29, ఆగస్టు 2021, ఆదివారం

గుండమ్మ కథ సినిమా | మౌనముగా నీ మనసు పాడిన పాట | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

చిత్రం : గుండమ్మ కథ (1962), గీతం : పింగళి, సంగీతం , గానం ఘంటసాల

భాష్యాలకు బాగా అలవాటుపడిపోయాం గానీ, ప్రేమ .... భాష ద్వారా వ్యక్తం అయ్యేదేనా అసలు? కానే కాదు. ఎందుకంటే ప్రేమ అంటే అదో  మహా నిశ్శబ్ద భావోద్వేగం మరి! ప్రేమికులకు కూడా ఆ విషయం తెలిసినా, గత్యంతరం లేక  బాషను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక్కడ మరో సత్యాన్ని కూడా చెప్పుకోవాలి!  ఒక అసాధారణ సున్నిత హృదయులకు మాత్రం భాషతో పనిలేకుండానే ఎదుటి వారి భావాలు తెలిసిపోతాయని మౌనర్షులు అనాదిగా చెబుతున్నారు! కాకపోతే, ఆ తరహా సున్నితత్వం పరిపూర్ణ నిశ్శబ్దంలో జీవించే వాళ్లకే సిద్ధిస్తుందని కూడా వారు చెప్పారు! ఈ ప్రేమికుడు అంతటి ఘనుడో ఏమో మరి! తన ప్రేయసి మౌనంగా పాడిన హృదయగీతం ,  తనకు వినిపించిందని చెబుతున్నాడు. ఈ విషయాల గురించి ఎంతో కొంత తెలిసిన మనం అతని మాటను కాదనడం ఎందుకు? అలా ఏమీ ఉండదని అతని మనసును చిన్నబుచ్చడం ఎందుకు? ‘గుండమ్మ కథ’ ( 1962) సినిమా కోసం,  పింగళి రాసిన ఈ పాటలో ఆ మౌనపు మాటలే ధ్వనిస్తున్నాయి.  తనే బాణీ కూర్చి, గానం చేసిన ఈ పాట ఘంటసాల హృదయంలోంచి వెలువడిన అత్యంత మధురమైన ... అరుదైన వాటిలో ఒకటి. అందుకే....ఆరు దశాబ్దాలు గడిచినా రసహృదయుల్ని ఇంకా ఆనంద డోలికల్లో ఓలలాడిస్తూనే ఉంది!!

మౌనముగా నీ మనసు పాడిన....! 


మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే // మౌనముగా //

మునులెందుకు మౌనంగా ఉంటారు? మాటలు రాక కాదుకదా! మాటల ద్వారా కన్నా వేయింతల లోతైన సత్యాలన్నీ మౌనంలోనే బాగా తెలిసిపోతాయని వాళ్లు అలా ఉండిపోతారు. ఒకవేళ, అడవుల్లో తిరిగే మునుల విషయం మనకెందుకులే అనుకున్నా! సామాన్య మానవ జీవన సత్యాలైనా నిశ్శబ్దంగానే ఉంటాయి మరి!  కాకపోతే తమ మనోభావాల్ని పరస్పరం చేరవేసుకోవడానికి ఏదో ఒక వాహిక అంటూ ఉండాలనుకుని మనిషి భాషను  సృష్టించుకున్నాడు. అయితే ఏమయ్యింది? ఆ ప్రయత్నమంతా  కడవలో సముద్రాన్ని నింపే వృధా ప్రయాసే అయ్యింది. ఎందుకంటే,  తన  భావోద్వేగాల్లో ఏ వెయ్యోవంతో మాత్రమే భాష ద్వారా వ్యక్త్తమవుతున్నాయి. ఇది నిరాశా జనకమే! నిస్సంశయంగా అదొక విఫల ప్రయత్నమే ... కాదనలేము!  అయినా తప్పదు కదా! భాష లేకుండానే భావాలు తెలుసుకునేటంత, సున్నితత్వాన్ని సాధించడం అందరికీ సాధ్యం అవుతుందా ఏమిటి? ! ఇంతకూ ఆ అమ్మాయి మౌనాన్ని ఎందుకు ఆశ్రయించినట్లు? దాన్ని బట్టి ... తన అనురాగాన్ని పూర్తి స్థాయిలో అభివ్యక్తం చేయడానికి ఇంకా ఆమె సిద్ధపడలేదనే కదా అర్థం? అందుకే మౌనంగా కొంత... కళ్లతో కొంత బయటపెడుతోంది! ఆ మాత్రానికే ఆయన ఆమె మనసు తనదైపోయినట్లు, ఎగిసిపడుతున్నాడు! అబ్బాయిలకు మరీ ఇంత తొందర ఎందుకు? అంటూ నన్నడిగితే నే నేం చెప్పను? ఏమీ చెప్పకుండా,  నేనూ మౌనంగానే ఉండిపోతాను!!

కదిలీ కదలని లేత పెదవుల ... తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహినీ ... ఓలలాడి మైమరిచితిలే // మౌనముగా //

గలగలా మాట్లాడటం అదో స్థితి.... మౌనంగా ఉండిపోవడం అదో స్థితి... అటు ఇటు కాకుండా మాటల్నీ, మౌనాన్నీ కలగలిపి మాట్లాడటం అదో స్థితి. ఈ మూడో స్థితి కాస్త గమ్మత్తుగానే ఉంటుంది. మాట్లాడాలా ... వద్దా అనే మీమాంస ఒకవైపు, ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న రవ్వంత భయం ... ఒక వైపు చేరినప్పుడు ఇలాగే ఉంటుంది! ఒక్కోసారి సిగ్గూ బిడియాలు కూడా మాట పెగలనీయవు. ఏమైనా ఇవన్నీ పెదాలకు పెద్ద పరీక్షలాంటివే  గుండె దిటవు చేసుకుని, అతి కష్టం మీద పెదాలు కదిపినా,  ఆ కదలికలు వింతగానే ఉంటాయి. మాట్లాడే వారికి ముచ్చెమటలు పోస్తుంటే, ఎదుటి వారికి అది ముచ్చటగానే అనిపించవచ్చు. తరళ తరళంగా వచ్చే ఆ మాటలు ఏదో తేనెలు కురిసినట్లే అనిపించవచ్చు!  అదో అమృత ధారలా కూడా అనిపించవచ్చు.  ఆ అమృత వాహినిలో ఓలలాడే వారు ఇక  మైమరిచిపోతే మాత్రం ఆశ్చర్యపోవలసింది ఏముంది? ఒకటి మాత్రం నిజం! ఎన్ని మీమాంసలు ఉన్నా, సిగ్గూ బిడియాలు ఎంతగా కట్టిపడేస్తున్నా, తప్పనిసరిగా చెప్పాల్సిన మాటల్ని చెప్పే తీరాలి! ఎందుకంటే, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం ఎంత ప్రమాదమో, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండిపోవడం కూడా అంతే ప్రమాదం కదా మరి! 

ముసిముసి నవ్వుల మోముగని, నన్నేలుకొంటివని మురిసితిలే 
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ, వలపు పాశమని బెదరితిలే // మౌనముగా //

ఏదో చూసి మరేదో అనుకోవడం... మనుషులకది మామూలే! ఒక రకంగా అది మనిషిని అనాదిగా పీడిస్తున్న మానసిక రుగ్మతే! ఆమె ఏదో మరియాద కోసం మందహాసం చేసిందే అనుకోండి!  అది తనను ఏలుకోవడానికి చేసిన సంకేతమే అనుకుంటే ఎలా? ఉక్కపోతతో చెమట పట్టి మెడంతా చిరాకు పెడుతుంటే, జెడను పక్కకు జరిపే చిన్న ప్రయత్నమేదో చేసిందే అనుకోండి! దాన్ని వలపు పాశమే అనుకోవడం సబబేనా? ఇలాంటి తొందరపాటు ప్రతి స్పందనల వల్లే చాలా మంది యువకిశోరులు అమ్మాయిల దృష్టిలో లోకువైపోతుంటారు. ఒక్కో ముఖ కవళిక వంద రకాల భావాలను చెబుతుంది. ఇది అదేనని, అది ఇదేనని, నువ్వు ఆశించినదేదో  వాళ్లకు ఆపాదించి ఊగిపోతే ఏమిటి అర్థం? జడ విసరడమో, పూలు ఎగజల్లడ మో నిన్ను ఆటపట్టించడానికైనా కావచ్చు కదా! అవన్నీ సరే గానీ, వలపు పాశమని తెలియగానే బెదరిపోయానంటాడేమిటి? కథ అలాగే ముందుకు సాగి పెళ్లి దాకా వెళితే, ఆ బాధ్యతలు ఎవడు మోస్తాడనేనా? ఏదో మాట వరుసకు ఇలా ప్రశ్సిస్తున్నానే గానీ, అంత దాకా వ చ్చిన వాడు బాధ్యతలకు భయపడతాడా? ఏది ఏమైనా వారు ఊహించుకుంటున్నది నూటికి నూరు పాళ్లూ తప్పేనని నేనేమీ అనడం లేదండోయ్‌! అదే అయినా కావచ్చు. అదే  జరిగితే సంతోషమే! ఒకవేళ అలా జరగకపోతేనో...!   ఏదో కారణంగా  కథ అడ్డం తిరిగితేనో ! అది అంతులేని మనస్తాపానికి  గురిచేసే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పడమే  నా ఉద్దేశం! అంతే తప్ప ఎవరినీ నిరత్సాహపరిచే తలంపు  నాలో ఏ కోశానా లేదు!  అయినా, వాళ్లనుకున్నదే నిజమైతే నాకైనా, మీకైనా ఏమిటి నష్టం?  పైగా లాభం కూడా! అలా వెళ్లి,  నాలుగు అక్షింతలు వేసి, నిండుగా పెళ్లి భోజనం చేసి బయటపడటంలో , నిజంగా ఎంత సుఖం, ఎంత సంతోషం, ఎంత ఆనందం! తొందరలోనే ఆ శుభదినం రావాలని మనసారా కోరుకుందాం మరి!!

