31, జనవరి 2021, ఆదివారం

చిత్రం : నర్తనశాల రచన : తిక్కన సోమయాజి సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి గానం : ఘంటసాల ఏనుంగునెక్కి....

 చిత్రం : నర్తనశాల 
రచన : తిక్కన సోమయాజి
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
గానం : ఘంటసాల

                       ఏనుంగునెక్కి...





అల్లంతదూరాన అర్జునుణ్ణి చూడగానే, ద్రోణాచార్యునికి హృదయం ఉప్పొంగిపోయింది.

‘‘అడుగో అర్జునుడు... అసలే ఆకలితో చిరాకు పడుతూ ఉన్న సింహానికి, దానికి మదించిన ఏనుగుల సమూహం అలికిడి కలిగితే గుహ నుంచి ఎలా బయటికి వస్తుందో... అలా వస్తున్నాడు’’ అన్నాడు ద్రోణాచార్యుడు.

‘‘అర్జునుడే అని నమ్మకం ఏముంది? ఒకవేళ అతడే అయితే... అజ్ఞాతవాస నియమంలో పాండవులు ఓడిపోయినట్లే’’అని రారాజు మీసం తిప్పాడు.

‘‘గడువు తీరిపోయింది కాబట్టే బయటపడ్డాడు. నువ్వే తెలివి తక్కువగా బోల్తా పడుతున్నావు’’ అన్నాడు భీష్మాచార్యుడు.

రథం మీద కూర్చున్న ఉత్తర కుమారుడికి కౌరవసేనను చూడగానే వణుకు పుట్టింది. పారిపోవడం మొదలుపెట్టాడు.

అతణ్ణి ఆపి, జమ్మిచెట్టుమీద దాచిన గాండీవాన్ని దింపించి, బృహన్నల వేషాన్ని చాలించుకుని అర్జునుడు కౌరవులను ఢీకొట్టాడు.

ఇప్పుడు అందరికీ అతడు అర్జునుడే అని రూఢి అయిపోయింది.

‘వచ్చినవాడు ఫల్గుణుడు’ అని భీష్మాచార్యుడు ఆనందంగా ప్రకటించాడు. అంతేకాదు... ‘‘కురురాజా! మనం తప్పకుండా గెలుస్తామని చెప్పడం కష్టం. రాజ్యలక్ష్మి కోసం యుద్ధం చేస్తే రెండుపక్షాల వారూ ఎలాగూ గెలవలేరు. ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. వచ్చినవాడేమో ఫల్గుణుడు. వాడితో పెట్టుకుంటే ఓడిపోవడానికి సిద్ధపడాలి. లేదంటే ఒక పని చేయవచ్చు. హాయిగా సంధి చేసుకో. ఇప్పుడు కావలసింది అదే’’ అన్నాడు.

దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మీరు అర్జునుణ్ణి ఆపండి. నేను గోవులను తరలించుకుపోతాను అన్నాడు. అర్జునుడు భీష్మద్రోణులను దాటుకుని, సరాసరిగా గోవులతో పారిపోతున్న దుర్యోధనుని ముందుకు తన రథాన్ని తీసుకువెళ్లి ఆపాడు.

మామూలుగా అయితే దుర్యోధనుణ్ణి భీముడు దెప్పిపొడిస్తే వినడానికి బాగుంటుంది. రాయబారంలాంటి సీన్లలో శ్రీకృష్ణుడు మంచినీతులు చెబితే వినేవాళ్లకి ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఇవి దుర్యోధనునితో అర్జునుడు అంటున్న మాటలు. భారతంలో తిక్కన గారు రచించినది. సినిమా కోసం ఘంటసాల గానం చేసింది.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీధుల గ్రాలగలదె
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డోలగంబున నుండగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపార భోగింపగలదె
గీ. కయ్యమున నోడిపారిన కౌరవేంద్ర
వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

‘‘ఓహోయ్ కౌరవేంద్రా! కాస్తాగు. పారిపోకు. ఇలా అయితే నువ్వు కోరుకున్నట్లు హస్తినాపురానికి పట్టం కట్టుకోవడం
సాధ్యమవుతుందా? రాజధాని వీధుల్లో రెండువైపులా రాయగజ సాహిణి కదలివెళుతుంటే ఆ నడుమ పట్టపుటేనుగు నెక్కి.... రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కుదురుతుందా? రాజువై మణిమయ ఆభరణాలను ధరించి, నిండుసభను తీర్చడం సాధ్యమవుతుందా? అందగత్తెలతో కూడేవేళ ఈ ఓటమి బాధ కుంగదీయదా? కర్పూరం, చందనం, కస్తూరి వంటి సుగంధద్రవ్యాలను భోగించేవేళ ఓటమి వాసన మనసులో మెదిలితే ఏమైపోతుంది? యుద్ధంలో ఓడిపోతే ఇవన్నీ కుదరవు. కనుక నామాట విని రథాన్ని వెనక్కు తిప్పు. పారిపోవడం కంటే వీరోచితంగా పోరాడి ఓటమి పాలైతే... నీకు సుగతి కలుగుతుంది. అలా కాదు... యుద్ధంతో పనిలేదు... జూదమాడి రాజ్యాలు కబళించేసే ఆ పాత అలవాటునే అడ్డం పెట్టుకుంటా నంటావా?! నాకా అలవాటు లేదు. నాతో యుద్ధం చేయడం మినహా నీకు మరో గత్యంతరం లేదు అన్నాడు.

విరాటపర్వం పంచమాశ్వాసంలోని 204వ పద్యమిది. దీనిని ఒక్కసారి పరికించండి. ప్రతిపాదం చివరిలోనూ ‘గలదె’ అని ఉంటుంది. ‘గలవె’ అని తిక్కనగారు వ్రాయలేదు. ఈ ఒక్క అక్షరం తేడాతోనే ఇది దుర్యోధనుణ్ణి సూటిగా చేసిన దెప్పిపొడుపు కాదు అని అర్థమవుతోంది. దుర్యోధనుడు చేసిన ఎగ్గులన్నీ మనసులో పెట్టుకుని అర్జునుడు మాట్లాడడం లేదు. యుద్ధంలో ఓడిపోయినవాడికి ఏమవుతుందో మాత్రం చెబుతున్నాడు. గెలిచినా, ఓడినా వీరుడు ఎలా సుఖించగలడో, పారిపోయిన వాడి దుఃఖమేమిటో మాత్రమే చెబుతున్నాడు. అందుకే ‘కయ్యమున ఓడి పారిన’ అన్నాడు. 

‘పిరికిపందా నిన్ను పట్టుకున్నాను చూశావా?? ఇప్పుడెక్కడికి పోతావ్?’ అనలేదు. ‘మరలి ఈ తనువు విడిచి’ అన్నాడు కానీ, అర్జునుడు నిన్ను నేను సఫా చేసేస్తా అనడం లేదు. పారిపోవడం కంటే యుద్ధం చేసి ఓడిపోతే పరువు దక్కుతుందని, ‘సుగతి బడయుము’ అనే మాటద్వారా సూచిస్తున్నాడంతే. మొత్తం పద్యంలో... ‘జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము’ అన్న ఒక్కమాటనే తీసుకుని బస్తీమే సవాల్ అన్న ధోరణిలో అర్జునుడు మాట్లాడాడని కొన్నిచోట్ల అర్థతాత్పర్యాలు కనిపిస్తూ ఉండడం సమర్ధనీయం కాదు. పెద్దనాన్న కొడుకు, ప్రత్యర్ధి అయినవాడితో ఎలా వ్యవహరించాలో అర్జునుడు అలాగే వ్యవహరిస్తాడు. పైగా ఆ ముందు పద్యంలోనే ‘క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా!’ అని చెబుతూనే, నేను నీకంటే చిన్నవాణ్ణి అని అన్నగారి ముందు ఒప్పుకున్నాడు. 

అటు తర్వాత ధర్మబద్ధంగానే అర్జునుడు యుద్ధం చేశాడు. తాను ఆడకూడని ప్రలాపాలను మాత్రం ఆడలేదు. అందుకేదుర్యోధనునితో అర్జునుని మాటకు, భీముని వ్యవహారానికి తేడా ఉంటుందన్నది. అసలందుకే వింటే భారతం వినాలన్నది.
                                                                               - నేతి సూర్యనారాయణశర్మ
                                                                                (శంకరవిజయం నవలాకర్త)
                                                                                
ఫోన్ : 99517 48340
                                               
                                                                                                                         

26, జనవరి 2021, మంగళవారం

బృందావనం (1993) సినిమా | మధురమే సుధాగానం గీతం | Telugu old songs

పాటలో ఏముంది?


బృందావనం (1993) సినిమా కోసం వెన్నెల కంటి రాసిన మృదుమధురమైన ఓ గీతం ఉంది. అత్యంత సాధారణమైన మాటలతో ఒక లోతైన భావాల్ని  వ్యక్తం చేసిన పాట ఇది.  మాదవపెద్ది సురేశ సంగీతదర్శకత్వంలో బాలు-జానకి పాడిన ఈ పాట పుట్టి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా, తెలుగు వారి గుండెలో ఇంకా అందంగా ధ్వనిస్తూనే ఉంది. మరోసారి వినేద్దామా మరి!

మధురమే సుధాగానం


మధురమే సుధాగానం - మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం -  మెదిలే తొలిసంగీతం

సుధ అంటే అమృతం అనే కదా! సుధాగానం అంటే  ఆ గానం అమరమూ, శాశ్వతమూ అనే కదా! ఆ మాటకొస్తే, ఏది అమరమో, ఏది శాశ్వతమో అదే  మధురంగానూ, మనోహరంగానూ ఉంటుంది. ఏది క్షణికమో,అది వ్యధనే నింపుతుంది. ఒకవేళ ఏదైనా, తాత్కాలిక సుఖాన్నీ సంతోషాన్నీ ఇచ్చినా కొన్నాళ్ల తర్వాత అది గుండెలో ఆరని తీరని దుఃఖాన్ని నింపడం ఖాయం. సంగీతం విషయానికొస్తే, వాద్యకారులూ, గాయనీ గాయకులూ కొన్నాళ్లకు కాలగతిలోకలిసిపోయినా, వాళ్ల వాద్యవిన్యాసం, వాళ్ల గాన వైదుష్యం చిరస్థాయిగా నిలిచిపోతాయి. భౌతికంగా వాళ్లు  మనకు దూరమైనా నాదశరీరులై మనలో మాధుర్యాలు నింపుతూ, మనతోనే, మనమధ్యనే ఉంటారు. వారు ఒలికించిన మాధుర్యాలు,  మనల్ని నిరంతరం సమ్మోహితం చేస్తుంటాయి. హృదయాల్లో మోహనగీతమై ఎప్పుటికీ మెదులుతూ ఉంటాయి. 
చరణాలు ఎన్ని ఉన్నా, పల్లవొకటే కదా! 
కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా!
శతకోటి భావాలను పలుకు ఎద మారునా? 
సరిగమలు మారుతున్నా, మధురిమలు మారునా?

పదేపదే చరణాలు మారిపోతుంటే, అప్పుడు పల్లవి పరిస్థితి ఏమిటి? అనిపించవచ్చు కానీ పల్లవి ఎప్పుడూ మారదు, మారేవి చరణాలే! వేరు వేరుగా వచ్చే ఆ చరణాలు ఒక్కోసారి పల్లవికి  భిన్నంగా కూడా అనిపించవచ్చు. కాకపోతే అది పైపైన చూసినప్పుడు మాత్రమే! కాస్త లోలోతుల్లోకి వెళ్లి చూస్తే, ఆ భిన్నత్వంలో ఏకత్వమే కనిపిస్తుంది. వృక్ష కాండంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మలూ, రెమ్మలూ , పూూలు ,  కాయలూ, పళ్లూ ఆ కాండానికి భిన్నమైనవేమీ కాదు కదా! పైకి ఎగిసి వచ్చిన విభాగాలన్నిటికీ అసలు మూలం వృక్షకాండమే కదా! అందువల్ల ఎన్ని చరణాలు పుట్టుకొచ్చినా వాటన్నింటికీ మూలం ఆ పల్లవేనన్న విషయాన్ని ఎలా మరిచిపోగలం?  అయినా పల్లవి, చరణాలు అంటూ ఆ విభజన ఎందుకు? ఆ రెండూ ఒకటే కదా!. అవి అవినాభావ సంబంధం ఉన్నవే కదా! ఆ మాటకొస్తే! శరపరంపరంగా భావాలు పుట్టుకొచ్చే హృదయం మాటేమిటి? ఒక్కో గ్లాసూ తాగేయగానే కడవలోని నీరు ఖాళీ అయినట్లు, అనుదినం  భావాలు  వెలువడితే హృదయం ఖాళీ అవుతుందా? కానే కాదు. ఎందుకంటే హృదయం ఒక అనంతమైన సముద్రం. అది ఎప్పటికీ ఇంకిపోదు. అలాగే వాద్యంలోంచి, లేదా గొంతులోంచి ఎన్ని బాణీలు పుట్టుకొస్తే మాత్రం వాటన్నింటికీ మూలమైన మాధుర్యం, ఆ హృదయం ఎటుపోతాయి ? అవి ఇంకా  ఇంకా పెల్లుబుకుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ శాశ్వత తత్వం కలవి. ఈ నిజాన్ని తెలియకపోతే, ఎప్పుడో ఒకప్పుడు ఇంకిపోతాయనిపించి తీవ్రమైన దిగులూ, ఆందోళనకూ గురవుతాం. అంతులేని అశాంతికీ వ్యధకూ లోనవుతాం !
వేవేల తారలున్నా, నింగి ఒకటే కదా !
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా!
ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా! 
అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా!

ఆకాశం ఒకటే అయితే మాత్రం ఏమిటి? నక్షత్రానికీ నక్షత్రానికీ మధ్య ఎంతెంతో వ్యత్యాసం ఉంది కదా అనిపించవచ్చు. గమ్యం ఒకటే అయితే మాత్రం ఏమిటి? దారులు పూర్తిగా వేరు కదా అనిపించవచ్చు. గమ్యం ఎంత ముఖ్యమో, నడిచి వచ్చిన దారీ అంతే ముఖ్యం కదా అనికూడా అనిపించవచ్చు. కానీ, వాస్తవం ఏమిటంటే, ఈ వ్యత్యాసాలన్నీ పైపైన కనిపించేవే! . అవి లోలోతుల్లో ఉండవు. పడిలేచే తరంగాలన్నీ పైపైన కనిపించేవే! సముద్ర గర్భంలో ఈ తరంగాల అలజడి ఏమీ ఉండదు. అది నిశ్చలంగా, నిర్మంలంగా సాగిపోతూనే ఉంటుంది. ఒక తరంగం పెద్దదిగానూ, మరో తరంగం చిన్నదిగానూ ఉంటే మాత్రం ఏమయ్యింది? అన్ని తరంగాల్లోనూ ఉండేది ఒకే నీరు కదా! అందులో ఏమైనా తేడా ఉందా? ఈ సత్యాలేవీ స్పురించక  పైపై పరిణామాలకు కకావికలమైపోయే వారు పదేపదే కలతల పాలవుతారు. కన్నీరు మున్నీరు అవుతారు. అందుకే క్షణికమైన వాటిని క్షణికమైనవి గానూ, శాశ్వతమైన వాటిని శాశ్వతమైనవిగా గుర్తించే ఆ నేర్పును ఎవరికి వారు సాధించాలి.  అందుకోసం,  క్షణికమైన వాటినుంచి పక్కకు జరిగి, శాశ్వతమైన వాటి వెన్నంటి నడవడమే ఎవరికైనా ముఖ్యం. అదే జరిగితే, దివ్యమైన ఆనంద తీరాలు చేరుకోవడం ఏమంత కష్టం కాదు!!
                                                                  - బమ్మెర 





24, జనవరి 2021, ఆదివారం

మౌనగీతం (1981) | పరువమా... చిలిపి పరుగు తీయకు పాట విశ్లేషణ | Telugu old songs |


పాటలో ఏముంది?

చిత్రం : మౌనగీతం (1981), రచన: ఆత్రేయ, సంగీతం! ఇళయరాజా, 

గానం: బాలు, జానకి

పరువమా... చిలిపి పరుగు తీయకు 





అతడు: పరువమా ... చిలిపి పరుగు తీయకూ
ఆమె :  పరువమా.... చిలిపి పరుగు తీయకూ 
అ :    పరుగులో ...  పంతాలు పోవకూ
ఆ::     పరుగులో .... పంతాలు పోవకూ
అ::    పరువమా.....

ఇద్దరిదీ ఒకే బాట  ఇద్దరిదీ ఒకే మాట, ఒకే పాట. అవే పరుగులు, అవే నవ్వులు అయితే, నవ్వులాటలో కోపాలు తలెత్తిన ట్లు,  పరుగులాటలో కొన్నిసార్లు పంతాలు మొదలవుతాయి. పరుగులు శరీరానికే పరిమితమైతే అది వేరు. కానీ, శరీరంతో పాటే మనసు కూడా పరుగులు తీస్తే.... అది వేరే కథ. శరీరమూ మనసూ కలిపి పరుగులు తీసేవేళ ఎంత వద్దనుకున్నా కొన్ని ఎగిసిపడే ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలు ఒక్కోసారి, తమకు ఎదురే లేదనుకుంటాయి. ఎదుటి వారి ఆలోచనల్ని గాలిలోకి  ఊదేసి తమదే సాగాలంటూ పంతాలు  పోతాయి. ఒక్కోసారి తగవుకూ సిద్ధమవుతాయి. నడివయసులోనో ఆ పై వయసులోనో అంటే అది సరే కానీ, కౌమారం నుంచి పాతికేళ్ల వయసు దాకా ప్రతి అడుగూ ఉప్పెన వరదలతో పోటీపడుతుంటాయి. అలా ఉప్పెనలతో తలపడే పరువాల్ని అదుపులో ఉంచుకోవడం అంటే అది అంత తేలికైన పనేమీ కాదు.  
అ: ఏ ప్రేమ కోసమో చూసే చూపులూ
ఏ కౌగిలింతకో చాచే చేతులూ
ఆ: తీగలై హ... చిరుపూవులై పూయా
   గాలిలో హ.... రాగాలు మ్రోగా
అ: నీ గుండె వేగాలు తాళం వేయా ..... పరువమా 
ఆ: చిలిపి పరుగు తీయకూ

ఒక్కొక్కరుగా ఉండిపోవడంలో ఒక లోటు ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే, వేరువేరుగా కాకుండా ఒక్కరైపోయే ప్రేమ కోసం ఇద్దరి ఎదురు చూడటాలూ,  మనసులే కాదు తనువులూ ఏకమైపోయే గాఢానుబంధం కోసం చేతులు చాపడాలూ ఉంటాయి. ఇవన్నీ జీవితేచ్ఛ కోసం జరిగే ఆరాటాలు. పోరాటాలే కదా! ఒకవేళ ఆ చాచిన చేతులే తీగలైపోతే, అక్కడ ఇంక పూలు పూయడంలో పెద్ద జాప్యం ఏముంటుంది? పరిసరాల్లో నిండు పరిమళాలే ఎగిసిపడుతున్నప్పుడు హృదయం గాలితో గొంతు కలపక ఏం చేస్తుంది? అక్కడ వేవేల  రాగాల ఆలాపన  మొదలవుతుంది. రాగాలు మారుమ్రోగడం సరే గానీ, అదే సమయంలో తాళం వేసేందుకు ఒకరు ఉండాలి కదా! అప్పుడు గుండెయే మృదంగ మై తాళం వేస్తుంది. 
ఆ: ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో 
   ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో 
అ : వెతికితే హ... నీ మనసులో లేదా 
   దొరికితే జత కలుపుకోరాదా 
ఆ : అందాక అందాన్ని ఆపేదెవరూ .... పరువమా 
అ : చిలిపి పరుగు తీయకూ 

ఎన్నడూ మనసు విప్పి చెప్పలేదు కాబట్టి గువ్వ గుండెను స్వర్గధామమే అనుకోగలమా? తుఫానుగాలులకూ, రాళ్ల వర్షానికీ  ఇప్పటికి అది కట్టుకున్నఎన్ని  గూళ్లు నేలకూలిపోయాయో ఎవరికి తెలుసు? రాళ్లూ ముళ్లూ లేవు కాబట్టి, చెట్టు నీడను సుఖసౌఖ్యాల సోపానం అనుకోగలమా? ఎంతెంత మంది బాటసారుల నిట్టూర్పులు ఆ చెట్టు నీడన పడి మండుతున్నాయో ఎవరికి తెలుసు? నిజానికి గువ్వ గూడూ, చెట్టు నీడా మానవ జీవనానికన్నా భిన్నంగా ఏమీ  ఉండవు. ఎక్కడైనా కష్టాలూ, సుఖాలూ కలగలిసే ఉంటాయి. గువ్వలో ఆశావెహాలు తక్కువ కాబట్టి, ఎంతో కొంత స్వర్గసుఖం ఉంటుంది.  ఆ మాటకొస్తే, ఆ మాత్రం స్వర్గం, ఆ మాత్రం నీడ మానవ హృదయంలోనూ ఉంటాయి. కాకపోతే, వాటిని వెతుక్కునే శక్తి,  అవి దొరికే దాకా వేచి చూసే ఓపిక మనకుండాలి. అంతే !!
                                                                     - బమ్మెర

ఆత్రేయ పాటలు , ఇళయరాజా తెలుగు పాటలు , 
బాలు తెలుగు పాటలు , జానకి తెలుగు పాటలు 

16, జనవరి 2021, శనివారం

సంతానం సినిమా | దేవి.. శ్రీదేవి పాట | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | Telugu old songs Analysis

పాటలో ఏముంది ? 
Telugu old songs

సంతానం. 1955లో విడుదలైన ఈ సినిమాలోని పాటలన్నీ తేనెల సోనలే. కాకపోతే ‘దేవీ శ్రీదేవీ’ అన్న పాటలో ఒక విశేషం ఉంది.  సినిమా చూడని వారికి ఈ పాట ఏ దేవతా మూర్తినో ఉద్దేశించి పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. సుసర్ల దక్షిణామూర్తి కూర్చిన బాణీ, ఘంటసాల పాడిన తీరు ఆ భానననే కలిగిస్తాయి. వాస్తవం ఏమిటంటే ఇది ప్రేయసితో పాడే పాట. మొదటి సారి వినే వాళ్లకు ఇదో కొత్త అనుభూతే మరి!!

దేవి.. శ్రీదేవి


దేవి.. శ్రీదేవి
మొరలాలించి పాలించి నన్నేలినావే  //దేవి //
ఏ గుండెలోనైనా, ప్రేమ ఒక బిందువుగానే ముందు మొదలవుతుంది.  ఆ తర్వాత క్రమక్రమంగా కోనేరై, సెలయేరై, ఒక మహానదీ ప్రవాహమై హృదయమంతా పారుతుంది. అప్పుడింక అస్తిత్వాలకు సంబంధించి ఎక్కువ - తక్కువ అనే లెక్కలేమీ ఉండవు. అహం ఆత్మగౌరవాల భేషజాలు ఉండవు. తన ప్రేయసి తన హృదయ లోకాన్ని ఏలే దేవదేవిలా కనిపిస్తుంది. ఆ స్థితిలో ఆమె పైన అధికారమో, ఆదేశమో ప్రయోగించే ఆలోచనే ఉండదు. ఎదురుగా ఉన్నది ఒక దేవతామూర్తి అన్న భావన కలిగాక ఆ ఆధిపత్యపు ఆలోచనలు రావు కదా! పైగా ఆ సమయంలో ఏం చెప్పినా, ఏం చెప్పాలనుకున్నా,తన మొర ఆలకించమన్నట్లుగానే ఉంటుంది. ఒకవేళ అప్పటికే తన మొర ఆలకించి, తన హృదయాన్ని పాలించే బాధ్యతల్లో ఉంటే అతనికి అంతకన్నా ఏం కావాలి?
మదిలో నిన్నే మరువను దేవీ 
నీ నామ సంకేర్తన  చేసెద // దేవి //
మొర ఆలకించి, తన హృదయాన్ని లాలించి పాలించిన ఆమెను అతనెలా మరిచిపోతాడు? మామూలుగా అయితే మరిచిపోయే అవకాశమే లేదు. కాకపోతే, ఏ విపరీత పరిణామాలో, బలమైన ఏ బాహ్య కారణాలో వచ్చిపడి మరిపింప చేస్తేనో ? నిజంగానే అలా ఏదైనా జరిగితే ఏమిటి చేయడం? దానికి విరుగుడుగా ఏదో చేయాలి. అందుకు నిరంతరం ఆమెను స్మరించుకోవడం, ఆమె నామ సంకీర్తన చేయడమే మార్గమని ప్రేమపిపాసులకు అనిపిస్తుందేమో మరి ! ఇతనైతే ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. దీనివల్ల రెండు లాభాలు.అనుక్షణం ఆమెను తన మదిలో నిలబెట్టుకోవడం ఒకటైతే, ఆమె తనను మరిచిపోకుండా చేయడానికి కూడా అది తోడ్పడుతుంది.. ఇది రెండవది మామూలుగా అయితే, కీర్తనలు, ఎవరి కోసం పాడతారు? దేవతల కోసం కదా! అలాంటిది ఈయన ప్రేయసి కోసం సంకీర్తనలు పాడతానంటాడేమిటి  అనిపించవచ్చేమో గానీ,  ఆమెను అతడు దేవతగానే చూస్తున్నాడు దానికి మనమేం చేయగలం? అందుకే అతని గొంతులో, గుండెలో పలికే నాదాలన్నీ ఆమె కోసమైన సంకీర్తనలే అవుతాయి,. కాదనగలరా ఎవరైనా?
నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించ రావే  //దేవి //
అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవేవీ జీవితాన్ని ఇవ్వవు. అందువల్ల ఒకసారి లాలించి పాలించినంతనే సరిపోదు. తన ఆరాధ్యమూర్తి తన కనుసన్నలలో కలకాలం, కడదాకా తనను ఓలలాడించాలని కోరుకుంటారు. ఎందుకంటే, ప్రేమ లాలస ఒకనాటితో తీరేది కాదు పైగా రోజురోజుకూ అది పెరుగుతూనే ఉంటుంది. నిజానికి , దినదిన ప్రవర్థమానం అవుతుంటేనే ఏదైనా నిలబడుతుంది. అయినా, కోరుకున్న జీవితం లభించడం, ఆశించిన ప్రేమ సిద్ధించడం  ఎంత మంది జీవితంలో జరుగుతుంది ? ఇతని జీవితంలో మాత్రం ఆశించినదే జరిగింది. అది అతని అదృష్టమే ! కాకపోతే, ఆ అదృష్టాన్ని కలిగించిన ఆమె, దాన్ని నిలబెట్టే బాధ్యతను కూడా కొంత  తీసుకోవాలి! జీవితానందంలో హాయిగా ఓలలాడే అవకాశం ఇవ్వాలి !
ఇలదేవతగా వెలసితివీవే
ఈడేరె - నా కోర్కెలీనాటికీ // దేవి //
దేవతలు దివ్యలోకంలో ఉంటారనే కదా చెబుతారు.  కానీ ఇతని సౌభాగ్యం ఏమిటంటే, ఆమె దేవతై కూడా భూలోకంలో నివాసం ఏర్పరుచుకున్నట్లు అతనికేవో జాడలు దొరికాయి. అది నిజమో కాదో మనకైతే తెలియదు కానీ, అతని దృష్టిలో ఆమె దివి నుంచి భువికి దిగివచ్చిన దేవదేవి. ఇప్పటిదాకా దేవతల గురించి కథల్లో గాధల్లో వినడమే గానీ, కళ్లతోనైతే ఎప్పుడూ చూడలేదు.చివరికి కలలోలనైనా చూడలేదు. అలాంటిది ఒక దేవత ఈ లోకంలో అదీ ఎక్కడో కాదు తన ముందే ప్రత్యక్షమైనట్లు అనిపిస్తే ఎలా ఉంటుంది? అప్పటికి  అతని ఆనందాన్ని మనం ఏ రకంగా కొలవగలం? ఆ ఆనందంలో అప్పటిదాకా అతన్ని వెంటాడిన వ్యధలూ, క్షోభలూ పరిసమాప్తం అయిపోయాయి. .జీవితం తాలూకు సమస్త సంకెళ్ల నుంచి అతని మనసు విముక్తి పొందింది . అతనికి ఇంతకన్నా ఏం కావాలి? కావలసిందల్లా ఏనాడూ తడి ఆరని, ఎప్పటికీ పరిమళాలు ఆవిరికాని నిరంతరాయమైన ప్రేమ కావాలి నిలకడగా మహోజ్వలంగా వెలిగే  ప్రేమ సామ్రాజ్యం కావాలి ... అంతేనా !!
                                                               - బమ్మెర 
Santhanam Telugu Movie , Santhanam Video Songs, Nageswararao Hit Songs, Savithri Songs ,ANR Santhanam Songs, ANR Songs ,  Santhanam Movie Songs , Santhanam Songs


భక్త కన్నప్ప సినిమా | శివశివ శంకర భక్తవ శంకర భక్తి గీతం విశ్లేషణ | తెలుగు పాత పాటలు | కృష్ణంరాజు పాటలు |

పాటలో ఏముంది ? 


శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది . 

శివశివ శంకర


శివశివ శంకర భక్తవ శంకర 
శంభో హరహర నమో నమో !

శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద    ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం! శబ్ద  , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన  దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం ! 

పున్నెము పాపము ఎరుగని నేను 
పూజలు సేవలు తెలియని నేను 
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల  చేయాలి  నీ సేవలు || శివ శివ ||

శివపూజలో నిమగ్నం కావడం అంటే శివచైతన్యంలో పాలు పంచుకోవడమే కదా ! శివచైతన్యంలో కలిగే ఆ జ్ఞానం ఏం చేస్తుంది ? సమస్త ప్రకృతి పట్ల , సకల ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగిస్తుంది . నిజానికి , సమజ్ఞానం , సమదృష్టి కలిగిన వ్యక్తి . ఏం చేసినా అది మానవాళికి శ్రేయోదాయకమే తప్ప హానికరం కాజాలదు . ఆ స్థితిలో ఏది పుణ్యం , ఏది పాపం అనే మీమాంసకు తావే ఉండదు . చేపట్టినవన్నీ సత్కర్మలే అవుతాయి . పుణ్యకార్యాలే అవుతాయి . అన్నింటినీ మించి , ఆ జ్ఞాన స్థితిలో ఈశ్వరుడు వేరు , తాను వేరు అనే ద్వైత భావనే మనసులోకి రాదు . ఆ స్థితిలో పూజలు , హారతులు అనే మాటలకు అర్థమే ఉండదు . కాకపోతే , అందరిలోనూ , అన్నివేళలా ఆ దివ్యజ్ఞాన స్థితి నిలకడగా ఉండదు . ఉన్నట్లుండి అది ఏదో ఒక పక్కకు జరిగిపోతుంది . అదే అదనుగా ఆశామోహాల మాయపొర మనసును బలంగా కమ్మేస్తుంది . అలా కమ్ముకోకుండా నిలువరించడానికి , మనసు ఆ దివ్యస్థితి నుంచి కిందికి జారిపోకుండా నిలబెట్టుకోవడానికి ఈ ఆరాధనలూ , పూజలు అవసరమే అవుతాయి  మరి

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవనీ
గంగను తేనా నీ సేవకు  

అంతే కదా ! లోకంలోని సమస్త ప్రాణికోటి హృదయాలను ఏలే దొర కదా ఈశ్వరుండంటే . రారాజు కదా ! ఆ విశ్వనాధుని పూజకోసం ఏం చేయాలి ? ఆతడు అమితంగా ఇష్టపడే , మారేడు దళాల్ని వెతికి వెతికి తీసుకురావాలి . అది సరే కానీ , ఈశ్వరుడు తానుగా  ఏరికోరి సృష్టించిన వాటిల్లో తనకే యిష్టమైనవీ , అయిష్టమైనవీ అంటూ రెండు రకాలుగా ఉంటాయా ? ఉండవు కదా ! అలాంటప్పుడు ప్రత్యేకించి మారేడు దళాల్ని వెతికి వెతికి తేవాల్సిన అవసరం ఏముంది ? అవన్నీ మనకు మనంగా శివునికి ఆపాదించినవే ! పైగా సృష్టిలోని అణువణువూ శివశక్తితో ప్రాణం పోసుకున్నప్పుడు ఏ పువ్వునైనా ఏ పత్రాన్నయినా తెంపి తేవడం చేయాల్సిన పనేనా ? మరో విషయంగా , శివుడు గంగమ్మ మెచ్చిన వాడన్నది అంతటా వినిపిస్తున్నడే ! కానీ , లోకంలో ఆయనను మెచ్చని వారంటూ ఉంటారా ? శివుడైనా , శివభక్తుడైనా ఇక్కడ మెచ్చడం , మెచ్చకపోవడం అనే ద్వంద్వాలు ఎక్కడివి ? గాలి , నీరు , నిప్పు నేల , ఆకాశం వీటి విషయంలో మనిషి మెచ్చడం , మెచ్చకపోవడం కూడా ఉంటుందా ? అవేవీ శివునికి ఆవల ఉండేవి కావు కదా ! అందుకే జ్ఞానసిద్ధి కలిగిన వాడు ఏదో ఒక దశలో అంతా శివమయమేనని తెలుసుకుంటాడు . శంబో హరహర నమోనమ !: అంటూ నిరంతరం శివ చైతన్యంతో జీవితం సాగిస్తాడు . సచ్చిదానంద క్రాంతిలో సదానందుడిగా వెలిగిపోతాడు . 
                                                               - బమ్మెర✍

11, జనవరి 2021, సోమవారం

పాడవేల రాధికా..ప్రణయ సుధాగీతికా పాట లిరిక్స్ విశ్లేషణ | ఇద్దరు మిత్రులు సినిమా | తెలుగు పాత పాటలు | ANR Songs |Telugu old songs Analysis|

పాటలో ఏముంది 
పాడవేల రాధికా..ప్రణయ సుధాగీతికా పాట
 తెలుగు పాత పాటలు
1961 లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతిపాటా వీనులవిందే ! ప్రత్యేకించి శ్రీశ్రీ రాసిన పాడవేల రాధికా అన్న పాట అత్యంత మనోహరం . సుశీల మధురాతి మధురంగా గానం చేసిన ఈ పాటలో ఘంటసాల ముక్తాయింపుగా ఒకే ఒక్క పాదం పాడతాడు . అయితేనే అది ఎంతో రసరంజకం. ఏమైనా , హృదయాల్లో హోరెత్తిపోయే వాటిల్లో ఈ వీణ పాటను విశేషంగా చెప్పుకుంటారు .  

పాడవేల రాధికా ... ! 



పాడవేల రాధికా ..ప్రణయ సుధాగీతికా//పాడవేల//

అంతో ఇంతో పాడగలిగే వారినే ఎవరైనా పాడమని అడుగుతారు . అంతేగానీ అసలే పాడలేని వారిని అయితే ఆ పాడగలిగే వారు కూడా పాడకపోతే , ఎందుకు పాడటం లేదు ? అనే ప్రశ్న ఎలాగూ వస్తుంది . కాకపోతే , పాడగలిగే వారంతా ఆడిగీ అడగగానే పాడగలుగుతారా ? అంటే అది సాధ్యం కాదు మరి ! అందుకు ఒక ఉల్లాసకరమైన మానసిక స్థితి అవసరం . కొన్నిసార్లు సహజసిద్ధంగానే పాడగలిగే మనోస్థితి ఉండదు . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా అది భావోద్వేగాల వెల్లువ ! ఆ రసస్థితి లేనప్పుడు గొంతు ఉండి కూడా లేనట్లే ! ఆ స్థితిలో ఏం చేయాలి ? 

padavela radhika lyrics
padavela radhika Songs lyrics
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ ... నీ వీణను సవరించి // పాడవేల // 
తలపెట్టిన పనికి అన్నిసార్లూ మన లోంచే ఆ ప్రేరణ రాకపోవచ్చు . అలాంటప్పుడు విజ్ఞుల నుంచో రసజ్ఞుల నుంచే ప్రేరణ పొందాలి . గాత్రం వాద్య సహకారం పొందినట్లు , పరిసరాల నుంచో , పరిచయాల నుంచో , ప్రకృతి నుంచే ప్రేరణ పొందాలి . అడిగిన వారి మనసు నొప్పించకుండా అందంగా , ఆడిగిన వారు పరవశించేలా పాడాలి ! హృదయంలో మంటలు రేపే గ్రీష్మమే ఉండవచ్చు. కానీ , ప్రకృతి వసంతమయం అయినప్పుడు దాన్నించి స్ఫూర్తి పొందాల్సిందే ! భూమిని పచ్చదనంతో నింపే వసంతం , ఆకాశాన్ని కాంతివంతం చేసే వెన్నెల సృష్టి చైతన్యానికి ప్రతీకలే కదా ! వీటి నుంచి ఎంత శక్తినైనా పొందవచ్చు . ఈ భూమ్యాకాశాల ప్రేరణ , ఒక దశలో మనో వికారాలేవీ లేని ఒక భావాతీత స్థితికి చేరుస్తుంది . ఒక్కసారి ఆ స్థితిలోకి ప్రవేశిస్తే , గొంతులోంచి హృదయాన్నే కాదు , మొత్తంగా జీవితాన్నే పలకింపచేసే గానం పెల్లుబుకుతుంది . 

padavela radhika lyrics
padavela radhika lyrics
గోపాలుడు నిను లచి - నీ పాటను మదితలచి ...
ఏ మూలనో పొంచి పొంచి .. వినుచున్నాడని ఎంచి // పాడవేల ||
పాడమని అడిగిన వాడు , మన వాడై , మనసులోని వాడైనప్పుడు మనసులో జీశ శక్తి నింపుకోవాల్సిందే ! గొంతులో సెలయేరులు ప్రవహింపచేయాల్సిందే ! పాడమంటూ వచ్చి ఎదురుగా నిలుచున్నవాడే కాదు , ఎదురుగా రాకుండానే ఎంతెంతో మంది నీ గాన ప్రియులు , నీ గొంతులోంచి ఏదైనా ఒక పాట తేనెల సోనగా జాలువారుతుందేమో నని చాటుగా పొంచి పొంచి వింటున్నారేమో ఎవరికి తెలుసు ? ఎలా చూసినా గొంతు సవరించుకోవలసిందే ! తనలోంచి తాను బయటికి వచ్చి చుట్టూ చేరిన హృదయాల్ని రసరంజితం చేయాల్సిందే

anrvideosongs
ANRvideosongs
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము విని 
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ // పాడవేల //
ఏదో మామూలుగా వినేవాళ్లే కాదు , స్వతహాగా గొప్ప గానప్రియులైన వారు నీ చెంతచేరి , అప్పుడెప్పుడో పలికిన నీ హృదయవీణ మాధుర్యం కోసం ఎదురుచూస్తుంటే ఏమిటి చేయడం ? గుండెలోంచి రసఝరులు ఒంపాల్సిందే! నిజానికి , పాడటానికి రాగజ్ఞానం , స్వరశక్తి మాత్రమే సరిపోవు . అపారమైన ఆత్మవిశాసం ఉండాలి . దాన్ని సముపార్జించుకున్న వాడు ధన్యుడు . అతడు వ్యక్తిగతమైన ఎన్నెన్నో అవరోధాలను అవలీలగా అధిగమించగలడు . ఆ స్థితిలో నలుగురి కోసం తన హృదయాన్ని సవరించుకోగలడు . అనంతమైన శక్తితో గొంతెత్తి ఆత్మగానం చేయగలడు !! 

anroldsongs
anroldsongs

#anrvideosong,#padavela radhika lyrics, #anroldsongs





10, జనవరి 2021, ఆదివారం

మనసున మల్లెల మాలలూగెనే పాట | మల్లీశ్వరి సినిమా ( 1951 ) | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది ? 
ఒక్క పూటలో , సినిమాలోని మొత్తం పాటలకు బాణీలు ఇచ్చి వెళ్లిపోయే ఇప్పటి కాలాన్ని మనం చూస్తూనే ఉన్నాం . కానీ , ఒక్క సినిమాలోని పాటలను స్వరపరచడానికి ఈ 6 మాసాలు పట్టిందంటే మనకు ఆశ్చర్యం కలగదా ! మల్లీశ్వరి సినిమా పాటల స్వరకల్పనలో అదే జరిగింది . ఎక్కువ కాలం పడితే ఎక్కువ గొప్ప అని కాదు . ఎక్కువ మనసు పెట్టడానికి వారు అంత సమయం పెట్టారు . ఆ శ్రమ ఫలించి, ఎప్పుడో ఏడు దశాబ్దాల క్రితం ( 1951 ) వచ్చిన ఆ సినిమా పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఇప్పటికీ తాజాగా కదలాడుతున్నాయి . 

                ఆ సినిమాలోని అన్ని పాటలూ రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రికి వాటిని స్వరపరిచిన సాలూరు రాజేశ్వరరావుకూ , తెలుగు హృదయాలు కాలం ఉన్నంత కాలం రుణపడి ఉంటాయి . వీరితో పాటు సన్నాయి  నాదం  లాంటి భానుమతి గొంతు మల్లీశ్వరి కోసం పాడిన పాటల్ని తెలుగు వాళ్లే కాదు , రసజ్ఞులైన భారతీయులెవరూ ఎప్పటికీ మరవలేరు .

మనసున మల్లెల మాలలూగెనే 


మనసున మల్లెల మాలలూగెనే 
కన్నుల వెన్నెల డోలలూగెనే 
ఎంత హాయి ఈ రేయి నిండెనో 
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో 

నిరీక్షణ... ఎంత మధురమైనదో , అంత బాధాకరమైనది కూడా ! ఒక్క మాటలో చెప్పాలంటే , నిరీక్షణ ఒక మధురమైన బాధ . ఎందుకంటే , నిరీక్షణలన్నీ నిజమవుతాయన్న గ్యారెంటీ ఏదీ లేదు . ఒకవేళ ఆ నిరీక్షణ నిజంగానే ఫలిస్తే మాత్రం , మనసులో మల్లెల మాలలు ఊగడమే కాదు , కన్నుల్లో వెన్నెలలే ఓలలాడతాయి . నిజానికి , ప్రేమ నిరీక్షణలో ఎన్నాళ్లు పట్టినా , ఎన్నేళ్లు గడిచినా సరే ! అది ఫలించిననాడు మాత్రం ప్రేమికులకు అదో పెద్ద పండగే మరి ! 
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా 
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని 
కన్నుల నీరిడి కలయజూచితిని

తన ప్రేమమూర్తి గురించిన ఎడగెగని ఆలాపనలో ఏమవుతుంది ? ప్రకృతిలోని ప్రతి శబ్దమూ , ఆ ప్రేమమూర్తి ప్రతిధ్వనిలాగే వినిపిస్తుంది . ఎక్కడో దూరం నుంచి ఓ వేణునాదం వినిపిస్తే , అది అతని గానమే అనిపిస్తుంది . ఇరువురూ ఏకమై లోకమంతా తామే వ్యాపించిన ఆ ప్రేమ స్థితిలో ప్రతిదీ తమదే అనిపిస్తుంది . ప్రేమను అద్వైత స్థితి అని ఇందుకే అన్నారు మరి ! ఏమైనా , తన ప్రేమ మూర్తి కోసం ఎదురు చూడటం అంటే , తన ప్రాణం కోసం తాను ఎదురు చూడటం , తన జీవితం కోసం తాను ఎదురు చూడటమే ! ఏ కారణంగానో ఆ ప్రేమ మూర్తి  రావడంలో ఆలస్యమైతే లేదు .... ఒక పెద్ద ఎడబాటు ఏర్పడితే , కళ్లు ఇంక కన్నీటిమయమే ! సరిగ్గా అదే స్థితిలో ఒకవేళ నిజంగానే అతడొచ్చి ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుంది? కన్నీటి పొర కమ్మేసిన కళ్లతో తొలుత అతన్ని గుర్తించడం కష్టమవుతుంది . కాకపోతే , తనకు అంత సన్నిహితంగా నిలబడేది అతడు కాక ఇంకెవరవుతారు ? 

గడియలోని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఒకరిలో ఒకరుగా ఏకమైపోయిన అనంతరం ఆ హృదయ స్థితి ఎలా ఉంటుంది ? గడియ కాదు ఒక క్షణమైనా ఒకరికొకరు దూరంగా ఉండడం సాధ్యమే కాదు . ఒకవేళ నిరీక్షణ ఫలించి తన ప్రేమమూర్తి తన చెంతన వాలిపోతే , లోకమే సొంతమైన ఒక మహదానందం . కాకపోతే , చేరువైన వారు ఎప్పటికీ చెంతనే ఉంటారన్న గ్యారెంటీ ఏదీ లేదు మరి ! ఏ బలీయ కారణమో వారిని విడదీసి , ఏళ్ల పర్యంతం వారిని దూరం చేస్తే ! ఎంత వ్యధ ? ఎంత దుఃఖం? దూరదూరాలకు విసిరేయబడ్డ ఈ హృదయాలు ఒకరికొకరు మళ్లీ చేరువ కావడానికి వారు ఎంత యుద్ధమో చేయాలి ? అలాంటి వాళ్లకు ఆ యుద్ధంలో పోరాడే తిరుగులేని శక్తి వాళ్లకు రావాలి . ఆ మహాశక్తి వారికి రావాలని మనమంతా మనస్పూర్తిగా కోరుకుందాం మరి !! 

                                                                     ---బమ్మెర
Telugu Old Songs Analysis Quotations
Telugu Old Songs Analysis Quotations

ntr songs,Bhanumati Singer Songs, sr ntr movies, పాత సినిమా పాటలు , ఎన్.టి.రామారావు , senior n.t. rama rao , నందమూరి తారక రామారావు ,

4, జనవరి 2021, సోమవారం

కలకానిది విలువైనది పాట లిరిక్స్ విశ్లేషణ | వెలుగు నీడలు సినిమా |ఏ ఎన్ ఆర్ - సావిత్రి | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది
Telugu old songs
'వెలుగు నీడలు...' ఈ సినిమాలోని పాటలన్నీ చిరకాలం నిలిచిపోయేవే . ప్రత్యేకించి , మహాకవి శ్రీశ్రీ రాసిన 'కలకానిది విలువైనది' అన్న పాట మరింత హృద్యమైనది .1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు . అయితే భావస్ఫోరకమైన ఘంటసాల గానం ఈ పాటను రసజ్ఞుల గుండెలోతుల్లో నిలబెట్టింది . అన్ని తరాల్లోనూ , మానవత్వాన్ని మేల్కొలుపుతూ , స్ఫూర్తిని నింపుతూ వస్తున్న ఈ పాట ఈ కొత్త సంవత్సరానికి (2021) శష్టి పూర్తి చేసుకుంది . ఇంతకాలం అంత సజీవంగా ఉన్న ఈ పాటలో ఎంతటి భావనా పటిమ ఉండి ఉండాలి . ఒకసారి తరచి చూస్తే తరించిపోతాం "
కలకానిది .. విలువైనది

కలకానిది విలువైనది
బ్రతుకు ... కన్నీటి ధారలలోనే బలిచేయకు
కలలో జరిగిన కన్నీటి గాద ఏదైనా ఉంటే , అది కలచెదిరి పోగానే కరిగిపోతుంది . ఆ కలలో ఆద్యంతం కన్నీటి పర్యంతమే అయినా నష్టమేమీ లేదు . ఎందుకంటే , అది జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశమే లేదు .అది కల కాబట్టి . ఒకవేళ నిజజీవితంలోనే ఎవరైనా ఆ స్థితికి లోనై నిరంతరం ఏడుస్తూ కూర్చుంటే , ఏమవుతుంది? జీవితం శిధిలమైపోతుంది . బతుకు ఎడారిగా మారిపోతుంది . ఆ కన్నీటి కార్చిచ్చుకు బలైపోతుంది . 

కలకానిది విలువైనది పాట
Kalakaanidi Viluvainadi Song

గాలి వీచి పూవుల తీగ - నేలవాలిపోగా
జాలివీడి టులే దాని వదిలివైతువా !
ఓ ... చేరదీసి నీరుపోసి చిగురించనీయవా !
మన జీవితమే అని కాదు . ఎదుటి వారి జీవితంలోనే అలా ఏదో జరిగిందే అనుకోండి . కన్నీరు మున్నీరుగా ఏడ్వడమే మిగిలిందనుకోండి ఏమవుతుంది? ఎప్పటికప్పుడు పైపైకి ఎగబాగవలసిన జీవితం నేలకూలిపోతుంది . అలాంటప్పుడు సాటి మనిషిగా మనకు ఏ బాధ్యతా ఉండదా ? అందుకే ఎక్కడెక్కడో కాకపోయినా , మన పక్కనే పడి ఉండి ఏడ్చి ఏడ్చి  తడారిపోతున్న వారి గొంతుకు కాసిన్ని నీళ్లందించడం కావాలి . అలా దాహార్తి తీర్చడం వల్ల కలిగే ఆనందం , ఆధ్యాత్మికులు కోరుకునే మోక్షం కన్నా ఎంతో  ఉన్నతమైనది !! 

వెలుగు నీడలు సినిమా
Velugu Needalu Cinema

అలముకున్న చీకటిలోనే ఆలమటించనేల
కలతలకే లొంగిపోయి , కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో // కలకానిది //
భయమనేది ఒకటి గుండెలో చొరబడితే చాలు . మనం వెళ్ల వలసిన దారులన్నీ మూసుకుపోయినట్లే అనిపిస్తుంది . నిజంగానే అవి అలా మూసుకుపోయాయని కాదు . భయం వల్ల వాటిని చేధించే శక్తి కొరవడుతుంది . దానివల్ల ముందుకు వెళ్లే దారే లేనట్లు అనిపిస్తుంది . కారు చీకట్లు కమ్ముకుని ఏదో లోయలో పడిపోయినట్లే అనిపిస్తుంది . ఇదంతా ఒక విభ్రాంతి మాత్రమే ! ఇక్కడ కావలసిందల్లా ఒక్కటే ! అదే ధైర్యం ! ఇదే నిజానికి దీపం వెలిగించగానే చీకట్లన్నీ పటాపంచలైపోయినట్లు , గుండెలో సాహసం నిండుకోగానే ఆటంకాలన్నీ చెల్లాచెదరైపోతాయి . మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది . కానీ , ఆ ధైర్యం ఎలా వస్తుంది ? అందుకు మనలో దాగిఉన్న ఆత్మశక్తి విశ్వరూపాన్ని గుర్తించడం ఒక్కటే మార్గం !

సావిత్రి పాటలు
Savitri Songs

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే 
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం !! 
సముద్రంలోకి దూకి ఈ దరి నుంచి , ఆ దరికి , ఆ దరి నుంచి ఈ దరికి అదే పనిగా ఈదుతూ ఉండిపోతే ఏమవుతుంది ? ఆ నిరర్ధకమైన ప్రయాసలో చాలా త్వరగా శరీరం అలసిపోతుంది . మనోబలం సన్నగిల్లుతుంది . ఏదో ఒక దశలో ఊపిరి ఆగి ప్రాణం పోతుంది . అలా ఉుత్తినే సముద్రం పైపైన తిరగకుండా , సముద్రపు అట్టడుగుకు వెళ్లగలిగితేనో ... అక్కడుండే ఆణిముత్యాలు చేతికి అందుతాయి . పడ్డ శ్రమకు ఫలితం లభిస్తుంది .వ్యధలూ , బాధల విషయంలోనూ అంతే ! వాటిని చూసి జడుస్తున్న కొద్దీ హృదయం కకావికలం అవుతుంది . కన్నీటిమయం అవుతుంది . అలా కాకుండా , దుఃఖపు లోలోతుల్ని పరిశీలిస్తే , అసంఖ్యామైన జీవితసత్యాలెన్నో బోధపడతాయి . అలా ఏదో జ్ఞాన సిద్ధి కలుగుతుందని మాత్రమే కాదు .జీవిత సమస్యల్ని చేధించే విజయ రహస్యాల అమ్ములపొది చేతికొస్తుంది .అంతిమంగా గుండెల్లో విజయకేతనం రెపరెపలాడుతుంది . ఎన్నడూ ఊహించని గొప్ప విజయానందం హృదయాన్ని అభిషేకం చేస్తుంది .

Telugu Quotes

                                                                  ---  బమ్మెర

#కలకానిది విలువైనది పాట లిరిక్స్ ,#వెలుగు నీడలు సినిమా,తెలుగు పాత పాటలు ,ANR old movies, Akkineni Nageswara cinema, velugu needalu (1999),Akkineni Nageswara Rao, ANR Old Telugu Movies, Akkineni nageswara rao Telugu cinema,ANR Old Songs,Velugu Needalu Old Songs,ANR Old Songs ,Nee Sukhame Ne korukunna,తెలుగు ఓల్డ్ సాంగ్స్ ,#ghantasala సాంగ్స్


2, జనవరి 2021, శనివారం

నీ చరణ కమలాల నీడయే చాలు పాట లిరిక్స్ విశ్లేషణ | శ్రీకృష్ణావతారం సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs Analysis |

 పాటలో ఏముంది ?

శ్రీకృష్ణావతారం సినిమాలోని ముగ్ధమనోహరమైన ఈ పాట డాక్టర్ సి. నారాయణ రెడ్డి కలంలోంచి జాలువారినది.1967 లో విడుదలైన ఈ సినిమాకు టి.వి. రాజు సంగీత దర్శకత్వం వహించారు .త్రివేణి సంగమంలా ఘంటసాల , లీల , సుశీలల గాత్రాలు ఈ పాటను ఎంతో మృదుమధురంగా గానం చేశారు . ఈ ప్రణయగీతం , పౌరాణిక సినిమాల్లోకెల్లా మకుటాయమానంగా నిలిచింది అనేది వాస్తవం.ఎప్పటిదో 50 ఏళ్ల క్రితం నాటి ఈ సృజన , ఇప్పటికీ రసుజ్ఞులకు వీణుల విందు చేస్తోంది అంటే , ఈ పాట ఎంత రసాత్మకమో ఊహించుకోవచ్చు .




నీ చరణ కమలాల నీడయే చాలు !

జీవితంలో ఇప్పటిదాకా తనకేమీ లభించనేలేదు .ఏవైనా లభ్యమైనా అవి ఎందుకూ కొరగానివని కొందరు అనుకుంటారు . మరికొందరేమో , ఇప్పుడున్నవే చాలా ఎక్కువ . ఇవి లభించడం నిజంగా ఎంతో గొప్ప అదృష్టం అనుకుంటారు . రెండవ కోవకు చెందిన వారు నిరంతరం ఆనంద డోలికల్లో తేలాడుతుంటే ,  మొదటి కోవకు చెందిన
వారేమో జీవితమంతా ఏడుస్తూ గడిపేస్తారు . రుషులు , మహర్షులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ , ఉన్నదాని పై నిర్లక్ష్యం , లేనిదానిపై వ్యామోహం ... ఇవే దుఃఖానికి అసలు మూలమని చెబుతుంటారు . అలాంటిదేమీ లేకుండా ,
ఉన్నదే అపురూపమని భావించే ఈ ఆనంద
హృదయాలను చూడండి .
- నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
ఎంత ప్రేమ ఉంటే మాత్రం , ఎందుకలా ఏకంగా పాదాలపై వాలిపోవడం ఏమిటని ఏమీ అనుకోనవసరం లేదు . పరిపూర్ణమైన ప్రేమికుల్లో పాదాలు తక్కువ .... చేతులు ఎక్కువ లనే భావన ఏదీ ఉండదు .అందుకే నీ పాదపుష్పాల నీడయే చాలు ఇంకా ఏ పూదోటలూ అవసరం లేదు అంటోంది|
nee charana kamalaala old song
Nee Charana Kamalala song

నీ నయన కమలాల నేనున్న చాలు I
ఎందుకే ఓ దేవి నందనవనాలు
ఉన్నదానితో సంతృప్తి పడితే , అభివృద్ధి , పురోభివృద్ధి ఏముంటుంది ? అంటూ కొందరు వాదిస్తారు . నిజమే కానీ , శక్తికి మించి ,ఆశపడి ,విఫలమై , విలపిస్తూ కూర్చుంటే అదేమంత గొప్ప ? ఏదైనా నీ పరిమితులకు లోబడే ఆశించాలి. అప్పటిదాకా లభించినవి కూడా తమ పరిమితులకు లోబడే లబించాయని గ్రహించాలి . ఆ భావనలో నిజంగా ఎంత హాయి !
- నును మోవి చివురుపై నను మురళిగా మలచి
పలికించరా మధువు లొలికించరా
ఎక్కడెక్కడికో వెళ్లి పుట్టతేనియలు తేవాల్సిన అవసరం లేదు .నన్నే ఒక వేణువుగా మలిచి మధుర రాగాలు పలికించు, నీ ప్రేమలో మత్తిళ్ల చేసే మధువులు ఒలికించు అంటోంది ఆ ప్రేయసి .శరీరం గతితప్పిన వారి అరచేతిలో తేనె పోసినా కాస్తంత చప్పరించి అబ్బే చేదని ఆవల పారబోస్తారు . శరీరం సద్గతితో ఉండి ,మనసు శృతిలో ఉన్నవారికి మమతానురాగాలతో ఏమొచ్చినా అది తేనె పాత్రలాగే అనిపిస్తుంది . ఏ నాదమైనా రాగమయంగానే వినిపిస్తుంది . అందుకే ఆమె తనను ఒక వేణువుగా మలిచి నాదాలు పలికించమంటోంది .
sri krishnavataram film songs
sri krishnavataram film songs
మోవిపై కనరాని , మురళిలో వినలేని
రాగాలు పలికింతునే మధురానురాగాలు చిలికింతునే
విశేషం ఏమిటంటే , ఆమె మాట విన్న అవతలి వ్యక్తి , ఆమె ఆశించిన దానికన్నా మిన్నగా ఇంకా ఎంతో ఎత్తున నిలబడి, ఆమె కోరికల్ని తీర్చే ప్రయత్నంలో పడ్డాడు . అందరిలా కాకుండా , ఇంకెవరికో తెలియకుండా , కనిపించకుండా తాను ఆశించింది నెరవేరుస్తానంటున్నాడు . ముఖం పైన కనిపించని అనురాగాల్ని , ఏ వాయిద్యమూ
పలికించలేని కనీవినీ ఎరుగని కమ్మకమ్మని రాగాల్ని పలికిస్తానంటున్నాడు . పైగా పాత పోకడల్ని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండాలనుకోవడం , ఉండడం నిజంగా ఎంత ఆనందకరం ? అదీకాక , మరొకరి కంట పడకుండా , చెవిన పడకుండా అనురాగాల్ని ఒలికించడం , రాగాలు పలికించడం ఎంత గొప్ప కళ ?
- నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు

నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓదేవి బృందావనాలు
విహార యాత్రగా పచ్చపచ్చని ఏ అరణ్యాల్లోనో తిరగాల్సిన అవసరం లేదు . నీ ప్రేమవనంలో నేనుంటే చాలు అని ఆమె అంటే , అనంతమైన ఆకాశయానాలు ఏమీ అవసరం లేదు. నీ హృదయమే ఒక మహా ఆకాశం . అందులో నేనుంటే చాలు అని అతడంటున్నాడు . ప్రేమికుల జీవితాల్లో వేరే అరణ్యాలు .... వేరే ఆకాశాలు ఏముంటాయి ? ఉన్నా వాటితో పనేముంటుంది ?
- తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా స్వామి - పులకింతునా
ఎవరినైనా , ఆరాధించడానికి , పూజించడానికి , బంగారు పళ్లెంలో  వజ్ర వైడూర్యాలు నింపుకోవాల్సిన అవసరం ఏముంది ? ప్రేమ కూడా భక్తి లాంటిదే కదా ! ప్రేమ భక్తులకు కూడా సమర్పించుకోవడానికి నాలుగు తులసి ఆకులైనా చాలు . పూజించడానికీ , భక్తి పారవశ్యంలో పులకించడానికి అవి సరిపోతాయి . అయినా అలా పూజించనా స్వామీ అంటూ , ఒక మీమాంసను అతని ముందు పెడుతోంది . అందుకు అతనేమంటున్నాడు !
NTR songs
NTR songs
పూజలను గ్రహియించి- పులకింతలందించి
లోలోన రవళింతునే ఓ దేవి నీలోన నివసింతునే
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వారికి ఆడంబరాలు ఆర్భాటాల అవసరం ఏమీ ఉండదు . వాటిని వారు కోరుకోరు కూడా! పైగా , ఆ తరహా సాదాసీదా ఆరాధనలకే వారు ఆనంద పరవశులవుతారు . ఇంకా బయటెక్కడో ఎందుకులే అనుకుని ఆమె హృదయంలోనే మకాం వేసి , అనురాగ గీతాల్ని ఆలపిస్తారు . ఆ గానం వాళ్ల హృదయాల్నీ , జీవితాల్ని ధన్యం చేస్తుంది .
---బమ్మెర
చల్లని వెన్నెలలో పాట లిరిక్స్ విశ్లేషణ
లిరిక్స్ విశ్లేషణ
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 

#నీ చరణ కమలాల నీడయే చాలు పాట, #శ్రీకృష్ణావతారం సినిమా, #Telugu old songs, #
Nee Charana Kamalala సాంగ్ ,#ntr songs,#ghantasala సాంగ్స్,#susheela సాంగ్స్