25, ఫిబ్రవరి 2021, గురువారం

భక్త తుకారాం సినిమా | ఘనాఘన సుందరా పాట | Telugu old songs | Ghana Ghana Sundaraa song lyrics |

పాటలో ఏముంది ?




భక్త తుకారాం సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ' ఘనాఘన సుందరా ' అన్న ఈ పాటను ఆదినారాయణ రావు స్వరపరిస్తే , ఓంకార నాదం ప్రతిధ్వనించేలా ఘంటసాల గానం చేశారు . 

ఘనాఘన సుందరా ?

హరి ఓం ! హరి ఓం ! హరి ఓం ! 
ఘనాఘన సుందరా ! కరుణా రస మందిరా ! 
అది పిలుపో .. మేలు కొలుపో
నీ పిలుపో .. మేలుకొలుపో 
అతి మధుర మధుర మధురమౌ ఓంకారమో !
పాండురంగ పాండురంగు // ఘనాఘన సుందరా ..... //

 ఓంకారం .. అంటే విశ్వఝంకారం కదా ! 
ఆ నాదమే సమస్త జీవకోటిలో ప్రాణశక్తిని నింపుతుంది . లోకాన్ని నిద్రావస్థ నుంచి నవచైతన్యం వైపు నడిపిస్తుంది . అనాదం అత్యంత సుందరమూ , కరుణాత్మకమూ అయిన ఒక అమృతధార . అది ప్రాణికోటికి ఒక పిలుపు . కోటి గొంతుల మేలుకొలుపు . విశ్వమంతా ఘర్జిల్లే ఆ ఓంకార చైతన్యాన్ని ఎవరు ఏ పేరున పిలిస్తే మాత్రం ఏమిటి ?. ఆ నాదాన్ని ఎవరైనా దివ్యత్వం అన్నా , దైవత్వం అన్నా , అందులో దోషం ఏముంది ? మౌలికంగా ఆ దైవత్వమంతా నాదాత్మకమే . నాద శరీరాత్మకమే ! ఆ శబ్దధాతువుల్ని ఎవరైనా దివ్యమూర్తులుగా పిలిచినా అందులో వైరుధ్యమేమీ లేదు . నిజానికి , దివ్యమూర్తులుగా పిలవబడే వారంతా నాద శరీరులే ! ఓంకార నాద శరీరులే ! అందువల్ల మనసు పడి ఎవరైనా ఆ నాద మూలాల్ని త్రిమూర్తులుగా పిలిచినా , పాండురంగడిగా కొలిచినా అది దర్శనీయమే !

ప్రభాత మంగళ పూజావేళ 
నీ పద సన్నిధి నిలబడి ... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళు లిడతా.. వేడదా ! కొనియాడదా !
పాండరంగ ... పాండురంగ ...// ఘనాఘన సుందరా ... // 

పునరపి జననం , పనరపి మరణం అన్న మాటలకు జన్మాంతర పరిణామాలనే గుర్తు చేసుకోనవసరం లేదు . ప్రతి నిద్రా ఒక మరణం , ప్రతి మెలుకువా ఒక పనర్జన్మ అని గ్రహించినా చాలు . అయితే , ప్రతి మెలుకువతో పునర్జన్మం పొందిన ఆ ఉదయంప e ఘడియలు నిజంగా ఎంత మంగళ ప్రదమైనవి . అలాంటి శుభవేళలో ఏం జరుగుతుంది ? జనన మరణాల పరంపరకు మూలమైన దివ్యమూర్తికి ప్రతీకగా వెలుగుతున్న దివ్యజ్యోతి ముందు ఆత్మ వాలిపోతుంది . ఆ క్రాంతి కిరీటి పాదపీఠికపైన తలవాల్చి అర్చన చేస్తుంది . ఒక దివ్యశక్తిని స్పూర్తిగా పొంది . జీవన పోరాటానికి సంసిద్ధమవుతుంది . ఎందుకంటే అర్ధవంతమైన ప్రారంభం , మరింత అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుందని కాస్తో కూస్తో జ్ఞానసిద్ధిని పొందిన ప్రతి ఆత్మకూ తెలుసు 

గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే ! నిరతము నీ రూప  గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా ! భవహరా ! 
పాండురంగ పాండురంగ // ఘనాఘన సుందరా ... //

 భావం శబ్దాన్ని స్ఫురింపచేస్తుంది . శబ్దం భావాన్ని స్ఫురింపచేస్తుంది . శబ్దాన్నీ- అర్థాన్ని వేరు చేయడం అసాధ్యం . ప్రతీ దేహం ఒక రూపం . ఆ దేహానికి వెనుక ఒక నామం ఉంది . ఒక వ్యక్తిని తలచుకోగానే మనసులోకి అతని రూపం వచ్చి వాలుతుంది . లేదా అతని రూపాన్ని తలచుకోగానే అతని నామం స్ఫురిస్తుంది . మానవుడి మనస్సులో రూపస్ఫూర్తి లేని నామ స్ఫూర్తి ఉండదు . నామస్ఫూర్తి లేని రూపస్ఫూర్తి ఉండదు . అందుకే దివ్యత్వాన్ని , ఒక రూపంతోనూ , ఒన నామంతోనూ చూడటం ఎందరికో సహజ ధర్మంగా మారింది . అయినా , ఈ జగత్తు నామరూపాత్మకం కాక మరేమిటి ? అందుకే దివ్యత్వాన్ని లేదా దివ్యచైతన్య నాదాన్ని నామ రూపాల్నీ స్తుతించడం , ఒక దివ్య ఆరాధానా భావంతో భజించడం జీవన తత్వంగా మారిపోయింది . అయితే ఇదేదో మనిషికే పరిమితమైనది అనుకోవడానికి లేదు . నిజానికి ,విశ్వంలోని అణువుణువూ ఆ దివ్యత్వపు ధ్యానంలో పడి , ఆ దివ్య నామరూపాల్ని గానం చేయడంలో పరవశించిపోతోంది . ఎంతయినా చరాచర జగత్తునంతా నిత్యం ప్రాణమయం చేస్తున్న ఓంకార శక్తి కదా ! నామ రూపాలతో చెప్పుకుంటే దివ్యానందమూర్తి కదా ! మోక్షజీవన ప్రదాత కదా !
                                                                         - బమ్మెర

5 కామెంట్‌లు: