27, మార్చి 2021, శనివారం

స్వయంవరం సినిమా || గాలివానలో... వాననీటిలో... పాట || శోభన్ బాబు

పాటలో ఏముంది?

గానం అంటే రాగాలు ఆలపించడం మాత్రమే కాదు కదా! ప్రకృతిలోని ప్రతినాదాన్నీ గొంతులో పలికించాలి.  ‘గాలివానలో’ అన్న ఈ పాటను పాడుతున్నప్పుడు ఏసుదాసు గొంతులో  నిజంగా, ఆ వానగాలి హోరు., ఉప్పెన వరదల అలజడీ స్పష్టంగా వినిపిస్తాయి. 1982లో విడుదలైన ‘స్వయంవరం’  సినిమా కోసం దాసరి నారాయణరావు రాయగా, సత్యం  స్వరపరిచిన ఈ పాట మానవజీవితాలకు సమాంతరంగా ఎప్పటికీ అలా సాగిపోతూనే ఉంటుంది.

 గాలివానలో... వాననీటిలో...




గాలి వానలో .... వాన నీటిలో.....
గాలి వానలో ...  వాన నీటిలో ... పడవ ప్రయాణం
తీరమెక్కడో ...  గమ్యమేమిటో ...  తెలియదు పాపం
తెలియదు పాపం... ఓహోహో......

గాలీ ... వానా ఒక్కటైతే, 

సమస్త ప్రాణికోటీ, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎడతెగని వానలతో  వరదలు పోటెత్తిపోతుంటే, గుండెలు ఎగిసిపడినట్లు నదులూ, సముద్రాలూ ఉప్పొంగిపోతాయి మరి! సరిగ్గా అదే సమయంలో ఎవరైనా,  పడవ ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఎంత భీభత్సమది? కాకపోతే, ఈ తరహా ప్రకృతీ వైపరీత్యాల గురించి, దాదాపు అందరికీ ఎంతో కొంత ముందే తెలుసు. అందుకే వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న విషయంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అందువల్ల, ఎవరికి వారుగానో, సామూహికంగానో తీరం చేరే, ప్రయత్నాలూ, తీరం చేర్చే ప్రయత్నాలూ చేస్తూపోతారు. అయితే, నేలకూ, ఆకాశానికీ మధ్యే కాదు, ఒక్కోసారి గుండెల మధ్య కూడా సుడిగాలి వానలూ, ఉప్పెన వరదలూ పోటెత్తిపోతాయి. కాకపోతే ఇవి ప్రకృతీ వైపరీత్యాల్లోలా అందరిలో ఒకేలా ఉండవు. మనిషి మనిషికీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పుట్టుకొచ్చే  ప్రతి సమస్యా, ప్రతీ సంక్షోభం కనీ వినీ ఎరుగని రీతిలోనే ఉంటాయి. జీవితపు ఈ సుడిగాలి వానలో .కొందరి హృదయ సౌధం తునాతునకలైపోతుంది. ఊపిరే కాదు. జీవితమే ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

ఇటు హోరుగాలి అని తెలుసూ..... అటు వరద పొంగు అని తెలుసూ .....
హోరుగాలిలో ... వరద పొంగులో ... సాగలేననీ తెలుసూ
అది జోరువాన అని తెలుసూ.....ఇవి నీటి సుడులనీ తెలుసూ...
జోరువానలో ... నీటి సుడులలో ... మునక తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం.... 
తీరమెక్కడో ... గమ్యమేమిటో తెలియదు పాపం...  తెలియదు పాపం... ఓ... ఓ.....

అన్ని వరదలూ మనిషిని ముంచేయలేనట్లే, అన్ని వరదల్నీ మనిషి అధిగమించలేడు. అయినా, ఆ వచ్చే వరద ఎంతో ఉధృతంగా ఉందని తెలిసి తెలిసే అందులోంచే ప్రయాణించాల్సి రావడం నిజంగా ఎంత నరకం? పైగా ఈ పరిణామాలు చివరికి ఎటు తీసుకుపోతాయో, అంతిమంగా ఏమై మిగులతామో కూడా ఏమీ అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? ఆ నిస్సహాయ స్థితిలో, ఏ కూడలిలోనో, ఏ మలుపు దగ్గరో, వరదలో కొట్టుకు వచ్చే చెక్కనో, చెట్టుకొమ్మనో పట్టుకుని కాసేపు సేద తీరవచ్చేమో కానీ, అదెంత సేపు? దాన్నే తీరం అనుకుని అక్కడే బస చేయలేం కదా! మజిలీలన్నీ తీరాలు కానట్లే, తీరాలన్నీ గమ్యాలు కాలేవు మరి! ఉధృతమైన ప్రవాహంలో ఒకసారి పడిపోయాక, తిరిగి ఒడ్డుకు చేరుకోవడం అంత సులువేమీ కాదు, పైగా, ఎంతో కొంత ఆసరా అనుకున్నది కూడా ఒక్కోసారి హఠాత్తుగా చేజారిపోవచ్చు. అది చాలదన్నట్లు, అదే సమయంలో ఆ ప్రవాహం ఒక మహా సుడిగుండం వైపు తీసుకుపోనూవచ్చు.  సమస్య ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో ఏ రెండు రూపాలూ ఒక్కలా ఉండనట్లు, ఏ రెండు జీవితాలూ ఒక్కలా ఉండవు. అందువల్ల అవతలి వ్యక్తి ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్నవారైనా, వారిచ్చే సలహాలూ, సూచనలు ఇవతలి వ్యక్తికి పెద్దగా ఏమీ ఉపయోగపడవు. అందువల్ల కొట్టుకుపోతున్న ఎవరైనా, నదీ ప్రవాహాన్ని తనకు తానుగా  బేరీజు వేసుకోవలసిందే! తన జీవిత నౌకను తనదైన ఆలోచనలతో ఒడ్డుకు చేర్చే పాట్లు పడాల్సిందే! ఒకవేళ మునక తప్పదని తెలిసినా, దానికి కూడా తనదైన రీతిలో తనను తాను సిద్ధం చేసుకోవలసిందే! 

ఇది ఆశ నిరాశల ఆరాటం..... అది చీకటి వెలుగుల చెలగాటం .....
ఆశ జారినా, వెలుగు తొలగినా ఆగదు జీవన పోరాటం
ఇది మనిషీ మనసుల పోరాటం.....అది ప్రేమా పెళ్లీ చెలగాటం....
ప్రేమ శకలమై ... మనసు వికలమై ... బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం.....
తీరమెక్కడో ... గమ్యమేమిటో ... తెలియదు పాపం....
తెలియదు పాపం ..... ఓ.. ఓ... ఓ

విచిత్రం ఏమిటంటే, ప్రాణాలు నిలుపుకోవడం ఇంక అసంభవమేనని ఒక పక్కన అనిపిస్తున్నా, మనసు మాత్రం పూర్తిగా ఆశ వదులుకోదు. హృదయక్షేత్రంలో ఇక్కడే ఆశానిరాశల మధ్య ఒక అంతర్యుద్ధం మొదలువుతంది. భూమ్యాకాశాల్ని కటిక చీకట్లు కమ్మేసినా,  మొండి మనసు ఒక వెలుతురు కిరణం కోసం ఎదరుచూస్తూనే ఉంటుంది. కాకపోతే,  మధ్య కాసేపు చీకటి, కాసేపు వెలుగు వస్తూ పోతూ ఉండడం, ఒక చెలగాటంలా అనిపిస్తుంది. అయినా జీవితేచ్ఛ శక్తినంతా కూడగట్టుకుని చైతన్య దీపాలు వెలిగించే ప్రయత్నం మానుకోదు. ఈ క్రమంలోనే బ్రతుక్కీ, జీవితానికీ మధ్య , అంతస్తులకీ, అంతరంగానికీ మధ్య, బాహ్య ప్రపంచానికీ, ఆత్మలోకాలకూ మధ్య జీవన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ఇవే కాకుండా, ప్రేమకూ, ఆ ప్రేమను శాశ్వత పరుచుకోవడం కోసం జరిగే పెళ్లి ప్రయత్నాలూ ఇవి కూడా పోరాటాలే అవుతాయి.  ఈ పోరాటం మరీ తీవ్రమైనప్పుడు ఒక్కోసారి శరీరమూ, మనసూ, ఆత్మ తన శక్తియుక్తులన్నీ కోల్పోతాయి. ప్రాణం అలసి, సొలసి, డస్సిపోయి  జీవచ్ఛవమైపోతుంది. నడిచే సమాధిలా మారిపోతుంది.  తన చుట్టూ తాను తిరుగుతూ,  సూర్యుని  చుట్టూ తిరిగే  భూమిలా  తన సమాధి చుట్టూ తాను తిరుగుతూ, తన అంతర్లోకాల చుట్టూ తిరుగుతుంది. దిక్కుతోచక ఒక్కోసారి నభోనిలయాలు పిక్కటిల్లేలా గొంతెత్తి అరుస్తుంది. గోడుగోడుమని ఏడుస్తుంది. నిజమే కానీ , ఇప్పటిదాకా నడిచిన , నడుస్తున్న పరిణామాలే ఎప్పటికీ కొనసాగుతాయనుకోవడంలో ఔచిత్యం  లేదు కదా! ఇప్పుడు కళ్లముందున్నవి సరే! కంటికి కనిపించకుండా , ఊహకైనా అందకుండా , దూరదూరంగా ఏ శుభ పరిణామాలు నీ చెంతకు చేరడానికి సిద్ధమవుతున్నాయో ఎవరికి తెలుసు ? ఇప్పటిదాకా లేనిది ఎప్పటికీ రాదని ఎలా అనుకుంటాం? హృదయ ద్వారాలు సంపూర్ణంగా తెరిచి ఉంచితే , వ్యధలూ , వేదనలు లోనికి ప్రవేశించినట్టే , సంతోషాలు ఆనందాలు ప్రవేశించవచ్చు ! మనలోనైనా ఇప్పటిదాకా లేని శక్తియుక్తులు కొత్తగా ఏం పుట్టుకొస్తాయో ఎవరికి తెలుసు ? ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి . జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే అది హృదయాన్ని విశాలం చేయడమే . జీవితాన్ని ఆకాశం చేయడమే!
                                                                                                                                                          - బమ్మెర 

18, మార్చి 2021, గురువారం

‘ప్రేమనగర్‌’ సినిమా | తేటతేట తెలుగులా పాట | Telugu old songs |

 పాటలో ఏముంది?

తెలుగు తేటతనం గురించి తెలియడానికి , ‘ప్రేమనగర్‌’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ ఒక్క పాట  వింటే చాలు. పాటలోని ప్రతి పదం ఒక పాటంత అపురూపంగా వినిపిస్తుంది. ఈ గీతానికి  స్వరాలు కూర్చడంలో మహదేవన్‌  తన అనుభవమతా పెడితే, ఆ పాటకు ప్రాణం పోయడంలో ఘంటసాల,  మంద్ర-తార స్వర మాధుర్యాల మంత్రమే వేశాడు. విని తరించండి!

తేటతేట తెలుగులా.....



తేటతేట తెలుగులా - తెల్లవారి వెలుగులా  
తేరులా ... సెలయేరులా - కలకలా- గలగలా
కదలి వచ్చిందీ కన్నె అప్సరా - 
వచ్చి 
నిలుచిందీ కనుల ముందరా // తేట తేట తెలుగులా //
తన మనసంతా నిండిపోయిన మగువ తనకు ప్రాణప్రదమైన మాతృభాషలా ఎదురుపడటం ఎంత అపురూపం? 

ఆ రావడమైనా అలసీ సొలసీ డస్సిపోయిన వేళ వచ్చే నడిరేయి వెన్నెలలా కాకుండా, మనసంతా క్రాంతులు నింపే  తెల్లవారి వెలుగులా కనిపిస్తె ఎంత గొప్ప ఆహ్లాధం?

హృదయ స్పందనల్ని మోసుకొచ్చే పూల తేరులా.... ఎన్నో జీవన ప్రవాహాల్ని తనలో కలిపేసుకున్న సెలయేరులా నడిచిరావడం ఎంత మనోహరం? 

అలల నాదాలే పదధ్వనులుగా రావడం అంటే అది ఇంకెంతో రసానందం. ఇంతకీ అవన్నీ కలగలిసిన ఆ హృదయేశ్వరి ఎవరు? ఒక కన్నె అప్సర. అంటే .... నవయవ్వని అనేనా ! 

ఇంకా ఎవరికీ మనసివ్వనిది అని కదా! అప్పటికే మనసిచ్చేసిన అప్సరసలు ఎంతో మంది ఉండవచ్చు. అతనికి వాళ్లతో ఏంపని? అందుకే అతడు కోరుకున్నట్లు కన్నె అప్సరే కళ్ల ముందు వచ్చి నిలుచుంది. 

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా - ఎంకి కొప్పులోని ముద్దబంతి పూవులా 
గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినదీ - పలికినదీ - పలికినదీ
చల్లగా - చిరుజల్లుగా - జలజలా - గలగలా  కదలి వ చ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలుచిందీ కనుల ముందద! // తేట తేట తెలుగులా //

ఎంకి, అప్సరలు కొందరు అంటున్నట్లు  కావ్యకన్యలే కావచ్చు. అయితే మాత్రం ఏమిటి? అవి నిజరూపాల కన్నా, వేయి రెట్లు ఉన్నతమైనవి. 

కవి మహర్షుల  కల్పనా ప్రతిమలే అయితే మాత్రమేమిటి? అవి  ఆది సృష్టికి సమాంతరంగానే నిలిచి, భావుకుల హృదయ దారుల్లోంచి సాగిపోతున్న సజీవ రూపాలు. 

అయినా ప్రకృతి చేసిన సృష్టి వద్దే ప్రపంచం ఆగిపోవాలా? పరిణామ క్రమంలో ఇంతింత మేధో శక్తి సాధించిన మనిషి తానుగా  సృజనేదీ చేయకుండా చేతులు ముడుచుని ఎలా కూర్చుంటాడు?

తననుంచి వెల్లువెత్తిన ఆ సృజనకు ప్రతిస్పందనగా, ప్రకంపనగా నదీ కెరటాలు తమవైన గీతాలు ఆలపించకుండా ఎలా ఉంటాయి? 

రెక్కలొచ్చి  ఊహలన్ని ఎగురుతున్నవి.... ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నొ రూపాలు వెలిసినవి వెలిసినవి వెలిసినవి 
వీణలా, నెరజాణలా - కలకలా - గలగలా.....కదలి వచ్చింది కన్నె అప్సరా 
వచ్చి నిలుచిందీ కనుల ముందరా? // తేట తేట తెలుగులా //

ప్రేమలు కట్టుకునే గూళ్లు, పొదరిళ్లు తెలుసు,  ప్రేమసౌధం అనడం కూడా తెలుసు. కానీ ‘ప్రేమ మందిరాలు’  అనే  ఈ మాటకు అర్థమేమిటి? ఈ మాటను  ఇంతకుముందు ఎంతమందైనా అని ఉండవచ్చు. కానీ,  ఎవరెన్ని సార్లు అన్నా  కొందరికి అది ఎప్పటికీ కొత్తగానే వినిపిస్తుంది. అసలా మాట ఎందుకొచ్చింది? అనే మీమాంస ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే, ప్రేమను ఎవరో ఒకరు దైవంగా చూడటమే జరగకపోతే,  ప్రేమ మందిరం అన్న మాటే పుట్టదనేది వాస్తవం. కాకపోతే, దైవం అనేది ఏక రూపాత్మకం కాదనే మాట కూడా ఈ సందర్బంగా చెప్పుకోవాలి. ఎందుకంటే  ముక్కోటి దేవతలు అంటూ మనకో లెక్క ఉంది కదా! ఆ లెక్క ప్రకారం ప్రేమదేవత ఎన్నెన్ని రూపాలుగానో కనిపిస్తుంది . అయినా, అంతిమంగా అన్నీ ఒకటేలే అన్న అద్వైత భావనే నిలుస్తుంది. ఏమైనా ప్రేమను ఒక దైవంగా చూడటం, ఆ దైవం కోసం ఒక మందిరాన్నే  నిర్మించడం నిస్సందేహంగా అదో దివ్య భావనే  కాకపోతే ఆ భావన అలా వచ్చి ఇలా పోయేదిగా కాకుండా అది స్థిరంగా, శాశ్వతంగా నిలిచి వెలిగేదై ఉండాలి !!

                                                                  -  బమ్మెర 

=======================================



6, మార్చి 2021, శనివారం

చిత్రం : తెనాలి రామకృష్ణ | గానం : ఘంటసాల | సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ రామ్మూర్తి

 చిత్రం : తెనాలి రామకృష్ణ
చమత్కారం : తెనాలి రామలింగడు
గానం : ఘంటసాల
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ రామ్మూర్తి

   పెదవులు కదిపి చూడండి!

‘‘అయ్యా! తమకు అంతటితోనే జయపత్రిక అందదు’’ అన్నాడు తెనాలి రామకృష్ణుడు.

అది రాయలవారి భువనవిజయం. అక్కడ అష్టదిగ్గజ కవులున్నారు. తాతాచార్యుల వంటి వేదాంతాది శాస్త్రపండితులున్నారు. ఎంతమంది వున్నాగడ్డు సమస్యలు వచ్చినప్పుడు అడ్డుపడేవాడు రామకృష్ణుడే.

సాక్షాత్తూ తాతాచార్యుల శిష్యుడే ఓ సందర్భంలో... ‘మతవిషయకమైన చర్చ వచ్చినట్లయితే మా గురువుగారు మాడు వాయగొట్టేవారే. కానీ ఇది వ్యాకరణం అయిపోయింది’ అంటాడో సందర్భంలో. అటువంటిది రామకృష్ణుడు సభలోనే ఉన్నప్పుడు వైరిపక్షం వారికి గెలుపు అంత తేలిగ్గా దక్కనిస్తాడా? అడ్డు పడనే పడ్డాడు.

వచ్చినవాడు సహస్రఘంటకవి నరసరాజు. ‘పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి విజయపత్రిక కటాక్షించండి’ అంటూ భువనవిజయంలో కాలుపెట్టాడు.
ముందుగా ఘంటం పడతానని పరీక్షకు కూర్చున్న అతగాడిని.... కుటిలోపాయాలు తెలియని తేటతెల్లపు కవి అయిన ధూర్జటి.... కొంచెం పరీక్షించాడు కానీ, లాభం లేకపోయింది. చెప్పింది చెప్పినట్లు నరసరాజు రాయనే రాసేశాడు.

అప్పుడన్నాడు రామకృష్ణుడు. ‘తమకు అంతటితోనే జయపత్రిక అందదు’ అని.

‘మరో శారదామూర్తి అందుకోవచ్చు’ అని నరసరాజు సవాలు విసిరాడు.

‘నేను అందుకుంటున్నాను రాయండి’ అంటూ తెనాలి రామకృష్ణుడు ఆదిలోనే హంసపాదు పడేలా మారుమోగేలాంటి పద్యం చెప్పాడు.వేగంగా రాస్తాను అన్నవాణ్ణి ఎక్కడో చివర్లో ఆపడం కాకుండా... మొదటి
మాటతోనే నిలిపేశాడు.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళుక్
అవ్వట; అరయంగ నట్టి హరునకు జేజే!


బాబా అంటే వాహనం. ఇకరామకృష్ణుడు మొదటిగా చేసిన శబ్దం.... తృవ్ హెహె అని ఎద్దును అదిలిస్తారు కదా అది. మొత్తంమీద ఎద్దును వాహనంగా కలవాడు అని అర్థం. జాబిల్లిని తలమీద పువ్వులాగా పెట్టుకున్నవాడు శివుడే కదా! ఆయనకు అవ్వ అంటే తల్లి హుళక్కి.... లేదు! తల్లిదండ్రులు లేకుండా పుట్టినవాడని అర్థం. అటువంటి శివునికి జేజేలు చెబుతున్నాడు కవి.

ఇది కందపద్యం. ఒక్కసారి ఈ పద్యానికి ఘంటసాల గానాన్ని, అక్కినేని అభినయాన్ని జాగ్రత్తగా మరోసారి పరికించండి. నోరారా మీరు పలికి చూడండి. తృవ్ అని మీ చిన్నారుల చేత పలికిస్తూ ఈ పద్యాన్ని నేర్పించండి. వారికి ఆటగా ఉంటుంది. పైగా భావమేమో శివునికి నమస్కారం అని. కాబట్టి రెండిందాలా లాభం.

మనమైతే తృవ్ అని రాసేసుకున్నాం కానీ, అలా రాసి సరిపెట్టుకోవడానికి నరసరాజుకు తోచలేదు. పాపం తెనాలి రామకృష్ణుని చేత ముక్కచివాట్లు తిన్నాడు.

తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
బలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడరాన్నరసా విరసా తుసా భుసా

వార్నీ! కవులకు మరీ ఇంతటి అహంకారమా? ఏదోపాపం రాస్తానన్నవాడు రాయలేకపోతే ఇంతమరీ చెడతిట్టాలా? అనుకోవాల్సిన పనిలేదు. నీకు రాయడం కూడా రాదని రామలింగడు వాడినక్కడే ఆపకపోయి వుంటే... అతగాడు తరువాత చేస్తానన్న పనేమిటి... పెద్దల కవితల్లో తప్పులు పడతానని. ఈ పని మనలో పెద్దపెద్దవాళ్లం అనిపించుకున్నవాళ్లం కూడా నిత్యం చేసేస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఈ పద్యం ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.

‘ఓయి కవి నరసా... నీవు చేసేదంతా విరసమే. బుస్సుబుస్సులు తప్ప ఏమున్నది నీలో?! ఈపాటి పద్యమే వ్రాయలేక నీ పనితనమంతా తుస్సా... ఇక దయచేయి. ఒళ్లు దగ్గరపెట్టుకో!’.... అనడానికి ముందు ఇంకా భయంకరమైన తిట్లు తిట్టాడు.

ఆర్యవ్యవహారంబులు అదుష్టంబులు గ్రాహ్యంబులు... అన్నాడు చిన్నయసూరి. పెద్దలు కవితాత్మకంగా కానీ, సందేశాత్మకంగా కానీ ఏదైనా ప్రయోగం చేస్తే దానిలో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. దానిని దుష్టప్రయోగంగా అనుకోకూడదు. యధాతథంగా తీసుకుని మననం చేసుకునే కొద్దీ కవిభావమేదో తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేద్దాం.
- నేతి సూర్యనారాయణశర్మ
శంకరవిజయం నవలా రచయిత

1, మార్చి 2021, సోమవారం

తెల్లవారక ముందే పల్లె లేచింది పాట | ముత్యాలపల్లకి సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ | Telugu old songs

పాటలో ఏముంది?


1977లో విడుదలైన ముత్యాలపల్లకి సినిమా కోసం మల్లెమాల రాసిన గీతమిది. సత్యం స్వర రచన చేసిన ఈ పాటను పల్లె సొగసులు అద్దుతూ సుశీల ఎంతో పారవశ్యంతో పాడింది. 


తెల్లవారక ముందే పల్లె లేచింది.


తెల్లావారక ముందే పల్లె లేచింది - తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరిచి నిద్రపోతున్న తొలికోడి - అదిరిపడి మేల్కొంది - అదేపనిగ కూసింది //తెల్లవారక//

తనవరకు సరే! పల్లెదాటి, పట్టణాలు దాటి మహానగరాలదాకా  పల్లె తాను పండించినవన్నీ పొద్దుపొద్దున్నే చేరవేయాలి కదా! లేచీలేవక ముందే పాలకోసం తల్లడిల్లే పసిబిడ్డలకోసం, తేనీటి కోసం విలవిల్లాడే పెద్దల కోసం పాలబిందెలు పరుగులు తీయాలి కదా! పల్లె కూడా అందరిలాగా బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే  ఇంకెక్కడి జనజీవన స్రవంతి? అంతా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోవడమే కదా! తన బాధ్యతలేమిటో తనకు బాగా తెలుసు కనుకే  తెల్లావారక ముందే పల్లె మేలుకుంటుంది. ఆ వెంటనే తన బిడ్డలందరినీ నిద్రలేపి  పనిపాటలకు పరుగులు  తీయిస్తుంది. అదే జరగకపోతే, లోకాన  అర్చనలూ, ఆరాధనలూ ఉండవు. టిఫిన్‌లూ భోజనాల సంగతి అలా ఉంచండి. టైముకు టీ, కాఫీలే అందవు. ఆ పరిస్థితి రావద్దనే పల్లె పొద్దుపొద్దున్నే కళ్లు నలుచుకుని రెప్పలు తెరుస్తుంది. ఒళ్లు విరిచి తన రెక్కలు విప్పుతుంది. ఈ తంతులో నా పాత్ర మాత్రం ఏం తక్కువ అన్నట్లు, పల్లెకన్నా ముందే కోడిపుంజు గొంతెత్తి సైరన్‌ మోత వినిపిస్తుంది. ప్రధమంగా పల్లెను మేల్కొలిపేది తనేనంటూ గర్వంగా నలువైపులా తలతిప్పి చూస్తుంది. ఇకనే..: పల్లె అణువణువునా ప్రాణశక్తి ప్రజ్వరిల్లుతుంది.  శ్రమైక జీవన  సౌందర్యం పల్లె పల్లెనా విలయతాండ వంచేస్తుంది.

వెలుగు దుస్తులేసుకుని సూరీడు - తూర్పు తలుపుతోసుకుని వచ్చాడు
పొడు చీకటికెంత భయమేసిందో - పక్కదులుపుకుని ఒకే పరుగు తీసింది
అది చూసీ లతలన్నీ పక్కున నవ్వాయి. - ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి // తెల్లవారక //

పగలూ రాత్రులనేవి మనకే కానీ, సూర్యునికి కాదుకదా! అందుకే విరామమే లేకుండా విశ్వమంతా నిత్యసంచారం చేస్తుంటాడు. కాస్త వెనకా ముందే గానీ, చీకటి ఏ వైపు వెళితే ఆ వైపే తనూ వెళ్లి  దానికి నిద్రలేకుండా చేస్తాడు. , దవళ  వస్త్రాలేసుకుని సూర్యుడు ధరణిపై ఏ మూలన అడుగుపెడితే,అక్కడున్న చీకటంతా పరుగులు తీయాల్సిందే! బాహ్యంగా కనపడే చీకటే అని కాదు మనిషి అంతరంగ చీకటిని కూడా అవలీలగా పారద్రోలగలడు. అందుకే ‘ తమసోమా జ్యోతిర్గమయ ’ అంటూ లోకం అతన్ని అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటుంది. 

పాలవెల్లీ లాంటి మనుషులూ - పండువెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాసి వంటి మమతలు - పల్లెసీమలో కోకొల్లలు
అనురాగం - అభిమానం కవల పిల్లలు - ఆ పిల్లలకు పల్లెటూళ్లు కన్నతల్లులు // తెల్లవారక //

పల్లెవాసులంతా పాలవెల్లిలాంటి వాళ్లనీ, వారందరి మనసులూ పండు వెన్నెల లాంటివేననే మాట. ఈ రోజుల్లో అందరికీ రుచించదు. ఎందుకంటే నగరాల్లోలాగే పల్లె హృదయాలు కూడా ఎంతో కొంత కలుషితమైన మాట వాస్తవం. ప్రపంచీకరణ ప్రభావం పల్లెల మీద కూడా పడిందనేది  వాస్తవం. ఈ నిజాన్ని పల్లెవాసుల్లో కూడా చాలా మందే ఒప్పుకుంటారు.అలాగని, ఆ ప్రభావంలో అంతగా కూరుకుపోకుండా పల్లెల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. మునపటిలా అవి నిలబదేందుకు అవసరమైన గొప్ప ఆసరా ఇచ్చిన వాళ్లు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే పై చదువుల కోసం వెళ్లిపోయిన వాళ్లంతా పట్నాల్లోనే ఉండిపోయారు.ఉద్యోగం అంటూ వెళ్లిపోయిన వాళ్లు ఊరే మరిచిపోయారు. ఏ కారణంగా వెళ్లినా, వాళ్లలో వెనక్కి తిరిగి వచ్చిన వాళ్లు ఒక్కరిద్దరికి మించి లేరు! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు . ప్రతి పల్లెకూ  వెన్నుదన్నుగా పది మంది యువకులు నిలిచినా చాలు . పల్లె ఆత్మలు ప్రాణం పోసుకుంటాయి. ఆ తర్వాత  మునుపటిలా పాలవెల్లి లాంటి మనుషులు దర్శనమిస్తారు. పండువెన్నెల వంటి మనసులు  కళ్ల ముందు కదలాడతాయి. మెల్లమెల్లగా పల్లె  బ్రతుకులు మళ్లీ అన్నివిధాలా సుసంపన్నమవుతాయి. పల్లె జీవితాలు గొప్ప శాంతివనాలవుతాయి. 
                                                                   - బమ్మెర