17, ఫిబ్రవరి 2021, బుధవారం

మూగ మనసులు సినిమా | మానూ మాకును కాను ! పాట | Telugu old songs Analysis |

పాటలో ఏముంది ?

మనసు బయటపడేదాకా మనిషంటే ఏముంది ? ఒక రూపమే ! రాతి స్థంభంలా , శిలా శిల్పంలా అదో ఆకారమే ! కానీ , చేనూ చేమా కాదు , పుట్టా గుట్టా కాదు ఆ రూపం మనిషేనని ,మనసున్న మనిషేనని , తెలిసేదాకా మన దృష్టి మారదు ఈ అంశమే సారంగా ఆత్రేయ 'మానూ మాకును కాను' అనే ఈ పాట రాశారు .1964 లో విడుదలైన ' మూగ మనసులు ' సినిమాలోని ఈ పాటకు కె.వి మహాదేవన్ బాణీ కూర్చారు . అయితే , ప్రతిపాటకూ ఎప్పుడూ హుందాతనాన్నే పొదిగే సుశీల గొంతు పల్లెతనపు అమాయకత్వాన్నిఈ పాట నిలువెల్లా పలికించించింది. ఆ వైవిద్యాన్ని ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే !

మానూ మాకును కాను !



మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను
మామూలు మణిసిని నేను , నీ మణిసిని నేను

ఏ మనిషికైనా , తన మనసు గురించి తానే చెప్పుకోవాల్సి రావడమంత దయనీయ స్థితి మరేముంటుంది ? మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను ' అనడంలో వాటికి మనసే లేదని గానీ , వాటికి స్పందించడమే తెలియదనే భావనేదీ లేదు . చెట్లు కూడా స్పందిస్తాయన్నది తెలియని విషయమేమీ కాదు . కాకపోతే అవి మన భాషలో మాట్లాడవు . మనసు విప్పి ఏమీ చెప్పలేవు , మనతో కలసిపోవు , మనతో కలసి నడవలేవు అదీ సమస్య . అయితే ఆ అవరోధాలేవీ లేని మనిషై కూడా మామూలు మణిసిని నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ? అవతలి వ్యక్తి తనను మామూలు మణిసిగా కూడా చూడటం లేదనే కదా !

నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆశున్నాది
కలలు కనే కళ్లున్నాయి అవి కలత పడితె నీళ్లున్నాయి // మానూ //

ఏ మాత్రం పరిచయం లేని , ఎప్పుడూ పలకరించని ఏ మనిషి గురించైనా మనకు ఏం తెలుస్తుంది ? సరేగానీ , ఆ వ్యక్తి గురించి మనకేమీ తెలియనంత మాత్రాన ఆ వ్యక్తి ఏమీ కానట్లా ? ఆ గుండెలో ఏమీ లేనట్లా ? అవతలి వ్యక్తి ఏ కారణంగానో తనకు తానుగా బయటపడకపోవచ్చు . అలాంటప్పుడు మనమైనా ఆ మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేయవచ్చు కదా ! అలా ఏమీ చేయకపోతే , మనిషిగా భూమ్మీద ఎందుకు ఉన్నట్లు ? ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటారు గానీ , తనే నోరు విప్పి , నాకూ ఒక మనసున్నాదీ అంటూ తన గురించి తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడినట్లు ? కలలు కనే తన కళ్ల గురించి , అవి కలతపడితే వచ్చే కన్నీళ్ల గురించి చెప్పాల్సిన పరిస్థితిలోకి తనను ఎవరు నెట్టేసిట్లు ? మనసున్నప్పుడు ఆశ కూడా ఉంటుంది . ఆ ఆశైనా ఎలా పుడుతుంది ? ఏదో ఆశించి కలగన్నప్పుడే కదా ! ఏ కాస్త మనసున్న మనిషైనా సాటి మనిషి ఆశలూ , కలలు ఫలించాలనే కోరుకుంటాడు . కానీ , కొందరుంటారు . వారు నిరంతరం కలల్ని కాల్చేయాలనే చూస్తారు . కళ్లను చిద్రం చేయాలనే చూస్తారు .

పెమిదను తెచ్చి పొత్తిని యేసీ - సమురును పోనీ బెమ సూపేవా ?
ఇంతా శేసి 
యెలిగించేందుకు  , ఎనకాముందులాడేవా // మానూ //

మనిషన్నాక సాటి మనుషులతో కలిసిపోక ఏంచేస్తాడు ? అయితే కలసిన మనుషులంతా మనసంతా నిండిపోరు . ఆ వచ్చిన వారిలో ఎప్పుడో , ఎవరో ఒకరు మనసులోకి ప్రవేశిస్తారు . అక్కడ చీకట్లు కమ్ముకున్నాయని తెలిస్తే ,
వెంటనే వెలుగు గురించి ఆలోచిస్తారు . ఒక దీపపంతె తెచ్చి అందులో వత్తివేస్తారు . తైలం పోసి ఇక దీపం వెలిగించడమే ఆలస్యం అన్నట్లు చేస్తారు . ఎందుకో గానీ తీరా ఆ క్షణం వచ్చేసరికి కొందరిలో ఏదో భయం పుట్టుకొస్తుంది . అప్పటికి సరే . జీవితమంతా ఆంధకారాన్ని మోయడం కష్టం కదా అనిపిస్తుంది .ఇంకా ఏదేదో ఆలోచించుకుని మెల్లమెల్లగా వెనకడుగు వేస్తారు . చివరికి వత్తి వెలిగించకుండానే తిరుగుముఖం పడతారు . అప్పటిదాకా ఏ అండాదండా లేదని వగచే మనను ఏదో ఆసరా దొరికిందంటూ గుండె దిటవు చేసుకుటున్న వేళ ఉన్నఫళాన ఆ వ్యక్తి ఎటో వెళ్లిపోతే ఏమైపోవాలి . ఆ ఆశపడ్డ మనసేం కావాలి ? అంతా భ్రమేనని సమాధాన పదాలా ? కాకపోతే అలా ఆశపడటం అనేది అవతలి వారి మనసు గురించి బాగా తెలిసే జరిగిందా ? ఏకపక్షంగా జరిగిందా ? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎవరికి వారు . తమకు తాముగా సమాధానం కనుక్కోవాలి !

మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మళ్లా  !

మనుషులంటే తోలుబొమ్మలేమీ కాదుకదా! తోలుబొమ్మలకు రూపమే ఉంటుంది. మనుషులకు మనసు కూడా ఉంటుంది. తోలుబొమ్మలతో ఆటాడుకున్నట్లు మనుషులతో ఆడుకుంటే ఎలా?మనుషులేనా చివరికి  వారి మనసులతో కూడా ఆడుకుంటే ఎలా? చేజారిపోయి కిందపడి తోలుబొమ్మ విరిగిపోయినా అదేమీ పెద్ద సమస్య కాదు. ఏదో రకంగా దాన్ని తిరిగి అతికించవచ్చు. మనసు విషయంలో అలా సాధ్యం కాదు కదా! అది ఒకసారి విరిగితే జీవితంలో ఇంక అతకదు. తెలిసో తెలియకో శరీరాన్ని ఆకలి మంటలకు గురిచేస్తే ఓ పూట తర్వాత మరపు రావచ్చు. దేహాన్ని గాయాల పాలు చేసినా ఆ గాయం మానిపోయేనాటికి ఆ ఘటన మరపు రావచ్చు. మనసు విషయం అలా కాదు కదా! సమస్య ఏమిటంటే, శరీరానికి అయ్యే గాయం బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. అవే మనసుకు తగిలిన గాయాలైతే  బయటికేమీ కనిపించవు. అలాగని పదేపదే మనసును గాయపరుస్తూ పోతే ఏమైనా ఉందా?  మనసు గాయాన్ని బయటపెట్టేవి కన్నీళ్లు మాత్రమే! అయితే నిబ్బరం ఉన్నవాళ్లు  మనసుకు ఎన్నిగాయాలు అవుతున్నా, కన్నీళ్లే రానీయరు. చివరికి ముఖంలోనైనా ఆ ఆ బాధ, ఆ దుఃఖం కనపనీయరు. ఎదుటి వారి పైన ఏ ప్రభావమూ లేదని మానసికంగా అదే పనిగా  గాయపరుస్తూ పోతే ఏమవుతుంది?  అంతిమంగా అది విరిగి ముక్కలవుతుంది. ఆ త ర్వాత ఎన్ని పాట్టు పడినా విరగిన మనసు మళ్లీ అతకదు. అది తెలిసి మసలుకున్న వాడే మనిషి. జీవితమంతా ఎవరి మనసునూ  గాయపరచకుండా బతికిన వాడే లోకంలో గొప్ప మనసున్న మనిషి. 

                                                        - బమ్మెర





2 కామెంట్‌లు: