10, జనవరి 2021, ఆదివారం

మనసున మల్లెల మాలలూగెనే పాట | మల్లీశ్వరి సినిమా ( 1951 ) | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది ? 
ఒక్క పూటలో , సినిమాలోని మొత్తం పాటలకు బాణీలు ఇచ్చి వెళ్లిపోయే ఇప్పటి కాలాన్ని మనం చూస్తూనే ఉన్నాం . కానీ , ఒక్క సినిమాలోని పాటలను స్వరపరచడానికి ఈ 6 మాసాలు పట్టిందంటే మనకు ఆశ్చర్యం కలగదా ! మల్లీశ్వరి సినిమా పాటల స్వరకల్పనలో అదే జరిగింది . ఎక్కువ కాలం పడితే ఎక్కువ గొప్ప అని కాదు . ఎక్కువ మనసు పెట్టడానికి వారు అంత సమయం పెట్టారు . ఆ శ్రమ ఫలించి, ఎప్పుడో ఏడు దశాబ్దాల క్రితం ( 1951 ) వచ్చిన ఆ సినిమా పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఇప్పటికీ తాజాగా కదలాడుతున్నాయి . 

                ఆ సినిమాలోని అన్ని పాటలూ రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రికి వాటిని స్వరపరిచిన సాలూరు రాజేశ్వరరావుకూ , తెలుగు హృదయాలు కాలం ఉన్నంత కాలం రుణపడి ఉంటాయి . వీరితో పాటు సన్నాయి  నాదం  లాంటి భానుమతి గొంతు మల్లీశ్వరి కోసం పాడిన పాటల్ని తెలుగు వాళ్లే కాదు , రసజ్ఞులైన భారతీయులెవరూ ఎప్పటికీ మరవలేరు .

మనసున మల్లెల మాలలూగెనే 


మనసున మల్లెల మాలలూగెనే 
కన్నుల వెన్నెల డోలలూగెనే 
ఎంత హాయి ఈ రేయి నిండెనో 
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో 

నిరీక్షణ... ఎంత మధురమైనదో , అంత బాధాకరమైనది కూడా ! ఒక్క మాటలో చెప్పాలంటే , నిరీక్షణ ఒక మధురమైన బాధ . ఎందుకంటే , నిరీక్షణలన్నీ నిజమవుతాయన్న గ్యారెంటీ ఏదీ లేదు . ఒకవేళ ఆ నిరీక్షణ నిజంగానే ఫలిస్తే మాత్రం , మనసులో మల్లెల మాలలు ఊగడమే కాదు , కన్నుల్లో వెన్నెలలే ఓలలాడతాయి . నిజానికి , ప్రేమ నిరీక్షణలో ఎన్నాళ్లు పట్టినా , ఎన్నేళ్లు గడిచినా సరే ! అది ఫలించిననాడు మాత్రం ప్రేమికులకు అదో పెద్ద పండగే మరి ! 
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా 
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని 
కన్నుల నీరిడి కలయజూచితిని

తన ప్రేమమూర్తి గురించిన ఎడగెగని ఆలాపనలో ఏమవుతుంది ? ప్రకృతిలోని ప్రతి శబ్దమూ , ఆ ప్రేమమూర్తి ప్రతిధ్వనిలాగే వినిపిస్తుంది . ఎక్కడో దూరం నుంచి ఓ వేణునాదం వినిపిస్తే , అది అతని గానమే అనిపిస్తుంది . ఇరువురూ ఏకమై లోకమంతా తామే వ్యాపించిన ఆ ప్రేమ స్థితిలో ప్రతిదీ తమదే అనిపిస్తుంది . ప్రేమను అద్వైత స్థితి అని ఇందుకే అన్నారు మరి ! ఏమైనా , తన ప్రేమ మూర్తి కోసం ఎదురు చూడటం అంటే , తన ప్రాణం కోసం తాను ఎదురు చూడటం , తన జీవితం కోసం తాను ఎదురు చూడటమే ! ఏ కారణంగానో ఆ ప్రేమ మూర్తి  రావడంలో ఆలస్యమైతే లేదు .... ఒక పెద్ద ఎడబాటు ఏర్పడితే , కళ్లు ఇంక కన్నీటిమయమే ! సరిగ్గా అదే స్థితిలో ఒకవేళ నిజంగానే అతడొచ్చి ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుంది? కన్నీటి పొర కమ్మేసిన కళ్లతో తొలుత అతన్ని గుర్తించడం కష్టమవుతుంది . కాకపోతే , తనకు అంత సన్నిహితంగా నిలబడేది అతడు కాక ఇంకెవరవుతారు ? 

గడియలోని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఒకరిలో ఒకరుగా ఏకమైపోయిన అనంతరం ఆ హృదయ స్థితి ఎలా ఉంటుంది ? గడియ కాదు ఒక క్షణమైనా ఒకరికొకరు దూరంగా ఉండడం సాధ్యమే కాదు . ఒకవేళ నిరీక్షణ ఫలించి తన ప్రేమమూర్తి తన చెంతన వాలిపోతే , లోకమే సొంతమైన ఒక మహదానందం . కాకపోతే , చేరువైన వారు ఎప్పటికీ చెంతనే ఉంటారన్న గ్యారెంటీ ఏదీ లేదు మరి ! ఏ బలీయ కారణమో వారిని విడదీసి , ఏళ్ల పర్యంతం వారిని దూరం చేస్తే ! ఎంత వ్యధ ? ఎంత దుఃఖం? దూరదూరాలకు విసిరేయబడ్డ ఈ హృదయాలు ఒకరికొకరు మళ్లీ చేరువ కావడానికి వారు ఎంత యుద్ధమో చేయాలి ? అలాంటి వాళ్లకు ఆ యుద్ధంలో పోరాడే తిరుగులేని శక్తి వాళ్లకు రావాలి . ఆ మహాశక్తి వారికి రావాలని మనమంతా మనస్పూర్తిగా కోరుకుందాం మరి !! 

                                                                     ---బమ్మెర
Telugu Old Songs Analysis Quotations
Telugu Old Songs Analysis Quotations

ntr songs,Bhanumati Singer Songs, sr ntr movies, పాత సినిమా పాటలు , ఎన్.టి.రామారావు , senior n.t. rama rao , నందమూరి తారక రామారావు ,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి