25, ఏప్రిల్ 2022, సోమవారం

మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై పాట | డాక్టర్‌ చక్రవర్తి సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ |

పాటలో ఏముంది?

తమపైన తమకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం!, ఎవరికివారు తమతో తాము ఎంత సేపని మాట్లాడుకుంటారు? జీవితానుభూతులన్నింటినీ తన ఒక్క మనసులోనే నింపుకుంటూ ఎంత కాలమని ప్రయాణిస్తారు? ఇది బాగా విసుగు పుట్టించే విషయమే! అందుకే, మనసు పంచుకునే మరో మనిషి కోసం ప్రతి ఒంటరి మనసూ వీలు చిక్కినప్పుడల్లా వెతుక్కుంటూనే ఉంటుంది. చీకటి వెలుగుల్లోనూ, కష్టసుఖాల్లోనూ వెన్నదన్నుగా ఉండే ఒక   నిండు ప్రేమమూర్తి కోసం ఎడతెగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటుంది. కాకపోతే, పక్కా చిరునామా ఏదీ లేని ఈ వెతుకులాట కొంత కష్టమైనదే! అయితే, ఒకటి మాత్రం నిజం! ఒక మహా తపస్సులా సాగిన  ఏ అన్వేషణా ఎప్పటికీ  వృధా పోదు. తాను అంతగా కోరుకున్న ఆ ప్రేమమూర్తి కాస్త ఆలస్యంగానే అయినా,  ఎక్కడో, ఎప్పుడో ఎదురుబడకుండా ఉండదు. మనసంతా వ్యాపించకుండా ఉండదు. ఆ తర్వాత అయినా జీవితం తాలూకు వ్యధలూ బాధలూ అసలే ఉండవని కాదు గానీ, మొత్తంగా చూస్తే ఆశించిన ఆ ఆనందానుభూతి ఏదో ఒక స్థాయిలో లభించే తీరుతుంది. అప్పటిదాకా ఆమె కోసమైన అతని అందమైన కల కొనసాగుతూనే ఉంటుంది. నిలువెల్లా పెనవేసుకుపోయిన ఆ అందమైన కలే 1964లో విడుదలైన ’డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాలోని ఈ  పాటలో కనిపిస్తుంది.
                 
 శ్రీశ్రీ రాసిన ఈ పాటను సాలూరి రాజేశ్వరరావు స్వరబద్దం చేస్తే, జీవితపు మధుర జ్వాలల్ని తన గొంతులో ఎంతో మనోహరంగా పలికించాడు ఘంటసాల. ఆ రసానంనద  ఝరుల్లో తేలాడటం తప్ప ఇప్పుడు మన కింక వేరే ధ్యాస ఏముంది? ఎవరు ఏమనుకుంటే ఏమవుతుందిలే గానీ,  భూమ్యాకాశాలను ఏకం చే స్తున్న ఆ రసానందసీమే ఇప్పుడు మనకున్న ఏకైక  లోకం!

మనసున మనసై...!!

మనసున మనసై ....,  బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ ...,  అదే స్వర్గమూ // మనసున //

బ్రతుకు ... నేల, 
మనసు ... ఆకాశం.

మట్టితో మట్టి కలిసిపోయినట్లు  బ్రతుకుతో బ్రతుకు సునాయాసంగానే కలిసిపోతుంది. కానీ, మనసుతో మనసు కలిసిపోవడమే ఎంతో కష్టమవుతుంది.  ఎందుకంటే ఏ మన సైనా ఒక మహా అంతులేని ఆకాశం కదా! ఆకాశం అంటే ఉత్తి శూన్యం అని కూడా కాదు! అది కోటానుకోట్ల గ్రహాల సమేతం. అనంత కోటి నక్ష త్రాల ఆవాసం. అందులోని,  దాన్నో దీన్నో మన సౌకర్యార్థం, అటో ఇటో కదల్చడం,  నేల మీదున్న వాగుల్నో, వంపుల్నో పక్కదోవ పట్టించినంత సులభం కాదు మరి! మానవుడి హృదయాకాశం పరిస్థితి కూడా దాదాపు ఇదే! ఎందుకంటే,  ప్రతి వ్యక్తీ  వేవేల అభిప్రాయాల్నీ ఆలోచనలల్నీ, ఆశయాల్నీ,  అన్నింటినీ మించి అనేకానేక లక్ష్యాల్నీ, సిద్ధాంతాల్నీ తన హృదయాకాశంలో ఎంతో బలంగా ప్రతిష్టించుకుని ఉంటాడు. ఎవరైనా ఏ కారణంగానో వాటిని కదిల్చే ప్రయత్నం చేస్తే అది అంత సులభంగా జరిగే పని కాదు. ఒక రకంగా ఆ ప్రయత్నం,  ఉప్పెనను ఎగదోయడం లాంటిది. అగ్ని సరస్సును జీవన స్రవంతిలో కలిపేయడం వంటిది. వింత ఏమిటంటే, ఆకాశం అంత గొప్పదే అయినా, ఎప్పుడైనా తనకు తానుగా ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, ఆ మార్చుకునే శక్తి మాత్రం ఆ  ఆకాశానికి ఉండదు. కానీ, అంతో ఇంతో ఉంటే ఆ అవకాశం మనిషికే ఉంటుంది. ఆ సావకాశాలన్నింటినీ ప్రోగు చేసుకుని, తన ప్రేమమూర్తిని గుండెల్లోకి తీసుకునే ప్రయత్నంలో అతని మనసు ఏ మాత్రం వెనుకాడదు. తన సర్వ శక్తులూ వెచ్చించి ఆ ఆనంద మూర్తిని సాధించే తీరతాడు. అప్పుడింక మనసూ, బ్రతుకూ ఆనందంగా కలగలిసిపోయిన ఆ  మహా సౌభాగ్యాన్ని అతడు  తనివితీరా ఆస్వాదిస్తాడు. ఆ మాధురీ హృదయ నాదంలో ఓలలాడుతూ జీవితమంతా హాయిగా గడిపేస్తాడు.  

ఆశలు తీరని ఆవేశములో - ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

కలగన్న ఆశలు గానీ, ఆశయాలు గానీ,  మొత్తంగా నెరవేరిన దాఖలాలు ఏ జీవితంలోనైనా ఉన్నాయా? అంటే,  అసలే లేవు.  ఏ ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా,   ఎంత గొప్ప అనుభపజ్ఞుడైనా సరే అతడు కలగన్న వాటిలో పది శాతమైనా నెరవేరవు. సమస్య ఏమిటంటే, చాలా మందిలో ఆ నెరవేరిన సంతోషమేమీ  పెద్దగా ఉండదు గానీ,  నెరవేరని వాటి తాలూకు వ్యధల్లో మాత్రం వారు బాగా కూరుకుపోతారు. ఇది మనసు సహజ గుణం. అయితే ఎవరి ఆశలు ఎందుకు నేరవేరలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెబుతాం? ఎవరి వైఫల్యాల వెనుక ఏ బలమైన కారణాలు ఉన్నాయో వాటి గురించి ఎవరికి వారు తెలుసుకోవలసిందే తప్ప అవి ఎదుటివారు చె ప్పగలిగేవి కాదు. ఎవరి అంచనాల మాట ఎలా ఉన్నా, నెరవేరని ఆశలు, చేజారిపోయిన విజయాలు, ఏ మనసునైనా కలత పెట్టకుండా ఉండవు. జీవితాన్ని ఏదో ఒక మేరకు అల్లకల్లోలం చేయకుండా ఉండవు.  ఆ కల్లోల హృదయంలో నిజంగా ఒక లావాలాంటి ఆవేశమే  పుడుతంది.  ఆక్రోశమే కాదు దాని వెనకాల అంతులేని ఆవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిసిన ఒకానొక దశలో లోకమంతా ఏదో  కారుచీకట్లు కమ్మేసినట్లే  అనిపిస్తుంది.. మనసు అయోమయంలో పడిపోతుంది. ఇలాంటి పరిణామాల్లో  చాలా మందిని  ఏకాంతం కాదు, ఒక కీకారణ్యం లాంటి  ఏకాకితనం కమ్ముకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మహా కాంతిపుంజంలా  ఒక హృదయ మూర్తి  ఎవరైనా, తన ఒంటరి లోకంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది?  ఎప్పటికీ వీడని ఒక తోడై నిలిస్తే ఎలా ఉంటుంది? వారి జీవితాల్లో  అక్షరాలా అది ఒక మహోత్సవమే ... వారి జీవనయానంలో అదో స్వర్గధామమే! 

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు - నీ కోసమే కన్నీరు నింపుటకు 
నేనున్నానని నిండుగ  పలికే 
తోడొక రుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

కాదనడానికి ఏముంది? ప్రతి వ్యక్తీ ఒక ప్రత్యేక ప్రపంచమే! అలా  ఒక ప్రపంచంగా విరాజిల్లే ఆ వ్యక్తిలో కచ్ఛితంగా కొన్నయినా ఇతరులు అతన్ని ప్రేమింపచేసేవిగా ఉంటాయి.  ఆ మాటకొస్తే, అతన్ని  ద్వేషింపచేసే అంశాలు కూడా ఏదో ఒక మేర అతనిలో ఉంటాయి. కాకపోతే,  లోకంలో నీ సామర్థ్యాల్ని ప్రశంసించే వాళ్లు అతి స్పలం్పగానూ, నీ  లోపాల్ని చూసి నిన్ను విమర్శించేవాళ్లు అత్యధికంగానూ ఉంటారు. అలాంటప్పుడు జీవన నేస్తాలు, కుటుంబ సభ్యులు, అయినవాళ్లూ, ఆత్మీయులు  కూడా ఆ ద్వేషించే వారి గుంపులో చేరిపోవడం అవసరమా? అతని వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే, సానుభూతితో వాటిని అధిగమించే సాయం అందించాలి గానీ, అతన్ని, దోషిలా చూస్తూ ఉండిపోతే ఎలా? ఇప్పటిదాకా  నీవాళ్లుగా, నీ ఆత్మీయులుగా చలామణీ అయిన వారు, నీ లోపాలకు అతీతంగా  నిన్ను చూడగలగాలి! నిన్ను నిన్నుగా ప్రేమించగలగాలి. లోకానిది ఏముంది?  దానికి వేయి నాలుక లు. . ఒక్కో సమయాన. అది ఒక్కోలా మాట్లాడుతుంది. నిన్న మొన్నటిదాకా నిన్ను ఎంతగానో శ్లాఘించిన  ఆ వర్గమే ఉన్నట్లుండి, నీ పైన కత్తికట్టవచ్చు. దారుణంగా హింసించనూవచ్చు.. దాంతో అప్పటిదాకా  అందరిలా నేనూ ఈ ప్రపంచంలో సమ భాగస్తుణ్ణే అనుకుంటూ వచ్చిన వాడు కాస్తా,  నాకెవరూ లేరు. ఈ ప్రపంచానికి నేను పూర్తిగా  పరాయివాణ్ననుకునే స్థితికి వచ్చేస్తాడు. కొందరైతే లోకాన్ని మొత్తంగానే  ఏవగించుకుని,  లోకాన్నే వదిలేయాలనుకుంటారు!  సరిగ్గా ఆ స్థితిలో ఎవరో వచ్చి, నీకు దాపుగా నిలబడి, ఎప్పటికీ నీకు  అండదండగా ఉంటానంటూ ఒక పూర్తి స్థాయి భరోసా ఇస్తే అప్పుడింక అంతకన్నా ఏం కావాలి? ఆరోహణలోనూ, అవరోహణలోనూ, జీవితపు అన్ని దశల్లోనూ, అన్ని దారుల్లోనూ, నీతో కలిసి నడుస్తానన్న ఆ  మనిషి ఏకంగా  నీ జీవితంలోకే ప్రవేశిస్తేనో...! అప్పటి వారి మనస్థితిని ఆనందమనే ఆ అతిసాధారణమైన మాటతో  కాకుండా దానికి  వేయింతలు గొప్పదైన మరే మాటైనా చెప్పుకోవాలి!    

చెలిమియె కరువై, వలపే అరుదై  - చెదరిన హృదయమే శిలయైు పోగా
నీ వ్యధ తెలిసి, నీడగ నిలిచే 
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ // మనసున //

ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే అది నిత్య పరిణామశీలి. ఒకసారి అది పూవులా ఉంటుంది. ఒకసారి అగ్ని గుండంలా ఉంటుంది.  ఒక్కోసారి,  ఇంకాసేపట్లో వ ర్షించి మహోత్పాతాన్నే సృష్టిస్తుందనిపించే భీకర ఆకాశంలా ఉండి మరికాసేట్లో అదేమీ లేని ఒక  మహా యోగినీ హృదయంలా దర్శనమిస్తుంది.  ప్రేమ ఒక్కోసారి మహోత్తుంగ తరంగంలా ఎగిసినట్లే  ఎగిసి అంతలోనే సముద్రంలో కలిసిపోయి, పరమ నిర్మలత్వాన్నీ, నిశ్చలత్వాన్నీ ప్రదర్శిస్తుంది. ఏమైనా, అప్పటిదాకా ఆకాశ వీధుల్లో విహరించిన ప్రేమ ఏ కారణంగానో అక్కడి నుంచి దిగిరావడానికి పూనుకున్నా, కనీసం అది నే లపైనైనా ఉండిపోవాలి కదా! అలా కాకుండా నేరుగా అది పాతాళంలోకే జారిపోతే ఎలా? నిన్నమొన్నటి దాకా  హృదయంలో హృదయంగా, జీవితంలో జీవితంగా ఉన్న ఇలాంటి అనేక మంది, ఒక్కోసారి  హఠాత్తుగా ఇలా ఎందుకు దూరమైపోతారు? ... అంటే ఏం చెబుతాం?  ఎవరి పరిస్థితులు వారివి! నిజానికి, ఇరువురూ ప్రేమలో పడిన నాడు ఇవన్నీ లేవు మరి! అప్పుడు  లేని  ఈ తరహా పరిణామాలెన్నో ఆ తర్వాత ఒక్కొక్కటిగా వచ్చిపడుతుంటాయి. వాస్తవానికి, అలా మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోవాలి. కానీ, అవి అలా పోకపోగా,  ఇంకా లోలోతులకు పాతుకుపోతాయి. వాటిని  నిరోధించే ఏ ప్రయత్నమూ ఏ వైపునుంచీ ఎవరూ చేయకపోతే,  ఇలా కాక ఇంకేమవుతుంది? ఇదంతా చాలదన్నట్లు,, కొందరు నిలువెత్తు విద్వేషాలూ, ఆగ్ర హాలూ ఎగజిమ్ముతారు. . నిజానికి హృదయ బంధాల్ని  పైపైనే చూస్తూ  రగిలిపోయేవారే  తొందరపడి బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతారు. అలా కాకుండా,  అంతరంగపు లోలోతుల్లోకి  వెళ్లి , వ్యధను, అంతర్వేదననూ ఆమూలాగ్రం అర్థం చేసుకున్న వారైతే అలా వెళ్లలేరు.  పైగా నీ సమస్త క్షోభల్ని  రూపుమాపి  పూర్వవైభవంతో మళ్లీ నిన్ను నిలబెట్టడానికి తమ సర్వశక్తులూ ధారవోస్తారు. ఆ ప్రయత్నంలో రోజులూ నెలలే కాదు. జీవితకాలమంతా నీతోనే,  నీలోనే ఉండిపోతారు. ఆ క్రమంలో సమస్త సంకెళ్ల నుంచి  నీకు విముక్తి కలిగించి,  నీకు  నీడనిస్తారు. నీ మనసుకు ఓదార్పునిస్తారు. నీ చుట్టూ వేల ప్రభాకరుల్ని నిలబెట్టి,  నీ దారిపొడవునా ఒక ఉజ్వల కాంతినీ, నీ జీవితానికి ఒక నిండు శాంతినీ  ప్రసాదిస్తారు. ఒక మహోజ్వలమైన భావనా స్రవంతిలో మనసున మనసైపోవడం అంటే ఇదే మరి!!

- బమ్మెర 

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా

      

20, ఏప్రిల్ 2022, బుధవారం

ఈ జీవన తరంగాలలో పాట | జీవన తరంగాలు సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ |

పాటలో ఏముంది? 

చిత్రం: జీవన తరంగాలు (1973), గీతం: ఆత్రేయ, సంగీతం: జె.వి. రాఘవులు, గానం: ఘంటసాల 

లోకంలో ఏదీ ఎవరికీ సొంతం కాదు. ఏదీ ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోదు. ఇది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఎవరైనా వేటితోనో మరీ గాఢంగా పెనవేసుకుపోతుంటే, అంత మమకారం సరికాదని లోకం అప్పుడో ఇప్పుడో  చెబుతూనే ఉంటుంది. ఆ మాటలు సరిగా మనసుకు పట్టాలే గానీ, అప్పటిదాకా బిగదీసుకుపోయిన జీవన బంధాలు కచ్ఛితంగా ఎంతో కొంత సడలిపోతాయి. కాకపోతే, బంధాలన్నీ అలా  సడలిపోయాక జీవితం పట్ల ఆసక్తిగానీ, ఆరాటం గానీ ఏముంటాయి? అనిపించవచ్చు. నిలువెల్లా నైరాశ్యం కమ్ముకుంటుందేమోనన్న బెంగ కూడా పట్టుకోవచ్చు. అలా అని జీవితం నుంచి ఎవరూ పారిపోలేరు. పారిపోకూడదు కూడా. అలాంటప్పుడు ఇదంతా ఒక ఆట, ఇదో చదరంగం అనుకుంటే అప్పుడు సరదాగానే అడేయవచ్చు. ఆటలో ఎవరు ఓడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరి జీవితం ఆనందమయం అవుతుందో, ఎవరి జీవితం  విషాదకరం అవుతుందో ఏదీ ఊహించలేం! కాకపోతే ఇదో ఆట అని ముందే అనుకుంటే, ఓటమి కూడా కుంగదీయదు. విషాదం కూడా బాధించదు. ఏది ఏమైనా,  ఓటమి గెలుపులతో గానీ, సుఖ దుఃఖాలతో గానీ,  సంభందం  లేకుండా ఎవరికి వారు ఎంతో బాధ్యతగా  జీవన చదరంగాన్ని ఆడాల్సిందే! ఫలితాలు ఎలా ఉన్నా,  అన్నింటికీ  సిద్దం కావలసిందే!
                       1973 లో విడుదలైన ’ జీవన తరంగాలు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాటను జె. వి. రాఘవులు స్వరపరిస్తే, స్వరధుని ఘంటసాల జీవన గాంభీర్యాన్నంతా పొదిగి ఈ పాటను గానం చేశారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ఈ పాటను ఈ పూట మరోసారి వినేద్దాం మరి!!

ఈ జీవన తరంగాలలో...

ఈ జీవన తరంగాలలో.... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము - ఎంతవరకీ బంధ ము // ఈ జీవన తరంగాలలో //

ఎగిసి ఎగిసి పడుతూ సాగే తరంగాలు, పైపైన చూస్తే,  దేనికది వేరేవేరేమో అనిపిస్తాయి. కానీ, అవన్నీ ఆ నదిలో లేదా సముద్రంలో అంతర్భాగమే కదా! నిజానికి ఆ ఎగిసి పడే తరంగాల్లో  అహం ఏమీ ఉండదు. సముద్రమే లేకపోతే, తమకు ఈ అస్తిత్వమే లేదనే మూలసత్యాన్ని ఎగిసి ఎగిసినట్లే ఎగిసి మళ్లీ పడిపోయిన ప్రతిసారీ గుర్తు చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే, ఉన్నట్లుండి ఒక్కోసారి నది నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా పలు  రకాల విన్యాసాలు చేసిన అలలన్నీ కనిపించకుండా పోతాయి. ఉన్నట్లుండి అవి హఠాత్తుగా అదృశ్యమైపోవడం చూసిన వాటి మనసు ఎంతో కొంత అలజడికి గురికావచ్చు. అయితే,   నీటి ప్రవాహంలోకి గాలి చొరబడినప్పుడే ఈ అలలు అవతరిస్తాయనే అసలు నిజం కాస్త ఆలస్యంగానైనా  స్పురించకపోదు. చొరబడిన గాలి వెనుదిరిగిన ఫలితమే ఈ నిశ్చలత్వానికి కి కారణమని బోధపడకుండా ఉండదు. మనిషి ప్రాణమైనా అంతే కదా! ఊపిరి ఉన్నంత సేపే మానవాళిలో ఉరుకూ పరుగులు ఉంటాయి. ఊపిరి ఒక్కసారి ఆగిపోగానే అంతా నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా మహోత్తుంగ తరంగంగా సాగిన జీవనది  మైదాన భూమిలా మారిపోతుంది. ఎడారిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత క్రమం ఉండనే ఉంటుంది.  జీవమే ఆగిపోయాక జీవన బంధాలన్నీ సమసిపోతాయి. అయినా,  ఎవరెంత ఆశపడితే మాత్రం ఏముంది?  భూమ్మీద మొదలైన బంధాలు మనిషి భూమ్మీద సచైతన్యంగా ఉన్నంత కాలమే ఉంటాయి. ఆ ఉపరితలం వదిలేసి, పాతాళంలోకో, ఆకాశంలోకో వెళ్లిపోయాక అన్ని బంధాలూ ఒక్క ఉదుటున తెగిపోతాయి. ఇవి ఎంత చేదునిజాలైతే మాత్రం ఏముంది? అందరూ ఈ పరిణామాలను స్వీకరించాల్సిందే. మనసును నిబ్బర పరుచుకోవలిసిందే!

కడపు చించుకు పుట్టిందొకరు - కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు - ఆ పై నీతో వచ్చేదెవరు
ఆపై నీతో వచ్చేదెవరు //ఈ జీవన తరంగాలలో // 

బిడ్డలు చెట్టంత అయ్యేదాకా కన్నవాళ్లు కళ్లల్లో పెట్టుకుని పెంచుతారు. కానీ, ఉన్న్డట్లుండి వారు హఠాత్తుగా కనిపించకుండా పోతే వాళ్లకెలా ఉంటుంది? కడుపున పుట్టిన వాడు తాము కడతేరే దాకా  తమ పంచనే ఉండాలని ఏ కన్నవాళ్లయినా కోరుకుంటారు. అది  అత్యంత సహజం!  కానీ, అందుకు భిన్నంగా తమ కళ్లముందే వాళ్లు జీవచ్ఛవాలైపోతుంటే ఎలా జీర్ణించుకోగలరు? మనసు మండినప్పుడు మనిషి చిత్రమైన వాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాం కానీ,  నిజానికి, ఆ చిత్రమైన స్థితి ఆ మనిషిది కాదు, అతని చుట్టూ ఆవరించి ఉన్న అతని జీవితానిది! అది బాహ్య ప్రపంచానికీ, అంతర ప్రపంచానికీ మధ్య నిరంతరం ఒరుసుకుపోతూ  సాగే  బండిచక్రపు ఇరుసు కదా! ఆ ఒరుసులాటలో జీవితం  ఎప్పుడు ఏ వైపు ఒరిగిపోతుందో తెలియదు.  చివరికి ఆ ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఆకులు దేనికది ఊడిపోయి ఎక్కడ  పడిపోతాయో కూడా  ఎవరూ ఊహించలేరు. విధి భీషణంగా మారినప్పుడు రక్తబంధాలన్నీ, కన్నబిడ్డలతో సహా ఎండుటాకుల్లా ఎటో కొట్టుకుపోవచ్చు. ఒక్కొక్కటిగా శూలాలై దిగుతుంటే,  త ట్టుకోలేని గుండె తడారిపోయి ప్రాణం ఆవిరైపోదా? అంతిమంగా స్మశానానికి చేరుకోవలసిందేగా, అయితే, అక్కడికి చే రవేయడానికైనా, కనీసం ఓ నలుగురైనా ఉండాలి! కన్నబిడ్డలెవరూ లేకపోయినా, ఉన్న ఆ నలుగురే  మానవ ధర్మంగా  కర్మకాండలన్నీ పూర్తి చేసి, అశ్రునయనాలతో ఆత్మకు వీడ్కోలు పలుకుతారు. మనసులో ఎవరికెంత ప్రేమ ఉంటేనేమిటి?  బహుదూరపు బాటసారి వెన్నంటి ఎవరు మాత్రం కడదాకా వెళ్లగరు? అందుకే చివరికి ఎవరికి వారు ఆ అనంతలోకాల్లోకి ఏకాకి ప్రయాణం చేయాల్సిందే!

మమతే మనిషికి బంధిఖానా - భయపడి తెంచుకు పారిపోయినా 
తెలియని పాశం వెంటబడి - రుణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది // ఈ జీవన తరంగాలలో //

కూడూ, గూడూ, గుడ్డా ఇవి భౌతికమైన బతుకునే ఇస్తాయి. కానీ అసలు మనిషి, అంటే అంతరాత్మ బతికేది మమతానురాగాల మధ్య. అయితే మధ్యలో మనసులోకి ఏ భయాందోళనలో జొరబడి మరే ఇతర కారణాల వల్లో ఈ బంధాలన్నింటికీ దూరంగా వెళ్లిపోవాలనీ అనిపించవచ్చు. తాత్కాలికంగా ఏమో గానీ, శాశ్వతంగా దూరం కావడం ఎవరికీ  సాధ్యం కాదు. భౌతికంగా ఒక వేళ దూరమైనా ఆత్మగతంగా నిరంతరం వాళ్ల మధ్యనే ఉంటారు. మనసుకలా అనిపించకపోయినా జరిగేది మాత్రం అదే! మమతల, ప్రేమపాశాల ఎత్తూ లోతుల గురించి గానీ,  వాటికున్న అపారమైన శక్తి గురించి గానీ, మనలో చాలా మందికి పెద్దగా ఏమీ తెలియదు. నిజంగా అవి అంత బలమైనవే కాకపోతే,  బంధాలకు దూరమై ఎటో వెళ్లిపోయిన వాళ్లల్లో చాలామంది చివరికి తిరిగి తిరిగి మళ్లీ  వెనక్కి వచ్చేస్తారు ఎందుకని?  ఎవరో రెక్కలు కట్టేసి,  లాక్కొచ్చినట్లు వదిలేసి వెళ్లిపోయిన చోటే వాలిపోతారెందుకుని? ఒక విషయం ఇక్కడ గమనించాలి! ప్రాణంలేని విమానాలో రాకె ట్లో  ప్రపంచాన్నంతా  చుట్టివస్తాయి కదా! పంచభూతాత్మకమై, జాజ్వల్యమానమైన ఈ  మహాప్రాణానికి ఇంకెంత వడి ఉండాలి? ఆ ప్రాణధారతో అఖండంగా వెలిగిపోతున్న ప్రేమశక్తికి ఎంత బలం ఉండాలి. కాకపోతే, ఇవేవీ, మేదోజ్ఞానానికి గానీ,  దాని తర్కానికి గానీ అంత సులువుగా అందేవి కావు.  అన్ని తర్కాలకూ అతీతమైన అంతర జ్ఞానానికీ, అందులోంచి దేదీప్యంగా వెలిగే అంతర చైతన్యానికి మాత్రమే ఇవి బోధపడతాయి! ఎవరికి వారు తమ మనసును అందుకు సిద్ధపరుచుకుంటే సరే సరి! లేదంటే  జీవితమంతా ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతారు. 

తాళి కట్టిన మగడు లే డని - తరలించుకుపోయే మృత్యువాగదు
ఈ కట్టెలు కట్టెను కాల్చక మానవు - ఆ కన్నీళ్లకు చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు // ఈ జీవన తరంగాలలో //

లోకాన్ని నడిపించే శక్తులు ఎన్నయినా ఉండవచ్చు. వాటన్నింటిలోకెల్లా అత్యంత బలీయమైనది మృత్యువేశ్రీ గమనించాలే గానీ, మృత్యువుకో నిర్దిష్టమైన విధానం,  నిఖార్సయిన తాత్వికతా కనిపిస్తాయి. ఆకాశంలోకి మేఘాలు రావచ్చు పోవచ్చు.. నక్షత్రాలు మొలవొచ్చు కనిపించకుండా పోవచ్చు. రుతువులు మారొచ్చు. వత్సరాలు మారొచ్చు. కానీ, ఉదయాస్తమయాలు మారవు కదా! వాటికో మొక్కవోని లెక్క  ఒకటుంది. ఆ మాటకొస్తే, మనిషి ఆలోచనా రీతులు మారొచ్చు. అతని మాట మారొచ్చు. మనసు ఆరాటాలు మారొచ్చు. అతని పోరాటాలు మారొచ్చు. కానీ, జనన మరణాలు మారవు కదా! వీటికి కూడా అంతే నిర్థిష్టమైన ఓ లెక్క ఉంటుంది. నిక్కచ్చితమైన ఘడియలు ఉంటాయి. అందుకే తాళి కట్టిన వాడు లేడనో, తలకొరివి పెట్టేవాడు లేడనో, మృత్యువు, అంతిమ ఘడియల్ని వాయిదా వేయదు.  అలా  ఎన్నో తెలిసి, ఎంతో ఆలోచించగలిగే మృత్యువే తన విధినిర్వహణలో ఏ సడలింపూ ఇవ్వకుండా  కఠినంగా,  అంత కచ్ఛిత ంగా ఉంటే,  ఏ ఆలోచనాలేని కట్టెలు, ఈ దేహపు కట్టెను కాల్చడంలో ఎందుకు వెనక్కి తగ్గుతాయి? అయిన వాళ్లూ, ఆత్మీయులూ కొండశోకం పెడుతున్నారని చితిమంటలు వాటికవే ఆరిపోతాయా? ఆప్తుల  కన్నీళ్లతో అవేమైనా చల్లారిపోతాయా? కాకపోతే ఇక్కడొకటి గమనించాలి. ఎంతసేపూ నిప్పు, ఒక మానవరూపాన్ని నిలువునా కాల్చి బూడిద చే స్తోంది కదా అనుకుంటామే గానీ, నిప్పు ఆ మనిషికి అలా ఓ పునర్జన్మను ప్రసాదిస్తోందన్న అసలు విషయాన్ని మనం మరించిపోతాం! కాదా మరి! లోకంలో ఏ రూపమైనా  కావచ్చు.  కాలి బూడిదైతేనే కదా అది మట్టిలో కలిసిపోతుంది! మట్టిలో కలిసిపోతేనే కదా ఎప్పుడో ఒకప్పుడు ఏదో  పాదులో కలిసి మొక్క మొలవడానికి ఆలంబన అవుతుంది. అలా ఆలంబన కావడం అంటే, అది మొక్కలో భాగం కావడమే కదా! అది  పునర్జన్మ కాక మరేమిటి?  అలా మళ్లీ మళ్లీ జన్మించి, జీవన పరంపరను అలా కొనసాగించడానికి మించి లోకంలో ఏ అస్తిత్వమైనా ఇంకా ఏం కోరుకుంటుంది? 

- బమ్మెర




8, ఏప్రిల్ 2022, శుక్రవారం

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా | తెలుగు పాత పాటల విశ్లేషణ |

పాటలో ఏముంది? 

చిత్రం: బ్రతుకు తెరువు, గీతం: జూనియర్‌ సముద్రాల, సంగీతం: సుబ్బరామన్‌ - ఘంటసాల, గానం: ఘంటసాల 

అందమె ఆనందం....!


అందం... ఆనందం ... ఇవి మనందరం రోజూ వినే మాటలే! 

ఒద్దికైన రూపురేఖలే కావచ్చు. మనసుపడే మనోహరత్వం కావచ్చు. ఆక ర్షించేదీ, ఆహ్లాదపరిచేదీ,  పారవశ్యంలో ఓలలాడించేదే కావచ్చు. మొత్తంగా అందమంటే ఇవే కదా మన దృిష్టిలో...!  జ్ఞానుల దృష్టిలో మాత్రం వీటి అర్థాలు పూర్తిగా వేరు. ’ఇప్పటికి నిగనిగలాడుతున్నట్లే  అనిపించినా మరి కాసేపట్లోనే వడలి, వాడిపోయేది అదేమంత గొప్ప అందం? ఎప్పటికీ చెక్కుచెదరకుండా,  దినదిన ప్రవర్థమానమయ్యేదే అసలు సిసలైన అందం’ అంటారు వారు. ఈ రోజు ఎంత అపూరూపంగా అనిపించినా, ’ఏరోజుకారోజు క్షీణిస్తూపోయే భౌతిక సౌందర్యాల వల్ల ఒరిగేదేముంది? అవి ఎంతోకాలం నిలబడలేవు. దేన్నీ నిలబెట్టలేవు’ అని కూడా అంటారు. అయితే,  దినదిన ప్రవర్థమానమయ్యే ఆ లక్షణం లోకంలో సత్య జ్ఞానానికీ, సౌందర్య జ్ఞానానికే తప్ప మరిదేనికీ ఉండదని  కూడా వారు నొక్కి చెబుతారు. నిజానికి,  సత్య జ్ఞానమూ, సౌందర్య జ్ఞానమూ ఈ రెండూ ఒకటే. ఒకవేళ ఏ కారణంగానో ఈ రెండింటినీ వేరువేరే అనుకున్నా, ఈ రెండింటి మూలతత్వం మాత్రం చైతన్యమే! ఈ క్రమంలోనే ’ సత్యం - శివం - సుందరం’ అంటూ ఒక మహా వ్యాఖ్య చేస్తారు.  సర్వ సమగ్రమైన చైతన్యమే సౌందర్యం అనేది ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. అంటే ఏమిటి? దేన్నించి అయితే  ఏదీ పక్కకు వెళ్లదో, , ఏదైతే సర్వకాల,  సర్వావస్థల్లోనూ సచేతనంగా నిలిచి ఉంటుందో అదే సుందరమనేది వారి భావన.

ఏమైనా,  ’అందమె ...ఆనందం’ ఆంటూ. అలతిపొలతి మాటలతో మొదలై ....అనంతమైన ఆధ్యాత్మిక దిశగా నడిపించే  ఈ పాట సినీగీత సాహిత్యంలో ఒక కలికితురాయి.  1953 లో విడుదలైన ’బ్రతుకు తెరువు’ సినిమా కోసం జూనియర్‌ సముద్రాల  రాసిన  ఈ పాటకు.. సి.ఆర్‌. సుబ్బరామన్‌ - ఘంటసాల సంయుక్త సంగీత సారధ్యంలో ఆపాత మధురమైన బాణీయే సమకూరింది. ఈ పాటను పాడటంలో ఘంటసాల గొంతులో  నిజంగా అమృత ధారలే ఒలికాయి. అందుకే ఈ పాట ఆవిర్భవించి. ఇప్పటికి ఏడు దశాబ్దాలు కావస్తున్నా  తెలుగు వారి గుండెల పైన అది ఇప్పటికీ తేనె జల్లు  కురిపిస్తూనే ఉంది. నిజానికి, దశాబ్దాలు, శతాబ్దాలే కాదు, ఎప్పటికీ ... ఎప్పటికీ ఒక్క మాటలో  చెప్పాలంటే... భూమ్మీద తెలుగు హృదయాలు ఉన్నంత కాలం,  ఈ పాట రసఝరులు ఒలికిస్తూనే ఉంటుంది.  

అందమె ఆనందం .....
ఆనందమె జీవితమకరందం // అందమె //

నిజానికి, ’సౌందర్యమే సత్యం... సత్యమే సౌందర్యం’  అన్న వేదాంత వ్యాఖ్యానమే ఈ  పాటలోని ’అందమె ఆనందం’ అన్న పాదానికి ప్రాణమయ్యింది.  ఉన్నదంతా సత్యమే.. లేనిదే అసత్యం. ఉండడం అంటే  ఈ రోజు ఉండి, రేపటికి కనుమరుగైపోవడం అని కాదు. అనాదిగా, ఆద్యంతంగా, అజరామరంగా నిలిచి వెలగడం.  అందం అనే కాదు. అనందం కూడా అలాంటిదే! ’ఆనందం’ అన్నది అనంతం అన్న మాటలోంచే కదా  ఆవిర్భవించింది.  ఏది క్షణికం కాదో, ఏది శాశ్వతమో, ఏది అనంతమో  అదే ఆనందాన్నిస్తుందనే కదా ఈ మాటకు అర్థం? లోకంలోని సర్వ వస్తు సముదాయం, భౌతికమైన సమస్త వసతులు, సకల సౌకర్యాలూ, ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ ఇస్తూ,  మనిషికి తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలనైతే ఇవ్వగలవు. అంతే గానీ, వీటిల్లో ఏ ఒక్కటీ  శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషికి అసలు సిసలైన ఆనందాన్ని ఇవ్వగలిగే ది అభౌతికమైన,  శాశ్వతమైన, అనంతత్వ జ్ఞానమొక్కటే! ఒకటి మాత్రం నిజం! సత్యానికైనా, సౌందర్యానికైనా అంతిమ లక్ష్యం ఆనందమే!  అందుకే ఆనంద పిపాసులు ఎటెటో తిరిగి తిరిగి చివరికి  అనంతత్వాన్ని ప్రభోదించే ఆధ్యాత్మిక విషయాల్లోకే ప్రవేశిస్తారు. జీవిత మకరందమైన ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు. 

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం // అందమె //

నిజమే! రూప సౌందర్యాలూ, ప్రకృతి సౌందర్యాలూ క్షణికమైనవే, తాత్కాలికమైనవే, కాకపోతే మనిషి వాటినుంచి కూడా స్పూర్తి పొందవచ్చు. తన మనసును కూడా పడమట సంధ్యారాగమంత సుశోభితం చేసుకోవచ్చు. పూలపరాగాల్లో హృదయాన్ని పరిమళ భరితం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం విశ్వమంతా సమస్త ప్రాణికోటిలో చైతన్యం నింపే స్పూర్తికుండమే కదా! ఆ వరుసలో చూస్తే, చంద్రుడు నీ మనసును తనలా ఎప్పుడూ చల్లచల్లగా, వెన్నెల కురిపిస్తూ ఉండేలా చూసుకొమ్మంటాడు. సూర్యుడేమో అన్నివేళలా అలా ఉంటే కుదరదు నాయనా! జీవితం అన్నాక అప్పుడప్పుడైనా నాలా భగభగా మండడం కూడా అవసరమే అంటాడు. నదులూ, సముద్రాలేమో, జడ త్వాన్ని ఽఎప్పుడూ దరి చేరనీయకుండా ఒక ప్రవాహంలా ఉండాలంటూ తమవైన పాఠాలు చెబుతాయి. అదే సమయంలో అందుకు భిన్నంగా  నిరంతరం తరంగాల్లా ప్రతిదానికీ తల్లడిల్లిపోతే ఎలా? నిశ్చలంగా, నిబ్బరంగా తమలా నిలిచి ఉండాలంటూ, పర్వతాలు తమ అస్థిత్వాన్ని చాటి చెబుతాయి. మోహన రాగాలనేవి చెలిచెంత నుంచే కాదు పురుషోత్తమా! ముగ్దమనోహరమైన నీ అంతరంగమే అనంతకోటి మోహన రాగాలు వినిసిస్తుంది ఒకసారి విని చూడు! అంటూ గాలి ఈలలు వే స్తూ, నీ భుజాలు కుదుపుతుంది. అవునూ.... చెంతనే   ఇన్నిన్ని రసస్పూర్తులు అందుతుంటే, ఎవరికైనా, లోకం మహత్తరంగా, జీవితం మధురాగనురాగంగా అనిపించక ఏంచేస్తుంది?  

పడిలేచే కడ లితరంగం
వడిలో జడిసిన సారంగం 
సుడిగాలిలో..... సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం // అందమె //

నిలువెల్లా చైతన్య దీప్తులు నింపుకున్న జీవితం ఎక్కడా రాజీ పడదనేది నిలువెత్తు నిజం!  తరంగంలా అది ఎన్నిసార్లు పడిపోతే, అన్ని సార్లూ మళ్లీ లేచే ప్రయత్నమే చేస్తుంది..  ఏ పక్షి అయినా అనుకోని  వాన వడిలో తడుస్తూ,  ముందు కొంత భయభ్రాంతికి గురైతే కావచ్చు కానీ, ఆ వెంటనే, జవసత్వాలు నింపుకుని తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు పతంగం,  మేఘాలను తాకితే  అందులో అంత గొప్పేముంది? అందుకు భిన్నమైన సుడిగాలిలో కూడా పతంగం ఉవ్వెత్తున ఎగురుతుంది. అన్నింటికీ ఎదురీదుతుంది.  కాకపోతే ఈ పోరాటాలన్నీ మన మేమిటో మనకు పూర్తిగా అవగతమైనప్పుడే చెయ్యగలం!  పంచభూతాత్మకమైన మొత్తం ప్రపంచం సూక్ష్మరూపంలో మనలో వసిస్తున్నదన్న అసలు సత్యం బోధపడినప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం కాగలం! కాకపోతే, ఉన్నట్లుండి,  ఏదో ఒక రోజున ఒక నైరాశ్యం, ఒక వైరాగ్యం మనసును ఆవహించవచ్చు. ఎందుకంటే,  ఇంతా చేసి చివరికి మిగిలేదేమిటి?  ఏదో ఒక రోజున అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి లోకం నుంచి నిష్క్రమించాల్సిందే కదా అనిపించవచ్చు. ఆ స్థితిలో రంగస్థలం మీది నుంచి బయటికి వె ళ్లిపోతున్న నటీనటుల్లాగే మనకు మనం కనిపించవచ్చు. ఆ మాటకొస్తే  మొత్తం జీవితమే ఒక నాటకంలా కూడా అనిపించవచ్చు. అవునూ! ఒకవేళ నాటకమే అయితే మాత్రం ఏమిటి? ప్రదర్శనకు సిద్ధమైనప్పుడు వేదికపై ఉన్నంత సేపు మన భూమికను మనం అద్భుతంగా పోషించగలిగితే చాలదా? జీవన వేదికా, నటనా వేదికా అన్నది ఇక్కడ విషయమే కాదు. నీ పాత్రకు నువ్వు పూర్తి స్థాయిలో న్యాయం చేశావా లేదా అన్నదొక్కటే అత్యంత కీలకమవుతుంది. ఆ నిర్శహణా పటిమే హృదయంలో మొక్కవోని అందాన్నీ, నిండైన ఆనందాన్నీ నింపుతుంది. అన్నింటినీ మించి  జీవితానికి ఒక పరిపూర్ణమైన సార్థకతనిస్తుంది. ఏ  మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలి!! 

- బమ్మెర