18, డిసెంబర్ 2021, శనివారం

నిదురించే తోటలోకి పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?


కమ్మటి కల ఏదో కంటావు. జీవితం ఆ కలలాగే సాగిపోవాలనుకుంటావు! అయితే, నీ జీవితం పూర్తిగా నీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ కల సగమైనా నెరవేరుతుంది. అలా కాకుండా జీవితం మరొకరి చేతుల్లోకి వెళితే మాత్రం, కథే మారిపోతుంది. అప్పుడింక నువ్వు నువ్వుగా ఉండవు. నువ్వు నీకోసం కాకుండా, మరెవ్వరి కోసమో పడి ఉంటావు. అప్పటిదాకా నీ అంతరంగానికి తెలిసిన నువ్వే నువ్వు! నీ జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత,  నువ్వేమిటన్నది ఎదుటి వాళ్లు నిర్ణయిస్తారు, వాళ్లకు ఏదనిపిస్తే అదే నువ్వవుతావు? వాళ్లకున్న ఆ స్వేచ్ఛతో అప్పటి దాకా నిన్ను దేవతవని కీర్తించిన నోటితోనే భూతం అనేయగలరు! ద్వేషం పెంచుకుని నీ పైన ఎంత బురదైనా చల్లగలరు! ఒకటి మాత్రం నిజం....., జీవితానికి సంబంధించిన అందమైన పార్శ్వన్ని మాత్రమే చూస్తూ ఉండిపోతే, ఒక్కోసారి మరో పార్శ్వం నుంచి  ఎదురయ్యే పాశవిక చర్యల పర్యవసానాల్ని తట్టుకోవడం కష్టమవుతుంది. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలోని ఈ పాట ఆ నిజాన్నే చెబుతోంది. కె.వి. మహాదేవన్‌ సంగీత సారధ్యంలో సుశీల గొంతు నిండా ఆవేదన  నింపుకుని ఆలపించిన బాణీ ఇది! ఈ పాట మరో ప్రత్యేకత ఏమిటంటే, అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ,  ఏనాడూ సినిమా పాటలు రాయని  విప్లవ కవి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైన వియోగ గీతమిది! నిలువెల్లా గాయాలే అయినా, అన్యాయాన్ని నిలదీయాల్సిందేనని చెప్పే ఆ కవిగళం ఎంతో మందికి నిలువెత్తు స్పూర్తి!!. 

నిదురించే తోటలోకి....!


నిదురించే తోటలోకి - పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి - కమ్మ్డ్డ్డటి కల ఇచ్చింది

ప్రశాంతంగా ఉంటేనే అని కాదు, తనువు అలసిపోయినా, మనసు అలసి పోయినా, నిదురపడుతుంది. ఆ నిదురలో నిన్ను నువ్వు  మరిచిపోనూ వచ్చు., లేదా ఏవో కలలు వచ్చి నీ గతాన్నంతా తిరగదోడనూ వచ్చు. ఆ గతంలో అందమైన కథలూ ఉన్నట్లే,  విషాద గాధలూ ఉంటాయి. ఆ కలలో ఒక్కోసారి,  తేనెలు కురిపించే పాటలూ వినిపిస్తాయి. పాటలాంటి మనసులూ కనిపిస్తాయి. ఒకవేళ ఎదుటివారి గుండెనిండా దుఃఖమే ఉంటే ఓ మనసు  ఆ కన్నీరు తుడవనూ వచ్చు. మరో కమ్మటి కలకు జీవం పోయనూవచ్చు. నిజానికి, ఆశే లేని వారికి నిరాశలూ త క్కువే!,  కలలే కనని వారికి కన్నీళ్లూ తక్కువే! అయితే మాత్రం, ఎక్కడ కన్నీటి పాలవుతామేమోనని ఎవరైనా కలలు కనకుండా ఉంటారా? అదీకాక, కలలనేవి మన అనుమతి తీసుకునేమీ  రావుకదా! ప్రత్యేకమైన హక్కులూ అధికారాలేమీ లేకపోయినా, మన అనుమతి లేకుండానే మనసులోకి చొరపడే స్వేచ్ఛ, చొరవా కలలకు పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే అవి మన మనసుతో ఎలాగైనా ఆటాడుకుంటాయి. 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది // నిదురించే //

ఏ కారణంగానో బోసిపోయిన ఒక ఇంట, ఎవరో వచ్చి, హరివిల్లులను తలపించే రంగవల్లులు అల్లితే ఎంత బావుంటుంది? దీనంగా పడి ఉన్న లోగిలిలో దీపాలు వెలిగిస్తే ఎంత బావుంటుంది? అయినా, రోజురోజంతా  సమూహంలో, సందడిలో తిరిగే వాళ్లుకు ఆ బోసితనం, ఆ దైన్యం ఏంతెలుస్తుంది? జీవితమే తలకిందులైన తాలూకు ఆ దైన్యం, కొందరిని  వారి చుట్టూ ఎందరున్నా ఏకాకిగానే నిలబెడుతుంది. ఆ నిలువెత్తు ఏకాకితనంలో హృదయవేణువు శూన్యమే అవుతుంది. కాకపోతే, కాలం కలిసొచ్చి,  ఒంటరి బాటసారికి మరో బాటసారి తోడైనట్లు, మౌనంగా పడి ఉన్న ఆ హృదయవేణువులోకి ఒక మమతల ఝరి ప్రవేశిస్తే మాత్రం, రసరమ్యంగా ఉంటుంది. ఆకు రాలే కాలంలో హఠాత్తుగా వసంతం వచ్చి పడినట్లు, ఆ జీవితాల్లో అద్భుతమేదో జరగాలి! అలా ఏదో జరగకపోతే, గుండెనిండా పరుచుకున్న ఆ బరువైన వ్యధలూ , బాధల్ని ఎన్నోరోజులు మోయలేం! నిజానికి, ఈ ఆత్మవే దనలూ, ఆత్మక్షోభలూ గుండె గోడల మధ్య సాగే యుద్ధాలే మరి! ‘యుద్దంలో గెలిచిన వాడి కన్నా, యుద్ధం జరగకుండా ఆపినవాడే నిజమైన విజేత’ అంటూ ఉంటారు. కానీ,  దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపడం కన్నా, మానవ హృదయాల మధ్య  సాగే యుద్ధాలను ఆపడమే ఎక్కువ కష్టం! ఎందుకంటే,  దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు బయటికి కనిపిస్తాయి.  కానీ,  మానవ అంతరంగ యుద్దాలు బయటికి కనిపించవు. ఇదే పెద్ద సమస్య! అందుకే వాటిని ఆపడం అంత కష్టం! ఒకవేళ ఎవరైనా ఆపగలిగితే, అంతకన్నా హర్షదాయక విషయం మరేముంటుంది? 

విఫలమైన నా కోర్కెలు -  వ్రేలాడే గుమ్మంలో 
ఆశల అడుగులు విననబడి - అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న, నావను ఆపండీ ....
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి.... నావకు చెప్పండి ...!!

ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన అవి కురుస్తాయన్న గ్యారెంటీ లేదుగా! కమ్ముకున్నంతసేపట్లోనే అవి కనుమరుగైపోవచ్చు కూడా! ఆత్మీయులైనా అంతే..., ఇంటి ముందు ఎదురుపడ్డంత మాత్రాన వారు ఇంట్లోకి వస్తారనేమీ లేదుగా! మనం, ఆహ్వానించినా మాట వినకుండా, చూస్తుండగానే మలుపు తిరిగి మరోదారి పట్టవచ్చు. అప్పటిదాకా ఈ వెలుగులో ఈ జీవనయానం నిశ్చింతగా కొనసాగిపోతుందిలే అని,  ఎంతో ధీమాగా ఉన్న సమయంలో ఒక్కోసారి హఠాత్తుగా చిమ్మచీకట్లు కమ్ముకోవచ్చు. అప్పటిదాకా మమతల ఝరీనాదమేదో వినిపించినట్లే వినిపించి, హఠాత్గుగా కర్ణపేయంగా భీకర ధ్వనులేవో మారుమ్రోగవచ్చు. అయితే  ఊహించని గాయాలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న ఇలాంటి సమయంలో ఒక్కోసారి ఓ అమృతమూర్తి వచ్చి ఊపిరిపోస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే, అంతలోనే ఆ రూపం మాయమైపోనూవచ్చు. ఎంత గుండె నిబ్బరం ఉంటే మాత్రం, అన్నీ అనుకున్న దానికి విరుద్ధంగానే వెళుతుంటే ఆ మనిషి ఏమైపోవాలి? వాస్తవానికి లోకంలో నేరుగా వెళ్లే దారుల కన్నా, మలుపు తిరిగేవే ఎక్కువ! దారులే కాదు కొంత మంది మనుషులూ అంతే! చిత్తచాంచల్యం వారిని స్థిరంగా ఉండనివ్వదు. నమ్ముకున్న వారిని నిలకడగా సాగనీయదు.  ఎదుటి వారి జీవితాల్ని అల్లకల్లోలం చేసే అమానుషమైన  ఇలాంటి దోరణులను ఎవరు మాత్రం ఎల్లకాలం భరించగలరు? అప్పటిదాకా నదీతరంగాలతో కాలం గడిపి, చివరికి ఆ నదికే ముప్పు తలపెట్టే వారిని  నిలదీయాల్సిన అవసరం లేదా? వాళ్లు విసిరిన బాణాలతో గాయపడిన నదీహృదయం,  ఎంత కొండశోకం పెడుతోందో గుండె బద్దలయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదా? ప్రతిసారీ పోనీలే అనుకునే వాడు,  సమాజంలో ఎలా మనగలుగుతాడు? నిజానికి  అమానుషత్వాన్ని నిలదీసే వాడే, న్యాయం కోసం పోరాడే వాడే  నిలబడతాడీ లోకంలో... !

                                                                 - బమ్మెర 

11, డిసెంబర్ 2021, శనివారం

వినిపించని రాగాలే పాట | చదువుకున్న అమ్మాయిలు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

పంచేంద్రియాలకు తెలిసిందే ప్రపంచమైపోయింది మానవాళికి. కానీ, ఇంద్రియాలు ఎంత పరిమితమైనవో, వాటి పరిధి ఎంత చిన్నదో ఒకసారి తెలిస్తే ఆశ్చర్యపోతాం! కంటికి కనిపించేంత దూరమే ఈ నేల ఉంది అనుకోవడం ఎంత అమాయకత్వమో, ఇంద్రియాలకు తెలిసిందే సమస్తం అనుకోవడం కూడా అంతే అమాయకత్వం! మన అమాయకత్వం గురించి మనకు ఒకసారి తెలిసిపోతే ఎల్లలు ఎరుగని విషయాలు లోకంలో ఎన్నో  ఉన్నాయని బోధపడుతుంది. అప్పుడింక,  అప్పటిదాకా వినిపించని రాగాలెన్నో కొత్తగా వినిపించడం మొదలవుతుంది. అప్పటిదాకా కనిపించని అందాలెన్నో కనిపించడం మొదలవుతుంది. 
1963లో విడుదలైన ‘ చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ పాట ఇంద్రియాలకు అతీతమైన ఆ వినూత్న ప్రపంచం గురించి ప్రస్తావిస్తుంది. ఈ పాటను  స్వరపరిచిన రాజేశ్వరరావు హృదయం రాగాలు విరితేనెల వెన్నెల ఎలా కురిపిస్తాయో అక్షరాలా ఆవిష్కరిస్తుంది. అంత మధురమైన బాణీని తేనెల సోనను తలపించేలా సుశీల గానం చేసింది. త్రివేణి సంగమంలా అవతరించే ఇలాంటి అరుదైన పాటల్ని వినగలగడం నిస్సందేహంగా రసజ్ఞుల అదృష్టం!

వినిపించని రాగాలే.....!


వినిపించని రాగాలే - కనిపించని అందాలే 
అలలై మదినే కలచే - కలలో ఎవరో పిలిచే // వినిపించని //
‘తెలిసింది గోరంత ... తెలియనిది కొండంత’ అన్నట్లు, లోకంలో వినిపించే రాగాలు కొన్నే అయితే...,  వినిపించని రాగాలు లెక్కలేనన్ని! ఎంతసేపూ మనం,  కర్ణపుటాలను తాకిన వాటినే విని తాదాద్మ్యం చెందుతూ ఉంటాం. అవైనా కొన్నే! అయితే, హృదయ పుటాలను తాకే రాగాలు కోకొల్లలు.  మనసు పెడితే అవన్నీ వినవచ్చు. కానీ ఎంత మందికి అంత సమయం ఉంది? చాలా అరుదుగా కొందరు ఆ పనిచేస్తారు. హృదయ పుటాలపైన కదలాడే వాటిని  వారు హృదయంతోనే వింటారు! అందాల విషయానికి వస్తే...,  బాహ్యనేత్రం చూడగలిగే  సౌందర్యాలే సమస్తం కాదు కదా! అయినా అవి మాత్రం ఎన్ని? బహు స్వల్పం. అంతర్నేత్రంతో చూడగలగాలే గానీ, అవి అనంతం!  అత్యంత నవీనమైన రాగాలూ, అప్పటిదాకా కనీవినీ ఎరుగుని అందాలూ, మన రసాత్మను తాకినప్పుడు లోలోంచి ఏవో అలల్లాంటి ప్రకంపనలేవో పుట్టుకొస్తాయి. అలజడి రేపుతాయి. కమ్మకమ్మగా గుండెను కలచివేస్తాయి. మనో ఆకాశంలో  కలల మేఘాలు కమ్ముకుంటాయి. ఒక్కోసారి ఆ కలల్లో  ఎవరో పిలిచిన అలికిడి వినబడుతుంది. ఎవరా పిలిచినది? అంటే ఏ  రాకుమారుడో ఏమో మరి ! 

తొలిచూపులు నాలోనే - వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే - చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు // వినిపించని  //
గుండె నిండా కాంతిపుంజాలు నింపుకన్న ఆ రాకుమారుడి తొలి చూపులు,  దీపాలు వెలిగించక ఏం చేస్తాయి?  ఆ దీపాలు కళ్లముందే కాదు,  ఎదలోనూ వెలుగులు నింపుతాయి. ఆ అంతరంగ కాంతిలో  మోడువారిన కోరికలు కూడా చిగురించడం మొదలెడతాయి. అలా ఎదనిండా ప్రేమభావాలు మోసులెత్తిన తర్వాత ఏమవుతుంది? మేఘావృతమైన ఆకాశం వర్షించడానికి సిద్ధమైనట్లు, ప్రేమావృతమైన హృదయం వలపుల వర్షం కురిపిస్తుంది. వర్షాలు లేకపోతే నేల ఎడారిగా మారిపోయినట్లు,  వలపులే కురవకపోతే, మానవలోకం పొడిబారిపోతుంది. హృదయాల గొంతు తడారిపోతుంది. నిజానకి  యుగయుగాలుగా ఈ జీవచైతన్యయాత్ర ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది! అయినా తొలి చూపులు ... తొలి ప్రేమ అంటూ ఉంటాం, అవునూ...,  తొలిచూపులోనే ప్రేమ పుట్టడం సాధ్యమయ్యే పనేనా? అందులో ఉన్న నిజం ఏపాటి? మనకు తెలిసి అవి తొలిచూపులే కావచ్చు కానీ, మనకు తెలియకుండా అవి ఒక సుదీర్ఘకాలంగా సాగుతూ ఉండి ఉండాలి!  వాటి ఉనికి అంత  సుదీర్ఘమైనదే కాకపోతే,  అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న వారితో ఏకంగా జీవితబంధానికి సిద్ధమైపోవడం ఎలా సాధ్యం? ఇదీ అని చెప్పలేకపోవచ్చు. కానీ, ఆ చూపుల ఆగమనం మనం అంచనా వేయలేనంత  సుదీర్ఘమైదే!

వలపే వసంతములా - పులకించి పూచినదీ
చెలరేగిన తెమ్మెరలే - గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు // వినిపించని //
వలపు అంటే అదేదో ఒక పూవు పూచినట్లు, ఒక  కోయిల కూసినట్లు, ఒక కొమ్మ చిగురించినట్లు, అలా ఏదో ఒకదానితో ముడివడిన విషయమేమీ కాదు! అది మొత్తం వసంతాన్నే పొదువుకున్న వైనం! నిజానికి, ఒక హృదయం కోటి నందనాలకు సమానం! గమనించాలే గానీ, ఎద లోలోపల  కోటానుకోట్ల పూల రాసుల కోలాహలం వినిపిస్తుంది. వందలాది సెలయేర్లు ముప్పిరిగొని ఎదమీదుగా  పారుతున్నట్లుగా హొరు  వినిపిస్తుంది.  అసలు ఈ పులకింతలు ఎప్పుడొస్తాయి? పట్టరాని పారవశ్యంతో  గుండె ఉబ్బితబ్బిబ్బయినప్పుడే  కదా! ఈ స్థితిలో చల్లచల్లగా సాగే తెమ్మెరలు కూడా అగ్ని సరస్సుల్లా చెలరేగిపోతాయి. గిలిగింతలూ, .పులకింతలూ  కలగాపులగం అవుతాయి. వయసూ వయసూ అంటాం గానీ, తొలి శ్వాస నుంచీ తుది శ్వాసదాకా సాగే  మొత్తం జీవితాన్నంతా పరిగణనలోకి తీసుకోలేం!  దీపం వెలిగిన కాలమే దీపంతె జీవితమన్నట్లు,  ఏరు దాటించే కాలమే పడవ ఆయువన్నట్లు, హృదయం స్పందిచే కాలమే దాని వికాస కాలం! తనువూ, మనసు  అన్ని రకాలుగా విరబూసే కాలమే అసలు సిసలైన వయసు కాలం!

వికసించెను నా వయసే - మురిపించు ఈ సొగసే 
విరితేనెల వెన్నెలలో - కొరతేదో కనిపించే 
ఎదలో ఎవరో మెరిసే // వినిపించని //
ఎంతో బలమైనదే అయినా ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా! యువరాజు ఎంత పరాక్రమ శాలి అయినా యువరాణి లేకపోతే అది కొరతే కదా! యువరాణి పనీ అంతే మరి!! ఆమె ఎంత గొప్ప సౌందర్యరాశి అయితే మాత్రం ఏమిటి? యువరాజు లేకపోతే ఆమె ప్రేమ అంతా అడవి కాచిన వెన్నెలేగా! అందుకే మిగతా ఎన్ని ఉన్నా, ఎవరి తోడు వారికి దొరకకపోతే, అదో పెద్ద లోటుగానే ఉంటుంది! తనువూ మనసుల మధ్య ఆ వలపేదో తారట్లాడుతూ ఉంటేనే పరువం వికసిస్తుంది. సొగసులు మురిపిస్తాయి. ఎదలో విరితేనేలే కురుస్తాయి.!! అప్పుటిదాకా తన హృదయపు అంతరాంతరాల్లో ఒదిగి ఒదిగి ఉండిపోయిన  ఆ యువకిశోరుడెవరో అదును చూసుకుని  మెరుపులా వస్తాడు. చేతిలో చేయి వేసి ఎదలోకి  పిలుస్తాడు. నిండు నూరేళ్ల జీవితంలోకి కొండంత మనసుతో  ఆహ్వానిస్తాడు!! అప్పుడింక వినిపించని లక్షలాది రాగాలు వినిపిస్తాయి. అప్పటిదకా చూడని కోటానుకోట్ల సౌందర్యాలు దర్శనమీస్తాయి!!

                                                              - బమ్మెర 

4, డిసెంబర్ 2021, శనివారం

అందమైన తీగకు - పందిరుంటే చాలును పాట | భార్యాబిడ్డలు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

శరీరాలైనా, మనసులైనా వాటికవిగా ఏమీ కావు. వాటి  వెనుక ఏ ప్రేరక శక్తి పనిచేస్తుందా అన్న దాని పైనే వాటి ఉనికీ, ఉత్థాన పతనాలూ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా నేలపైనున్న వారిలో నైరాశ్యాన్ని నింపితే వారు పాతాళానికిి జారిపోవచ్చు. అదే చైతన్యాన్ని నింపితే వారు ఆకాశంలోకి ఎగరవచ్చు. అయితే వారిని ఆకాశంలోకి ఎగదోసే యోచన ఎంతమందికి ఉన్నా, అసలు వ్యక్తిలో బలమైన ఆ ఆకాంక్షేదీ లేకపోతే, ఏ ప్రోత్సాహమూ ఫలితాన్నివ్వదు. ఆ ఆకాంక్షే బలంగా ఉంటే మాత్రం, అసాధ్యాలు సైతం సుసాధ్యాలు అవుతాయి. అప్పుడింక అంతుచిక్కని వేదనతో సతమతమయ్యే వారు కూడా ఆనంద సీమలకు చేరుకోవచ్చు. ఈ భావజాలాన్నే ప్రతిబింబిస్తూ,  1972లో విడుదలైన ‘భార్యాబిడ్డలు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈపాటలోని సాహిత్య విలువలు గత 50 ఏళ్లుగా లక్షలాది శ్రోతల్ని ఉద్దీపింపచేస్తూనే ఉన్నాయి. ఆ సాహిత్యాన్ని మహదేవన్  స్వరపరిచిన తీరు, నిలువెత్తు చైతన్య దీప్తిని నింపేలా సాగిన ఘంటసాల గానం,  రసజ్ఞుల్లో జీవశక్తిని నింపుతూనే ఉన్నాయి.

అందమైన తీగకు.....!!


అందమైన తీగకు - పందిరుంటే చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా!
అందమంటే భౌతికమైన చక్కని రూపురేఖలే అన్నట్లు చూస్తారు చాలా మంది. నిజానికి, ఆశావహ దృక్పథంతో, నిలువెత్తు ప్రాణశక్తితో తొణకిసలాడేదే అసలు సిసలైన అందం. అలాంటి చైతన్య స్థితిలో ఏ కాస్త ఆసరా, ఆలంబన లభించినా పందిరిపైకి ఎగబాకే తీగెలా, మనిషి జీవన శిఖరాలను అధిరోహిస్తాడు.  అడ్డుపడే అంతరాయాలూ, అవరోధాలూ ఎన్ని ఉన్నా వాటిని అధిగమిస్తాడు. ఆనందిస్తాడు. ఆ పారవశ్యంలో వేయి వేణువులు ఒక్కటైనట్లు గానం చేస్తాడు.

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులే ముందు ముందు నడకలౌతాయి
ఆశ ఉంటే మోడు కూడా చిగురు వే స్తుంది
అందమునకానందమపుడే తోడు వస్తుంది
లోకంలోని ఎక్కువ మందిలో ఉండే పెద్ద లోపం ఏమిటంటే, అప్పటిదాకా అనుభవంలోకి వచ్చిన వాటినే వారు నిజాలనుకుంటారు. అలా స్వీయ అనుభవంలోకి రానివన్నీ నిజాలే కాదంటారు. కానీ, అప్పటిదాకా ఎన్నకడూ కనీ వినీ ఎరుగని  నిజాలెన్నో ఆ తర్వాత బయటపడి  ఆశ్చర్యచకితుల్ని చేసిన సందర్భాలు ఎన్ని లేవు? శరీర శాస్త్రవేత్తలనూ,  వైద్యశాస్త్ర వేత్తలను సైతం దిగ్భారంతికి గురిచేసిన  అనూహ్య సత్యాలు ఎన్ని లేవు? ఏ మహా ఆవిష్కర్త అయినా, అతనిలో ఉన్న మొత్తం శక్తితో పోలిస్తే, అతడికి తెలిసింది అందులో సగమే!’ అన్నాడో మహానుభావుడు. సాధ్యాసాధ్యాల విషయానికొస్తే, మనకు తెలిసిన సాఽధ్యాలు ఒక శాతమైతే, మనకు తెలియని సాధ్యాలు మిగతా 99 శాతం. అందులో భాగంగానే  ఒకప్పుడు అసాధ్యమనుకున్నవెన్నో ఆ తర్వాత సాధ్యం అవుతుంటాయి.  మనం వెంటనే నమ్మలేము గానీ,  అప్పటిదాకా వాలిపడిన పక్షి రెక్కలు ఒక్క ఉదుటున,  గొప్ప శక్తి పుంజుకుని,  ఆకాశంలో రెపరెపలాడినట్లు, అప్పటిదాకా నిర్జీవంగా పడి ఉన్న అవయవాలు సైతం గొప్ప చలన శక్తితో కదలాడవచ్చు. నిశ్చేష్టగా పడిఉన్న వ్యక్తి పరుగులు తీయవచ్చు. . కాకపోతే, మనసు నిండా అంత బలమైన ఆశ ఉండాలి. పునరుజ్జీవం పొందాలన్న తిరుగులేని ఆకాంక్ష ఉండాలి! 

పాదులోని తీగె వంటిది పడుచు చిన్నది
పరవమొస్తే చిగురువేసి వగలుబోతుంది
మొగ్గతొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది
తగ్గ జతకై కళ్లతోటే వె తుకుతుంటుంది
జీవితనౌక సాదాసీదాగా సాగిపోతున్న వారి మాట ఎలా ఉన్నా, జీవితం ఒడిదుడుకులతో సాగుతున్న వారి జీవితం వేరుగా ఉంటుంది. ఒక్కోసారి దుఃఖదాయకంగా కూడా ఉంటుంది.   అయితే,  బీడునేలలో వాడిపోతున్న మొక్క,  నాలుగు చినుకులు పడగానే తలరిక్కించి  చూసినట్లు, శోకతప్తమై  ఉన్న హృదయానికి నాలుగు ఓదార్పు మాటలు చెబితే అది  గొప్ప ప్రాణశక్తితో పరిఢవిల్లుతుంది. మనోవైకల్యాన్నే అని కాదు. ఒక దశలో  అంగవైక ల్యాన్ని కూడా అధిగమిస్తుంది. అన్నీ బావుంటేనే ఆరోగ్యం బావుంటుందని చాలా మంది అనుకుంటారు గానీ, నిజానికి, జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లేమీ లేకపోతేనే అనారోగ్యం మొదలవుతుంది. ఒకవేళ ఎవరైనా, సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధమైతే, అప్పటిదాకా వెంటాడిన అనారోగ్యాల్లో చాలా భాగం మటుమాయమవుతాయి. మానవజీవితాల్లో  ఇది పలుమార్లు రుజువైన నిజం!!

కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగువేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది
సాధారణంగా మనిషి తనలోని లోపాల్ని తలుచుకుని తరుచూ భయపడుతుంటాడు.  నిజానికి మనిషి భయపడాల్సింది తన లోపాల్ని చూసుకుని కాదు,  తనకు తెలియకుండానే తనలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తికేంద్రాల్ని తెలుసుకుని భయపడాలి! ఎందుకంటే, వాటిని అర్థవంతంగా వాడుకోలేకపోతే, అవి అణుబాంబులంత ప్రమాదకరమైనవి కూడా! ఏ వస్తువునైనా అందరిలా వినియోగిస్తే అందరికీ వచ్చిన సాదారణ ఫలితాలే మనకూ వస్తాయి.  అందరిలా కాకుండా భిన్నంగా వినియోగిస్తే, అసాధార ణమైన, అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఒక్కోసారి అవి ఎవరూ నమ్మలేని నిజాలే అయినా కావచ్చు. అప్పటిదాకా కదలక మెదలక ఒక శిధిలావస్థలో ఉన్న వ్యక్తి, హఠాత్తుగా లేచి నడిస్తే అది నమ్మలేని నిజమేగా! చాలా మంది,  దేహశక్తికి లోబడే,  సాధ్యాసాధ్యాలను  అంచనా వేస్తారు. వాటికి ఉండే పరిమితుల్నే పరమ సత్యాలుగా భావిస్తారు. కానీ, ఆత్మశక్తి, వాటికి అతీతమైనదనీ, దేహాలకు అసాధ్యమైనవి, ఆత్మశక్తితో సుసాధ్యమవుతాయన్న సత్యాన్ని విస్మరిస్తారు. నిజానికి కలలకు ప్రేరకంగా ఏ శక్తి అయినా పనిచేయాలే గానీ,  కదలలేని ఆ కలలకు కాళ్లు రావడం ఖాయం. అప్పుడింక  జీవితం పురివిప్పిన నెమలిలా అందంగా, ఆనందంగా  నాట్యం చేయడం ఖాయం!! 

                                                   - బమ్మెర