పాటలో ఏముంది?
ఏదో ఏదో అన్నది....
సోయగాల విందులకై వేయి కనులు కావాలి // ఏదో ఏదో//
జీవిత భాగస్వామికోసం ఏ వరుడిలోనైనా ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉంటుంది. కాకపోతే, ఎక్కువమంది దృష్టి సహజంగానే, కొత్త పెళ్లి కూతురు రూప సౌందర్యం పైనే ఉండవచ్చు. అతని కళ్లకు ఆమె ఒదిగి కూర్చోవడంలోని ఒయ్యారాలే కనిపించవచ్చు. ఆమె ముడుచుకోవడంలోని సింగారాలే కనిపించవచ్చు. కానీ, ఆమె అలా ఒదిగి కూర్చోవడంలో ఎన్నెన్ని దిగులూ, ఆందోళనలు ఉన్నాయో ఎవరికి తెలుసు? తాను కొత్తగా అడుగిడబోయే సంసార చదరంగంలో, ఏ స్థానంలో ఎవరున్నారో, వాళ్లు ఎలాంటివారో, వాళ్లతో ఎలా మసలుకోవాలో ఎలా బోధపడుతుంది? ఆ విషయాల్లో ముందుగా ఏ అంచనా ఉండదు కదా! పెళ్లి నాటి దాకా ఆమె ఒక స్వేచ్ఛా విహంగం. పెళ్లి తర్వాత ఆ స్వేచ్ఛ ఉండదు కదా! అందుకే ఆ విస్తారమైన తన రెక్కల్ని తానే కత్తిరించుకోవాలి. ఎగిరే తన మనసును తానే కట్టడి చేసుకోవాలి! ఇపన్నీ ఆమె గుండె పైన హఠాత్తుగా వచ్చి పడిన అదనపు బాధ్యతలు..... భారాలు. కొత్తపెళ్లి కొడుకు ఆశలూ, ఆకాంక్షలూ సరే! అతన్ని తనకు అప్పగించిన ఆ తల్లిదండ్రుల ఆశలూ, ఆకాంక్షలు కూడా ఉంటాయి కదా ! అవే కాదు, వాటితో పాటే వాళ్లల్లో, కొత్తగా మొదలైన భయాలూ ఆంధోళనలు కూడా ఉంటాయి! వాటిల్లో ఇప్పటి దాకా తమ కనుసన్నల్లో, తమ అడుగు జాడల్లో మసలుకున్న అబ్బాయి, ఇకపైన అలా ఉండడేమో అన్న భయం ఒక వైపు, తనదైన వేరే ప్రపంచంలో పడిపోయి, తమకింక దూరమైపోతాడేమోనన్న అన్న ఆందోళన మరో వైపు వారి హృదయాల్ని ముప్పిరి గొంటాయి. అదంతా ఏమీ ఉండదని ఎవరికి వారు తేల్చేసుకోవడం అంత తేలికేమీ కాదు కదా! ఇలాంటి తనలోవి, బయటి వి పలు అంశాల పైన ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచించే కొద్దీ ఏమౌతుంది? ఎంత లేదన్నా గుండె బరువెక్కిపోతుంది. ఈ స్థితిలోనే మునుముందు ఎలా ఉండబోతోందో ఏమీ తోచక, వధువు తనలోకి తానే ఒదిగిపోతుంది. తనలోకి తానే ముడుచుకుపోతుంది. వరుడు అవేవీ పట్టించుకోకపోగా, ఆమె సోయగాలు చూడటానికి తనకు వేయి కళ్లు ఎందుకు లేవు? అంటూ తనలో తాను మధ నపడుతుంటాడు!
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు
పులక రించు మమతలతో పూలపాన్పు వేశారు // ఏదో ఏదో //
ఆశించినదానికన్నా అపురూపమైనది ఏదో అనుకోకుండా తన జీవితంలోకి ప్రవేశించినప్పుడు, ప్రత్యేకించి దాని వెనుక మానవ సాయమేదీ లేదనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? కొంతమందికైతే, కొన్ని అతీతమైన భావాలు కలుగుతాయి. భువి నుంచి కాకుండా దివి నుంచి ఎవరో దేవ దేవుళ్లు ఆమెను తనకు ఒక అపురూప కానకగా చేరవేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా తనకు ఎదరుపడిన వాళ్లంతా, నేల మీద తారట్లాడే మాటలే వినిపించారు. ఏదో ఏటి తరగల పైన కదిలే పాటలే వినిపించారు. ఉన్నట్లుండి, ఒక సౌందర్య రాశి, నక్షత్రాల భాషలో మాట్లాడుతుంటే, నభో నిలయాల్లో మారుమ్రోగే రాగాలేవో వినిపిస్తుంటే, ఆ వరుడికి క చ్ఛితంగా ఆమె దైవదత్తమైన దివ్య కానుకే అనిపిస్తుంది. పైగా, అది ఏనాటికీ తరగనీ, కరగనీ మహా ఐశ్వర్యమే అనిపిస్తుంది. భావోద్వేగాలు వారికి అంతటి మహానందాన్నీ, గొప్ప పారవశ్యాన్నీ అందిస్తుంటే నిండు మనసుతో కొండెత్తు శుభాకాంక్షలు అందించాలి! దివికీ, భువికీ మధ్యనున్న రేఖను అంత అవలీలగా మాయం చేసిన వారి ప్రేమశక్తిని మనం ఒక్కొక్కరం వేయి హృదయాలతో అభినందించాలి!!
- బమ్మెర