12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

అమర శిల్పి జక్కన సినిమా | ఈ నల్లని రాళ్లలో .. పాట | తెలుగు పాత పాటల విశ్లేషణ

పాటలో ఏముంది .?

పగటివేళ నక్షత్రాలు కనిపించవు . అంతమాత్రాన నక్షత్రాలే లేవని కాదుగా ! పొద్దు గుంకి ఆ వెలుగు తెర కాస్త తొలగిపోగానే వేల కాంతులీనుతూ , అనంతమైన తారా ప్రపంచం దర్శనమిస్తుంది . 
శిలాలోకము అంతే ! రాతి పొరల వెనుక అపురూప శిల్పాలెన్నో అనాదిగా అలా ఉండిపోతాయి . ఎవరో ఒక శిల్పి ,ఉలి చేతబూని చెంతచేరగానే ఆ శిలల్లో వేల ప్రకంపనలు మొదలవుతాయి. అప్పటిదాకా ఆ శిలల మాటున దాగిన సజీవ శిల్పాలన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి . ' అమర శిల్పి జక్కన సినిమా కోసం డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ గీతంలో ఆ సజీవత్వాలన్నీ సాదృశ్యమవుతాయి. ఎంతో రసాత్మకమైన ఈ గీతానికి ఎస్ . రాజేశ్వరరావు సంగీతం సమకూరిస్తే , ఘంటసాల దీన్ని ఎంతో భావస్ఫోరకంగా గానం చేశారు .

ఈ నల్లని రాళ్లలో ..


ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో

“ శరీరాన్ని చూసేవారికి ... మనస్సు కనిపించదు . మనస్సును చూసేవారికి ... ఆత్మ కనిపించదు " 
అంటూ ఉంటారు . నిజమే మరి ! ఎవరైనా , మనసు లోతులు చూడాలనుకుంటే , ఆత్మ కాంతులు చూడాలనుకుంటే , వారి దృష్టి శరీరాన్ని దాటి , మనసులోకి వెళ్లాలి . ఒక దశలో మనస్సును కూడా దాటి ఆత్మలోకి వెళ్లాలి . అప్పుడే ప్రాణవంతమైన హృదయ ప్రకంపనలు కనిపిస్తాయి . హృదయంతో మమేకమై ఉన్న రసరంజిత లోకాలు తెలుస్తాయి .. నల్లనల్లని రాళ్లల్లో దాగిన కళ్ల కాంతి పుంజాలు కనిపిస్తాయి . మనసును తాకే గుండె చప్పుళ్లు వినిపిస్తాయి .

పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
మునుల వోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి || ఈ నల్లని రాళ్లలో ||

పర్వతాలెప్పుడూ ఊరి నడుమ ఉండవు . అవి అడవుల్లోనే ఉంటాయి . ఎందుకంటే ఎంతలేదన్నా , మనుషులు సంచరించే చోట ఏవో కొన్ని మానవ సంబంధమైన కక్ష్యలూ కార్పణ్యాలూ ఉంటాయి . కోపాలూ , తాపాలూ ఉంటాయి . అందుకే ఆ వాసనలు తమనెక్కడ తాకుతాయోనని పర్వతాలు మనుషులకు దూరంగా అరణ్యాల్లో వెలుస్తాయి. అరణ్యాల్లో మసలే మునీశ్వరుల్లా పర్వతాలు కూడా అరణ్యాల్లోనే బసచేస్తాయి .

కదలలేవు , మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి యలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు || ఈ నల్ల
ని రాళ్లలో ||

నిజమే ! రాళ్లు కదలలేని , మెదలేని స్థితిలోనే ఉంటాయి . కానీ , ఒకసారి ఉలి చప్పుడు వినపడితే చాలు వాటి లోలోపలి సెలయేర్లు ఉప్పొంగడం మొదలవుతాయి . విత్తనం ఏదైతేనేమిటి ? నీటి చినుకు పడేదాకా అది చిగురించదు కదా ! చంద్ర కిరణాలు పడేదాకా కలువలు వికసించవు కదా ! పర్వతాలూ అంతే , తమ హృదయం తెలిసిన శిల్పి తమను తాకేదాకా అవి కదలవూ మెదలవు . అతడు చెంత చేరి , వాటి గుండె పైన చేయి వేసేదాకా వాటి జీవనాదాలు మొదలవ్వవు పైన కఠినమనిపించును .. లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును నిశ్చలంగా నిద్రిస్తున్న మనిషిని శవం అనుకుంటే ఎలా ? అతని నాడి పట్టుకుంటే గానీ అతని ప్రాణశక్తి తెలియదు . అతని జీవచైతన్యం తెలియదు . పర్వతాలూ అంతే , పైపైన చూస్తే , పరమ కఠినంగానే కనిపిస్తాయి . ఒకసారి వాటి గుండె తోతుల్ని తాకితే చాలు . లోలోన వెన్న ముద్దలు కనిపిస్తాయి . ఏదో మృదుత్వమే అని కాదు , ఏనాడూ ఎవరికీ హాని తలపెట్టని మానవత్వం కనిపిస్తుంది . ఆ మాటకొస్తే ,పైకి మృదువుగా కనిపిస్తూనే , లోలోన కసాయి ఆలోచనలు చేసే మనిషి కన్నా శిలలే వేయి రెట్లు మేలనిపిస్తాయి . కాదంటారా ?

                                                                  --- బమ్మెర

దేశద్రోహులు సినిమా | జగమే మారినది మధురముగా ఈ వేళ పాట 
మందార మకరంద మాధుర్యమున... బమ్మెర పోతన భాగవత పద్యం

5 కామెంట్‌లు: