పాటలో ఏముంది?
1981 లో విడుదలైన ’ ప్రేమాభిషేకం’ సినిమా కోసం దాసరి నారాయణ రావు రాసిన తాత్వికమైన ఈ పాటను చక్రవర్తి సంగీత సారధ్యంలో బాలు ఎంతో భావోద్వేగంగా పాడారు. పల్లవి వినగానే మనసేదో బరువెక్కుతున్నట్లు అనిపించినా ఒక్కో చరణమే దాటుతూ లోలోతుల్లోకి వెళ్లే కొద్దీ మనసు ఎంతో తేలికపడుతుంది. ఎవరూ కాదనలేని ఆ జీవిత సత్యాల ప్రవాహాల్లో మరోసారి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ అనుభూతి మళ్లీ మళ్లీ ఆస్వాదించాలని కూడా అనిపిస్తుంది. మనలోని ఆ భావనను భుజానేసుకుని ఆ పాటను మరోసారి వినేద్దామా మరి!!
ఆగదు ఏ నిమిషము నీ కోసమూ ....!
ఆగితే సాగదు .. ఈ లోకము ...
కాలానికి ఆదీ - అంతం అంటూ ఏమీ లేవు కదా! అయితే, తూనికల్లోనో, కొలమానికల్లోనో పెట్టనిదే మనిషి దేన్నీ పరిగణనలోకి తీసుకోడు! అందుకే ఉదయాస్తమయయాలు మనిషికి ఆ వెసులుబాటు కలిగించాయి. వాస్తవానికి అనంతమైన సృష్టి చైతన్యంలో భాగమైన ఈ మనిషి కూడా అనంతుడే! కానీ, ఆ అనంతత్వం కూడా కొన్నాళ్లకు విసుగుపుట్టిస్తుందేమో! కాల పరిమితులంటూ లేకపోతే మనిషి మహా బద్ధకస్తుడైపోతాడేమో కూడా అనుకుని, కాలం, మనిషి ప్రాణశక్తికి కొన్ని పరిమితులు విధించాలనుకుంది. ఆ వెంటనే జనన మరణాలంటూ కొన్ని సరిహద్దు రేఖల్ని గీసి ఎంతో మంచి పని చేశాననుకుంది. కానీ, ఇదే మనిషి హృదయాన్ని మహా వేదనామయం చేసింది. కాకపోతే, ఆ వేదనే అతని జ్ఞానిని చేసింది, అతనిలో వేగాన్ని పెంచింది. విధినిర్వహణకు పురికొల్పింది. ఉన్నది పరిమిత కాలమే కాబట్టి, ఉదయానికీ, అస్తమయానికీ మధ్య జరగాల్సినవన్నీ త్వరత్వరగా జరిగిపోవాలనుకున్నాడు మనిషి! పరిమిత ప్రాణశక్తే కాబట్టి, జననానికీ మరణానికీ మధ్య నెరవేర్చాల్సినవన్నీ వెంటవెంట నెరవేర్చాలని కూడా అనుకున్నాడు. ఏమైతీనేమిటి ? చీకటి వెలుగుల మధ్య, జీవుల చేతన - అచేతనల మధ్య ఎక్కడా ప్రతిష్టంబన ఏర్పడకూడదని కాలం క్షణమాగకుండా సాగిపోతూనే ఉంటుంది. కాలం ఆగితే లోకమే ఆగిపోతుంది కదా మరి! అసలు నిజానికి , ఒకవేళ కాలమే కాసేపు ఆగాలనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే, కాలం ఆగడం అన్నది కాలం చేతుల్లో కూడా లేదు మరి!. అందుకే అనంత ంగా నిర్విరామంగా కాలం అలా కొనసాగుతూనే ఉంది. జీవితం అంటేనే కొనసాగడం కదా మరి!
తెలిసినా ... గ్రహణము ... రాకమానదు
పూవులు లలితమనీ ..తాకితే రాలుననీ
తెలిసినా ... పెనుగాలి .. రాక ఆగదు
హృదయము అద్దమనీ, పగిలితే అతకదనీ
తెలిసినా .. మృత్యువు రాక ఆగదూ.... // ఆగదు ఏ నిమిషము //
సృష్టిలో ప్రతిదానికీ నిర్దిష్ట కాలపరిమితులు ఉన్నాయి. అవి కచ్ఛితంగా అమలై తీరుతాయి. ఎవరైనా ఇంకాసేపు వెలుగు ఉంటే బావుణ్ణు అనుకున్నంత మాత్రాన సూర్యుడు అస్తమించకుండా తాత్సారం చేయడు కదా!. చేయవలసిన పనులేవో పూర్తి కాలేదని కారణంగా లోకంలో మరికొంత కాలం ఉండిపోవాలని మనిషి ఆశపడితే మాత్రం? మృత్యువు ఆ సడలింపు ఇవ్వదు కదా! తెరపడాల్సిన సమయంలో తెరపడితీరాల్సిందే!! జాబిలి చల్లదనాన్నే కదా ఇస్తోందని...., వెన్నెల వెలుగులే కదా పంచుతోందని రావాల్సిన సమయాన గ్రహణం రాకుండా ఆగిపోదు కదా! పూలు లోకానికి పరిమళాలు పంచుతూ, ప్రాణికోటికి సున్నితత్వాన్ని అందిస్తాయని ప్రకృతికి తెలియదా? అయినా వడగాలులూ, పెనుగాలులూ, అసలే రాకుండా ఉండవు కదా! అవెందుకూ అంటే వాటి ద్వారా, సమస్త ప్రాణికోటికీ , ప్రతేక్యించి మనిషికి విశ్వం కొన్ని పాఠాలు చెప్పాలనుకుంటుంది. వాటివల్ల ఎవరికెంత బాధ కలిగినా అది ఆ పాఠాలు చెప్పే తీరుతుంది. రాళ్ల వర్షం పడి, అద్దాల మేడ వ్రకలైపోవచ్చు. ఏదో విధ్వంసం జరిగి, జీవన సౌధం నేల మట్టం కావచ్చు. అయినవాళ్లూ, ఆత్మీయులూ ప్రాణాలు పోయి, మట్టిలో కలిసిపోవచ్చు.... దహనమై ఆకాశంలో కలిసిపోవచ్చు. పోయిన వాళ్లుపోగా వాటిద్వారా ఉన్నవాళ్లందరికీ కాలం జీవితపాఠాలో, మృత్యుపాఠాలో చెబుతూనే ఉంటుంది. మనిషి వాటిని వినితీరాల్సిందే! అలా జన్మ తరించాల్సిందే!
తెలిసినా ...ఈ మనిషీ పయనమాగదు
జననం ధర్మమనీ ... మరణం ఖర్మమనీ
తెలిసినా జనన మరణ చక్రమాగదు...
మరణం తధ్యమనీ ... ఏ జీవికి తప్పదనీ
తెలిసినా .. ఈ మనిషి ... తపన ఆగదు // ఆగదు ఏ నిమిషము //
జీవిత ంలో గమనమే తప్ప గమ్యం ఉండదు ఇది వాస్తవం! ఎందుకంటే, అదేదో గమ్యం అనుకుని ఎంతో కష్టపడి తీరా అక్కడికి చేరుకునే సరికి అది గమ్యమే కాదనీ, గమ్యానికి చేరే అనంత కోటి ద్వారాల్లో ఇది ఒకటి మాత్రమేనని తేలిిపోతూ ఉంటుంది. జీవనయానమంతా మజిలీలు మజిలీలుగానే ిసాగిపోతూ ఉంటుంది ఇది నిజం . కాకపోతే ప్రతిసారీ మనిషి, మజిలీనే గమ్యమని పొర బడుతుంటాడు. పోనీ, చివరికి మరణాన్నే గమ్యం అనుకుందామా అంటే అదీ కుదరదు. ఎందుకంటే, ’మరణం అంతిమ దశ ఏమీ కాదు, మరణించేది శరీరమే తప్ప ఆత్మ కాదు, అసలు ఆత్మకు మరణమే లేదు అని చెప్పే అనేక వాదనలూ, సిద్ధాంతాలూ లోకంలో అనాదిగా ఉన్నాయి. అందులో భాగంగా మరణం తర్వాతే కాదు. ఇప్పటి ఈ జన్మకు ముందు కూడా ఆయా జన్మల ఖర్మానుసారం ఆత్మ ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ వచ్చిందనీ వాదన కూడా ఉంది . పూర్వ జన్మలూ, పునర్జన్మల విషయం పక్కనబెడితే, ఇప్పటి ఈ జన్మలోనైతే మరణం తప్పదనే సత్యం అందరికీ తెలిసిందే! ఎన్ని చేసినా మనిషి జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడే గానీ, మరణాన్ని పూర్తిగా అధిగమించలేడుగా! ఈ క్రమంలో జననమే కాదు మరణం కూడా మనిషి చేతిలో లేదనే విషయం కూడా స్పస్టమవుతుంది . అయితే, మనిషి చేతిలో ఉన్నదేమిటి మరి? జననానికీ మరణానికీ నడుమ నడిచే ఆ మధ్య కాలమొక్కటే అతని చేతిలో ఉంటుంది. ఆ నాలుగు రోజల మధ్య కాలాన్ని మనిషి ఎంత అర్థవంతంగా, ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటాడన్న దాని పైనే అతని జీవిత ఔన్నత్యమూ, అతని ఆత్మానందమూ అన్నీ ఆధారపడి ఉంటాయి. అంతే!!
- బమ్మెర