21, జులై 2021, బుధవారం

మల్లియలారా...! మాలికలారా...పాట | నిర్దోషి సినిమా | తెలుగు పాత పాటలు లిరిక్స్ |

పాటలో ఏముంది?


రాగం, భావం .... సమ ఉజ్జీగా సాగే గీతాల సంఖ్య చాలా అరుదే! ‘ నిర్దోషి’  సినిమా కోసం ఘంటసాల కూర్చిన బాణీ కోసం నారాయణరెడ్డి రాసిన ఈ పాట ఆ అరుదైన పాటల్లో ఒకటి. లోతైన భావాల్ని లోతైన మాటలతో చెప్పడం ఎప్పుడూ జరిగేదే! కానీ ఎంతో లోతైన భావాల్ని కూడా అలతిఅలతి పదాలతోనే పలికించడం ఈ పాటలో జరిగిన ఒక విశేషం. విషయాన్ని పూర్తిగా కధాంశంతో ముడివేసి చెప్పినప్పుడు ఆ అనుభూతులకు కొందరు బాగా దగ్గరైతే, కొందరు మరీ దూరమైపోతారు. ఆ కథ తమలాంటి వాళ్లది కాదులే అనుకోవడమే అందుకు కారణం.  అందుకు భిన్నంగా విషయాన్ని లీలగా ఒక ‘ఆరా’ లా నడిపించడం వల్ల ఈ పాటను కోటానుకోట్ల మంది అక్కున చేర్చుకున్నారు. నిజానికి, ఘంటసాల స్వర - గానమాధురి నారాయణ రెడ్డి భావఝరిని మరింత రసార్థ్రం చేసింది. వెయ్యిన్నొక్కమారేమో! విని ఆస్వాదించండి మరి!

మల్లియలారా...! మాలికలారా...!!మల్లియలారా .... మాలికలారా
మౌనముగా ఉన్నారా ... మా కథయే విన్నారా!

మనిషిని పోలిన మనిషి ఉన్నట్లు,  జీవితాల్ని పోలిన  జీవితాలూ ఉంటాయి. అందువల్ల ఎవరినో చూసి ఇంకెవరో అనుకోవడం,  ఎవరి గురించో చెప్పినవాటిని,  ఇంకెవరి గురించో అనుకోవడం జరిగిపోతూ ఉంటుంది. పైగా చెప్పడం చేతగాని వాళ్లు చెప్పినవేవో విని, విని అర్థం చేసుకోలేని వాళ్లు  తమకు అంతా అర్థమైపోయిందనుకుని, తెగించి అందరికీ చెబుతూ వెళతారు. అసలు తాము విన్నది నిజమేనా అన్న కనీస మీమాంసలోకి కూడా వెళ్ళకుండా  ఎంత దుమారమో లేపుతారు. ఎందుకంటే, వికృతమైన, విచిత్రమైన సంఘటనల్ని రోజూ అక్కడో ఇక్కడో చూసే కళ్లు ఇక్కడ కూడా అవే జరిగాయనే అనుకుంటారు. కానీ, ఏ జీవితానికి ఆ జీవితం పూర్తిగా భిన్నమనీ, చాలా సార్లు ఒక జీవితానికీ, మరో జీవితానికీ మధ్య పొంతనే ఉండదని గ్రహించరు. వీళ్లవల్ల  ఒక్కోసారి మనుషుల మధ్య అంతులేని దూరాలు, మనసుల మధ్య అంతుచిక్కని అగాధాలు చోటుచేసుకుంటాయి. మరీ బాధాకరం ఏమిటంటే, ఎవరో పరాయి వాళ్ల ధోరణి ఇలా ఉంటే ఏదోలే అనుకుని, ఉండిపోవచ్చేమో గానీ. అయినవాళ్లు, జీవితంలో భాగమైన వాళ్లే అలా వ్యవహ రిస్తే ఎలా ఉంటుంది?  ఏదో కొద్ది రోజుల బాధే అనుకోవడానికి కూడా వీళ్లేదు. ఒక్కోసారి ఇవి సుదీర్ఘకాలం కొనసాగి, జీవితాలకు జీవితాలనే బలితీసుకుంటాయి. మరో సమస్య ఏమిటంటే ఎంతో గుండెకోతకు గురైన ఇలాంటి వాళ్లకు తమ బాధేమిటో చెప్పుకోవడానికి ఒక్కోసారి మనిషే దొరకరు. ఏం చేయాలో తోచక,  గుండె బరువు దించుకోవడానికి వీళ్లకు చెట్టుకో గుట్టకో చెప్పుకోవాల్సిన గతి పడుతుంది. ఈ కథానాయకుడు మల్లెల ముందు, మల్లె మాలికల ముందు మనసు విప్పడంలోని కారణం కూడా ఇదే!

జాబిలిలోనే జ్వాలలు రేగే - వెన్నెలలోనే చీకటి మూగే
పలుకగ లేక పదములు రాక, పలుకగా... లేక, పదములే,... రాక
బ్రతుకే తానే బరువై సాగే // మల్లియలారా // 

మనిషి తెలివి తేటలు ఎంత పెరిగిపోయాయీ అంటే, చెట్లల్లో, పొదల్లోనే అని కాదు, మనిషి నీళ్లల్లోనే నిప్పు పుట్టించగలడు. చల్లచల్లని చంద్రమామనే చండ్రనిప్పుల పాలు చేయగలడు! వెన్నెల వేళల్ని కటిక చీకట్లతో నింపగలడు. చివరికి జీవితాల పైన కూడా ఇతని పైశాచిక ప్రయోగాలు ఇలాగే ఉంటాయి. ఒకటా రెండా? ఇలా చూస్తే, ఊహకందని, మాటకందని కల్లోలాలు మానవజీవిత ంలో కోకొల్లలు. ఏదో అవేశానికి  లోనై, సమస్త ప్రాణికోటికన్నా, భాష తెలిసిన మానవుడే బహుగొప్పవాడని చెప్పుకుంటాం గానీ, ఇతని భాష ఏమంత గొప్పది? నిజంగానే భాష అంత గొప్పదైతే ఓ మహా రచయిత ‘‘ చాలా బలహీనమైన భావాలు మాత్రమే భాష ద్వారా వ్యక్తమవుతాయి’’ అనేమాట ఎందుకంటాడు? కావలసిన పదాలన్నీ ఉన్నట్లు కేవలం పలకలేకపోవడమే సమస్య అన్నట్లు మాట్లాడతారు గానీ,  నిజానికి, పలకలేకపోవడం కాదు.. అసలా ఆ పదాలు లేకపోవడమే అసలు సమస్య! ఎంతసేపూ ఉన్న కాసిన్ని పదాలతో సరిపెట్టుకోవడం తప్ప ఏ భాషలోనైనా అంత సర్వసమగ్రమైన పదకోశం ఎక్కడుంది? మనోభావాల్ని ఆసాంతం అభివ్యక్తం చేయలేకపోతే... హృదయమూ చివరికి జీవితమూ బరువెక్కిపోక ఏమవుతాయి.? 

చెదరిన వీణ రవళించేనా... జీవన రాగం చిగురించేనా
కలతలు పోయి,  వలపులు పొంగి, కలతలే ... పోయి, వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా // మల్లియలారా //

చెక్కవీణ చెదిరిపోతే ఏముంది? ఏ వాద్యనిపుణుడో వచ్చి నాలుగు ఘడియల్లో చక్కదిద్దిపోగలడు. సమస్య అంతా జీవన వీణ చెదిరిపోయినప్పుడే!  ఆ మాటకొస్తే,  శాస్త్రీయ స్వర రాగాలు పలికించడం కూడా ఎప్పుడూ సమస్య కాదు. సమస్య అంతా జీవన రాగాలు పలికించడం దగ్గరే! రాగాలు అంటే ధ్వనితరంగాలు అని కాదు కదా! కోటానుకోట్ల భావోద్వేగాల సమన్వితంగా వెల్లువెత్తే హృదయనాదాలవి! ఈ క్రమంలో కలతలు పోయి, వలపులు పొంగితే బావుందునని ఒక్క మాటలో అనేసుకోవచ్చు గానీ,  కలతలు పోవడానికీ,  అదే స్థావరంలో వలపులు పొంగడానికీ  మధ్య ఎన్ని వేల వంతెనలు నిర్మాణం కావాలి? అవి నిర్మాణమయ్యాక అయినా, ఆ చివరి నుంచి ఈ మొదలు దాకా ఎన్ని కోట్ల యోజనాల దూరం ప్రయాణం చేయాలి? అది మహామహా దూరమే! కాకపోతే ఒక నిండైన ఆశాహృదయానికీ కొండెత్తు ఆత్మవిశ్వాసానీకి  ఆ వంతెనల నిర్మాణ భారం, భారమే కాదు. ఆ ప్రయాణ దూరం,  దూరమే కాదు!!

                                                               - బమ్మెర 

================================

8 కామెంట్‌లు:

 1. In olden days cine writers every word is beautiful meaning. It gives very plesence of mind with ghantasala tone. Thank you Anjanna garu.

  రిప్లయితొలగించండి
 2. It's really wonderful,the way of your narration making more glamour.keep writing

  రిప్లయితొలగించండి
 3. నారాయణ రెడ్డి గారి పాట కి పోటీగా మీ వివరణ వుంది. అదే కదా జీవనగీతం కు ప్రాణం. నారాయణ రెడ్డి గారికి సాటిగా రాసే వాళ్ళుండొచ్చు, కానీ మీలాగా రచయిత భావాల్ని మరింత లోతుగా ,మరింత భావయుక్తంగా చెప్పేవాళ్ళే లేరు. మీకు శతకోటి అభినందనలు

  రిప్లయితొలగించండి
 4. I have no words to express my happy feelings, your work is exalent, beyond comparision, great contribution to telugu people.

  రిప్లయితొలగించండి
 5. ఎస్ పి కోదండపాణి గంటసాల సీ నా రే గీతం ఎన్టీఆర్ నటన అద్భుతం

  రిప్లయితొలగించండి