వెనుక ఏ ప్రేరక శక్తి పనిచేస్తుందా అన్న దాని పైనే వాటి ఉనికీ, ఉత్థాన పతనాలూ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా నేలపైనున్న వారిలో నైరాశ్యాన్ని నింపితే వారు పాతాళానికిి జారిపోవచ్చు. అదే చైతన్యాన్ని నింపితే వారు ఆకాశంలోకి ఎగరవచ్చు. అయితే వారిని ఆకాశంలోకి ఎగదోసే యోచన ఎంతమందికి ఉన్నా, అసలు వ్యక్తిలో బలమైన ఆ ఆకాంక్షేదీ లేకపోతే, ఏ ప్రోత్సాహమూ ఫలితాన్నివ్వదు. ఆ ఆకాంక్షే బలంగా ఉంటే మాత్రం, అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అవుతాయి. అప్పుడింక అంతుచిక్కని వేదనతో సతమతమయ్యే వారు కూడా ఆనంద సీమలకు చేరుకోవచ్చు. ఈ భావజాలాన్నే ప్రతిబింబిస్తూ,  1972లో విడుదలైన ‘భార్యాబిడ్డలు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈపాటలోని సాహిత్య విలువలు గత 50 ఏళ్లుగా లక్షలాది శ్రోతల్ని ఉద్దీపింపచేస్తూనే ఉన్నాయి. ఆ సాహిత్యాన్ని మహదేవన్  స్వరపరిచిన తీరు, నిలువెత్తు చైతన్య దీప్తిని నింపేలా సాగిన ఘంటసాల గానం,  రసజ్ఞుల్లో జీవశక్తిని నింపుతూనే ఉన్నాయి.

అందమైన తీగకు.....!!


అందమైన తీగకు - పందిరుంటే చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా!
అందమంటే భౌతికమైన చక్కని రూపురేఖలే అన్నట్లు చూస్తారు చాలా మంది. నిజానికి, ఆశావహ దృక్పథంతో, నిలువెత్తు ప్రాణశక్తితో తొణకిసలాడేదే అసలు సిసలైన అందం. అలాంటి చైతన్య స్థితిలో ఏ కాస్త ఆసరా, ఆలంబన లభించినా పందిరిపైకి ఎగబాకే తీగెలా, మనిషి జీవన శిఖరాలను అధిరోహిస్తాడు.  అడ్డుపడే అంతరాయాలూ, అవరోధాలూ ఎన్ని ఉన్నా వాటిని అధిగమిస్తాడు. ఆనందిస్తాడు. ఆ పారవశ్యంలో వేయి వేణువులు ఒక్కటైనట్లు గానం చేస్తాడు.

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులే ముందు ముందు నడకలౌతాయి
ఆశ ఉంటే మోడు కూడా చిగురు వే స్తుంది
అందమునకానందమపుడే తోడు వస్తుంది
లోకంలోని ఎక్కువ మందిలో ఉండే పెద్ద లోపం ఏమిటంటే, అప్పటిదాకా అనుభవంలోకి వచ్చిన వాటినే వారు నిజాలనుకుంటారు. అలా స్వీయ అనుభవంలోకి రానివన్నీ నిజాలే కాదంటారు. కానీ, అప్పటిదాకా ఎన్నకడూ కనీ వినీ ఎరుగని  నిజాలెన్నో ఆ తర్వాత బయటపడి  ఆశ్చర్యచకితుల్ని చేసిన సందర్భాలు ఎన్ని లేవు? శరీర శాస్త్రవేత్తలనూ,  వైద్యశాస్త్ర వేత్తలను సైతం దిగ్భారంతికి గురిచేసిన  అనూహ్య సత్యాలు ఎన్ని లేవు? ఏ మహా ఆవిష్కర్త అయినా, అతనిలో ఉన్న మొత్తం శక్తితో పోలిస్తే, అతడికి తెలిసింది అందులో సగమే!’ అన్నాడో మహానుభావుడు. సాధ్యాసాధ్యాల విషయానికొస్తే, మనకు తెలిసిన సాఽధ్యాలు ఒక శాతమైతే, మనకు తెలియని సాధ్యాలు మిగతా 99 శాతం. అందులో భాగంగానే  ఒకప్పుడు అసాధ్యమనుకున్నవెన్నో ఆ తర్వాత సాధ్యం అవుతుంటాయి.  మనం వెంటనే నమ్మలేము గానీ,  అప్పటిదాకా వాలిపడిన పక్షి రెక్కలు ఒక్క ఉదుటున,  గొప్ప శక్తి పుంజుకుని,  ఆకాశంలో రెపరెపలాడినట్లు, అప్పటిదాకా నిర్జీవంగా పడి ఉన్న అవయవాలు సైతం గొప్ప చలన శక్తితో కదలాడవచ్చు. నిశ్చేష్టగా పడిఉన్న వ్యక్తి పరుగులు తీయవచ్చు. . కాకపోతే, మనసు నిండా అంత బలమైన ఆశ ఉండాలి. పునరుజ్జీవం పొందాలన్న తిరుగులేని ఆకాంక్ష ఉండాలి! 

పాదులోని తీగె వంటిది పడుచు చిన్నది
పరవమొస్తే చిగురువేసి వగలుబోతుంది
మొగ్గతొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది
తగ్గ జతకై కళ్లతోటే వె తుకుతుంటుంది
జీవితనౌక సాదాసీదాగా సాగిపోతున్న వారి మాట ఎలా ఉన్నా, జీవితం ఒడిదుడుకులతో సాగుతున్న వారి జీవితం వేరుగా ఉంటుంది. ఒక్కోసారి దుఃఖదాయకంగా కూడా ఉంటుంది.   అయితే,  బీడునేలలో వాడిపోతున్న మొక్క,  నాలుగు చినుకులు పడగానే తలరిక్కించి  చూసినట్లు, శోకతప్తమై  ఉన్న హృదయానికి నాలుగు ఓదార్పు మాటలు చెబితే అది  గొప్ప ప్రాణశక్తితో పరిఢవిల్లుతుంది. మనోవైకల్యాన్నే అని కాదు. ఒక దశలో  అంగవైక ల్యాన్ని కూడా అధిగమిస్తుంది. అన్నీ బావుంటేనే ఆరోగ్యం బావుంటుందని చాలా మంది అనుకుంటారు గానీ, నిజానికి, జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లేమీ లేకపోతేనే అనారోగ్యం మొదలవుతుంది. ఒకవేళ ఎవరైనా, సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధమైతే, అప్పటిదాకా వెంటాడిన అనారోగ్యాల్లో చాలా భాగం మటుమాయమవుతాయి. మానవజీవితాల్లో  ఇది పలుమార్లు రుజువైన నిజం!!

కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగువేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది
సాధారణంగా మనిషి తనలోని లోపాల్ని తలుచుకుని తరుచూ భయపడుతుంటాడు.  నిజానికి మనిషి భయపడాల్సింది తన లోపాల్ని చూసుకుని కాదు,  తనకు తెలియకుండానే తనలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తికేంద్రాల్ని తెలుసుకుని భయపడాలి! ఎందుకంటే, వాటిని అర్థవంతంగా వాడుకోలేకపోతే, అవి అణుబాంబులంత ప్రమాదకరమైనవి కూడా! ఏ వస్తువునైనా అందరిలా వినియోగిస్తే అందరికీ వచ్చిన సాదారణ ఫలితాలే మనకూ వస్తాయి.  అందరిలా కాకుండా భిన్నంగా వినియోగిస్తే, అసాధార ణమైన, అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఒక్కోసారి అవి ఎవరూ నమ్మలేని నిజాలే అయినా కావచ్చు. అప్పటిదాకా కదలక మెదలక ఒక శిధిలావస్థలో ఉన్న వ్యక్తి, హఠాత్తుగా లేచి నడిస్తే అది నమ్మలేని నిజమేగా! చాలా మంది,  దేహశక్తికి లోబడే,  సాధ్యాసాధ్యాలను  అంచనా వేస్తారు. వాటికి ఉండే పరిమితుల్నే పరమ సత్యాలుగా భావిస్తారు. కానీ, ఆత్మశక్తి, వాటికి అతీతమైనదనీ, దేహాలకు అసాధ్యమైనవి, ఆత్మశక్తితో సుసాధ్యమవుతాయన్న సత్యాన్ని విస్మరిస్తారు. నిజానికి కలలకు ప్రేరకంగా ఏ శక్తి అయినా పనిచేయాలే గానీ,  కదలలేని ఆ కలలకు కాళ్లు రావడం ఖాయం. అప్పుడింక  జీవితం పురివిప్పిన నెమలిలా అందంగా, ఆనందంగా  నాట్యం చేయడం ఖాయం!! 

                                                   - బమ్మెర


19, నవంబర్ 2021, శుక్రవారం

ఎవరికి వారౌ స్వార్థంలో పాట | గుడిగంటలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

 పాటలో ఏముంది?


ఎవరికి వారౌ స్వార్థంలో......!

స్వార్థం మనుషుల్ని విడదీస్తుంది. త్యాగమొక్కటే మనుషుల్ని కలుపుతుంది. అందుకే లోకం త్యాగమూర్తులకు పెద్ద పీట వేస్తుంది.  నిజానికి, ఆ త్యాగభావనే లేకపోతే, మనిషికి మిగిలేది ఏమీ ఉండదు.  ఒక్కొక్కరుగా ఆత్మీయులంతా దూరమై, ఏదో ఒక దశలో మనిషి జీవితం  ఎడారిగా  మారిపోతుంది. ఈ నిజం తెలిసినా తెలియకపోయినా, నీరు పల్లం వైపు పరుగెత్తినట్లు చాలా మంది మనసు స్వార్థం వైపే వెళుతుంది. ఆ స్వార్థంలో, ఎడతెగని ఆరాటాలూ, పోరాటాలూ, మనిషిని నిత్యం వేధిస్తాయి. అయితే, ఒక్కోసారి,  ఎన్నెన్నో ఎదురీతల తర్వాత కూడా  తీరం చేరలేకపోయినట్లు, ఎన్నో పోరాటాల తర్వాత చేరువైన బాంధవ్యాలు కూడా ఎప్పటికీ తనతో ఉండలేకపోవచ్చు. ఒకవేళ అన్నీ అనుకూలించి, ఆ సాంగత్యం కడదాకా ఉంటే మాత్రం జీవితమింక నూరేళ్ల  పండగే! 1964లో విడుదలైన ‘గుడిగంటలు’ సినిమా కోసం శ్రీశ్రీ రాసిన ఈ పాటను స్వీయ సంగీత సారధ్యంలో ఘంటసాల భావస్పోరకంగా,  ఎంతో ఆర్థ్రతతో గానం చేశారు. 



ఎవరికి వారౌ స్వార్థంలో - హృదయాలరుదౌ లోకంలో 
నాకై వచ్చిన నెచ్చెలివే - అమృతం తెచ్చిన జాబిలివే 
నాకమృతం తెచ్చిన జాబిలివే // ఎవరికి //

ఒకరి కోసం ఒకరన్న ఏకీ భావన లోకంలో రోజురోజుకూ కొడిగట్టుకుపోవడం మనమంతా గమనిస్తున్నదే! ఫలితంగా,  భూమ్మీద నాలుగింట మూడువంతులు నీరే ఉన్నట్లు, జీవితాల్లోనూ నాలుగింట మూడు వంతులు కన్నీరే ఉంటోంది. ఇందుకు కారణం ఎక్కువ మంది ఎవరికి వారుగా విడి పోవడమే! అదేమిటో గానీ,  విడిపోవడంలోనే ఎక్కువ సుఖం ఉందని అత్యధికులు భావిస్తున్నారు.. కానీ,  సుఖం మాట అటుంచి, ఆ ఎడబాటు, అనుకున్నదానికి పూర్తిగా విరుద్ధంగా,  హృదయాల్ని కన్నీటి మయం చేస్తోంది. ఏదో అనుకుంటారు గానీ, బ్రతుక్కి ఒక వైభవాన్నీ, జీవితానికో సౌందర్యాన్నీ ఇచ్చే శక్తి స్వార్థానికి లేనే లేదు. ఏ మనిషికైనా  అవన్నీ త్యాగం వల్లే సిద్ధిస్తాయి. అందుకే లోకమెప్పుడూ  త్యాగమూర్తులనే కీర్తిస్తుంది. ఆ నిజం తెలియకుండా,  స్వార్థబుద్దితో వ్యవహరిస్తూ, సర్వశక్తులూ వెచ్చించి ఎంత సంపద కూడబెట్టుకున్నా,  ఒకదశలో అది ఎందుకూ పనికి రాదని స్పష్టంగా తేలిపోతుంది. అలాంటి స్థితిలో నీ కోసం నిలబడే మనిషే ఉండడు.  నిన్ను పలకరించే దిక్కే ఉండదు.  అప్పటిదాకా అందరినీ దూరం పెట్టగలిగినట్లు, నువ్వేదో అనుకుంటావు గానీ, అందులో నిజం లేదని , అవతలి వాళ్లే నిన్ను దూరం పెట్టారన్న అసలు నిజం,  కాస్త ఆలస్యంగానైనా నీకు బోధపడుతుంది. ఒకవేళ పెద్ద మనసుతో నిన్ను మన్నించి, నీలోని సమస్త లోపాలు తెలిసితెలిసే ఒక నెచ్చెలి,  నీ వద్దకు వచ్చి,  నిన్ను తన ఒడిలోకి తీసుకుందే అనుకుందాం! అప్పుడు ఎలా ఉంటుంది.? గుండెలో పూల వర్షం కురిసినట్టే ఇంక! అయితే  వస్తూ వస్తూ, ఆమె ఇంకేదో తీసుకురావాలనుకుంటే మాత్రం, నిజంగా అదో పెద్ద దురాశ! ఎందుకంటే, ఆమె రావడం అంటే ఒక మహా అమృతభాండం నీ ముందు నిలవడమే!    

ధనము కోరి మనసిచ్చే ధరణి - మనిషిని  కోరి వచ్చావే... 
నా అనువారే లేరని నేను,  కన్నీరొలికే కాలంలో ...
ఉన్నారని నా కన్నతల్లివలె  ఒడిన చేర్చి నన్నోదార్చావే // నాకై వచ్చిన //
ఇతర విలువల గురించి ఏం తెలిసినా,  తెలియకపోయినా,  నేటి మనిషికి ధనం విలువ మాత్రం బాగా తెలిసొచ్చింది. మిగతా ఏమున్నా లేకపోయినా, చేతి నిండా డబ్బు ఉంటే చాలు జీవితం హాయిగా గడిచిపోతుందనే భావన మనసులో బాగా స్థిరపడిపోయింది. కొంత మంది తెలివిగా అర్థాలు మార్చేస్తారు గానీ,  ఆస్తులూ, ఐశ్వర్యాలూ లేకపోవడం వల్ల వచ్చేది దారిద్య్రం కాదు. నా అన్నవారెవరూ లేకపోవడం వల్ల ఏర్పడే శూన్యమే అసలు సిసలైన దారిద్య్రం. ఆ దారిద్య్రంలో ఆత్మీయులకు కూడా దూరమై, కనీసం పలకరించే మనిషి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా సరిగ్గా  అదే సమయంలో నిన్ను ఓదార్చడానికి, తల్లిలానో, చెల్లిలానో లేదా నెచ్చెలిలానో ఎవరైనా నీ  చెంత చేరితే ఎలా ఉంటుంది? ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్లు, మృత్యుముఖంలో ఉన్నవారికి ప్రాణాలు నిలబెట్టే సంజీవిని దొరికినట్లు అనిపిస్తుంది. అయితే, అందరికీ ఆ దశలో అంత పెద్ద మనసున్న వారు ఎదురుపడే అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకే ఏమాత్రం జాప్యం చేయకుండా, అన్నీ బావున్నప్పుడే మనిషిగా మసలే విద్య నేర్చుకోవాలి. ఏ కారణంగానో ఒడిలో ధనకనకాలు నింపుకున్నా, తలపైన మాత్రం ప్రేమ-దనాగారాన్ని పొదివి పట్టుకోవాలి! ఎవరైనా, జీవితం ఆనందమయం కావాలని  ఆశపడితే సరిపోదు.  అందుకు ఈ అడుగులన్నీ వేయాలి మరి!

ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను - గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ  మ్రోగాయి - నా కంటిపాప నువ్వన్నాయి // నాకై వచ్చిన //
చెట్లను నరికేసి, పండ్లకోసం వెతికినట్టు, అయిన వాళ్లందరినీ దూరం చేసుకుని, ప్రేమకోసం వెతికితే ప్రయోజనం ఏముంటుంది? నిష్ప్రయోజకమైన ఈ రకం పనుల్లో ఎంతో కాలం గడిచిపోయాక,  తప్పిదాలకు ఎంత   పచ్చాత్తాపం చెందితే మాత్రం ఒరిగేదేముంది? నిన్ను ప్రేమించే వారికోసం, ఎంత పలవరించీ, ఎంత కలవరిస్తే  మాత్రం సాధించేదేముంటుంది?  కాకపోతే,  మనుషులెవరూ అసలే నమ్మని ఆ స్థితిలో, నమ్మ బలుకుతూ, స్వార్థ జీవులే కొందరు నీకు ఎదురుపడతారు. ఎంత ప్రేమనో ఒలకపోస్తారు. కాకపోతే, ఆ అవగాహనేదో ముందే ఉంటే, వారి స్వార్థాన్ని వెంటనే గుర్తించి, దూరం పెట్టవచ్చు లేదా తనే దూరం జరగవచ్చు. ఏమైనా ఇక్కడ ఎంతో కొంత అలజడి, ఆందోళనా ఉంటాయి.  ఒకదశలో కొందరు ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంటారు. చివరికి దిక్కుతోచక ఇంక దేవుడే దిక్కనుకునే స్థితి వచ్చేస్తారు.  అప్పుడింక అదేపనిగా  మఠాలూ,  గుళ్లూ, తిరుగుతూ, సాధువులకో లేదంటే దేవుళ్లకో గోడు చెప్పుకోవడం మొదలెడతారు. అయితే, ఇదంతా దూరం నుంచి గమనిస్తూ, మెల్లమెల్లగా ఎవరో నీ దగ్గరగా వచ్చి,  నీ నీడగా, నీకు తోడుగా,, అన్నివిధాలా నీకు అండదండగా నిలబడితే, ఇక అంతకన్నా ఏంకావాలి? ఎన్నో ఏళ్ల నీ నిరీక్షణ ఫలించి,  నీ జీవితేచ్ఛ నెరవేరుతుంది. నీ జీవనయానం కొత్తకొత్తగా  మళ్లీ ఆరంభమవుతుంది. 

ఈ అనురాగం ఈ ఆనందం - ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఊడలు బాకీ - నీడలు పరచి ఉండాలీ వెయ్యేళ్లు - చల్లగ ఉండాలీ వెయ్యేళ్లు 
తియ్యగ పండాలీ మన కలలు..... // ఎవరికి //

లోకంలో మామూలుగా అయితే,  ద్వేషానికి ద్వేషమే ఎదురవుతుంది.. ప్రేమకు ప్రేమే దొరుకుతుంది. అయితే వీటికి అతీతంగా, గతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అంత ఉదాత్తంగా వ్యవహరించేదెవరు? ఎన్నో రకాలుగా దెబ్బతిని  జీవితపు అట్టడుగున పడి ఉన్నవారికి చేయూత అందించేవారెవరు? ఆకాశమంత ప్రేమతో నిన్ను  అక్కున చేర్చుకునేదెవరు?  ఒకవేళ అనూహ్యంగా అదే జరిగితే, అంతకన్నానా? ఆ ఆనందం నిజంగా ఎల్లలు లేనిది. ఎవరి జీవితంలోనైనా, అలాంటి బంధమేదైనా ఏర్పడితే, వారి పాలిటి అదో వరప్రసాదమే! ఎవరికైనా అలాంటి తీయని అనుభవమేదో ఎదురై, ఒక నిండు అనుబంధంతో పెనవేసుకుపోయిన నాడు, ఆ బంధం చిరకాలం ఉండాలనుకుంటారు.  వందేళ్లు కాదు ..... ఆ ప్రేమయానం వెయ్యేళ్లు కొనసాగాలని కోరుకుంటారు! వాళ్ల ఆశలు అక్షరాలా నిజం కావాలని మనమూ ఆశిద్దాం మనసారా!!

                                                              - బమ్మెర 

14, నవంబర్ 2021, ఆదివారం

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పద్యం | ‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక |ఘంటసాల ప్రైవేట్‌ పద్యాలు |

పద్యమాధురి

‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక లోని (ప్రైవేట్‌ రికార్డ్‌) అంజలి ,  రచన: కరుణశ్రీ, సంగీతం, గానం: ఘంటసాల

అంజలి ఘటిస్తూ....!

గృహ సంసారాన్ని యీదడానికే మనిషి నానా అవస్థలూ పడుతూ ఉంటాడు. అలాంటిది అనంతమైన విశ్వసంసారాన్ని యీదే ఆ దేవదేవుడి పరిస్థితి ఏమిటి? నిరంతరం,  గతాన్నీ, వర్తమానాన్నీ, భవిష్యత్తునూ క్రోడీకరించుకుంటూ,  విశ్వచక్రాన్ని అరమరికలు లేకుండా ముందుకు నడిపించుకుంటూ వెళ్లడానికి ఆ పరమేశ్వరుడు నిత్యం,  ఎంత  శక్తి ధారపోయాలి? అప్పటికే పుట్టీ, పెరిగి  మనుగడ సాగిస్తున్న వారికే కాదు, పుట్టబోయే వారి కోసం కూడా అవసరమైన అన్ని  ఏర్పాట్లు చేయాల్సి రావడం ఆయనకు అదెంత భారం? అది సరే గానీ, అహోరాత్రులూ విశ్వవీణను మోసీ మోసీ అలసి సొలసిన ఆ దేవదేవుడు కాసేపైనా సేద దీరేందుకు  కాస్తంత వెసులుబాటు అవసరమా కాదా?  సమస్త ప్రాణికోటిలో కెల్లా సమున్నతుడిగా చెప్పుకునే మనిషిపైన ఆ బాధ్యత ఉందా ... లేదా? ఆకాశమంత పందిరి వేసి ఆతిధ్యం ఇవ్వాల్సిన ధర్మం మనిషిదే కదా! నిజానికి, మనమేదో ఆతిధ్యం ఇస్తే  తప్ప అతని మనసు కుదుటపడదనేమీ లేదు. అయినా, ఆయన పట్ల  మనకున్న కృతజ్ఞతా భావాన్ని మనం ఏదో ఒక రకంగా వ్యక్తం చేయకపోతే, మనల్ని మనం మనుషులం అనుకోలేం మరి! 

తన ఉదయశ్రీ కావ్యం లోని ‘అంజలి’ అనే పద్య ఖండిక ద్వారా ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ మాటే చెబుతున్నాడు. భక్తిపారవశ్యంలో ఊయలలూపే ఇందులోని పద్యాల్ని ఘంటసాల తనే స్వరపరిచి, ఎంతో మనోహరంగా గానం చేశారు. ఎప్పుడో  కొన్ని దశాబ్దాల క్రితం ప్రైవేటు రికార్డుగా విడుదలైన ఈ పద్యరాగమాలిక  సాహితీ ప్రియుల గుండెల పైన  ఇప్పటికీ ‘లాహిరి ... లాహిరి.. లాహిరిలో....’ అంటూ తేలాడుతూనే ఉంది.  ఎన్నిసార్లు  విన్నా ఎంతకూ తనివి తీరని ఈ స్వరరాగ జలపాతాల్లో మనం మరోసారి తడిసి ముద్దైపోదామా? 

వచనం: 

ఎవరిదీ కాళ్ల చప్పుడు? ఎవరో కాదు, నా ప్రభువే.  ప్రభూ! నీవు కరుణామయుడవు. నీ సృష్టి కరుణామయం. నా ఇంటికి నడచి వచ్చావా ప్రభూ! ఈ నాడు నా భవ్య జీవితానికి ఒక మధుర ప్రసాదం. నా హృదయానికి ఒక ఉదయశ్రీ. 

పద్యం:

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై

       పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి, 

కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో

       లతలకు మారాకు లతికి యతికి 

పూల కంచాలలో రోలంబములకు రే 

       పటి భోజనము సిద్ధపరిచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

       వింత వింతల రంగు వేసి వేసి 


తీరికే లేని విశ్వ సంసారమందు 

అలసిపోయితివేమొ దేవాదిదేవ! 

ఒక నిమేషము కన్ను మూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు. 

నిలువెత్తు పెరిగాక, కొన్ని నిజానిజాలేవో  తెలిసిపోయాక మనిషి ఎన్నెన్నో పరిణామాలకు లోనవుతాడు.  ఆ విషయం అలా ఉంచితే, భూమ్మీద వాలకుండా, ఇంకా తల్లి కడుపులోనే కదలాడుతున్న ఆ పసికందుల మాటేవిటి?  ఆ పరమాత్మల ఆగమనాన్ని దృష్టిలో ఉంచుకుని దేవదేవుడు ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి? జన్మనిచ్చే ఆ తల్లి ఎదలో అమృతమయమైన పాల కోనేర్లు నెలకొల్పడానికి ఆయన పడే పాట్లు ఎన్నెన్ని? మండుటెండల్లో తిరిగినా, దోసిళ్లలో వెన్నెల చల్లదనాన్నే ఒడిసిపట్టుకుని, కొమ్మ కొమ్మకూ,  తీగెతీగెకూ ఎన్నెన్ని ఆకులో అతికి అతికి ఆయన ఎంతెంతగా అలసిపోయి ఉంటాడు? ఆక లితో అలమటిస్తూ,  దిక్కు తోచక తిరుగాడే తుమ్మెదల కోసం,  పూల గిన్నెలలో తేనె  ధారల్ని నింపడం కోసం,  ఎంతగా రెక్కల్ని ముక్కలు చేసుకుని ఉంటాడు? రోజురోజంతా  ప్రాణికోటి హృదయాలు వర్ణ రంజితం కావడానికి, తెల్లవారకముందే మొగ్గమొగ్గకూ రసరమ్యమైన రంగులు వేస్తూ, వేస్తూ  ఆతని ఎంత రక్తం ఆవిరౌతూ ఉంటుంది? ఆయన నిత్యకృత్యాల్లో మచ్చుకు ఇవి నాలుగు మాత్రమే!

దేవదేవుడు అనగానే పూజలందుకోవడమో, రథమెక్కి ఊరేగడమో తప్ప ఆయనకింక  వేరే పనులు ఏముంటాయి? అనుకునే వాళ్లే లోకంలో ఎక్కువ. నిజానికి ముక్కోటి రూపాల్లో అనునిత్యం ఆయన చేసే కార్యకలాపాలు అనంత కోటి!. అయితే, ఆయనకు అంజటి ఘటించడానికి, ఆ పరమాత్మకు మనం ఎన్ని నీరాజనాలు పడితే మాత్రం అవి ఆయన ముందు ఏపాటి? ఆయనకు మనం ఇచ్చే ఆతిఽథ్యం మాత్రం ఏపాటి? అయినా, అన్నీ తానే అయిన ఆ అనంత మూర్తికి మనమేమి సేవలందించగలం? ఆయన సేదతీరడానికి మనమేం చేయగలం? అనిపించవచ్చు. అదీ నిజమే కానీ ... మన మనసులో సిద్ధమైన కృతజ్ఞతా పూలమాలను మన చేతులతో  మనం ఆయన మెడలో వేయాలి కదా! అమ్మానాన్నలు కట్టించిన ఇల్లే కావచ్చు. అయితే మాత్రం! అహోరాత్రులూ పనిచేసే అలవాటుతో వారు అలసిపోయినప్పుడు,  అమ్మా...! కాస్త నడుము వాల్చు!,    నాన్నా ...! కాస్త సేదదీరు! అనే మాటలు మన నోటి నుంచి రావాలి కదా! ఈ పద్యాలు గొంతెత్తి ఆ మాటలే చెబుతున్నాయి! అవి రాగబద్ధమై ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా తెలుగు నేలంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి!!

                                                              - బమ్మెర