                                                                    - బమ్మెర 



14, ఆగస్టు 2021, శనివారం

భారతీయుల కళాప్రాభవమ్మొలికించి పద్యం | సరోజినీ నాయడు గురించి ఘంటసాల పాడిన పద్యం | తెలుగు పద్యాలు |

 పద్యమాధురి

‘ఇండియన్‌ నైటింగేల్‌ ’ లేదా ‘భారత కోకిల ’ అన్న మాటలు ఎక్కడ విన్నా,  మనముందు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో విరాజిల్లే సరోజినీ నాయడు రూపం కళ్లముందు నిలుస్తుంది.  స్వాతంత్య్ర సమర శంఖం ఊదడంలో ముందు వరుసలో నిలిచిన వీరవణిత ఆమె. బారతీయ కళావైభవాన్నీ, ప్రాక్పశ్చిమాల మధ్యగల అభేదత్వాన్ని చాటి చెప్పిన ఆమె అద్భుతమైన స్వరం ఆ రోజుల్లో నిజంగా ప్రపంచమంతా మారు మ్రోగింది. కన్నవారి మూలాలు బెంగాళ్‌లో ఉన్నా ఆమె పుట్టీ పెరిగింది తెలుగునేల పైనే. ఇక్కడ పుట్టడమే కాదు,  తెలుగు వ్యక్తినే పెళ్లాడి, తెలుగింటి కోడలయ్యింది.  1925లో ఆమె  ఇండియన్‌ నేష్నల్‌ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అద్యక్షురాలిగా ఎన్నికయ్యింది. స్వాత్రంత్య్రపోరాటంలో ఆమె చేసిన కావ్యాత్మక ప్రసంగాలు ఎంతో మంది యువతీ యువకులు సమర రంగంలో దూకేలా చేశాయి. భారత దేశ ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు వివరించి,  ఈ దేశ సంస్కృతి పట్ల వారికి సదవగాహన కలిగేలా చేయడంలో ఆమె ఒక అద్వితీయమైన భూమికను పోషించింది. దేశ స్వాతంత్య్రం కోసం  దాదాపు 50 ఏళ్లపాటు అలుపెరుగని పోరాటం చేసిన సరోజినీ నాయడు గురించి తోలేటి వెంకటరెడ్డి రాయగా,  స్వీయ సంగీతదర్శకత్వంలో ఘంటసాల పాడిన ఈ పద్యం ఒక ప్రైవేటు రికార్డుగా విడుదలైంది.


భారతీయుల కళాప్రాభవమ్మొలికించి

          తీయగా పాడిన కోయిలమ్మ

కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో

           ప్రసరించినట్టి మేల్‌ పసిడిబొమ్మ

స్వారాజ్య వీర విహార రంగములోన  

           కోరి దూకిన తెన్గు కోడలమ్మ 

మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి

           చేయెత్తి చూపిన చెల్లెలమ్మ 

ప్రాక్పశ్చిమాలు విస్ఫారించి, ప్రేమింప 

           పాఠాలు నేర్పిన పంతులమ్మ 


భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ

ఖండ ఖండాలు జల్లి విఖ్యాతిగన్న

దివ్యమూర్తి సరోజినిదేవి వోలె 

దీక్షసూత్రాన ఆ దేవి దివ్య సుగుణ

పుష్పముల నేరి విరిదండ పూర్తి చేసి 

పుణ్య భారత మాతను పూజచేసి

ఘనతకెక్కుడి భారత వనితలార ! 

గుండెలో ఎంతటి భావోద్వేగమైనా ఉండవచ్చు. అద్భుతమైన భాషే లేకపోతే, అది చేరవలసిన వాళ్లకు చేరదు. జాజ్వల్యమానమైన తన కవితాత్మక భాషతో భారతీయ కళా ప్రాభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ప్రతిభామూర్తి సరోజినీ నాయుడు. దేశవిదేశాల్లో ఆమె చేసిన ప్రసంగాలు,  ఆమె గానం చేసిన దేశభక్తి గీతాలు, ఆమెకు ‘భారత కోకి ల’ అన్న  బిరుదు రావడానికి కారణభూతమయ్యియి. ఇంతకూ భారతీయ కళాసృష్టికి విశ్వవ్యాప్తంగా  అంత కీర్తి ప్రతిష్టలు రావడానికి గల కారణమేమిటి? కళల పట్ల ఈ దేశపు తాత్విక మూలాలే అందుకు ప్రదాన కారణం. ‘‘సృష్ట్యాధిలో విశ్వ ఆవిర్భావం పూర్తిగా జరగలేదు. కొంత జరిగి, మిగతాదంతా సృజనకారుల హృదయాలకు వదిలేయబడింది’’’ అన్న ఈ ఒక్కమాట భారతదేశం కళాత్మకత కు ఎంత పెద్ద పీఠ వేసిందో విషదమవుతుంది. జీవితమే ఒక అనంతమైన కవితా వస్తువనీ, అది  నిరంతరం తనను తాను బహుముఖంగా ఆవిష్కరించుకుంటూ ఉంటుందని భారతీయ కళావేత్తలు చెబుతారు.  భారత హృదయంలోని ఈ అవ్యాజమైన ప్రేమే కళను జీవిత మహా ఐశ్వర్యంగా  భావించేలా చేసింది.  ప్రాక్పశ్చిమాల ప్రస్తావన వచ్చినప్పుడు భిన్నత్వం అనేది భాహ్యంగా కనిపించేదే కానీ, మూలాల్లో అదేమీ లేదని ఆమె నొక్కి చెప్పింది.  

సౌందర్యశాస్త్ర  చర్చల్లో సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యమన్న దేశీయ కళాదృక్పధాన్ని ఉద్ఘాటించింది. మానవ హృదయం,  అల్పమైన విషయాలకు అతీతంగా అత్యంత లోతైన అర్థాన్ని ఆవిష్కరించేందుకు, లోలోపల దాగి ఉన్న అత్యంత సున్నితత్వాన్ని బహిర్గతం చేసేందుకు వేదిక కావాలని చెబుతూ ఉండేది. ఈ సున్నితత్వం మనిషిని  అహింసామార్గం వైపు నడిపిస్తుందని సరోజినీ నాయుడు  బలంగా నమ్మేది. వనితలే అని కాదు,  సమస్త మానవాళీ ఈ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన ఆమె నుంచి స్పూర్తి పొందాలి. ఆమె మూర్తిమత్వానికి చేతులెత్తి సమస్కరించాలి!!

                                                            - బమ్మెర 

==================================









8, ఆగస్టు 2021, ఆదివారం

నీకేలా ఇంత నిరాశ పాట | ఆరాధన సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

చిత్రం: ఆరాధన, గీతం: దాశరధి సంగీతం ఎస్‌ హనుమంతరావు, గానం: జానకి

"తగిలిన గాయం ఎంత తీవ్రమైనదైనా కావచ్చు. గుండెను పిండేస్తున్న దుఃఖం ఎంత పెద్దదైనా కావచ్చు. ఆ గాయాన్ని ఎవరో వచ్చి మాన్పలేరు. ఆ దుఃఖాన్ని ఎవరో వచ్చి పోగొట్టలేరు. అందువల్ల, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి.  ముళ్ల కంచెను నరికి  నీకు నువ్వే బాట వేసుకుని ఆ బాటలో నీకు నువ్వే నడిచి వెళ్లాలి"అంటూ కొందరు చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ, ఒక్కోసారి తనను తాను ఓదార్చుకునే ఆ శక్తి కొందరిలో ఉండదు. తనకు తానే ధైర్యం చెప్పుకుని దారిన పడినడిచే ఓపికా తనలో ఉండవు.  అలాంటప్పుడు ‘‘నీ బతుకు నువ్వు బతుకు, నీ ఏడ్పు నువ్వు ఏడువు’’ అంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోకుండా, . నాలుగు  ఓదార్పు మాటలు మనసులో వేసి,  నాలుగు  ధైర్యపు వచనాలు గుండెలో దించే వాళ్లు కావాలి. అదే జరిగితే, వారిలో ఒక కొత్త జీవనచైతన్యం అంకురిస్తుంది. వేయి రెక్కలు పుట్టుకొస్తాయి.  అప్పుడింక సుడిగుండాల్లోంచి కూడా ఈదుకుంటూ బయటికి వస్తారు. అగ్ని పర్వతాల్ని  కూడా దాటుతూ వచ్చి జనంలో కలుస్తారు. జనజీవన స్రవంతిలో తడుస్తారు. ‘ఆరాధన’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ పాట నిండా,  ఆ ఓదార్పు వాక్కులు ధైర్య వచనాలే ప్రతిబింబిస్తున్నాయి. ఈ సాహిత్యానికి ఎస్‌. హనుమంతరావు సంగీతం సమకూరిస్తే, ఎస్‌. జానకి ఎంతో ఆర్ధ్రతతో పాడారు. మనసు పెట్టి వింటే మనకూ కొంత లాభమే మరి!

నీకేలా ఇంత నిరాశ....!




నీకేలా .... ఇంత నిరాశా, నీకేలా..... ఇంత నిరాశా
నీ కన్నులలో కన్నీరేలా - అంతా దేవుని లీలా // నీకేలా //

ఆగిపోవడం గానీ, ఓడిపోవడం గానీ, ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఎవరికి వారు తమ సర్వశక్తులూ వెచ్చించి తమ సమస్యను అధిగమించాలనే అనుకుంటారు. అయితే అడుగడుగునా ఆటంకాలే వచ్చి ఒక్కోసారి అనుకున్నదేదీ అనుకున్నట్లు జరగదు. పైగా,  అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగానే అన్నీ జరిగిపోతుంటాయి. ఈ పరిణామాలు కొందరిని ఒక దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి నిలువెత్తు దిగులూ, ఆందోళనల్లో ముంచేస్తాయి. అలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో  కొందరు  ‘‘తండ్రీ! నువ్వే కాపాడాలి’ అంటూ భగవంతుని మ్రోలన వాలిపోతారు. అయితే పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కొంతమందికి ఇవన్నీ ఉత్త చేతగాని వ్యవహారాల్లా అనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుడిదే భారం అనుకునే వాళ్లంతా  తర్వాత ఏమీ ఆలోచించకుండా, ఏ చర్యలూ తీసుకోకుండా, ఎల్లకాలం జీవచ్ఛవాల్లా పడిఉంటారని కాదు. ఒకానొక తీవ్ర సంక్షోభ స్థితి నుంచి, ఎడతెగని అలసట నుంచి కాసేపు సేదతీరడానికి మాత్రమే ఈ అడుగులు! ఎన్నో మైళ్ల దూరం,  మండుటెండలో ప్రయాణిస్తూ వచ్చిన వ్యక్తి బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఏ చెట్టునీడనో కాసేపు సేదతీరతాడు. అలాగని ఎప్పటికీ  ఆ చెట్టునీడనే పడి ఉంటాడని కాదుగా! సేద తీరగానే  మళ్లీ  ప్రయాణం మొదలెడతాడు. ఎవరైనా,  బాటసారుల సత్రంలో విడిది చేసేది ..... జీవితమంతా అక్కడే పడి ఉండడానికేమీ  కాదు కదా! కాసేపు విరామంతో  శక్తి పుంజుకుని , తిరిగి తన గమ్యం వైపు సాగిపోవడానికే! కాబట్టి, ఈ భగవద్భావన కూడా కొందరికి సేదతీరేలా చేసే  చెట్టు నీడ లాంటిదే! సుదూర ప్రయాణికులకు మార్గమధ్యాన కాసేపు ఆశ్రయమిచ్చే భాటసారుల  సత్రం లాంటిదే! అలా అని భగవద్భావన అనేది అందరిలోనూ ఒకేలా ఉంటుందని కాదు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాకపోతే ఎక్కువ మందిలో ఈ భావనే ఉంటుంది. ఏమైనా,  ‘దేవుడిదే భారం’ అనో, ‘అంతా దేవుని లీల’ అనో ఎవరైనా అనేయగానే మానవశక్తి అంతా కొడిగట్టుకుపోతోందని ఆందోళన పడాల్సిన  అవసరమేమీ లేదు. 

ఆశ నిరాశల దాగుడు మూతల ఆటేలే ఈ లోకం.... ఆటేలే ఈ లోకం
కష్టసుఖాల కలయికలోనే  ఉన్నదిలే మాధుర్యం.. జీవిత మాధుర్యం
చీకటి కొంత .. వెలుతురు కొంత ఇంతే జీవితమంతా... ఇంతే జీవితమంతా // నీకేలా //

నేడు అస్తమించిన సూర్యుడు, రేపు మళ్లీ ఉదయిస్తాడనే  నిజం ఎవరికి తెలియనిది? అయినా, సూర్యుడు  అస్తమించగానే కమ్ముకునే చీకట్లను చూసినప్పుడు,  చాలా మంది మనసు ఎంతో  కొంత అలజడికీ,  ఆందోళనకూ గురవుతూనే ఉంటుంది. కాకపోతే ప్రకృతీ పరమైన ఈ ఉదయాస్తమయాలు ఒకదాని పిదప ఒకటి 24 గంటల్లో కచ్ఛితంగా సంభవిస్తాయి. జీవితంలో వచ్చే ఉదయాస్తమాయాల తీరు మాత్రం పూర్తిగా వేరు కదా!. వాటి మధ్య వ్యవధి అంత తక్కువగా ఉండదు. చాలాసార్లు ఒకటి పోయి మరొకటి రావడానికి  24 రోజులో,  24 వారాలో కాదు. 24 ఏళ్లు, ఒక్కోసారి అంత కన్నా ఎక్కువ కాలమే పట్టవచ్చు. అందుకే జీవితం తాలూకు అస్తమయాలు మనిషిని అంతగా కలవరపెడతాయి.   జీవితానికి నిర్ణీత కాల వ్యవధి లేనట్లే, మనిషి జీవితంలో జరిగే ఘటనల మధ్య కూడా ఒక నిర్ణీత కాలవ్యవధి అంటూ ఉండదు మరి! నిజానికి ఆశాజనక పరిస్థితులకన్నా, నిరాశాజనక పరిస్థితులే మనిషికి అపారమైన జ్ఞానాన్ని ఇస్తాయనేది ప్రతి జీవితానుభవమూ చెబుతుంది.  ఆ మాటకొస్తే సుఖాల కన్నా  కష్టాలే మనిషిని బాగా రాటుతేలేలా చేస్తాయనేది కూడా ప్రతి హృదయానికీ తెలిసిన పాఠమే! ఇవే కదా! అతి సామాన్యున్ని కూడా  జీవన కురుక్షేత్రంలో అద్భుతంగా పోరాడగలిగే యోధుణ్ని చేస్తాయి!. 

నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం - నిలువవులే కలకాలం... 
వాడిన  మోడు - పూయక మానదు - వచ్చును వసంత కాలం... వచ్చును వసంత కాలం
నీతో కలసి.. నీడగ నడిచే తోడుగ నేనున్నాను... నీ తోడుగ నేనున్నాను  // నీకేలా //

ఎంతటి మనోవేధనలైనా ఎంతటి ఆత్మక్షోభలైనా శాశ్వతంగా ఉండిపోవనేది ఎవరూ కాదనలేని సత్యం! కాకపోతే, ఎడతెగని వేధనలు, క్షోభలతో మోడుబారిన జీవితాలు,  మళ్లీ  ఎప్పుడు చిగురిస్తాయనేది అంత కచ్ఛితంగా ఎవరూ చెప్పలేరు.  ఎందుకంటే ప్రతి వసంత కాలంలోనూ తప్పనిసరిగా చిగురు వేసే చెట్టు కాదు కదా మనిషి! కాకపోతే, ప్రకృతికి సమాంతరంగా కాకపోయినా, తమవైన కాల వ్యవధిలో మానవ జీవితంలో కూడా రుతువులు ఉంటాయి. వాటిల్లో భాగంగా వసంతాలూ వస్తాయి. అయితే ఈ వసంతాలు రావడం పోవడం అనేది ప్రకృతి చేతిలో కన్నా ఆ మనిషి చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మౌలికమైన ఒక తేడా కూడా ఉంది ప్రకృతి పరమైన రుతుమార్పులు వద్దన్నా, కావాలన్నా, ఆయా కాలానుగుణంగా జరిగిపోతుంటాయి. మానవ జీవితంలో వచ్చే రుతువుల పరిణామ క్రమం అనేది దానికదిగా కాకుండా,  నువ్వెంత కృషి చేస్తావనేదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగని, ఎవరికి వారే అని కూడా కాదు, నీలో కలసిపోయి, నీతో కలసి నడవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాళ్లు కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు . నీ హృదయాన్ని  ప్రపుల్లితం చేస్తారు . ఒకవేళ ఎవరైనా వారి  జీవితంలోకి  స్నేహమూర్తిగానో, ప్రేమమూర్తిగానో ఇప్పటికే ఎవరైనా ప్రవేశించి ఉంటే, వారింక భాగ్యవంతులే, అక్షరాలా సౌభాగ్యవంతులే!!

                                                                    - బమ్మెర 


3, ఆగస్టు 2021, మంగళవారం

పాడనా తెలుగు పాట | అమెరికా అమ్మాయి సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs

పాటలో ఏముంది?


మాతృభాష పైని ప్రేమ, ఎప్పటికీ మాతృభాష దగ్గరే ఆగిపోతుందని కాదుగా!  ఒక్కో అడుగే వేస్తూ అది మాతృభూమినంతా వ్యాపిస్తుంది. ‘తనను తాను ప్రేమించలేని వాడు, సాటి మనిషినీ ప్రేమించలేడు’  అన్నట్లు, మాతృభాషను ప్రేమించలేని వాడు, మాతృభూమినీ ప్రేమించలేడు. అదీకాక, అన్యభాషల్లో ఎంత ప్రావీణ్యం ఉన్నా, ఇతర భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మాట  మెదడులోంచి వస్తుంది. అదే మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు  హృదయంలోంచి వస్తుంది. అందుకే ఆ మాట హృదయాన్ని తాకుతుంది. ఆ స్పర్శతో మానవ సంబంధాలు  పరిమళిస్తాయి. పరిఢవిల్లుతాయి.

                       ఓ విదేశీ కన్య తెలుగు హృదయంతో బాంధవ్యం ఏర్పరుచుకుని, జీవితమంతా తెలుగు నేలపైనే ఉండాలనుకున్నాక ఆ  అమ్మాయి పుట్టినిల్లు ఏ దేశంలో ఉంటేనేమిటి? పెళ్లయ్యాక ఆమె మెట్టినిల్లు ఈ దేశంలోనే కదా!   ఏదో తెలియని భయం, ఆందోళనల్లో  ‘మీ ఎదుట మీ పాట’ పాడనా అంటోంది కానీ, నిజానికి ఆమె తన పాట తానే పాడుకుంటోంది. ఎందుకంటే తనిప్పుడు 16 అణాల తెలుగమ్మాయి మరి! ‘అమెరికా అమ్మాయి’ సినిమా కోసం దేవులపల్లి కృష్ణ
శాస్త్రి ఎంతో ఆర్తితో రాసిన ఈ గీతానికి  జి.కె. వెంకటేశ్‌ హృద్యమైన బాణీ కూర్చగా,  సుస్వరాల రాణి సుశీల ఎంత ఆర్థ్రతతోనో పాడింది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వినేద్దాం మరి !!

పాడనా తెలుగు పాట

పాడనా తెలుగు పాట
పరవశనై... మీ ఎదుట మీ పాట // పాడనా //

ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మనం, మన భాషలో మనం మాట్లాడుకోవడం, మన పాటలు మనం పాడుకోవడం మామూలే! అందుకు భిన్నంగా ఒక అమెరికా అమ్మాయి, ఇప్పుడిప్పుడే తన దేశమైన దేశంలో,  తన భాష అనిపించే భాషలో ఓ పాట పాడటానికి సిద్ధమైతే ఎలా ఉంటుంది? ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి, మన భాషా విశేషాన్నీ,  మన సంస్కృతీ విశిష్టతనూ మన ఎదుటే సమ్మోహనంగా పాడుతుంటే మనకెలా ఉంటుంది? మన భాషను మనమే తొలిసారి వింటున్నట్లు అనిపిస్తుంది. వేయిగొంతులతో మనకూ గొంతెత్తి పాడాలనిపిస్తుంది. అవునూ...!, తెలుగు పాటను నేర్చుకున్న ఆ అమ్మాయి తెలుగు పద్యం నేర్చుకోకుండా ఉంటుందా? ఎందుకంటే పద్యం అంతటి అపురూపమైన ప్రక్రియ కదా మరి! పైగా పద్యం అనేది తెలుగులో తప్ప దేశంలోని మరే భాషలోనూ లేని విలక్షణ ప్రక్రియ.  ఆ మాటకొస్తే, యావత్ప్రపంచంలోనే ఏ భాషలోనూ లేని ఒక విశిష్ట ప్రక్రియ పద్యం. పద్యం పైన ఆమే కాదు, ప్రతి తెలుగు బిడ్డా మనసు పెట్టాల్సిన మనోహర ప్రక్రియ మరి!

కోవెల గంటల గణగణలో, గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపుల పైన - మసలే గాలుల గుసగుసలో 
మంచి ముత్యాల పేట... మధురామృతాల తేట... ఒక  పాట // పాడనా //

మిన్ను ముట్టే భావోద్వేగాలను అందుకోలేక మాటలు నేలపై చతికిల పడిపోతే ఏమిటి దిక్కు? అప్పుడు పాటలే వాటి చేయందుకుంటాయి. అందుకోవడమే కాదు, ఆనంద పారవశ్యంలో వాటిని ఏడేడు ఆకాశాలు తిప్పుతాయి. నేలపై పడిన మాటలు మహా అయితే,  కాస్త  పక్కకు వెళ్లి ఏ నదీ తరగల మీదుగానో ఆ  నది అంచుల దాకా తీసుకుపోవచ్చు.  ఇంకొంచెం శక్తి ఉంటే, నది నుంచి సముద్రం దాకా నడిపించవచ్చు. అన్నీ అనుకూలించి,  ఏ వాగ్గేయకారుని గాత్రంలోనో పడితే  మాత్రం, భూమ్యాకాశాలకు అతీతంగా ఎక్కడో  దివ్యతాండవం చేస్తాయి. ఏమైనా అక్షరబద్దమైనవీ, స్వరబద్ధమైనవీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయనేది నిఖార్సయిన నిజం. అందుకే కవులూ, గాయకులూ ప్రత్యేకించి వాగ్గేయకారులు తమ భావనా లోకాన్ని అక్షర బద్దం, రాగబద్దం చేయడానికి  తమ జీవితాల్నే ధారవోశారు. 

త్యాగయ, క్షేత్రయ, రామదాసులు - తనివి తీర వినిపించినదీ....
నాడునాడుల కదిలించేది... వాడవాడలా కదిలించేదీ 
చక్కెరమాటల మూట - చిక్కని తేనెల ఊట... ఒక పాట  // పాడనా //

నిన్న మొన్నటి దాకా అమెరికాలో ఉండివచ్చిన అమ్మాయి ఈ వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందీ అంటే, ఏమిటి అర్థం? ఖండాంతరాల్లో కూడా వారి ఖ్యాతి మారుమోగుతోందనే  కదా!  ఏమైనా, పదంలోని వాక్కును గేయం చేయగల వాగ్గేయకారులు వాగ్దేవిని ఒక భుజాన ఎత్తుకుంటే, రాగతాళ భావప్రదానమైన పదం పట్ల మక్కువ గల పదకవులు వాగ్దేవిని ఒక భజం పైన ఎత్తుకున్నారు. పదకవులైనా, వాగ్గేయకారులైనా, ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచం. వారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే! 

పదకవితకు ఆద్యుడు అన్నమయ్య అయితే,  అన్నమయ్య పదాలను పూర్తిగా, ఎంతో లోతుగా ఆకలింపు చేసుకున్నవాడు క్షేత్రయ్య.  కారణమేదైనా, అన్నమయ్య రాసిన శృంగార సంకీర్తనలు క్షేత్రయ్యను అమితంగా ఆకర్షించాయి. వాటిలోని తేట తెలుగుతనాన్ని మాటల సోయగాన్నీ క్షేత్రయ్య బలంగా గుండెల్లో నింపుకున్నాడు. పైగా రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సమర్థ సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే, క్షేత్రయ్య పదాలు సంగీత, సాహిత్య, నృత్య క్షేత్రాలకు జీవనదాలు.  క్షేత్రయ్య రాసిన పదాలు 4500 దాకా ఉంటాయి. కానీ, వాటిలో నేడు లభిస్తున్నవి 330 పదాలే!

రామదాసు ..... అకుంఠిత భక్తిపరుడు. ఆయన కవితాధార అనర్ఘలం. ఆయన కీర్తనల్లో సంగీతం భూమిక తక్కువే అయినా, శ్రోతలు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఆయన కీర్తనలు హృదయాన్ని చించుకుని వచ్చిన సరళ సంగీత రచనలు. కొంత మంది పండితుల దృష్టిలో రామదాసు వాగ్గేయకారుడు కాకపోయినా, సామాన్యుల దృష్టిలో కీర్తనా పితామహుడుగా నిలిచిపోయాడు. భద్రాచల రామదాసుగా ఉండిపోయాడు.  అటుఇటుగా రామదాసు కీర్తనలు 140 దాకా ఉంటాయి. కీర్తనలే కాక రామదాసు  ‘‘దాశరథీ కరుణాపయోనిధీ’  అనే మకుటంతో ‘దాశరథీ శతకం’  అనే మరో పుస్తకం రాశాడు. ఇది బహుళ ప్రసిద్ధమైనది.

బాల్యంలోనే త్యాగయ్యకు తన తల్లి సంగీత సాహిత్యాలు గుదిగుచ్చి అతని గుండెపైన వేసింది. అంత పిన్న వయసులోనే జయదేవుడి అష్టపదులూ, రామదాసు కీర్తనలూ, అన్నమయ్య సంకీర్తనలూ నేర్పింది. వీటికి తోడు, తండ్రి పోతన భాగవతాన్ని నూరిపోశాడు. అందుకే పోతనలోని మృదుత్వం,లాలిత్యం  త్యాగయ్యకు బాగా అలవడ్డాయి.  త్యాగరాజస్వామి రచించిన కీర్తనల్లో ఎంతో ఖ్యాతి పొందిన పంచరత్నాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఘనరాగ పంచరత్నాలు బాగా ప్రసిద్ధమైనవి. త్యాగరాజు రాసిన మణిమాణిక్యం లాంటి ‘ఎందరో మహానుభావులు’ అన్న కృతిని వినని తెలుగువారు బహుషా ఉండరేమో మరి! 

ఒళ్లంత ఒయ్యారి కోక - కళ్లకు కాటుక రేఖ
మెళ్లో తాళి - కాళ్లకు పారాణి  - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లుఘల్లున కడియాలందెల - అల్లనల్లన నడయాడే
తెనుగుతల్లి పెట్టని కోట - తెలుగునాట  ప్రతిచోట ఒకపాట // పాడనా //

ఎవరైనా సరే, తనలోంచి తాను బయటికి వచ్చి, తనను తాను చూసుకుంటే తప్ప తనేమిటో పూర్తిగా బోధపడదు.  అలాగే ఈ దేశంలో పుట్టీ, పెరిగి అనునిత్యం ఇక్కడి సంప్రదాయ,  సంస్కృతుల మధ్య గడిపిన వారికి అవి గొప్పగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ,  ఏ విదేశీయులో వచ్చి.  వాటి విశిష్టతల గురించి చెప్పేదాకా  ఒక్కోసారి మన దృష్టి, వాటి పైన పడకపోవచ్చు. నిజానికి,  ఆకాశాన్ని చుట్టేసుకున్నట్లు నఖశిఖం కమ్మేసే కోక ఎంతటి విశాల భావనకు ఉదాహరణ.  ఆకాశంలో సూర్యబింబంలా  నుదుట వెలుగులు చిమ్మే  కుంకుమబొట్టు. ఇవన్నీ నిలువెత్తు భావుకతకూ,  నిండైన  చైతన్యానికీ  ప్రతీకలే కదా! ఘల్లుఘల్లుమనే అందియలు, జీవితంలో పేరుకుపోయే స్తబ్దతను పారదోలడానికి కాక మరెందుకు? ఇవన్నీ విలక్షణమైనవే, విశిష్టమైనవే! ఎడతెగని జీవన పోరాటంలో అన్నిసార్లూ, అన్నీ మన దృష్టిలో పడకపోవచ్చు. అనుకోకుండా మనకు మనంగానో, ఇతరుల వల్లనో వాటి చెంతగా వెళ్లినప్పుడు వాటిని గుండెలకు హత్తుకోగలగాలి.  వాటినుంచి  మనలోకి చొరబడే ఒక కొత్త అస్తిత్వాన్నీ, కొత్త  ఆనందాన్నీ  జీవితంలోకి  నిండుగా ఆహ్వానించగలగాలి! 

                                                                      - బమ్మెర 

======================================