పాటలో ఏముంది ?
ఏనాడూ కనీవినీ ఎరుగనివీ ఎన్నడూ కలగననివీ అలా ఏవేవో ఉన్నట్లుండి , కళ్లముందు కొత్త కొత్తగా కదులడం మొదలెడితే ఏమనుకోవాలి ? నిజానికి అవేవీ అంతకు ముందు ఉనికిలో లేనివి కావు . అప్పుడే కొత్తగా వచ్చి పడినవీ కావు కాకపోతే ఇన్నేళ్లూ మన మనసు వాటిని చూసే స్థితిలో లేదు కారణం ఏదైతేనేమిటిలే గానీ , ఉన్నట్లుండి ఒక్కోసారి గుండెలో ఎప్పటినుంచో మకాం వేసి ఉన్న అలజడీ ఆందోళనా మటుమాయమైపోతాయి . మనసు నందనవనంగా మారిపోతుంది . మనసుకు వేయి కళ్లు పుట్టుకొస్తాయి . గుండె పులకించిపోతుంది . ప్రకృతి ఎన్నడూ లేనంత మనోహరంగా దర్శనమిస్తుంది . 1964 లో విడుదలైన పూజాఫలం సినిమా కోసం
డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ పాటలో పరవశాల హరివిల్లే కనిపిస్తుంది . సాలూరు రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో గండుకోకిల ఘంటసాల పాడిన ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తక్కువే !
నిన్నలేని అందమేదో !!
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో ... తీగ సాగెనెందుకో
నాలో .... నిన్నలేని అందమేదో
కళ్ల ముందు కదలాడే కమనీయ సౌందర్యాలన్నీ కొత్తగా పుట్టకొచ్చినవేమీ కాదు ఇన్నేళ్లూ నీలో ఉన్నవే . నీతో ఉన్నవే ! గమనించం కానీ , మనసు నిలిపితే లోకం ముగ్ధ మనోహరమే! నిర్మలమైన భావనాలోకంలో ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది ప్రతి కొమ్మా , ప్రతి తీగా కొత్త పెళ్లి కూతురులాగే కనిపిస్తుంది . ప్రకృతీ దేవి ఒడిలో ఓలలాడుతున్నట్లే అనిపిస్తుంది . రాగఝురుల్లో స్నానమాడుతున్నట్లే ఉంటుంది . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా !
అదొక భావోద్వేగాల వెల్లువ . అయితే ఈ భావోద్వేగాల మూలం బయటెక్కడో ఉన్నట్లు ముందు అనిపిస్తుంది . కానీ, ఆ తర్వాత అది బయటిదేమీ కాదు దాని మూలం తనలోనే ఉందని తొందరలోనే తెలిసిపోతుంది .
పూచిన ప్రతి తరువొక వధువు - పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో ...../ నిన్నలేని /
పూలు పూసే వయసొచ్చిన మొక్క పెళ్లి కూతురుకన్నా ఏం తక్కువ ? ఆ పెళ్లి కూతురు పంచే పూదెనె ఏం తక్కువ ? అవేమీ తక్కువ కాదు . వాస్తవం ఏమంటే , తన మనసు ఆ వైపు వెళ్లిందే చాలా తక్కువ . ఎందుకంటే , మనిషికి మనుషుల్ని చూడటమే ఎక్కువైపోయింది . మనిషే సమస్తం అయినట్టు . మనిషే సర్వసమగ్రం అయినట్లు ఎంత సేపూ అతని చుట్టే తిరుగడం ఎక్కువైపోయింది . మనిషి ఇతర జీవరాశుల్లో కెల్లా గొప్పే కావచ్చు . కానీ , ఆ మాటకొస్తే , సమస్త జీవకోటికీ ప్రాణదానం చేసిన ప్రకృతి మనిషి కన్నా ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ ? అయినా మనిషి దాని పైకి ఏపాటి దృష్టి సారిస్తున్నాడు ? ఎప్పుడో ఏ ఏడాదికో ఒకసారి కొందరి మనసు ఆ వైపు కాస్త వెళుతుందేమో !
కొందరైతే తమ జీవన పోరాటంలో పడి మొత్తంగా తమ జీవితకాలంలోనే ఒకసారైనా ఆ వైపు తేరిపార చూడటం జరగదు . అలాంటి వారు అనుకోకుండా ఎప్పుడో ఆ వైపు దృష్టి పెడితే ఎలా ఉంటుంది ? అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది . అన్నీ అప్పుడే పురివిప్పినట్లు , కోయిల తొలిసారిగా అప్పుడే గొంతు విప్పినట్లు అనిపిస్తాయి . పూల సోయగాలు , పూతేనియల మాధుర్యాలు తొలిసారి తెలిసి వస్తాయి ? నిత్యమూ శోభిల్లే ప్రకృతి సౌందర్యాలు ఆ రోజే తొలిసారి తెలిసొస్తాయి .
తెలినురుగులె నవ్వులు కాగా ...సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే / నిన్నలేని /
లోకంలో గలగలమని నవ్వేది , హొయలూ , ఒయ్యారాలు పోయేది మనుషులేనా ? ఇవేవీ మనిషి సొత్తేమీ కాదు . వీటిపైన మానవాళి గుత్తా దిపత్యం ఏమీ లేదు నదీ ప్రవాహంలో వచ్చే చిక్కని నురగలు నవ్వుల్లా అనిపించవా? వంకులు తిరుగుతూ పయనించే సెలయేరు నడకల్లో ఒయ్యారాలు కనిపించవా ? అనిపించకపోవచ్చు . కనిపించకపోవచ్చు . ఎందుకంటే చాలా మందికి మొత్తం తమ జీవిత కాలంలో మనిషుల్ని చూడటం ఒక్కటే తెలిసింది . అంతేగానీ , చెట్టూ , చేలూ , పుట్టా , గుట్టా , అరణ్యాలూ , మేఘాలూ , నమస్త సృష్టినీ చుట్టేస్తూ , హోరెత్తిపోయే గాలి నాదంలో ఎవరికీ రాగలయలు వినిపించవు . కనిపించని కోటి వీణల స్వరనాదాలు వినిపించవు . అలాగని అసలే వినిపించవని కూడా కాదు . వినిపిస్తాయి . కానీ , వాటిని అవేవో శబ్దాలు అనుకుంటారే గానీ జీవన రాగాలని గమనించలేరు . ఎప్పటికీ అంతేనా ? అంటే అలా ఏమీ కాదు .... మనసు కళ్లు తెరిస్తే , హృదయ కర్ణాలు విచ్చుకుంటే అవన్నీ వినిపిస్తాయి , కనిపిస్తాయి .
పసిడియంచు పైటజారా పయనించే మేఘబాలా
అరుణకాంతి సోకగానే పరశించెనే / నిన్నలేని /
పొద్దు పొద్దున్నే మేఘ బాలికలు సూర్యుడికి స్వాగతం పలకడానికి బంగారు అంచు పైటలతో వేచిచూస్తుంటాయి . అయినా , ఎవరూ వాటిని గమనించరెండుకని ? సూర్యుని తొలి కిరణాలు ఎడీపడగానే మేఘాలు పరవశించిపోవడాన్ని మనుషులు గమనించడమే లేదు . సమస్య ఏమిటంటే ,అయితే వారు అసలు గమనించడం లేదు అని చెప్పలేం . అణువణువునా అన్నీ గమనిస్తున్నారనీ చెప్పలేం . కానీ , చాలా మంది చూసీ చూడనట్లు , గమనించీ గమనించనట్లు ఉండిపోతున్నారు . ఎందుకంటే , జీవితాలు మందగమనంతో సాగిపోతున్నట్లు , హృదయాలు కూడా మంద్రస్పందనలతో ఉండిపోతున్నాయి . ఈ మందగమనం పోయి శరవేగాన్ని పుంజుకోవాలన్నా , జడత్వం పోయి జవజీవాలు నింపుకోవాలన్నా కొన్ని జరగాలి . వేయి సూర్యుల వేడి , వేయి చంద్రుల చల్లదనం మనిషిని తాకాలి . అతని మనసును తాకాలి . వాస్తవానికి అనాదిగా రస హృదయులంతా , రసాత్మక జీవులంతా అదేపనిగా ఇదే కోరుకుంటున్నారు . అయితే వారి లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది . ఎదురు చూడాలి !! మానవ హృదయాలు మయూరాల్లా ఎప్పుడు పరివిప్పి నాట్యమాడతాయో నిరంతరం నిరీక్షించాలి !!
-బమ్మెర
Excellent song with an excellent interpretation, thanks and congratulations
రిప్లయితొలగించండిThanking you so much
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిExcellent lyric interpretation sir..After so many years also they are worth ..really golden songs..
రిప్లయితొలగించండిఈ పాట అద్బుతం మీ రాత ఇంకా అద్బుతం
రిప్లయితొలగించండిదన్యవాదలు శ్రీనివాస్ గారు , మరిన్ని అద్బుతల కోసం , పాటల విశ్లేషణ చదువుతు ఉండండి - నవీన్ technician
తొలగించండిపాట లోని సాహిత్యం దానికి మీరు అందించిన వర్ణన..చాలా బాగుంది.
రిప్లయితొలగించండిచాలా చక్కని వినసొంపైన పాట
రిప్లయితొలగించండిచక్కని వినసొంపైన పాట
రిప్లయితొలగించండి