24, డిసెంబర్ 2020, గురువారం

పూవై విరిసిన పున్నమి వేళ పాట లిరిక్స్ విశ్లేషణ | తిరుపతమ్మ కథ సినిమా | ఎన్టీఆర్ పాత పాటలు | Telugu Old Songs Analysis |

పాటలో ఏముంది... ?

మంద్రస్వరంలో అత్యంత మధురంగా సాగే ఒక అరుదైన పాట ఇది 1963 లో విడుదలైన తిరుపతమ్మ కథ సినిమా కోసం డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ పాటను పామర్తి స్వరపరిచారు . ఈ పాటను ఆలపించడంలో ఘంటసాల గొంతు ఒలికించిన మార్దవం అపురూపం . దాని లితంగానే దాదాపు 6 దశాబ్దాలుగా ఈ పాట రసజ్ఞుల హృదయాల్ని ఇంకా రంజింపచేస్తూనే ఉంది .
పూవై విరిసిన పున్నమి వేళ

పూవై విరిసిన పున్నమి వేళ
బిడియమూ నీకేలా బేలా! // పూవై // హృదయాల్ని పరవశింపచేసే రీతిలో ప్రకృతి వికసిస్తున్న వేళ ... జాబిల్లి పువ్వులా విరిసే వేళ... భావోద్వేగాలు వెల్లువైపోయే వేళ ... ఒక్కోసారి ప్రియురాలి హృదయం ఎక్కడలేని బిడియానికి లోనవుతుంది . అలాగని ఆ బిడియం అర్థం లేనిదేమీ కాదు . ఎందుకంటే తమ భావావేశాలు ఎంత రసాత్మకమైనవైనా కావచ్చు . కానీ , లోకం వాటిని ఆమోదిస్తుందన్న గ్యారెంటీ లేదుకదా ! పైగా ఈ రోజు ఇంత అనురాగాన్ని చూపే ప్రేమమూర్తి , ఎప్పటికీ ఇలాగే ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదు కదా మరి ! అందుకే ఏదో జంకు , ఏదో భయం , వాటిని వెన్నంటి ఏదో బిడియం .అలాగని , ఎప్పటికీ ఆ భయం అలాగే కొనసాగినా నష్టమే ! ఎందుకంటే , తాను ఆశించిన ప్రతిస్పందనేదీ రావడం లేదని భావిస్తే , అవతలి వ్యక్తి విసిగి వేసారి , వెనక్కి తగ్గవచ్చు . అపురూపమైన ప్రేమమూర్తి తననుంచి దూరం కావచ్చు . అందువల్ల ఎల్లవేళలా మోసుకు తిరగకుండా బిడియాన్ని అధిగమించడం కూడా జీవితానికి అవసరమే !
పూవై విరిసిన పున్నమి వేళ పాట
poovai Virisina Punnami Vela Song

చల్లని గాలులు సందడి చేసే
తొలితొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాలువేలు బేలా ! // పూవై // చల్లచల్లని గాలులు ప్రేమికుల మధ్య సందడి చేసినప్పుడు ఏమవుతుంది ? లోలోపల సుడివడుతున్న తొలివలపులు హృదయేశ్వరిని చేరుకోవడానికి తొందరపడతాయి . కానీ , తొందరపడి బిరబిరా అడుగులు వేస్తే ఏమువుతుందో చెప్పలేము కదా ! తొలివలపులు అంటే ఏమిటి ? జీవితాన్ని , ప్రేమ లోకాన్ని కొత్తగా చూపేవి అనే కదా ! కాకపోతే అంతకు ముందు ఏ అనుభవమూ లేని ఆ కొత్త అడుగులు ఒక్కోసారి పెద్ద విపత్తులోకి నెట్టే ప్రమాదమే ఎక్కువ .ఏమైతేనేమిటి ? పిలిచిందే తడవుగా పరుగెడితే జవరాలు తత్తరబాటుకు గురువుతుంది . అప్పుడింక ముఖ కవలికలు బయటకు కనిపించకుండా , మేలిముసుగులో తలను వాల్చేస్తుంది . అదేదో బేలతనం అన్నట్లు అతడు మాట్లాడతాడు గానీ , నిజానికి అది బేలతనం కాదు . జీవితాన్ని గురించిన , లోకాన్ని గురించిన ఒక కొత్త అవగాహనే అందుకు కారణం . అలాగని ఆ వైఖరి ఎప్పటికీ అలాగే ఉంటుదనేమీ కాదు . తనకు తాను ధైర్యం చెప్పుకుని , తనను తాను సంభాళించుకుని వాల్చిన తలను పైకెత్తడానికి ఆమెకు మరీ అంత ఎక్కువ సమయమేమీ పట్టదు . అవతని వ్యక్తి కి ఆ మాత్రం ఓపిక ఉండాలి మరి !

పూవై విరిసిన పున్నమి వేళ పాట
Thirupathamma Katha Film
మొదట మూగినవి మొలకనవ్వులు
పిదప సాగినవి బెదురు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపొదువేల ? .... బేలా ! // పూవై // వెనకా ముందు ఏమీ ఆలోచించని ముగ్ధ బాలికే అయితే , ముఖం పైన ముసిముసి నవ్వులే నాట్యమాడవచ్చు . కానీ , కాస్త ఆలోచించడం మొదలెట్టగానే లోలోన ఏదో భయం మొదలవుతుంది . ఆ పైన బెదురుచూపులేవో కదలాడతాయి . ఈ మనోభావాల పరంపర ఎలా ఉన్నా , ఆమెకు అతీసన్నిహితంగా ఉన్న అతనికి ఆ రసధ్వనులేమిటో ఒక్కొక్కటిగా తెలిసిపోతూనే ఉంటాయి . చెంతకు తీసుకునే కొద్దీ తన హృదయ స్పందనలన్నీ అతని తెలిసిపోతున్నట్లు అమె గ్రహిస్తుంది. చివరికి అప్పటిదాకా పక్క పక్కకి తొలగిపోయే ఆమె ఏమీ తోచక అతని ఎదమీద వాలిపోతుంది .
పూవై విరిసిన పున్నమి వేళ పాట
NTR Old Songs
తీయని లపుల పాయసమాని
మాయని మమతలు ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
ఇంకా జాగేలా ? బేలా ! // పూవై // మమతలే ఊయలగా ఊగిఊగి ఓలలాడే దశలో ఏముంటుంది ? తీయతీయని వలపుల్నీ ఆస్వాదించడమేగా ! అప్పటిదాకా ఇద్దరుగా కదలాడిన వారు ఒకే ఒక్కరుగా పరవశించడమేగా ! ఈ స్థితిలో ఇంకా ఎందుకు జాప్యం అంటూ ప్రియతముడు ప్రశ్నించడం మామూలే కానీ , అన్నదే తడవుగా సిద్ధమైపోవడానికి ఎన్నెన్ని ఇరకాటాలు ? ఇరువురు ఒకటైపోవడం అంటే అదేమైనా మామూలు మాటా ? ఒక్కటిగా అంటే రెండు హృదయాలు ఒక్కటి కావడం ,రెండు జీవితాలు ఒక్కటి కావడం , అంతకన్నా మించి రెండు ప్రపంచాలు ఒకటి కావడం ..నిజంగా ఇది ఎంత పెద్ద విషయం ? అప్పటిదాకా ఎన్నోసార్లు కలసి సంచరించి ఉండవచ్చు . మనసులు కలిసి , మాటలు కలిసి అంతరంగాల్లో ఎన్నో ఉత్సవాలే జరిగిపోయి ఉండవచ్చు . కానీ , రెండు జీవితాలు ఏకం కావడం అంటే అదో యజ్ఞమే ! తొలిసారిగా ఒక యాగం చేయబూనుకున్నప్పుడు వివిధ కారణాల వల్ల ఎంతో కొంత జాప్యం జరుగుతూనే ఉంటుంది . కాకపోతే , ఆ జాప్యం మరీ ఎక్కువైతే , ఇబ్బందే మరి ! ఏదో అలా అనుకుంటామే గానీ , తెలిసి తెలిసీ ఎవరూ మరీ అంత జాప్యం కానివ్విరు . అతిచేసి , చేతిలోని అమృత కలశాన్ని ఎవరు మాత్రం జారవిడుచుకుంటారు చెప్పండి !! అలా ఎప్పుడూ జరగదు .ఇది నిజం ... !!
---బమ్మెర

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా

ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 
https://wa.me/message/6YRYVO6BHLZMA1

NTR Old Songs, Thirupathamma Katha Film ,poovai Virisina Punnami Vela Song,ntr songs,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి