19, నవంబర్ 2021, శుక్రవారం

ఎవరికి వారౌ స్వార్థంలో పాట | గుడిగంటలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

 పాటలో ఏముంది?


ఎవరికి వారౌ స్వార్థంలో......!

స్వార్థం మనుషుల్ని విడదీస్తుంది. త్యాగమొక్కటే మనుషుల్ని కలుపుతుంది. అందుకే లోకం త్యాగమూర్తులకు పెద్ద పీట వేస్తుంది.  నిజానికి, ఆ త్యాగభావనే లేకపోతే, మనిషికి మిగిలేది ఏమీ ఉండదు.  ఒక్కొక్కరుగా ఆత్మీయులంతా దూరమై, ఏదో ఒక దశలో మనిషి జీవితం  ఎడారిగా  మారిపోతుంది. ఈ నిజం తెలిసినా తెలియకపోయినా, నీరు పల్లం వైపు పరుగెత్తినట్లు చాలా మంది మనసు స్వార్థం వైపే వెళుతుంది. ఆ స్వార్థంలో, ఎడతెగని ఆరాటాలూ, పోరాటాలూ, మనిషిని నిత్యం వేధిస్తాయి. అయితే, ఒక్కోసారి,  ఎన్నెన్నో ఎదురీతల తర్వాత కూడా  తీరం చేరలేకపోయినట్లు, ఎన్నో పోరాటాల తర్వాత చేరువైన బాంధవ్యాలు కూడా ఎప్పటికీ తనతో ఉండలేకపోవచ్చు. ఒకవేళ అన్నీ అనుకూలించి, ఆ సాంగత్యం కడదాకా ఉంటే మాత్రం జీవితమింక నూరేళ్ల  పండగే! 1964లో విడుదలైన ‘గుడిగంటలు’ సినిమా కోసం శ్రీశ్రీ రాసిన ఈ పాటను స్వీయ సంగీత సారధ్యంలో ఘంటసాల భావస్పోరకంగా,  ఎంతో ఆర్థ్రతతో గానం చేశారు. 



ఎవరికి వారౌ స్వార్థంలో - హృదయాలరుదౌ లోకంలో 
నాకై వచ్చిన నెచ్చెలివే - అమృతం తెచ్చిన జాబిలివే 
నాకమృతం తెచ్చిన జాబిలివే // ఎవరికి //

ఒకరి కోసం ఒకరన్న ఏకీ భావన లోకంలో రోజురోజుకూ కొడిగట్టుకుపోవడం మనమంతా గమనిస్తున్నదే! ఫలితంగా,  భూమ్మీద నాలుగింట మూడువంతులు నీరే ఉన్నట్లు, జీవితాల్లోనూ నాలుగింట మూడు వంతులు కన్నీరే ఉంటోంది. ఇందుకు కారణం ఎక్కువ మంది ఎవరికి వారుగా విడి పోవడమే! అదేమిటో గానీ,  విడిపోవడంలోనే ఎక్కువ సుఖం ఉందని అత్యధికులు భావిస్తున్నారు.. కానీ,  సుఖం మాట అటుంచి, ఆ ఎడబాటు, అనుకున్నదానికి పూర్తిగా విరుద్ధంగా,  హృదయాల్ని కన్నీటి మయం చేస్తోంది. ఏదో అనుకుంటారు గానీ, బ్రతుక్కి ఒక వైభవాన్నీ, జీవితానికో సౌందర్యాన్నీ ఇచ్చే శక్తి స్వార్థానికి లేనే లేదు. ఏ మనిషికైనా  అవన్నీ త్యాగం వల్లే సిద్ధిస్తాయి. అందుకే లోకమెప్పుడూ  త్యాగమూర్తులనే కీర్తిస్తుంది. ఆ నిజం తెలియకుండా,  స్వార్థబుద్దితో వ్యవహరిస్తూ, సర్వశక్తులూ వెచ్చించి ఎంత సంపద కూడబెట్టుకున్నా,  ఒకదశలో అది ఎందుకూ పనికి రాదని స్పష్టంగా తేలిపోతుంది. అలాంటి స్థితిలో నీ కోసం నిలబడే మనిషే ఉండడు.  నిన్ను పలకరించే దిక్కే ఉండదు.  అప్పటిదాకా అందరినీ దూరం పెట్టగలిగినట్లు, నువ్వేదో అనుకుంటావు గానీ, అందులో నిజం లేదని , అవతలి వాళ్లే నిన్ను దూరం పెట్టారన్న అసలు నిజం,  కాస్త ఆలస్యంగానైనా నీకు బోధపడుతుంది. ఒకవేళ పెద్ద మనసుతో నిన్ను మన్నించి, నీలోని సమస్త లోపాలు తెలిసితెలిసే ఒక నెచ్చెలి,  నీ వద్దకు వచ్చి,  నిన్ను తన ఒడిలోకి తీసుకుందే అనుకుందాం! అప్పుడు ఎలా ఉంటుంది.? గుండెలో పూల వర్షం కురిసినట్టే ఇంక! అయితే  వస్తూ వస్తూ, ఆమె ఇంకేదో తీసుకురావాలనుకుంటే మాత్రం, నిజంగా అదో పెద్ద దురాశ! ఎందుకంటే, ఆమె రావడం అంటే ఒక మహా అమృతభాండం నీ ముందు నిలవడమే!    

ధనము కోరి మనసిచ్చే ధరణి - మనిషిని  కోరి వచ్చావే... 
నా అనువారే లేరని నేను,  కన్నీరొలికే కాలంలో ...
ఉన్నారని నా కన్నతల్లివలె  ఒడిన చేర్చి నన్నోదార్చావే // నాకై వచ్చిన //
ఇతర విలువల గురించి ఏం తెలిసినా,  తెలియకపోయినా,  నేటి మనిషికి ధనం విలువ మాత్రం బాగా తెలిసొచ్చింది. మిగతా ఏమున్నా లేకపోయినా, చేతి నిండా డబ్బు ఉంటే చాలు జీవితం హాయిగా గడిచిపోతుందనే భావన మనసులో బాగా స్థిరపడిపోయింది. కొంత మంది తెలివిగా అర్థాలు మార్చేస్తారు గానీ,  ఆస్తులూ, ఐశ్వర్యాలూ లేకపోవడం వల్ల వచ్చేది దారిద్య్రం కాదు. నా అన్నవారెవరూ లేకపోవడం వల్ల ఏర్పడే శూన్యమే అసలు సిసలైన దారిద్య్రం. ఆ దారిద్య్రంలో ఆత్మీయులకు కూడా దూరమై, కనీసం పలకరించే మనిషి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా సరిగ్గా  అదే సమయంలో నిన్ను ఓదార్చడానికి, తల్లిలానో, చెల్లిలానో లేదా నెచ్చెలిలానో ఎవరైనా నీ  చెంత చేరితే ఎలా ఉంటుంది? ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్లు, మృత్యుముఖంలో ఉన్నవారికి ప్రాణాలు నిలబెట్టే సంజీవిని దొరికినట్లు అనిపిస్తుంది. అయితే, అందరికీ ఆ దశలో అంత పెద్ద మనసున్న వారు ఎదురుపడే అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకే ఏమాత్రం జాప్యం చేయకుండా, అన్నీ బావున్నప్పుడే మనిషిగా మసలే విద్య నేర్చుకోవాలి. ఏ కారణంగానో ఒడిలో ధనకనకాలు నింపుకున్నా, తలపైన మాత్రం ప్రేమ-దనాగారాన్ని పొదివి పట్టుకోవాలి! ఎవరైనా, జీవితం ఆనందమయం కావాలని  ఆశపడితే సరిపోదు.  అందుకు ఈ అడుగులన్నీ వేయాలి మరి!

ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను - గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ  మ్రోగాయి - నా కంటిపాప నువ్వన్నాయి // నాకై వచ్చిన //
చెట్లను నరికేసి, పండ్లకోసం వెతికినట్టు, అయిన వాళ్లందరినీ దూరం చేసుకుని, ప్రేమకోసం వెతికితే ప్రయోజనం ఏముంటుంది? నిష్ప్రయోజకమైన ఈ రకం పనుల్లో ఎంతో కాలం గడిచిపోయాక,  తప్పిదాలకు ఎంత   పచ్చాత్తాపం చెందితే మాత్రం ఒరిగేదేముంది? నిన్ను ప్రేమించే వారికోసం, ఎంత పలవరించీ, ఎంత కలవరిస్తే  మాత్రం సాధించేదేముంటుంది?  కాకపోతే,  మనుషులెవరూ అసలే నమ్మని ఆ స్థితిలో, నమ్మ బలుకుతూ, స్వార్థ జీవులే కొందరు నీకు ఎదురుపడతారు. ఎంత ప్రేమనో ఒలకపోస్తారు. కాకపోతే, ఆ అవగాహనేదో ముందే ఉంటే, వారి స్వార్థాన్ని వెంటనే గుర్తించి, దూరం పెట్టవచ్చు లేదా తనే దూరం జరగవచ్చు. ఏమైనా ఇక్కడ ఎంతో కొంత అలజడి, ఆందోళనా ఉంటాయి.  ఒకదశలో కొందరు ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంటారు. చివరికి దిక్కుతోచక ఇంక దేవుడే దిక్కనుకునే స్థితి వచ్చేస్తారు.  అప్పుడింక అదేపనిగా  మఠాలూ,  గుళ్లూ, తిరుగుతూ, సాధువులకో లేదంటే దేవుళ్లకో గోడు చెప్పుకోవడం మొదలెడతారు. అయితే, ఇదంతా దూరం నుంచి గమనిస్తూ, మెల్లమెల్లగా ఎవరో నీ దగ్గరగా వచ్చి,  నీ నీడగా, నీకు తోడుగా,, అన్నివిధాలా నీకు అండదండగా నిలబడితే, ఇక అంతకన్నా ఏంకావాలి? ఎన్నో ఏళ్ల నీ నిరీక్షణ ఫలించి,  నీ జీవితేచ్ఛ నెరవేరుతుంది. నీ జీవనయానం కొత్తకొత్తగా  మళ్లీ ఆరంభమవుతుంది. 

ఈ అనురాగం ఈ ఆనందం - ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఊడలు బాకీ - నీడలు పరచి ఉండాలీ వెయ్యేళ్లు - చల్లగ ఉండాలీ వెయ్యేళ్లు 
తియ్యగ పండాలీ మన కలలు..... // ఎవరికి //

లోకంలో మామూలుగా అయితే,  ద్వేషానికి ద్వేషమే ఎదురవుతుంది.. ప్రేమకు ప్రేమే దొరుకుతుంది. అయితే వీటికి అతీతంగా, గతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అంత ఉదాత్తంగా వ్యవహరించేదెవరు? ఎన్నో రకాలుగా దెబ్బతిని  జీవితపు అట్టడుగున పడి ఉన్నవారికి చేయూత అందించేవారెవరు? ఆకాశమంత ప్రేమతో నిన్ను  అక్కున చేర్చుకునేదెవరు?  ఒకవేళ అనూహ్యంగా అదే జరిగితే, అంతకన్నానా? ఆ ఆనందం నిజంగా ఎల్లలు లేనిది. ఎవరి జీవితంలోనైనా, అలాంటి బంధమేదైనా ఏర్పడితే, వారి పాలిటి అదో వరప్రసాదమే! ఎవరికైనా అలాంటి తీయని అనుభవమేదో ఎదురై, ఒక నిండు అనుబంధంతో పెనవేసుకుపోయిన నాడు, ఆ బంధం చిరకాలం ఉండాలనుకుంటారు.  వందేళ్లు కాదు ..... ఆ ప్రేమయానం వెయ్యేళ్లు కొనసాగాలని కోరుకుంటారు! వాళ్ల ఆశలు అక్షరాలా నిజం కావాలని మనమూ ఆశిద్దాం మనసారా!!

                                                              - బమ్మెర 

2 కామెంట్‌లు:

  1. శ్రీ శ్రీ ఎంత గొప్పగా రాశారో, ఘంటసాల గారు అంతే గొప్పగా పాడారు. ఇంక బమ్మెర గారి విశ్లేషణ గురించి చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు. కన్నీరు తెప్పించిన aardhratha అది. మానవ సంబంధాల గురించి ఆయన విశ్లేషణ ఎంత హృద్యంగా ఉంటుందో. ధన్యవాదములు సర్

    రిప్లయితొలగించండి