9, ఫిబ్రవరి 2021, మంగళవారం

దేశద్రోహులు సినిమా | జగమే మారినది మధురముగా ఈ వేళ పాట | తెలుగు ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్

పాటలో ఏముంది...?


జగమే మారినది మధురముగా ఈ వేళ


ప్రేమ ఎంత గొప్పదైతేనేమిటి ? ప్రేమికులు ఎంత గొప్పవారైతే ఏమిటి ?  చాలా ప్రేమలు పెళ్లి దాకా వెళ్లవు . అలా పెళ్లికాని వారంతా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారనేమీ కాదు . ఇష్టం లేకపోయినా , కొందరి పెళ్లిల్లు వేరెవరితోనో జరిగిపోతాయి . అప్పటిదాకా ప్రాణాధికంగా ప్రేమించుకున్న వారు ఒకరికొకరు పరాయిల్లా మిగిలిపోతారు . మరొకరితో పెళ్లి జరిగిపోయిన ఆ విషయం ఆ ప్రేమించిన వ్యక్తి కి తెలిసిపోయిన్నాడు , ఎలా ఉంటుంది ? హృదయం బాధతో చేదెక్కిపోతుంది . జీవితమంతా తారుమారైన ఆ స్థితిలో మనసు కకావికలమైపోతుంది . అయినా , అంతిమంగా , పరాయిదైపోయిన  ఆ ప్రేమమూర్తి పట్ల ఒక త్యాగభావన నిండిపోతుంది . నిజానికి , దేన్నయినా పొందడానికి ఆశ , ప్రేమ ఉంటే చాలు . కానీ , వదిలేయడానికే ఎంతో పెద్ద మనసు ఉండాలి . ఆ ఔన్నత్యానికి చేరుకున్న ఏ మనసైనా , ఆ జరిగిన పరిణామాలన్నింటినీ మధుర భావనతోనే చూస్తుంది . అదే సమయంలో అనుకోకుండా వారిద్దరూ ఎక్కడైనా తారసపడ్డారే అనుకోండి . అప్పుడింక మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు . అసలు మాటలే పెగలవు . ఎక్కడ మాటలు ఆగిపోతాయో ,అక్కడ పాటలు మొదలవుతాయి అంటారు కదా అలాంటప్పుడు ఒక పాటేదో మొదలవుతుంది . 1964 లో విడుదలైన దేశద్రోహులు సినిమా కోసం ఆరుద్ర రాసిన " జగమే మారినది మధురముగా ఈ వేళ " అన్న ఈ పాట సరిగ్గా ఆ తరహా భావోద్వేగాలనే చెబుతుంది . ఆ పాట ఎన్నిసార్లు విన్నా , ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉంటుంది . ఆ పాటకు సాలూరు రాజేశ్వర రావు పొదిగిన బాణీ ఘంటసాల గొంతులో పడి నిలువెల్లా తేనెలు పులుముకుంది . కొన్ని దశాబ్దాలుగా మాధుర్యాలు నింపుతూ తెలుగు వారి గుండెల మీదుగా సాగిపోతోంది ..

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా    // జగమే //

తనకు దక్కకపోతే పోయింది . ఆమె సుఖ సంతోషాలతోనే ఉందంటే అది చాలు కదా ! ఆమె ఎప్పటికీ ఆనందంగా ఉండాలనుకునే తన కలలూ కోరికలూ అలా తీరినట్లే కదా ! జగమంతా మధురంగా మారినట్లే కదా !

మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదే చేరెనూ గోరువంక రామచిలుక చెంత
అవి . అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను    
జీవితమంతా చిత్రమైన పులకింత // జగమే //   
                                                                         
నిజమైన , నిర్మలమైన మనసు నెమలిలా నాట్యం చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రేమానురాగాలతో కనిపించే జంటను చూసి ఆనందంలో తన్మయత్వాన్ని పొందుతుంది , తడిసి ముద్ద అయిపోతుంది . ఎందుకంటే ఎదిగిన మనసులకు తన పర భేదం ఉండదు . ఎదుటి వారి కష్టాలను తన కష్టంగా భావింవచడమే కాదు , ఎదుటి వారి ఆనందాన్ని చూసి తనూ ఆనందపడుతుంది . ఒక వింత పులకింతకు లోనవుతుంది .

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుక
తిరుగాడెను తేనెటీగ తీయదనము కోరి అనురాగాలా 
తేలి కమ్మని భావమే కన్నీరై నిండెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి జగమే //

మొగ్గలు అందంగా విరబూయడమే కాదు , ప్రేమికులకు , కొత్త దంపతులకు స్వాగతాలు కూడా పలుకుతుంటాయి . వారి మనసుల్ని ఉత్తేజితం చేయడానికి నలుదిశలా సుగంధాలు వెదజల్లుతుంటాయి ఆ పరిమళాలతో మత్తెక్కిపోయిన మానవ తేనెటీగెలు మాధుర్యాలను గ్రోలడంలోనే నిమగ్నమై ఉంటాయి . పురుషుల ప్రణయలోకాన్ని చూసే ఎవరి గుండెల్లోనైనా ఒక కమ్మని భావం తొణకిసలాడుతుంది . వారి మనసు ఉద్వేగానికి లోనై ఆనంద భాష్పాలు రాలుస్తుంది . అలాంటి వారిని కళ్లారా చూసి , మనసారా ఆశీర్వదించడమే మన పనైపోతుంది !!

                                                                      -బమ్మెర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి