4, జనవరి 2021, సోమవారం

కలకానిది విలువైనది పాట లిరిక్స్ విశ్లేషణ | వెలుగు నీడలు సినిమా |ఏ ఎన్ ఆర్ - సావిత్రి | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది
Telugu old songs
'వెలుగు నీడలు...' ఈ సినిమాలోని పాటలన్నీ చిరకాలం నిలిచిపోయేవే . ప్రత్యేకించి , మహాకవి శ్రీశ్రీ రాసిన 'కలకానిది విలువైనది' అన్న పాట మరింత హృద్యమైనది .1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు . అయితే భావస్ఫోరకమైన ఘంటసాల గానం ఈ పాటను రసజ్ఞుల గుండెలోతుల్లో నిలబెట్టింది . అన్ని తరాల్లోనూ , మానవత్వాన్ని మేల్కొలుపుతూ , స్ఫూర్తిని నింపుతూ వస్తున్న ఈ పాట ఈ కొత్త సంవత్సరానికి (2021) శష్టి పూర్తి చేసుకుంది . ఇంతకాలం అంత సజీవంగా ఉన్న ఈ పాటలో ఎంతటి భావనా పటిమ ఉండి ఉండాలి . ఒకసారి తరచి చూస్తే తరించిపోతాం "
కలకానిది .. విలువైనది

కలకానిది విలువైనది
బ్రతుకు ... కన్నీటి ధారలలోనే బలిచేయకు
కలలో జరిగిన కన్నీటి గాద ఏదైనా ఉంటే , అది కలచెదిరి పోగానే కరిగిపోతుంది . ఆ కలలో ఆద్యంతం కన్నీటి పర్యంతమే అయినా నష్టమేమీ లేదు . ఎందుకంటే , అది జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశమే లేదు .అది కల కాబట్టి . ఒకవేళ నిజజీవితంలోనే ఎవరైనా ఆ స్థితికి లోనై నిరంతరం ఏడుస్తూ కూర్చుంటే , ఏమవుతుంది? జీవితం శిధిలమైపోతుంది . బతుకు ఎడారిగా మారిపోతుంది . ఆ కన్నీటి కార్చిచ్చుకు బలైపోతుంది . 

కలకానిది విలువైనది పాట
Kalakaanidi Viluvainadi Song

గాలి వీచి పూవుల తీగ - నేలవాలిపోగా
జాలివీడి టులే దాని వదిలివైతువా !
ఓ ... చేరదీసి నీరుపోసి చిగురించనీయవా !
మన జీవితమే అని కాదు . ఎదుటి వారి జీవితంలోనే అలా ఏదో జరిగిందే అనుకోండి . కన్నీరు మున్నీరుగా ఏడ్వడమే మిగిలిందనుకోండి ఏమవుతుంది? ఎప్పటికప్పుడు పైపైకి ఎగబాగవలసిన జీవితం నేలకూలిపోతుంది . అలాంటప్పుడు సాటి మనిషిగా మనకు ఏ బాధ్యతా ఉండదా ? అందుకే ఎక్కడెక్కడో కాకపోయినా , మన పక్కనే పడి ఉండి ఏడ్చి ఏడ్చి  తడారిపోతున్న వారి గొంతుకు కాసిన్ని నీళ్లందించడం కావాలి . అలా దాహార్తి తీర్చడం వల్ల కలిగే ఆనందం , ఆధ్యాత్మికులు కోరుకునే మోక్షం కన్నా ఎంతో  ఉన్నతమైనది !! 

వెలుగు నీడలు సినిమా
Velugu Needalu Cinema

అలముకున్న చీకటిలోనే ఆలమటించనేల
కలతలకే లొంగిపోయి , కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో // కలకానిది //
భయమనేది ఒకటి గుండెలో చొరబడితే చాలు . మనం వెళ్ల వలసిన దారులన్నీ మూసుకుపోయినట్లే అనిపిస్తుంది . నిజంగానే అవి అలా మూసుకుపోయాయని కాదు . భయం వల్ల వాటిని చేధించే శక్తి కొరవడుతుంది . దానివల్ల ముందుకు వెళ్లే దారే లేనట్లు అనిపిస్తుంది . కారు చీకట్లు కమ్ముకుని ఏదో లోయలో పడిపోయినట్లే అనిపిస్తుంది . ఇదంతా ఒక విభ్రాంతి మాత్రమే ! ఇక్కడ కావలసిందల్లా ఒక్కటే ! అదే ధైర్యం ! ఇదే నిజానికి దీపం వెలిగించగానే చీకట్లన్నీ పటాపంచలైపోయినట్లు , గుండెలో సాహసం నిండుకోగానే ఆటంకాలన్నీ చెల్లాచెదరైపోతాయి . మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది . కానీ , ఆ ధైర్యం ఎలా వస్తుంది ? అందుకు మనలో దాగిఉన్న ఆత్మశక్తి విశ్వరూపాన్ని గుర్తించడం ఒక్కటే మార్గం !

సావిత్రి పాటలు
Savitri Songs

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే 
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం !! 
సముద్రంలోకి దూకి ఈ దరి నుంచి , ఆ దరికి , ఆ దరి నుంచి ఈ దరికి అదే పనిగా ఈదుతూ ఉండిపోతే ఏమవుతుంది ? ఆ నిరర్ధకమైన ప్రయాసలో చాలా త్వరగా శరీరం అలసిపోతుంది . మనోబలం సన్నగిల్లుతుంది . ఏదో ఒక దశలో ఊపిరి ఆగి ప్రాణం పోతుంది . అలా ఉుత్తినే సముద్రం పైపైన తిరగకుండా , సముద్రపు అట్టడుగుకు వెళ్లగలిగితేనో ... అక్కడుండే ఆణిముత్యాలు చేతికి అందుతాయి . పడ్డ శ్రమకు ఫలితం లభిస్తుంది .వ్యధలూ , బాధల విషయంలోనూ అంతే ! వాటిని చూసి జడుస్తున్న కొద్దీ హృదయం కకావికలం అవుతుంది . కన్నీటిమయం అవుతుంది . అలా కాకుండా , దుఃఖపు లోలోతుల్ని పరిశీలిస్తే , అసంఖ్యామైన జీవితసత్యాలెన్నో బోధపడతాయి . అలా ఏదో జ్ఞాన సిద్ధి కలుగుతుందని మాత్రమే కాదు .జీవిత సమస్యల్ని చేధించే విజయ రహస్యాల అమ్ములపొది చేతికొస్తుంది .అంతిమంగా గుండెల్లో విజయకేతనం రెపరెపలాడుతుంది . ఎన్నడూ ఊహించని గొప్ప విజయానందం హృదయాన్ని అభిషేకం చేస్తుంది .

Telugu Quotes

                                                                  ---  బమ్మెర

#కలకానిది విలువైనది పాట లిరిక్స్ ,#వెలుగు నీడలు సినిమా,తెలుగు పాత పాటలు ,ANR old movies, Akkineni Nageswara cinema, velugu needalu (1999),Akkineni Nageswara Rao, ANR Old Telugu Movies, Akkineni nageswara rao Telugu cinema,ANR Old Songs,Velugu Needalu Old Songs,ANR Old Songs ,Nee Sukhame Ne korukunna,తెలుగు ఓల్డ్ సాంగ్స్ ,#ghantasala సాంగ్స్


8 కామెంట్‌లు:

 1. గొప్ప పాట...మంచి విశ్లేషణ. ఈ పాట ఎంతో స్ఫూర్తి. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 2. జీవితానికి ఉపయోగపడే గొప్ప సందేశం.

  రిప్లయితొలగించండి
 3. చక్కటి పాత పాట ఇప్పటికే వింటున్నాను, ఎంతో మంది కి కన్నువిప్పు ఈ పాట,మీకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. బాధ పడుతున్న వారిని ఒదార్చి గొప్ప మార్గం చూపించే పాటలలో మొదటి పాట.

  రిప్లయితొలగించండి