12, మే 2021, బుధవారం

ఉమ్మడి కుటుంబం చిత్రం | దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది | Telugu old songs

పాటలో ఏముంది

గూడు చెదిరితేనే అని కాదు. గుండె చెదిరినా మనుషులు వలస బాట పడతారు. పుట్టీ పెరిగిన కన్నతల్లి లాంటి 
పల్లెను సైతం వదిలేసి, పట్నాల పాలవుతారు. అయితే,  వెళ్లీ వెళ్లడమే పూలబుట్టలో పడతారన్న గ్యారెంటీ ఏదీ లేదు కదా! అక్కడ కూడా కొందరికి,  కష్టాలూ. కడగండ్లు తప్పకపోవచ్చు.  కాకపోతే ఏ చల్లని నీడో లభించి, ఏ మనసున్న మనిషి తోడో లభిస్తే, బతుకు నిలబడుతుంది. జీవితం పండిపోతుంది. ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం డా. సి. నారాయణ రెడ్డి వ్రాసిన ఈ పాటలో ఈ ఇతివృత్తమే కనిపిస్తుంది.  టి.వి. రాజు స్వరకల్పలనలో ఘంటసాల, సుశీల పాడి న ఈ పాటను ఎంత మధురంగా పాడారో, అంతే అందంగా చిత్రీకరించారు. కళ్లారా చూసి, మనసారా విని ఆనందించండి.
 

చెప్పాలని ఉంది... 

చెప్పాలని ఉంది.... కథ చెప్పాలని ఉంది.
దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది
మనుషుల్ని ఎప్పుడైనా మనం దేవతలు అంటూ ఉన్నామంటే ఏమిటి అర్థం? వాళ్లేదో దివి నుంచి భువికి 
దిగివచ్చిన దివ్యమూర్తులనేమీ కాదు కదా! మన ఊహాలోకంలో తప్ప మరెక్కడా కనపడని సాత్వికమూర్తులు హఠాత్తుగామనకు ఎదురుపడినప్పుడు ఏమనాలో తెలియక మనం దేవతలు అంటూ ఉంటాం. ఏదో అలా ఎదురుపడటమే కాదు, బ్రతుక్కీ, జీవితానికీ మధ్య వంతెన నిర్మించి, ముందుకు నడిపిస్తూ,  హృదయంలోకి అమృతాన్ని కూడా వొంచితే అదెలా ఉంటుంది? వారిని  దేవతే కాదు దేవదేవి అన్నా అంటాం. ఇంకొందరు ఉంటారు. వారు దేవతా మూర్తుల్లానే కనిపించినా, అంటీ ముట్టనట్లు అందరికీ దూరదూరంగానే ఉండిపోతారు. అలాంటి వాళ్లతో ఎవరి అనుబంధమైనా ఏముంటుంది? మమతల వర్షం కురిపించే మానవతా మూర్తులనే ఎవరైనా ఆరాదిస్తారు.  అంతటితో ఆగకుండా మనో శిఖరాన ఓ పెద్ద మందిరమే నిర్మిస్తారు. వీలు చిక్కినప్పుడల్లా  ఆ దేవత  ముందు కూర్చుని,. దాపరికం లేకుండా, పూస గుచ్చినట్లు, గుండెలో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా చెప్పేసుకుంటారు. 
పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్నుతట్టి
మనిషిగ తీరిచిదిద్దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది...

పల్లెలంటే అవి దేశంలో ఒక  భాగమే అన్నట్టు అనిపిస్తాయి గానీ, నిజానికి అవి ప్రత్యేక ప్రపంచాలు. జీవితం జీవితమంతా పల్లెలోనే జీవించిన వాళ్లను గమనిస్తే, వాళ్ల దృక్పథాలు ఎంత భిన్నమైనవో తెలుస్తుంది. జననం పట్ల, మరణం పట్ల, మనిషి పట్ల, మనుగడ పట్ల వారి దృష్టికోణం వేరువేరుగానే ఉంటాయి. ఒకవేళ ఏ కారణంగానో మధ్యలోనే నగరానికి రావలసి వస్తే,  అంతా కొత్తకొత్తగా అనిపిస్తుంది. అయోమయంగానూ ఉంటుంది? ఇక్కడ జరిగే వంచనలూ, మోసాల పట్ల పెద్ద అవగాహనే ఉండదు. అందువల్ల ఇక్కడ మోసపోయే అవకాశాలే ఎక్కువ. నిరక్ష్యరాస్యులే అని కాదు. కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లకు కూడా ఇక్కడ చేదు అనుభవాలే ఎదురవుతుంటాయి,. బతుకు తెరువు కోసం వచ్చిన వాడు ఒక్కోసారి బతుకునే కోల్పోయే పరిస్థితి ఎదురు కావచ్చు. పడుతూ లేస్తూ సాగిపోయే క్రమంలో నిలదొక్కుకోవడానికి జీవితకాలపు లేటు కావచ్చు. వాటినుంచి కొంత వరకైనా బయటపడాలంటే , అతన్ని పదునుపెట్టే వారొకరు కావాలి. ఒక నిండు మనిషిగా తీరిచిదిద్దే వారు కావాలి. అలా తన జీవితానికి   మార్గనిర్దేశం చేసే మనిషే  ఎదురుపడిందే అనుకోండి అతని మనసుకి ఆ వ్యక్తి ఒక దివ్యమూర్తిగా కాక ఎలా కనిపిస్తారు?  
కోరనిదే వరాలిచ్చి, కొండంత వెలుగునిచ్చి 
మట్టిని మణిగా చేసిన మరువరాని దేవత కథ  చెప్పాలని ఉంది
‘అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు’ అనే మాట ఎలా వచ్చిందో తెలియదు కానీ, అది నూటికి నూరుపాళ్లూ అర్థం లేనిది. ఎందుకంటే, ప్రపంచంలో అడగకుండానే అన్నం పెట్టేది ఒక అమ్మ మాత్రమే. ఒకవేళ ఇతరులే అయితే పూర్తిగా అమ్మ మనసు ఉన్నవారైనా కావాలి.  అలాంటి వారు నోరు తెరిచి అడగకపోయినా, అన్నపానాలిచ్చి ప్రాణాల్ని కాపాడి,  జీవితాన్నే నిలబెట్టవచ్చు. మౌలికంగా, పల్లె మనుషులంటే మట్టి మనుషులనే అర్థం .  మట్టిపని చేస్తేనే అని కాదు. పల్లె గాలిలో నిండి ఉండే మట్టి వాసన కూడా వారిని మట్టి మనుషులనే చేస్తుంది. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎంత లేదన్నా,  మట్టికి కాస్త నిలకడ ఎక్కువ, స్థిరత్వం కూడా ఎక్కువే. . దీన్నే కొందరు జఢత్వం లేదా నిద్రాణ స్థితి అన్నా అంటారు. ఎందుకంటే, భూకంపం వచ్చేదాకా ఆ భూమికేమీ తెలియదేమో అన్నట్లు అది నిశ్చలంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ధోరణి మనుషుల్లోనే ఉంటే అది చిక్కుల్లో పడదోసి, మనిషి జీవితాన్నే  తలక్రిందులు చేసే ప్రమాదం ఉంది . అలా కాకుండా ఉండేందుకు ఎవరైనా,  ఆ మట్టిమనిషిలో కాస్త చలనాన్ని నింపేస్తే, , చీకటి కమ్మేసిన గుండెలో వెలుగు రేఖలు ప్రసరింపచేస్తే అదో దివ్యమూర్తి ఆశీర్వాదమే అనిపిస్తుంది.  
అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో....
ఎన్ని జన్మలకు ఈ రుణమెలా ఎలా ఎలా తీరునో....

ఒక్కొక్కటి గా తన పైన కాంతికిరణాలు విరజిమ్ముతూ, ఎవరైనా కారుణ్య ఫలాల్ని అందిస్తుంటే, అతనికి ఎలా ఉంటుంది? గొప్ప ఆనందం పారవశ్యంలో తేలాడటంతో పాటు,  ఏం చేసి ఆ రుణం తీర్చుకోగలనా అని అనుక్షణం ఆలోచిస్తూ  గడిపేస్తాడు. అయితే ఆ రుణం ఈ జన్మలో తీరేది కాదని త్వరలోనే బోధపడుతుంది. అందుకని, ఇంకా  ఎన్నెన్నో జన్మలెత్తి ఆ రుణం తీర్చుకోవాలనుకుంటాడు.  కానీ, మనుషులందరికీ మళ్లీ మళ్లీ జన్మించే అవకాశం వస్తుందా అనేది ఓ పెద్ద మీమాంస. చివరికి ఏమీ తోచక చింతాక్రాంతుడై, కూర్చుండిపోతాడు. అలాంటి స్థితిలో ఎప్పటినుంచో ఇదంతా గమనిస్తున్న ఆమె ఏమనుకుంటుంది? ఎలా స్పందిస్తుంది?
ఆమె.....
నీ చల్లని మదిలో  ఆ దేవికింత చోటిస్తే
ఆ లోకమే మరిచిపోవు .. నీలోన నిలిచిపోవు. 

ఎంత సూటి సమాధానం! అయ్యా....! కారుణ్యాలూ లేవు, రుణాలూ లేవు. నువ్వు ఇంకా ఎత్తాల్సిన  జన్మలూ లేవు గానీ,  మంచుకొండ లాంటి నీ మనసులో తలదాచుకునేందుకు కాసింత చోటివ్వు చాలు. ఈ కాస్త మేలు చేస్తే, నేనేదో వేరే లోకం నుంచి దిగివ చ్చానంటున్నావే ఆ లోకాన్నే వదిలేస్తా! నీ కోసం వచ్చి  జీవితమంతా నీతోనే, ఉండిపోతా! అంటోంది ఆమె! ఏదో నాలుగు కృతజ్ఞతలు  చెప్పించుకోవడానికో, రుణమంటూ దాన్ని వడ్డీతో వసూలు చేయడానికికో కాదు కదా ఆమె తోడూ నీడగా నిలిచింది? నిజానికి,  ఒకరికొకరు జీవిత కాలపు అవసరాలు. అతనికి  అమె అవసరం ఎంత ఉందో, ఆమెకు అతని అవసరం అంతే ఉందనే నిజాన్ని తెలుసుకోకుండా ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ల గుండె లోతుల్లోని నిజాల  గుట్టు విిప్పి చెప్పకపోతే, లోకానికి ఈ పెద్దరికం ఎందుకు?  
                                                                  - బమ్మెర 


7, మే 2021, శుక్రవారం

అద్వైతమూర్తి పద్యఖండిక | జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలు | ఘంటసాల పద్యాలు | తెలుగు పద్యాలు |

పద్యమాధురి

పాటను పద్యంలా, పద్యాన్ని పాటలా పాడే ఒక విలక్షణత ఘంటసాలలో ఉంది. జంద్యాల పాపయ్య  శాస్త్రి రచించిన ‘అద్వైతమూర్తి’ పద్యఖండికలోని ఒక పద్యాన్ని  ఈ విలక్షణతతోనే పాడారు. ఘంటసాల తనే స్వరపరిచి పాడిన ఈ పద్యంలోని ‘‘ నీవే నేనుగ ....... నేనే నీవుగ’’ అన్న మాటలు వింటూ ఉంటే పాటలాగే అనిపిస్తుంది. మరోసారి విని ఆస్వాదిద్దాం మరి!

నీవే నేనుగ ... నేనే నీవుగ
భావోద్యనమునందు క్రొత్త వలపుం పందిళ్లలో కోరికల్‌ 
తీవల్‌ సాగెను., పూలు పూచెను., రసార్ర్థీభూత చేతమ్ముతో 
‘‘ నీవే నేనుగ .... నేనే నీవుగ’’ లంతాంగీ! యేకమైపోద మీ ప్రావృణ్ణీరద  పంక్తిక్రింద పులకింపన్‌ పూర్యపుణ్యావళుల్‌!

(ఓ లతాంగీ! ఈ  బావాల  నందనాన,  కొత్తకొత్తగా అల్లుకున్న  వలపు పందిళ్లలో,  మన కోరికలు తీగల్లా సాగి,  పూలుపూచాయి. వర్షమేఘాలు కమ్ముకున్నాయి  మన హృదయాలు ఆనందంలో తడిసిపోయాయి 
రసార్థ్రమైపోయాయి. ఈ మేఘాల నీడన నీవే నేనుగా,  నేనే నీవుగా మన ఇన్నేళ్ల పుణ్యాలు పులకించే విధాన ఒకటైపోదాం!.)

స్నేహితుల మధ్య కావచ్చు. ప్రేమికుల మధ్య కావచ్చు. దంపతుల మధ్య కావచ్చు. ప్రాంతాల మధ్య...,  దేశాల మధ్య కావచ్చు.....  అనాదిగా తలెత్తుతున్న అనేకానేక ఘర్షణలకు కారణమేమిటి? మౌలికంగా మనిషికీ మనిషికీ మధ్య జరుగుతున్న ఆ ఘర్షణల మూలాలేమిటి? ‘‘నువ్వు వేరు, నేను వేరు’’ అన్న భావనే కదా ప్రధాన కారణం!  నీ వర్గం వేరు ..... నా వర్గం వేరు.....నీ దారి వేరు, నా దారి వేరు అనుకోవడమే కదా! 

నీ కష్టం ... నా కష్టం కాదు, నీ బాధ .... నా బాధ కాదు. నీ మేలు ... నా మేలు కాదు. నీ  ప్రగతి .... నా ప్రగతి కాదు అనుకోవడమే కదా! అయితే అంతటితో ఆగిపోయినా బావుండేది. నీ నష్టమే నా లాభం, నీ బాధే  నా ఆనందం, నీ పతనమే నా ప్రగతి, నీ నాశనమే నా వికాసం అనేదాకా వెళ్లాడు మనిషి! నువ్వూ నేనూ ఒకటే అన్న అద్వైత భావన కొరవడటమే కదా ఇందుకు కారణం! ఇలాంటి ఈ దూరాలూ, వ్యత్యాసాలూ లేకుండా ఎవరైనా ‘నీవే నేను... నేనే నీవు’ అన్న భావనతో ఉండిపోగలిగితే ఎంత బావుంటుంది? కానీ, అలా ఉండదే! కాకపోతే..., ఈ అద్వైత భావన ప్రేమికుల మధ్యే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని ఈ భావన జీవితమంతా వారిలో ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఉన్నా కొందరిలోనే....చాలా అరుదుగానే! అలా కాకుండా సమస్త మానవాళిలో సర్వకాల, సర్వావస్థల్లోనూ ఈ భావన పరిఢవిల్లగలిగితే ప్రపంచానికి అంతకన్నా ఏం కావాలి!! 
                                                                        - బమ్మెర 

2, మే 2021, ఆదివారం

అంతులేని కథ సినిమా | కళ్లలో ఉన్నదేదో....పాట | Telugu old songs |

పాటలో ఏముంది? 

‘‘ఈ సమస్య ఒకటి పరిష్కారమైపోతే చాలు .... ఆ పైన జీవితమిక హాయిగా గడిచిపోతుంది’’ అన్న మాట చాలా మంది గుండెల్లో చాలా సార్లు ప్రతిధ్వనిస్తుంది. కానీ, చాలాసార్లు, ఒక సమస్య ఇంకా ముగిసీ ముగియకముందే  మరో రెండు కొత్త సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఎడతెగని ఈ జీవన సంక్షోభాన్ని తెలిపే ఇతివృత్తం కావడం వల్ల ‘అంతులేని కథ’ పేరు ఈ సినిమాకు అక్షరాలా సరిపోయింది. 1976లో విడుదలైన ఈ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఓ పాటను ఎం.ఎస్‌., విశ్వనాథన స్వరబద్దం చేయగా ఎస్‌. జానకి పాడారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పుటికీ జనం గుండెలో మారుమోగడానికి భావస్పోరకమైన బాణీ, భావోద్వేగపూరితమైన సాహిత్యం ఈ రెండూ సమాన కారణమే!

కళ్లలో ఉన్నదేదో......
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - రాళ్లలో ఉన్ననీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు గాక .... ఇంకెవరికి తెలుసు?
కనుపాపలు, కనుగుడ్లు ... కనురెప్పలు, కనుబొమ్మలు .... కళ్లంటే ఇంతేనా? కాదుకదా ! కళ్లల్లో పైకి కనిపించని సముద్రాలెన్నో ఉంటాయి. అయితే,  కొందరికి తమలో అన్ని సముద్రాలు ఉన్నాయన్న ఊహే ఉండదు.. ఒకవేళ ఉన్నా,  ఏ సముద్రం ఎప్పుడు ఉబికి, ఉప్పొంగుతుందో  ఎన్ని విపరిణామాలకు దారి తీస్తుందో ఏమీ తెలియదు. అలాంటిది, తనదికాని,  ఎవరో అవతలి వ్యక్తి కళ్లల్లోని సముద్రాల్ని చూడాలనుకుంటే అది అయ్యేపనేనా? మనుషుల గురించే అని కాదు. కదలక మెదలక పడిఉండే ఏ గండశిలల్ని గమనించినా ఎన్నో నిజాలు తెలుస్తాయి. చలనమే లేకుండా పడిఉన్న ఒక బండరాయిని పెగిలిస్తే, ఆ రాతి పొరల మధ్యలోంచి ఉవ్వెత్తున ఎగిసి పడే జలసంపద కనిపిస్తుంది. పైకేమీ కనిపించడం లేదని, రాతిగుట్టలో నీళ్లే ఉండవంటే ఎలా? కళ్లు చెమ్మగిల్లనంత మాత్రాన ఆ మనిషిలో కన్నీళ్లే లేవని కాదు కదా! ఇతరులెవరికో తెలిసినా తెలియకపోయినా,  అతనిలో ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో ఆ వ్యక్తికైతే తెలుస్తుందిగా
నీటిలో ఆరే నిప్పును కాను .... నిప్పున కాగే నీరైన కాను
ఏదీ కానీ నాలో రగిలే ... ఈ అనలాన్నీ ఆర్పేదెవరో...  // నాలో ఉన్న మనసు //

మనసు ప్రకృతిలోనే ఉంటుంది. ప్రపంచంతోనే ఉంటుంది. అయినా,  ప్రకృతిలోని చాలా ధర్మాలు మనసుకు ఉండవు. ప్రపంచంలోని చాలా తత్వాలు మనసులో కనిపించవు.  నీళ్లు చల్లితే నిప్పు చల్లారిపోతుంది అలాగని, కాలే మనసుపైన నీళ్లు చల్లితే అది ఎంతకూ చల్లారదు. ప్రకృతితోనూ, ప్రపంచంతోనూ పూర్తిగా మమేకమైనట్లు పైకి అనిపిస్తున్నా, మనసు వాటికి అతీతంగానే ఉంటుంది. ఈ అతీత ధోరణి వల్లే మనసు ఎవరికీ అర్థం కాదు. మరో తమాషా ఏమిటంటే, మనసు కాలుతుందే గానీ, అది  నిప్పు కాదు. అలాగని మనసు నీరు కూడా కాదు.  ఆ మాటకొస్తే .నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాల్లో మనసు ఏదీ కాదు.  అదొక  విచిత్రమైన, పరమ సంకీర్ణమైన ఒక బ్రహ్మ పదార్థం. కాస్త తరిచి చూస్తే, , మొత్తం ప్రపంచాన్ని మోయడం ఒక ఎత్తు. ఒక మనసును మోయడం ఒక ఎత్తు అని బోధపడుతుంది. . అదంతా సరే గానీ,  మనసులో ఒక  కార్చిచ్చు అంటూ మొదలైతే, దాన్నింక చల్లార్చలేమా? అంటే?  ఎందుకు కాదు?కాకపోతే దాని కోసం ఎక్కడో వెతకాల్సిన  అవసరమేమీ లేదు. వాస్తవానికి ప్రశ్న ఎంత జటిలమైనదైనా, ఆ  ప్రశ్నలోనే సగం సమాధానం ఉంటుంది.  సమస్యలోనే సగం పరిష్కారం ఉంటుంది. కాకపోతే, ఆ సగాల  ఆధారంగా మిగతా సగాల్ని ఒడిసిపట్టుకోగలిగే ఒడుపు మనిషికి ఉండాలి.  ఆధ్యంతాల్ని ఆకలింపు చేసుకోగలిగే  జీవన జ్ఞానం కావాలి. 
తానే మంటై వెలుగిచ్చు దీపం ... చెప్పదు తనలో చెలరేగు తాపం...
నే వెళ్లు దారి ఓ ముళ్ల దారి -  రాలేరు ఎవరూ నాతో చేరి.... // నాలో ఉన్న మనసు //

మేఘాలు వర్షించి భూమిని సస్యశ్యామలం చేయడం సరే ! కానీ,  వర్షించడానికి ముందు తామెంత ఘర్షణకు గురవుతాయో మేఘాలు ఎప్పుడైనా చెప్పాయా?  దశదిశలా కాంతిపుంజాలు ఎగజిమ్మే దీపాలైనా, తమలో తాము ఎంత కాలిపోతున్నాయో ఏ రోజైనా బయటపెట్టాయా?  కొంతమంది మనుషులూ అంతే ఎవరికేమీ చెప్పకుండా అన్నీ లోలోనే దాచేసుకుంటారు. నిజానికి  ఏ జీవితమైనా పూర్తిగా పూలబాటలా ఏమీ ఉండదు. ఎంత జాగ్రత్తగా వెళుతున్నా, ఎక్కడో ఒక చోట ముళ్ల దారులు ఎదురవుతూనే ఉంటాయి. తానేదో పూర్తిగా భిన్నమనుకుని తన దారిలోకి మరెవరూ రాలేరని ముందే అనుకుంటే ఎలా? ఎవరికైనా కాస్త దారి ఇస్తేనే కదా వారు రాగలరో లేదో తెలుస్తుంది? ఇదంతా కాదనుకుని, ఒకవేళ  ఒంటరి పోరాటం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంటే, అదీ మంచిదే! అప్పుడింక సర్వశక్తులూ తానే సమకూర్చుకుని,  సమర భూమిలోకి దిగిపోవలసిందే! వ్యూహాలూ, ప్రతివ్యూహాలూ, చక్రవ్యూహాలతో  సమర శంఖం ఊదాల్సిందే!
వేసవిలోనూ వానలు రావా... కోవెల శిలకూ జీవం రాదా 
జరిగే నాడే జరుగును అన్నీ.... జరిగిన నాడే తెలియును కొన్నీ // నాలో ఉన్న మనసు //
 
ఎన్నెన్నో జరుగుతాయనుకుంటే ఏమీ జరగవు కొన్నిసార్లు.. ఏమీ  అనుకోకుండా, నిర్లిప్తంగా ఉండిపోయిన రోజుల్లో
ఏమేమో జరిగిపోతాయి కొన్నిసార్లు. వ్యక్తులకే అని కాదు, ప్రకృతి ధర్మాలకే విరుద్ధంగా, ప్రపంచ తత్వాలకు 
భిన్నంగా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. మనిషి నడత మారిపోయినట్లు, ఎవరూ ఊహించని రీతిలో రుతువుల 
పోకడలు కూడా తారుమారవుతాయి. పచ్చిక బయళ్లు ఎడారులవుతాయి. ఆ ఎడారులే ఎండమావులకు 
ఆశ్రయమవుతాయి.  ఎప్పుడూ ఇలాగే అని కాదు. అందుకు భిన్నంగా కూడా కొన్ని జరిగి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఆ క్రమంలో మండు వేసవిలో ఎడతెగని వానలు కురిసి సంభ్రమానికి  
గురిచేయవచ్చు. తెగిపడిన అరణ్యంలోని  ప్రతి చెట్టూ లేచి నిలబడవచ్చు. . అప్పటిదాకా అధఃపాతాళంలో పడి ఉన్న 
హృదయాలెన్నో ఉవ్వెత్తున ఎగిసి భూతలం పైన శివతాండవం చేయవచ్చు. ప్రతికూల అంశాలన్నీ పటాపంచలై ఒక వినూత్న శక్తి ప్రకటితం కావచ్చు. మొత్తంగా చూస్తే, ఒకటి మాత్రం నిజం.  కళ్లముందు ఎన్ని చీకట్లు కమ్ముకున్నా, ఆ తర్వాత రాబోయే వెలుగును ఊహించడంలోనే నిజమైన చైతన్యం ఉంది.   ఈరోజు ఎంత దుఃఖంలో తలమునకలవుతున్నా, ఆ తర్వాత ఓ దివ్యానందాన్ని రప్పించడానికి,  తిరుగులేని  ప్రణాళికలు సిద్ధం చేయడంలోనే సినలైన జీవితం ఉంది. 
                                                                 - బమ్మెర 
===================================