22, సెప్టెంబర్ 2021, బుధవారం

ఏ పాదసీమ కాశీప్రయాగాది పద్యం | పాండురంగ మహాత్మ్యం సినిమా |ఘంటసాల పద్యాలు | తెలుగు పద్యాలు |

పద్య మాధురి

‘తలిదండ్రుల ద్వారా తనకు ఒరిగింది ఏముంది? వాళ్ల నుంచి నాకు సంక్రమించిన అంత పెద్ద ఆస్తులూ, ఐశ్వర్యాలు ఏమున్నాయి?’ అంటూ కొందరు కన్నవారి పైన నిష్టూరాలు పోతుంటారు. నిందలు వేస్తుంటారు కానీ, సకల ప్రాణికోటిలో మావవజన్మ సర్వోన్నతమైనదని చెబుతారే! ఆ ఉత్కృష్ట జన్మే వారి నుంచి నీకు లభించింది. అది ఏం తక్కువ? అంతకన్నా మించి వారు నీకు ఏమివ్వాలి? మనిషి అంటే సర్వశక్తివంతుడని కదా! నువ్వు  మనిషిగా అవతరించడం అన్నది ఒకటి జరిగితే, ఆ తర్వాత ఇంక నువ్వు అందుకోలేనిది, సాధించుకోలేనిది ఏముంటుంది? అయినా, జన్మంటే అదేదో  ఇసుక రేణువులా భూమ్మీద వాలిపోవడం అని కాదు కదా! జన్మతో సంక్రమించిన ఈ దేహం, ఈ మనసు, ఈ ఆత్మలు నువ్వు ఆశించిన దానికన్నా వేయింతల ఎత్తుకు తీసుకువెళ్లగలిగే  పుష్పకవిమానాలు. ఆ మాటకొస్తే, మానవ  జన్మ,తో భౌతికమైన ఐశ్వర్యాలే కాదు,  మానవాత్మను శిఖరాగ్రానికి చేర్చే మహోన్నతమైన తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాలెన్నో ఈ జన్మతో నీకు సంక్రమిస్తాయి. అది అష్టైశ్వర్యాలనే మించిన నిధి! ఆ నిధి నీతోనే ఉంది. నీలోనే ఉంది. నువ్వే దాన్ని గుర్తించడం లేదు. ‘ఆ పరోక్ష ప్రయోజనాల గురించి ఎందుకులే..! నాకు ప్రత్యక్షంగా ఒనగూడిందేమిటి?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించనే వచ్చు.  అయితే, అనంతమైన ఈ చరాచర జగత్తును దర్శించాలంటే, నువ్వు జన్మిస్తేనే కదా సాధ్యమవుతుది! నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వీటి మహోజ్వల రూపాన్ని ఆసాంతం దర్శించాలంటే, నువ్వు మానవ జన్మ ఎత్తాల్సిందే మరి! వాటి బాహ్య రూపాన్ని దర్శించడం మాత్రమే కాదు. వాటి అంతశ్శక్తులు గ్రాహ్యమయ్యేది కూడా మానవరూపం ఎత్తితేనే!  ఇవన్నీ ప్రత్యక్ష ప్రయోజనాలు కాక మరేమిటి?  ఇక్కడ ఓ మాట చెప్పాలి. కన్నవారి నుంచి నీకు ఇంకేదో అందాల్సింది అనే లెక్కలు నీకేవో ఉంటే ఉండవచ్చు కానీ,ప్రతి వ్యక్తికీ కొన్ని  పరిమితులంటూ  ఉంటాయి కదా! తమ పరిమితులకు లోబడే కదా ... ఎవరైనా ఏమైనా సాధిస్తారు! ఆ మాటకొస్తే, నువ్వు మాత్రం ఏ పరిమితులూ లేకుండా లేవు కదా!   ఆ సత్యాన్ని గుర్తించకుండా వికారాలు పోవడం, విషం కక్కడం ఏ రకంగా అర్థవంతం? పుండరీకుడు కూడా ముందు ఇలాగే మాట్లాడి, ఆ తర్వాత అది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు. ఈ పద్యంలో ఆ చేసిన తప్పుల తాలూకు నిలువెత్తు  పశ్చాత్తాపమే వినిపిస్తుంది. పశ్చాత్తాప నేపథ్యం ఏదైనా కావచ్చు. అది నీ ఆత్మజ్ఞానానికి దోహదం చేస్తే అంతకన్నా ఏం కావాలి?  

1957 లో విడుదలైన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా కోసం సముద్రాల జూనియర్‌ రాసిన ఈ పద్యాన్ని, టీ.వీ రాజు స్వరపరచగా స్వరధుని ఘంటసాల ఎంతో  ఆర్ద్రంగా పాడారు. వినోదం కోసం కాదు, పరమార్థ జ్ఞానం కోసం ఈ పద్యాన్ని వినాలి. పెద్దలు సరే, పిల్లలంతా మనసు పెట్టి ఈ పద్యాన్ని  మరీ మరీ వినాలి!! ఇంతకూ పుండరీకుడు ఏమంటున్నాడు?

ఏ పాదసీమ......!


ఏ పాదసీమ కాశీప్రయాగాది ప

            విత్రభూముల కన్న విమలతరము

ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ

            పూజలకన్నను పుణ్యతమము

ఏ పాదతీర్థము పాపసంతాపాగ్ని

             ఆర్పగా జాలిన అమృతఝరము

ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యా

             నమ్ముకన్నను మహానందకరము


అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి

ఇహపరమ్ముల కెడమై తపించువారి

కావగలవారు లేరు లేరు యీ జగాన వేరే  

నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా!!

మనలో ఎవరైనా, పాదస్మరణ చేసి, పాదపూజ చేసి, పాదతీర్థం తీసుకునే స్థితికి ఎప్పుడు చేరుకుంటారు? ఎన్నో దశాబ్దాలుగా వెంటాడుతున్న అహమంతా కాలి, కూలిపోతే గానీ, అది సాధ్యం కాదు. అదే జరగకపోతే,  అప్పటిదాకా ఉన్నారో లేదో కూడా తెలియని దేవదేవుళ్లకు మాత్రమే సాష్టాంగ పడినవాడు, నిత్యం ఇంట్లోనే తన కళ్లముందు కదలాడే తలిదండ్రుల పాదపూజకు ఎలా  సిద్ధమవుతాడు? వాళ్లల్లో ఆ దివ్యత్వాన్ని దర్శించినప్పుడు  మాత్రమే కదా... అది సాధ్యమవుతుంది.  అహమన్నది అంతర్థానం అయినప్పుడు మాత్రమే వారి ఆత్మజ్యోతి ప్రకటితమవుతుంది. జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆ స్థితిలో మాత్రమే తలిదండ్రులు దేవతా మూర్తుల్లా కనిపిస్తారు. వారి పాదసీమ కాశీప్రయాగల కన్నా పవిత్రంగా, వారి పాదపూజ, విష్ణుమూర్తి పాదసేవ కన్నా పుణ్యదాయకంగా అనిపిస్తుంది. అప్పుడే ఆ తలిదండ్రుల పాదస్మరణ  విష్ణుమూర్తి ధ్యానంలో గడిపిన ఘడియల కన్నా గొప్ప ఆనందానుభూతినిస్తుంది. వారి పాదతీర్థం, సమస్త పాపజ్వాలలను ఆర్పగలిగే అమృతవర్షిణిలా కనిపిస్తుంది. ఒకసారి ఆ సత్యస్పృహ సంపూర్ణంగా కలిగిన తర్వాత తలిదండ్రులను ఆరాధించడం కన్నా మించిన పూజ ప్రపంచంలో మరేదీ లేదనిపిస్తుంది. కాకపోతే,  ఆ జ్ఞానమేదో జీవితపు చరమాంకలో కాకుండా, అంతకన్నా ముందే సిద్ధిస్తే, బ్రతుకు మరింత పునీతమవుతుందది. జన్మ సార్ధకమవుతుంది. జీవితం అర్థవంతమవుతుంది!!

                                                            - బమ్మెర 

4 కామెంట్‌లు:

  1. Excellent song. Every children has to listen and has to know truth. Thank you Anjanna garu. Very nice poem.

    రిప్లయితొలగించండి
  2. మీరు రాసే మాటలవల్ల ఆ పాటలకు అందమొస్తుందో ఆ పాటలే అందంగా ఉన్నాయో.. తెలియడం లేదు. మంచి పాట అంతకన్నా మంచి విశ్లేషణ...🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  3. మీ విశ్లేషన ఎంత గోప్పగా ఉందొ చెప్పడానికి మాటలు చాలడం లేదు.

    రిప్లయితొలగించండి