2, మే 2021, ఆదివారం

అంతులేని కథ సినిమా | కళ్లలో ఉన్నదేదో....పాట | Telugu old songs |

పాటలో ఏముంది? 

‘‘ఈ సమస్య ఒకటి పరిష్కారమైపోతే చాలు .... ఆ పైన జీవితమిక హాయిగా గడిచిపోతుంది’’ అన్న మాట చాలా మంది గుండెల్లో చాలా సార్లు ప్రతిధ్వనిస్తుంది. కానీ, చాలాసార్లు, ఒక సమస్య ఇంకా ముగిసీ ముగియకముందే  మరో రెండు కొత్త సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఎడతెగని ఈ జీవన సంక్షోభాన్ని తెలిపే ఇతివృత్తం కావడం వల్ల ‘అంతులేని కథ’ పేరు ఈ సినిమాకు అక్షరాలా సరిపోయింది. 1976లో విడుదలైన ఈ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఓ పాటను ఎం.ఎస్‌., విశ్వనాథన స్వరబద్దం చేయగా ఎస్‌. జానకి పాడారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పుటికీ జనం గుండెలో మారుమోగడానికి భావస్పోరకమైన బాణీ, భావోద్వేగపూరితమైన సాహిత్యం ఈ రెండూ సమాన కారణమే!

కళ్లలో ఉన్నదేదో......




కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - రాళ్లలో ఉన్ననీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు గాక .... ఇంకెవరికి తెలుసు?
కనుపాపలు, కనుగుడ్లు ... కనురెప్పలు, కనుబొమ్మలు .... కళ్లంటే ఇంతేనా? కాదుకదా ! కళ్లల్లో పైకి కనిపించని సముద్రాలెన్నో ఉంటాయి. అయితే,  కొందరికి తమలో అన్ని సముద్రాలు ఉన్నాయన్న ఊహే ఉండదు.. ఒకవేళ ఉన్నా,  ఏ సముద్రం ఎప్పుడు ఉబికి, ఉప్పొంగుతుందో  ఎన్ని విపరిణామాలకు దారి తీస్తుందో ఏమీ తెలియదు. అలాంటిది, తనదికాని,  ఎవరో అవతలి వ్యక్తి కళ్లల్లోని సముద్రాల్ని చూడాలనుకుంటే అది అయ్యేపనేనా? మనుషుల గురించే అని కాదు. కదలక మెదలక పడిఉండే ఏ గండశిలల్ని గమనించినా ఎన్నో నిజాలు తెలుస్తాయి. చలనమే లేకుండా పడిఉన్న ఒక బండరాయిని పెగిలిస్తే, ఆ రాతి పొరల మధ్యలోంచి ఉవ్వెత్తున ఎగిసి పడే జలసంపద కనిపిస్తుంది. పైకేమీ కనిపించడం లేదని, రాతిగుట్టలో నీళ్లే ఉండవంటే ఎలా? కళ్లు చెమ్మగిల్లనంత మాత్రాన ఆ మనిషిలో కన్నీళ్లే లేవని కాదు కదా! ఇతరులెవరికో తెలిసినా తెలియకపోయినా,  అతనిలో ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో ఆ వ్యక్తికైతే తెలుస్తుందిగా
నీటిలో ఆరే నిప్పును కాను .... నిప్పున కాగే నీరైన కాను
ఏదీ కానీ నాలో రగిలే ... ఈ అనలాన్నీ ఆర్పేదెవరో...  // నాలో ఉన్న మనసు //

మనసు ప్రకృతిలోనే ఉంటుంది. ప్రపంచంతోనే ఉంటుంది. అయినా,  ప్రకృతిలోని చాలా ధర్మాలు మనసుకు ఉండవు. ప్రపంచంలోని చాలా తత్వాలు మనసులో కనిపించవు.  నీళ్లు చల్లితే నిప్పు చల్లారిపోతుంది అలాగని, కాలే మనసుపైన నీళ్లు చల్లితే అది ఎంతకూ చల్లారదు. ప్రకృతితోనూ, ప్రపంచంతోనూ పూర్తిగా మమేకమైనట్లు పైకి అనిపిస్తున్నా, మనసు వాటికి అతీతంగానే ఉంటుంది. ఈ అతీత ధోరణి వల్లే మనసు ఎవరికీ అర్థం కాదు. మరో తమాషా ఏమిటంటే, మనసు కాలుతుందే గానీ, అది  నిప్పు కాదు. అలాగని మనసు నీరు కూడా కాదు.  ఆ మాటకొస్తే .నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాల్లో మనసు ఏదీ కాదు.  అదొక  విచిత్రమైన, పరమ సంకీర్ణమైన ఒక బ్రహ్మ పదార్థం. కాస్త తరిచి చూస్తే, , మొత్తం ప్రపంచాన్ని మోయడం ఒక ఎత్తు. ఒక మనసును మోయడం ఒక ఎత్తు అని బోధపడుతుంది. . అదంతా సరే గానీ,  మనసులో ఒక  కార్చిచ్చు అంటూ మొదలైతే, దాన్నింక చల్లార్చలేమా? అంటే?  ఎందుకు కాదు?కాకపోతే దాని కోసం ఎక్కడో వెతకాల్సిన  అవసరమేమీ లేదు. వాస్తవానికి ప్రశ్న ఎంత జటిలమైనదైనా, ఆ  ప్రశ్నలోనే సగం సమాధానం ఉంటుంది.  సమస్యలోనే సగం పరిష్కారం ఉంటుంది. కాకపోతే, ఆ సగాల  ఆధారంగా మిగతా సగాల్ని ఒడిసిపట్టుకోగలిగే ఒడుపు మనిషికి ఉండాలి.  ఆధ్యంతాల్ని ఆకలింపు చేసుకోగలిగే  జీవన జ్ఞానం కావాలి. 
తానే మంటై వెలుగిచ్చు దీపం ... చెప్పదు తనలో చెలరేగు తాపం...
నే వెళ్లు దారి ఓ ముళ్ల దారి -  రాలేరు ఎవరూ నాతో చేరి.... // నాలో ఉన్న మనసు //

మేఘాలు వర్షించి భూమిని సస్యశ్యామలం చేయడం సరే ! కానీ,  వర్షించడానికి ముందు తామెంత ఘర్షణకు గురవుతాయో మేఘాలు ఎప్పుడైనా చెప్పాయా?  దశదిశలా కాంతిపుంజాలు ఎగజిమ్మే దీపాలైనా, తమలో తాము ఎంత కాలిపోతున్నాయో ఏ రోజైనా బయటపెట్టాయా?  కొంతమంది మనుషులూ అంతే ఎవరికేమీ చెప్పకుండా అన్నీ లోలోనే దాచేసుకుంటారు. నిజానికి  ఏ జీవితమైనా పూర్తిగా పూలబాటలా ఏమీ ఉండదు. ఎంత జాగ్రత్తగా వెళుతున్నా, ఎక్కడో ఒక చోట ముళ్ల దారులు ఎదురవుతూనే ఉంటాయి. తానేదో పూర్తిగా భిన్నమనుకుని తన దారిలోకి మరెవరూ రాలేరని ముందే అనుకుంటే ఎలా? ఎవరికైనా కాస్త దారి ఇస్తేనే కదా వారు రాగలరో లేదో తెలుస్తుంది? ఇదంతా కాదనుకుని, ఒకవేళ  ఒంటరి పోరాటం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంటే, అదీ మంచిదే! అప్పుడింక సర్వశక్తులూ తానే సమకూర్చుకుని,  సమర భూమిలోకి దిగిపోవలసిందే! వ్యూహాలూ, ప్రతివ్యూహాలూ, చక్రవ్యూహాలతో  సమర శంఖం ఊదాల్సిందే!
వేసవిలోనూ వానలు రావా... కోవెల శిలకూ జీవం రాదా 
జరిగే నాడే జరుగును అన్నీ.... జరిగిన నాడే తెలియును కొన్నీ // నాలో ఉన్న మనసు //
 
ఎన్నెన్నో జరుగుతాయనుకుంటే ఏమీ జరగవు కొన్నిసార్లు.. ఏమీ  అనుకోకుండా, నిర్లిప్తంగా ఉండిపోయిన రోజుల్లో
ఏమేమో జరిగిపోతాయి కొన్నిసార్లు. వ్యక్తులకే అని కాదు, ప్రకృతి ధర్మాలకే విరుద్ధంగా, ప్రపంచ తత్వాలకు 
భిన్నంగా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. మనిషి నడత మారిపోయినట్లు, ఎవరూ ఊహించని రీతిలో రుతువుల 
పోకడలు కూడా తారుమారవుతాయి. పచ్చిక బయళ్లు ఎడారులవుతాయి. ఆ ఎడారులే ఎండమావులకు 
ఆశ్రయమవుతాయి.  ఎప్పుడూ ఇలాగే అని కాదు. అందుకు భిన్నంగా కూడా కొన్ని జరిగి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఆ క్రమంలో మండు వేసవిలో ఎడతెగని వానలు కురిసి సంభ్రమానికి  
గురిచేయవచ్చు. తెగిపడిన అరణ్యంలోని  ప్రతి చెట్టూ లేచి నిలబడవచ్చు. . అప్పటిదాకా అధఃపాతాళంలో పడి ఉన్న 
హృదయాలెన్నో ఉవ్వెత్తున ఎగిసి భూతలం పైన శివతాండవం చేయవచ్చు. ప్రతికూల అంశాలన్నీ పటాపంచలై ఒక వినూత్న శక్తి ప్రకటితం కావచ్చు. మొత్తంగా చూస్తే, ఒకటి మాత్రం నిజం.  కళ్లముందు ఎన్ని చీకట్లు కమ్ముకున్నా, ఆ తర్వాత రాబోయే వెలుగును ఊహించడంలోనే నిజమైన చైతన్యం ఉంది.   ఈరోజు ఎంత దుఃఖంలో తలమునకలవుతున్నా, ఆ తర్వాత ఓ దివ్యానందాన్ని రప్పించడానికి,  తిరుగులేని  ప్రణాళికలు సిద్ధం చేయడంలోనే సినలైన జీవితం ఉంది. 
                                                                 - బమ్మెర 
===================================




6 కామెంట్‌లు:

  1. మానసిక మాంత్రికుడు బాలచందర్. మనసు కవి ఆత్రేయ. వారిద్దరి హృదయాల స్పందన ఈ పాట. ఒక స్త్రీ మనసును ఎవరూ అర్ధం చేసుకోలేరు. సముద్రుని గర్భంలో దాగిన రహస్యాలను ఎవరైనా ఛేదించి గలరా.రాతిమధ్యలో మండూకం సజీవంగా వుంటుందని తెలిసి మొదటి శాస్తరజ్నులే అచ్చెరువొందారు.
    తన కుటుంబం కోసం తన సర్వస్వాన్ని త్యజించగలిగే త్యాగశీలి ఒక స్త్రీ మాత్రమే.
    అజరామరమైన ఇటువంటి పాటు వినిపించినందుకు కృతజ్ఞతలు.👍🙏👍

    రిప్లయితొలగించండి
  2. అద్భుతమైన విశ్లేషణ 👌

    రిప్లయితొలగించండి
  3. మంచి పాటను అందించారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి