16, జనవరి 2021, శనివారం

సంతానం సినిమా | దేవి.. శ్రీదేవి పాట | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | Telugu old songs Analysis

పాటలో ఏముంది ? 
Telugu old songs

సంతానం. 1955లో విడుదలైన ఈ సినిమాలోని పాటలన్నీ తేనెల సోనలే. కాకపోతే ‘దేవీ శ్రీదేవీ’ అన్న పాటలో ఒక విశేషం ఉంది.  సినిమా చూడని వారికి ఈ పాట ఏ దేవతా మూర్తినో ఉద్దేశించి పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. సుసర్ల దక్షిణామూర్తి కూర్చిన బాణీ, ఘంటసాల పాడిన తీరు ఆ భానననే కలిగిస్తాయి. వాస్తవం ఏమిటంటే ఇది ప్రేయసితో పాడే పాట. మొదటి సారి వినే వాళ్లకు ఇదో కొత్త అనుభూతే మరి!!

దేవి.. శ్రీదేవి


దేవి.. శ్రీదేవి
మొరలాలించి పాలించి నన్నేలినావే  //దేవి //
ఏ గుండెలోనైనా, ప్రేమ ఒక బిందువుగానే ముందు మొదలవుతుంది.  ఆ తర్వాత క్రమక్రమంగా కోనేరై, సెలయేరై, ఒక మహానదీ ప్రవాహమై హృదయమంతా పారుతుంది. అప్పుడింక అస్తిత్వాలకు సంబంధించి ఎక్కువ - తక్కువ అనే లెక్కలేమీ ఉండవు. అహం ఆత్మగౌరవాల భేషజాలు ఉండవు. తన ప్రేయసి తన హృదయ లోకాన్ని ఏలే దేవదేవిలా కనిపిస్తుంది. ఆ స్థితిలో ఆమె పైన అధికారమో, ఆదేశమో ప్రయోగించే ఆలోచనే ఉండదు. ఎదురుగా ఉన్నది ఒక దేవతామూర్తి అన్న భావన కలిగాక ఆ ఆధిపత్యపు ఆలోచనలు రావు కదా! పైగా ఆ సమయంలో ఏం చెప్పినా, ఏం చెప్పాలనుకున్నా,తన మొర ఆలకించమన్నట్లుగానే ఉంటుంది. ఒకవేళ అప్పటికే తన మొర ఆలకించి, తన హృదయాన్ని పాలించే బాధ్యతల్లో ఉంటే అతనికి అంతకన్నా ఏం కావాలి?
మదిలో నిన్నే మరువను దేవీ 
నీ నామ సంకేర్తన  చేసెద // దేవి //
మొర ఆలకించి, తన హృదయాన్ని లాలించి పాలించిన ఆమెను అతనెలా మరిచిపోతాడు? మామూలుగా అయితే మరిచిపోయే అవకాశమే లేదు. కాకపోతే, ఏ విపరీత పరిణామాలో, బలమైన ఏ బాహ్య కారణాలో వచ్చిపడి మరిపింప చేస్తేనో ? నిజంగానే అలా ఏదైనా జరిగితే ఏమిటి చేయడం? దానికి విరుగుడుగా ఏదో చేయాలి. అందుకు నిరంతరం ఆమెను స్మరించుకోవడం, ఆమె నామ సంకీర్తన చేయడమే మార్గమని ప్రేమపిపాసులకు అనిపిస్తుందేమో మరి ! ఇతనైతే ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. దీనివల్ల రెండు లాభాలు.అనుక్షణం ఆమెను తన మదిలో నిలబెట్టుకోవడం ఒకటైతే, ఆమె తనను మరిచిపోకుండా చేయడానికి కూడా అది తోడ్పడుతుంది.. ఇది రెండవది మామూలుగా అయితే, కీర్తనలు, ఎవరి కోసం పాడతారు? దేవతల కోసం కదా! అలాంటిది ఈయన ప్రేయసి కోసం సంకీర్తనలు పాడతానంటాడేమిటి  అనిపించవచ్చేమో గానీ,  ఆమెను అతడు దేవతగానే చూస్తున్నాడు దానికి మనమేం చేయగలం? అందుకే అతని గొంతులో, గుండెలో పలికే నాదాలన్నీ ఆమె కోసమైన సంకీర్తనలే అవుతాయి,. కాదనగలరా ఎవరైనా?
నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించ రావే  //దేవి //
అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవేవీ జీవితాన్ని ఇవ్వవు. అందువల్ల ఒకసారి లాలించి పాలించినంతనే సరిపోదు. తన ఆరాధ్యమూర్తి తన కనుసన్నలలో కలకాలం, కడదాకా తనను ఓలలాడించాలని కోరుకుంటారు. ఎందుకంటే, ప్రేమ లాలస ఒకనాటితో తీరేది కాదు పైగా రోజురోజుకూ అది పెరుగుతూనే ఉంటుంది. నిజానికి , దినదిన ప్రవర్థమానం అవుతుంటేనే ఏదైనా నిలబడుతుంది. అయినా, కోరుకున్న జీవితం లభించడం, ఆశించిన ప్రేమ సిద్ధించడం  ఎంత మంది జీవితంలో జరుగుతుంది ? ఇతని జీవితంలో మాత్రం ఆశించినదే జరిగింది. అది అతని అదృష్టమే ! కాకపోతే, ఆ అదృష్టాన్ని కలిగించిన ఆమె, దాన్ని నిలబెట్టే బాధ్యతను కూడా కొంత  తీసుకోవాలి! జీవితానందంలో హాయిగా ఓలలాడే అవకాశం ఇవ్వాలి !
ఇలదేవతగా వెలసితివీవే
ఈడేరె - నా కోర్కెలీనాటికీ // దేవి //
దేవతలు దివ్యలోకంలో ఉంటారనే కదా చెబుతారు.  కానీ ఇతని సౌభాగ్యం ఏమిటంటే, ఆమె దేవతై కూడా భూలోకంలో నివాసం ఏర్పరుచుకున్నట్లు అతనికేవో జాడలు దొరికాయి. అది నిజమో కాదో మనకైతే తెలియదు కానీ, అతని దృష్టిలో ఆమె దివి నుంచి భువికి దిగివచ్చిన దేవదేవి. ఇప్పటిదాకా దేవతల గురించి కథల్లో గాధల్లో వినడమే గానీ, కళ్లతోనైతే ఎప్పుడూ చూడలేదు.చివరికి కలలోలనైనా చూడలేదు. అలాంటిది ఒక దేవత ఈ లోకంలో అదీ ఎక్కడో కాదు తన ముందే ప్రత్యక్షమైనట్లు అనిపిస్తే ఎలా ఉంటుంది? అప్పటికి  అతని ఆనందాన్ని మనం ఏ రకంగా కొలవగలం? ఆ ఆనందంలో అప్పటిదాకా అతన్ని వెంటాడిన వ్యధలూ, క్షోభలూ పరిసమాప్తం అయిపోయాయి. .జీవితం తాలూకు సమస్త సంకెళ్ల నుంచి అతని మనసు విముక్తి పొందింది . అతనికి ఇంతకన్నా ఏం కావాలి? కావలసిందల్లా ఏనాడూ తడి ఆరని, ఎప్పటికీ పరిమళాలు ఆవిరికాని నిరంతరాయమైన ప్రేమ కావాలి నిలకడగా మహోజ్వలంగా వెలిగే  ప్రేమ సామ్రాజ్యం కావాలి ... అంతేనా !!
                                                               - బమ్మెర 
Santhanam Telugu Movie , Santhanam Video Songs, Nageswararao Hit Songs, Savithri Songs ,ANR Santhanam Songs, ANR Songs ,  Santhanam Movie Songs , Santhanam Songs


11 కామెంట్‌లు:

 1. This song is one way it is a praying of God, another way song for lover. That's why old songs are golden hits. Very nice Anjanna garu.

  రిప్లయితొలగించండి
 2. మీ మార్కు విశ్లేషణ అదిరింది.

  రిప్లయితొలగించండి
 3. ఈ సినిమా లొ అన్ని పాటలు చాల మంచి మరియు కష్ట మయినవి.

  రిప్లయితొలగించండి
 4. Beautiful song and composition . Thank you for nice selection song and analysis .

  రిప్లయితొలగించండి
 5. షణ్ముఖప్రియ రాగంలో మృదంగ వాద్య సహకారంతో మలచిన అద్భుత గీతం!
  మొదటి అక్షరం (“దే”) పైనే అలవోకగా గమకం వేయడం ఘంటసాల వారికే చెల్లిందేమో!

  రిప్లయితొలగించండి
 6. షణ్ముఖప్రియ రాగంలో మృదంగ వాద్య సహకారంతో మలచిన అద్భుత గీతం!
  మొదటి అక్షరం (“దే”) పైనే అలవోకగా గమకం వేయడం ఘంటసాల వారికే చెల్లిందేమో!

  రిప్లయితొలగించండి