11, డిసెంబర్ 2021, శనివారం

వినిపించని రాగాలే పాట | చదువుకున్న అమ్మాయిలు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

పంచేంద్రియాలకు తెలిసిందే ప్రపంచమైపోయింది మానవాళికి. కానీ, ఇంద్రియాలు ఎంత పరిమితమైనవో, వాటి పరిధి ఎంత చిన్నదో ఒకసారి తెలిస్తే ఆశ్చర్యపోతాం! కంటికి కనిపించేంత దూరమే ఈ నేల ఉంది అనుకోవడం ఎంత అమాయకత్వమో, ఇంద్రియాలకు తెలిసిందే సమస్తం అనుకోవడం కూడా అంతే అమాయకత్వం! మన అమాయకత్వం గురించి మనకు ఒకసారి తెలిసిపోతే ఎల్లలు ఎరుగని విషయాలు లోకంలో ఎన్నో  ఉన్నాయని బోధపడుతుంది. అప్పుడింక,  అప్పటిదాకా వినిపించని రాగాలెన్నో కొత్తగా వినిపించడం మొదలవుతుంది. అప్పటిదాకా కనిపించని అందాలెన్నో కనిపించడం మొదలవుతుంది. 
1963లో విడుదలైన ‘ చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ పాట ఇంద్రియాలకు అతీతమైన ఆ వినూత్న ప్రపంచం గురించి ప్రస్తావిస్తుంది. ఈ పాటను  స్వరపరిచిన రాజేశ్వరరావు హృదయం రాగాలు విరితేనెల వెన్నెల ఎలా కురిపిస్తాయో అక్షరాలా ఆవిష్కరిస్తుంది. అంత మధురమైన బాణీని తేనెల సోనను తలపించేలా సుశీల గానం చేసింది. త్రివేణి సంగమంలా అవతరించే ఇలాంటి అరుదైన పాటల్ని వినగలగడం నిస్సందేహంగా రసజ్ఞుల అదృష్టం!

వినిపించని రాగాలే.....!


వినిపించని రాగాలే - కనిపించని అందాలే 
అలలై మదినే కలచే - కలలో ఎవరో పిలిచే // వినిపించని //
‘తెలిసింది గోరంత ... తెలియనిది కొండంత’ అన్నట్లు, లోకంలో వినిపించే రాగాలు కొన్నే అయితే...,  వినిపించని రాగాలు లెక్కలేనన్ని! ఎంతసేపూ మనం,  కర్ణపుటాలను తాకిన వాటినే విని తాదాద్మ్యం చెందుతూ ఉంటాం. అవైనా కొన్నే! అయితే, హృదయ పుటాలను తాకే రాగాలు కోకొల్లలు.  మనసు పెడితే అవన్నీ వినవచ్చు. కానీ ఎంత మందికి అంత సమయం ఉంది? చాలా అరుదుగా కొందరు ఆ పనిచేస్తారు. హృదయ పుటాలపైన కదలాడే వాటిని  వారు హృదయంతోనే వింటారు! అందాల విషయానికి వస్తే...,  బాహ్యనేత్రం చూడగలిగే  సౌందర్యాలే సమస్తం కాదు కదా! అయినా అవి మాత్రం ఎన్ని? బహు స్వల్పం. అంతర్నేత్రంతో చూడగలగాలే గానీ, అవి అనంతం!  అత్యంత నవీనమైన రాగాలూ, అప్పటిదాకా కనీవినీ ఎరుగుని అందాలూ, మన రసాత్మను తాకినప్పుడు లోలోంచి ఏవో అలల్లాంటి ప్రకంపనలేవో పుట్టుకొస్తాయి. అలజడి రేపుతాయి. కమ్మకమ్మగా గుండెను కలచివేస్తాయి. మనో ఆకాశంలో  కలల మేఘాలు కమ్ముకుంటాయి. ఒక్కోసారి ఆ కలల్లో  ఎవరో పిలిచిన అలికిడి వినబడుతుంది. ఎవరా పిలిచినది? అంటే ఏ  రాకుమారుడో ఏమో మరి ! 

తొలిచూపులు నాలోనే - వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే - చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు // వినిపించని  //
గుండె నిండా కాంతిపుంజాలు నింపుకన్న ఆ రాకుమారుడి తొలి చూపులు,  దీపాలు వెలిగించక ఏం చేస్తాయి?  ఆ దీపాలు కళ్లముందే కాదు,  ఎదలోనూ వెలుగులు నింపుతాయి. ఆ అంతరంగ కాంతిలో  మోడువారిన కోరికలు కూడా చిగురించడం మొదలెడతాయి. అలా ఎదనిండా ప్రేమభావాలు మోసులెత్తిన తర్వాత ఏమవుతుంది? మేఘావృతమైన ఆకాశం వర్షించడానికి సిద్ధమైనట్లు, ప్రేమావృతమైన హృదయం వలపుల వర్షం కురిపిస్తుంది. వర్షాలు లేకపోతే నేల ఎడారిగా మారిపోయినట్లు,  వలపులే కురవకపోతే, మానవలోకం పొడిబారిపోతుంది. హృదయాల గొంతు తడారిపోతుంది. నిజానకి  యుగయుగాలుగా ఈ జీవచైతన్యయాత్ర ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది! అయినా తొలి చూపులు ... తొలి ప్రేమ అంటూ ఉంటాం, అవునూ...,  తొలిచూపులోనే ప్రేమ పుట్టడం సాధ్యమయ్యే పనేనా? అందులో ఉన్న నిజం ఏపాటి? మనకు తెలిసి అవి తొలిచూపులే కావచ్చు కానీ, మనకు తెలియకుండా అవి ఒక సుదీర్ఘకాలంగా సాగుతూ ఉండి ఉండాలి!  వాటి ఉనికి అంత  సుదీర్ఘమైనదే కాకపోతే,  అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న వారితో ఏకంగా జీవితబంధానికి సిద్ధమైపోవడం ఎలా సాధ్యం? ఇదీ అని చెప్పలేకపోవచ్చు. కానీ, ఆ చూపుల ఆగమనం మనం అంచనా వేయలేనంత  సుదీర్ఘమైదే!

వలపే వసంతములా - పులకించి పూచినదీ
చెలరేగిన తెమ్మెరలే - గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు // వినిపించని //
వలపు అంటే అదేదో ఒక పూవు పూచినట్లు, ఒక  కోయిల కూసినట్లు, ఒక కొమ్మ చిగురించినట్లు, అలా ఏదో ఒకదానితో ముడివడిన విషయమేమీ కాదు! అది మొత్తం వసంతాన్నే పొదువుకున్న వైనం! నిజానికి, ఒక హృదయం కోటి నందనాలకు సమానం! గమనించాలే గానీ, ఎద లోలోపల  కోటానుకోట్ల పూల రాసుల కోలాహలం వినిపిస్తుంది. వందలాది సెలయేర్లు ముప్పిరిగొని ఎదమీదుగా  పారుతున్నట్లుగా హొరు  వినిపిస్తుంది.  అసలు ఈ పులకింతలు ఎప్పుడొస్తాయి? పట్టరాని పారవశ్యంతో  గుండె ఉబ్బితబ్బిబ్బయినప్పుడే  కదా! ఈ స్థితిలో చల్లచల్లగా సాగే తెమ్మెరలు కూడా అగ్ని సరస్సుల్లా చెలరేగిపోతాయి. గిలిగింతలూ, .పులకింతలూ  కలగాపులగం అవుతాయి. వయసూ వయసూ అంటాం గానీ, తొలి శ్వాస నుంచీ తుది శ్వాసదాకా సాగే  మొత్తం జీవితాన్నంతా పరిగణనలోకి తీసుకోలేం!  దీపం వెలిగిన కాలమే దీపంతె జీవితమన్నట్లు,  ఏరు దాటించే కాలమే పడవ ఆయువన్నట్లు, హృదయం స్పందిచే కాలమే దాని వికాస కాలం! తనువూ, మనసు  అన్ని రకాలుగా విరబూసే కాలమే అసలు సిసలైన వయసు కాలం!

వికసించెను నా వయసే - మురిపించు ఈ సొగసే 
విరితేనెల వెన్నెలలో - కొరతేదో కనిపించే 
ఎదలో ఎవరో మెరిసే // వినిపించని //
ఎంతో బలమైనదే అయినా ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా! యువరాజు ఎంత పరాక్రమ శాలి అయినా యువరాణి లేకపోతే అది కొరతే కదా! యువరాణి పనీ అంతే మరి!! ఆమె ఎంత గొప్ప సౌందర్యరాశి అయితే మాత్రం ఏమిటి? యువరాజు లేకపోతే ఆమె ప్రేమ అంతా అడవి కాచిన వెన్నెలేగా! అందుకే మిగతా ఎన్ని ఉన్నా, ఎవరి తోడు వారికి దొరకకపోతే, అదో పెద్ద లోటుగానే ఉంటుంది! తనువూ మనసుల మధ్య ఆ వలపేదో తారట్లాడుతూ ఉంటేనే పరువం వికసిస్తుంది. సొగసులు మురిపిస్తాయి. ఎదలో విరితేనేలే కురుస్తాయి.!! అప్పుటిదాకా తన హృదయపు అంతరాంతరాల్లో ఒదిగి ఒదిగి ఉండిపోయిన  ఆ యువకిశోరుడెవరో అదును చూసుకుని  మెరుపులా వస్తాడు. చేతిలో చేయి వేసి ఎదలోకి  పిలుస్తాడు. నిండు నూరేళ్ల జీవితంలోకి కొండంత మనసుతో  ఆహ్వానిస్తాడు!! అప్పుడింక వినిపించని లక్షలాది రాగాలు వినిపిస్తాయి. అప్పటిదకా చూడని కోటానుకోట్ల సౌందర్యాలు దర్శనమీస్తాయి!!

                                                              - బమ్మెర 

3 కామెంట్‌లు: