16, జనవరి 2021, శనివారం

భక్త కన్నప్ప సినిమా | శివశివ శంకర భక్తవ శంకర భక్తి గీతం విశ్లేషణ | తెలుగు పాత పాటలు | కృష్ణంరాజు పాటలు |

పాటలో ఏముంది ? 


శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది . 

శివశివ శంకర


శివశివ శంకర భక్తవ శంకర 
శంభో హరహర నమో నమో !

శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద    ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం! శబ్ద  , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన  దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం ! 

పున్నెము పాపము ఎరుగని నేను 
పూజలు సేవలు తెలియని నేను 
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల  చేయాలి  నీ సేవలు || శివ శివ ||

శివపూజలో నిమగ్నం కావడం అంటే శివచైతన్యంలో పాలు పంచుకోవడమే కదా ! శివచైతన్యంలో కలిగే ఆ జ్ఞానం ఏం చేస్తుంది ? సమస్త ప్రకృతి పట్ల , సకల ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగిస్తుంది . నిజానికి , సమజ్ఞానం , సమదృష్టి కలిగిన వ్యక్తి . ఏం చేసినా అది మానవాళికి శ్రేయోదాయకమే తప్ప హానికరం కాజాలదు . ఆ స్థితిలో ఏది పుణ్యం , ఏది పాపం అనే మీమాంసకు తావే ఉండదు . చేపట్టినవన్నీ సత్కర్మలే అవుతాయి . పుణ్యకార్యాలే అవుతాయి . అన్నింటినీ మించి , ఆ జ్ఞాన స్థితిలో ఈశ్వరుడు వేరు , తాను వేరు అనే ద్వైత భావనే మనసులోకి రాదు . ఆ స్థితిలో పూజలు , హారతులు అనే మాటలకు అర్థమే ఉండదు . కాకపోతే , అందరిలోనూ , అన్నివేళలా ఆ దివ్యజ్ఞాన స్థితి నిలకడగా ఉండదు . ఉన్నట్లుండి అది ఏదో ఒక పక్కకు జరిగిపోతుంది . అదే అదనుగా ఆశామోహాల మాయపొర మనసును బలంగా కమ్మేస్తుంది . అలా కమ్ముకోకుండా నిలువరించడానికి , మనసు ఆ దివ్యస్థితి నుంచి కిందికి జారిపోకుండా నిలబెట్టుకోవడానికి ఈ ఆరాధనలూ , పూజలు అవసరమే అవుతాయి  మరి

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ
గంగను తేనా నీ సేవకు  

అంతే కదా ! లోకంలోని సమస్త ప్రాణికోటి హృదయాలను ఏలే దొర కదా ఈశ్వరుండంటే . రారాజు కదా ! ఆ విశ్వనాధుని పూజకోసం ఏం చేయాలి ? ఆతడు అమితంగా ఇష్టపడే , మారేడు దళాల్ని వెతికి వెతికి తీసుకురావాలి . అది సరే కానీ , ఈశ్వరుడు తానుగా  ఏరికోరి సృష్టించిన వాటిల్లో తనకే యిష్టమైనవీ , అయిష్టమైనవీ అంటూ రెండు రకాలుగా ఉంటాయా ? ఉండవు కదా ! అలాంటప్పుడు ప్రత్యేకించి మారేడు దళాల్ని వెతికి వెతికి తేవాల్సిన అవసరం ఏముంది ? అవన్నీ మనకు మనంగా శివునికి ఆపాదించినవే ! పైగా సృష్టిలోని అణువణువూ శివశక్తితో ప్రాణం పోసుకున్నప్పుడు ఏ పువ్వునైనా ఏ పత్రాన్నయినా తెంపి తేవడం చేయాల్సిన పనేనా ? మరో విషయంగా , శివుడు గంగమ్మ మెచ్చిన వాడన్నది అంతటా వినిపిస్తున్నడే ! కానీ , లోకంలో ఆయనను మెచ్చని వారంటూ ఉంటారా ? శివుడైనా , శివభక్తుడైనా ఇక్కడ మెచ్చడం , మెచ్చకపోవడం అనే ద్వంద్వాలు ఎక్కడివి ? గాలి , నీరు , నిప్పు నేల , ఆకాశం వీటి విషయంలో మనిషి మెచ్చడం , మెచ్చకపోవడం కూడా ఉంటుందా ? అవేవీ శివునికి ఆవల ఉండేవి కావు కదా ! అందుకే జ్ఞానసిద్ధి కలిగిన వాడు ఏదో ఒక దశలో అంతా శివమయమేనని తెలుసుకుంటాడు . శంబో హరహర నమోనమ !: అంటూ నిరంతరం శివ చైతన్యంతో జీవితం సాగిస్తాడు . సచ్చిదానంద క్రాంతిలో సదానందుడిగా వెలిగిపోతాడు . 
                                                               - బమ్మెర✍

2 కామెంట్‌లు:

  1. ఈ పాట లో గంగను తేనా నీ సేవకు తర్వాత పల్లవి రాదు .కారణం చిత్రీకరణ చూస్తేగానీ తెలియదు. గంగను తేనా అంటూ నీటినీ నోట పెట్టుకుంటాడు కన్నప్ప. అప్పుడు పాడలేడు కదా. పాటకు, చిత్రీకరణకు ఉన్న ఆ లింక్ చాలా బాగా అనిపిస్తుంది. మంచి పాట పై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదములు సార్.

    రిప్లయితొలగించండి
  2. Nirmala bhakti nindina paata. Thank you... excellent review

    రిప్లయితొలగించండి