14, నవంబర్ 2021, ఆదివారం

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పద్యం | ‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక |ఘంటసాల ప్రైవేట్‌ పద్యాలు |

పద్యమాధురి

‘ఉదయశ్రీ’ కావ్య ఖండిక లోని (ప్రైవేట్‌ రికార్డ్‌) అంజలి ,  రచన: కరుణశ్రీ, సంగీతం, గానం: ఘంటసాల

అంజలి ఘటిస్తూ....!

గృహ సంసారాన్ని యీదడానికే మనిషి నానా అవస్థలూ పడుతూ ఉంటాడు. అలాంటిది అనంతమైన విశ్వసంసారాన్ని యీదే ఆ దేవదేవుడి పరిస్థితి ఏమిటి? నిరంతరం,  గతాన్నీ, వర్తమానాన్నీ, భవిష్యత్తునూ క్రోడీకరించుకుంటూ,  విశ్వచక్రాన్ని అరమరికలు లేకుండా ముందుకు నడిపించుకుంటూ వెళ్లడానికి ఆ పరమేశ్వరుడు నిత్యం,  ఎంత  శక్తి ధారపోయాలి? అప్పటికే పుట్టీ, పెరిగి  మనుగడ సాగిస్తున్న వారికే కాదు, పుట్టబోయే వారి కోసం కూడా అవసరమైన అన్ని  ఏర్పాట్లు చేయాల్సి రావడం ఆయనకు అదెంత భారం? అది సరే గానీ, అహోరాత్రులూ విశ్వవీణను మోసీ మోసీ అలసి సొలసిన ఆ దేవదేవుడు కాసేపైనా సేద దీరేందుకు  కాస్తంత వెసులుబాటు అవసరమా కాదా?  సమస్త ప్రాణికోటిలో కెల్లా సమున్నతుడిగా చెప్పుకునే మనిషిపైన ఆ బాధ్యత ఉందా ... లేదా? ఆకాశమంత పందిరి వేసి ఆతిధ్యం ఇవ్వాల్సిన ధర్మం మనిషిదే కదా! నిజానికి, మనమేదో ఆతిధ్యం ఇస్తే  తప్ప అతని మనసు కుదుటపడదనేమీ లేదు. అయినా, ఆయన పట్ల  మనకున్న కృతజ్ఞతా భావాన్ని మనం ఏదో ఒక రకంగా వ్యక్తం చేయకపోతే, మనల్ని మనం మనుషులం అనుకోలేం మరి! 

తన ఉదయశ్రీ కావ్యం లోని ‘అంజలి’ అనే పద్య ఖండిక ద్వారా ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ మాటే చెబుతున్నాడు. భక్తిపారవశ్యంలో ఊయలలూపే ఇందులోని పద్యాల్ని ఘంటసాల తనే స్వరపరిచి, ఎంతో మనోహరంగా గానం చేశారు. ఎప్పుడో  కొన్ని దశాబ్దాల క్రితం ప్రైవేటు రికార్డుగా విడుదలైన ఈ పద్యరాగమాలిక  సాహితీ ప్రియుల గుండెల పైన  ఇప్పటికీ ‘లాహిరి ... లాహిరి.. లాహిరిలో....’ అంటూ తేలాడుతూనే ఉంది.  ఎన్నిసార్లు  విన్నా ఎంతకూ తనివి తీరని ఈ స్వరరాగ జలపాతాల్లో మనం మరోసారి తడిసి ముద్దైపోదామా? 

వచనం: 

ఎవరిదీ కాళ్ల చప్పుడు? ఎవరో కాదు, నా ప్రభువే.  ప్రభూ! నీవు కరుణామయుడవు. నీ సృష్టి కరుణామయం. నా ఇంటికి నడచి వచ్చావా ప్రభూ! ఈ నాడు నా భవ్య జీవితానికి ఒక మధుర ప్రసాదం. నా హృదయానికి ఒక ఉదయశ్రీ. 

పద్యం:

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై

       పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి, 

కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో

       లతలకు మారాకు లతికి యతికి 

పూల కంచాలలో రోలంబములకు రే 

       పటి భోజనము సిద్ధపరిచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

       వింత వింతల రంగు వేసి వేసి 


తీరికే లేని విశ్వ సంసారమందు 

అలసిపోయితివేమొ దేవాదిదేవ! 

ఒక నిమేషము కన్ను మూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు. 

నిలువెత్తు పెరిగాక, కొన్ని నిజానిజాలేవో  తెలిసిపోయాక మనిషి ఎన్నెన్నో పరిణామాలకు లోనవుతాడు.  ఆ విషయం అలా ఉంచితే, భూమ్మీద వాలకుండా, ఇంకా తల్లి కడుపులోనే కదలాడుతున్న ఆ పసికందుల మాటేవిటి?  ఆ పరమాత్మల ఆగమనాన్ని దృష్టిలో ఉంచుకుని దేవదేవుడు ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి? జన్మనిచ్చే ఆ తల్లి ఎదలో అమృతమయమైన పాల కోనేర్లు నెలకొల్పడానికి ఆయన పడే పాట్లు ఎన్నెన్ని? మండుటెండల్లో తిరిగినా, దోసిళ్లలో వెన్నెల చల్లదనాన్నే ఒడిసిపట్టుకుని, కొమ్మ కొమ్మకూ,  తీగెతీగెకూ ఎన్నెన్ని ఆకులో అతికి అతికి ఆయన ఎంతెంతగా అలసిపోయి ఉంటాడు? ఆక లితో అలమటిస్తూ,  దిక్కు తోచక తిరుగాడే తుమ్మెదల కోసం,  పూల గిన్నెలలో తేనె  ధారల్ని నింపడం కోసం,  ఎంతగా రెక్కల్ని ముక్కలు చేసుకుని ఉంటాడు? రోజురోజంతా  ప్రాణికోటి హృదయాలు వర్ణ రంజితం కావడానికి, తెల్లవారకముందే మొగ్గమొగ్గకూ రసరమ్యమైన రంగులు వేస్తూ, వేస్తూ  ఆతని ఎంత రక్తం ఆవిరౌతూ ఉంటుంది? ఆయన నిత్యకృత్యాల్లో మచ్చుకు ఇవి నాలుగు మాత్రమే!

దేవదేవుడు అనగానే పూజలందుకోవడమో, రథమెక్కి ఊరేగడమో తప్ప ఆయనకింక  వేరే పనులు ఏముంటాయి? అనుకునే వాళ్లే లోకంలో ఎక్కువ. నిజానికి ముక్కోటి రూపాల్లో అనునిత్యం ఆయన చేసే కార్యకలాపాలు అనంత కోటి!. అయితే, ఆయనకు అంజటి ఘటించడానికి, ఆ పరమాత్మకు మనం ఎన్ని నీరాజనాలు పడితే మాత్రం అవి ఆయన ముందు ఏపాటి? ఆయనకు మనం ఇచ్చే ఆతిఽథ్యం మాత్రం ఏపాటి? అయినా, అన్నీ తానే అయిన ఆ అనంత మూర్తికి మనమేమి సేవలందించగలం? ఆయన సేదతీరడానికి మనమేం చేయగలం? అనిపించవచ్చు. అదీ నిజమే కానీ ... మన మనసులో సిద్ధమైన కృతజ్ఞతా పూలమాలను మన చేతులతో  మనం ఆయన మెడలో వేయాలి కదా! అమ్మానాన్నలు కట్టించిన ఇల్లే కావచ్చు. అయితే మాత్రం! అహోరాత్రులూ పనిచేసే అలవాటుతో వారు అలసిపోయినప్పుడు,  అమ్మా...! కాస్త నడుము వాల్చు!,    నాన్నా ...! కాస్త సేదదీరు! అనే మాటలు మన నోటి నుంచి రావాలి కదా! ఈ పద్యాలు గొంతెత్తి ఆ మాటలే చెబుతున్నాయి! అవి రాగబద్ధమై ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా తెలుగు నేలంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి!!

                                                              - బమ్మెర 

5 కామెంట్‌లు:

  1. Excellent. Restless person in the universe is "devaadi devudu". Beyond that no comment on song also.

    రిప్లయితొలగించండి
  2. చాలా చక్కగా వివరించారు దేవుడి కష్టం మనుషులకు వస్తే అమ్మో! మన వశమా

    రిప్లయితొలగించండి
  3. ఘంటసాల, కరుణశ్రీ ఇద్దరూ ఇద్దరే, ఈ ఆలాపన తక్కువగా విన్నాము. ఎంత మధురంగా ఉంది వినడానికి, ఇంక మీ వివరణకు సాటి ఏది? ఎన్నో సమీక్ష లు చదువుతుంటాను కానీ మీలా సాహిత్యాన్ని, సంగీతాన్ని, గానాన్ని, వేదాంతా ధోరణిలో సమీక్షించడంలో మీకు మీరే సాటి. మీకు ఎవరూ లేరు పోటీ. అందుకే మీరు ఘనాపాటి. ఇంత మంచి వీనుల విందైనా పద్యం అందించినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు🙏వీనుల విందైన సంగీతాన్ని, పాటల్లోనూ, మీ విశ్లేషణ ల్లోనూ మనోరంజకమైన సాహిత్యాన్ని నిస్వార్థంగా అందిస్తున్నందులకు.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇవి నాకు మత్తు మందు లా ఉపయోగపడుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  5. కొండంత దేవునికి కొండంత పత్రి తేగలమా అన్నట్లుగానే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి కవిత్వానికి గాని ఘంటసాల గారి గానానికిగాని సరిపోయే వ్యాఖ్య వ్రాయడం సామాన్యుల వల్ల కాదు గదా.

    రిప్లయితొలగించండి