పాటలో ఏముంది?
పాడమని నన్నడగవలెనా......
నేనే పరవశించి పాడనా .....!
మేఘాల్ని వర్షించమని ... అడిగినా అడగకపోయినా అవి వర్షిస్తాయి అంతే .... నదుల్ని ప్రవహించమని అడిగినా అడగకపోయినా అవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. కొమ్మల్ని చిగురించమని ఎవరూ అడగరు. అయినా అవి చిగురిస్తూనే ఉంటాయి. కోయిలల్ని పాడమని ఎవరూ అడగరు. ఎద నిండినప్పుడు, మది పొంగినప్పుడు ఎన్నెన్నో రాగాలు ఎగదన్నుకుని వాటి గొంతుదాటి వచ్చేస్తాయి. పారవశ్యంలో తేలాడే మనసు కూడా అంతే మరి ! అయిన వాళ్ల కోసం, ఆత్మీయుల కోసం, మనసున్న మనుషులందరి కోసం హృదయ వీణ మధుర మదురంగా పలుకుతుంది ... పాడుతుంది. మామూలుగానే ఇలా ఉంటే, ప్రాణమైన వారు, తామే పాడమని అడిగితే ఇంకేమైనా ఉందా? ఆ హృదయం పదింతలుగా స్పందిస్తుంది. వేయింతల పారవశ్యంతో గొంతు రసద్వనులు ఒలికిస్తుంది.
నీకు గాక ఎవరి కొరకు - నీవు వింటే చాలు నాకు .... // పాడమని //
పాదు తీసి, నీరు పోసి, తనను పెంచి పెద్దచేసిన వనమాలిని ఏ పూవైనా మరిచిపోతుందా? ఆ వనమాలి కనపడితే చాలు కళ్లు వేయింతలు చేసుకుని, నీరాజనం పడుతుంది. నిలువెల్లా పులకించిపోతుంది. తన పరిమళాలన్నీ ఆ వనమాలి ఎదపై వెదజల్లాలనుకుంటుంది. ఎవరు పెంచిన హృదయాన్ని వారికే నైవేద్యంగా సమర్పించడంలో కలిగే ఆనందం మరెక్కడైనా లభిస్తుందా? కాకపోతే, ఆ పరిమళాలు, ఆ వనానికే, ఆ వనమాలికే పరిమితమైపోవు. వద్దన్నా, కాదన్నా, ఆ పరిమళాలు అవతలి వారిని కూడా తాకుతాయి. ఇష్టాఇష్టాలను బట్టి, ఇతరులకు అవి నచ్చడం, నచ్చకపోవడం అది వేరే మాట, ఆ ఇతరుల మాట ఎలా ఉన్నా, తన పరిమళాలు తనకు జన్మనిచ్చిన ఆ వనమాలిని చేరినా చాలనుకుంటాయి పూలు . రుణం అలా తీరిపోతుందని కాదు గానీ, తన జన్మ అలా ఎంతో కొంత ధన్యమౌతుందనుకుంటాయి. తనకు అమృతాన్ని పంచిన దోసిళ్లల్లో వాలిపోతే చాలనుకుంటాయి. అక్కడే తన ప్రాణాలు వదిలినా అదృష్టమే అనుకుంటాయి.
ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై - // పాడమని //
ప్రతి మొగ్గా, పూవయ్యే దాకా ఉంటుందన్న గ్యారెంటీ ఏదీ లేదు. ఎందుకంటే, ఆ మధ్యే విరుచుకుపడే ఏ సుడిగాలికో అవి రాలిపోవచ్చు. ఏ వడగాలికో ఆవి వాడిపోవచ్చు. ఎన్నెన్నో మొగ్గలు అలా వికసించక ముందే రాలిపోయినట్లు, ఎన్నో జీవితాలు ఇంకా ప్రయాణం మొదలెట్టకముందే మృత్యువాత పడి ముగిసిపోతుంటాయి. అందువల్ల అందరి చిన్ననాటి ఆశలు ... తప్పనిసరిగా నెరవేరతాయన్న గ్యారెంటీ ఏదీ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా, ఎవరి ఆశలైనా నిజంగానే నెరవేరితే ... వారికి అంతకన్నా ఏం కావాలి? అదే జరిగితే, ఆ నెరవేరడానికి మూలభూతంగా ఉన్నవారి ముందు, ఆ పూలైనా, హృదయాలైనా నిలువెత్తు నివాళులై నీరాజనం పడతాయి. మమతలు మారాకులేసి మొగిలి పూవులాంటి మాటలవుతాయి. కమ్మ కమ్మని పాటలవుతాయి ఆ పాటల మాధుర్యాల్లో తేలియాడటం కన్నా మించిన ఆనందం మరేముంటుంది?
నీ మనసులో ఈనాడు నిండిన ..... రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ ..... // పాడమని //
ఏ పూవైనా ఎంతకాలం ఉంటుంది? ఎంత ఆశగా ఉన్నా, ఎంత కాలం తన పరిమళాలు వెదజల్లగలుగుతుంది? పూవూ, కొమ్మా అనే కాదు ప్రపంచంలోని ఏదీ శాశ్వతం కాదు కదా! అందుకే ఈ రోజు గంపెడు పరిమళాలు వెదజల్లిన పూల చెట్టు, రేపు ఏ పెనుగాలికో కొమ్మలు విరిగిపడి, మ్రోడై పోవచ్చు. అప్పటిదాకా రసరంజకమైన రాగాలు పలికిన వీణలు, ఏ భూకంపమో వచ్చి, విరిగిపడవచ్చు. తీగెలన్నీ తెగిపోయి, మూగవైపోవచ్చు. జీవన వేదికల పైన ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరన్నది ఆకాశమంత నిజం. అయితే, మానవ మస్తిష్కంలోని జ్ఞాపకాల గ్రంధాలు చిరకాలం నిలిచే ఉంటాయి. అక్షరం అక్షరంలో జీవితపు తడి నింపుకుని, పుటలన్నీ తనరారుతుంటాయి. ఆత్మానుబంధాల పునాదుల పైన వెలసిన ప్రేమలోకాలు, ఎప్పటికీ తమ ఉనికిని కోల్పోకుండా అలా ఉండిపోతాయి. వాటిల్లో తిరుగాడే రాగబంధాలు, అనురాగ బంధాలు ఆకాశంలోని నక్షత్రాల్లా ఎప్పటికీ చెక్కుచెదరకుండా అలా నిలిచిపోతాయి !!
- బమ్మెర
Golden hit song. Thanks for sharing like this song.
రిప్లయితొలగించండిGreat explanation of the song
రిప్లయితొలగించండిగోల్డెన్ హిట్ అమోఘమైన అర్థవంతమైన మనస్సును ఓలలాడించె అనంద భరితమైన తేనేలోలికే మధుర గీతం
రిప్లయితొలగించండిఅద్భుతమైన విశ్లేషణ... ఓ పాట పుట్టుక...ఓ తల్లి ప్రసవవేదనంత...సన్నివేశ సందర్భాన్ని బట్టి కవి ఓ పాట వ్రాస్తే...దానికి అనుగుణంగా స్వరకర్త బాణీలు సమకూరిస్తే....భావయుక్తంగా గాయనీ గాయకులు మృదు మధురంగా ఆలపిస్తే....ఆయా నటీనటులు తగు అభినయం జతకూరిస్తే....ఓ అజరామర గీతమవుతుంది...అట్టి పాటలెంచుకుని ఆ పాట అంతరార్థాన్ని విపులీకరిస్తున్న మీకు ధన్యవాదాలు...
రిప్లయితొలగించండి