27, డిసెంబర్ 2020, ఆదివారం

చల్లని వెన్నెలలో పాట లిరిక్స్ విశ్లేషణ | సంతానం సినిమా | ఏ ఎన్ ఆర్ - సావిత్రి | తెలుగు పాత పాటలు | Telugu old songs Analysis |

పాటలో ఏముంది ?

ఘంటసాల పాడిన వాటిల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అరుదైన పాట ఇది . 1955 లో విడుదలైన సంతానం సినిమా కోసం అనిసెట్టి రాసిన ఈ పాటను స్వరపరచిన వారు సుసర్ల దక్షిణామూర్తి . పాటకు ముందు ఉండే ఆలాపన హృదయాల్ని ఏ దూరతీరాలకో తీసుకువెళ్లి వదిలేస్తుంది . పల్లవి మొదలైనప్పుడు గానీ మళ్లీ వెనక్కి వచ్చి ఉన్నచోట వాలిపోలేము ! ఒకసారి వినిచూడండి , మీకే తెలుస్తుంది .

చల్లని వెన్నెలలో



చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే - ఆనందమె నా గానమాయెనే // చల్లని //
సర్వసమగ్రమైన సత్యమే సుందరము అంటూ ఉంటారు . సత్యం - శివం - సుందరం అనే మాట అక్కడి నుంచి వచ్చిందే కదా ! అలాంటి మహోన్నతమైన సౌందర్యం , లేదా అందం మనలో లీనమైపోతే జీవితానికి అంతకన్నా ఏం కావాలి ? కాకపోతే ఆ అందం మనలో లీనం కావడానికి ఏదో ఒక మూలం , ఏదో ఒక స్పూర్తి అవసరం ఒక కారణభూతం అవసరం . అది ఏ శిల్పకళా వైభవమో కావచ్చు .ఏ రాగ ప్రవాహమో కావచ్చు . లేదా ఒక సజీవ శిల్పసుందరి అంటే ఒక చక్కని కన్నె రూపమే కారణం కావచ్చు. కన్నె అంటే ఇక్కడ అదేదో శరీర సౌష్టవం , మిసిమితనం అనికాదు . సర్వసమగ్రమైన సజీవ రూపమే ఆ కన్నెతనం . అలాంటి రూపమే అతని ముందు కదలాడింది . ఒక దివ్యమైన ఆనందం అతనిలో కావ్యమయ్యింది . అదే అతని అధ్బుత గానమయ్యింది .
Challani Vennalalo Chakkani Kanne Song
Challani Vennalalo Chakkani Kanne Song

తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి - తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన - పూలు నవ్వెనే నిద్దురలో // చల్లని //
ప్రణయ లోకంలో , ప్రేమకలాపాల్లో తేలాడేది ఒక్క మనుషులేనా ? సమస్త ప్రాణికోటి అనే కాదు , చరాచర జగత్తంతా ఆ మధురానుభూతిలో ఓలలాడుతూ ఉంటుంది. అయితే , ఇవన్నీ మానవహృదయాలకు ఒక ప్రేరణలే ! స్పూర్తి కారకాలే చంద్రుణ్నే చూడండి మేఘాల కౌగిలిలో మైమరిచిపోతుంటాడు . మృదుమధురంగా తాకే గాలి స్పర్శకు నిద్రలో జోగుతున్నా సరే పూలు మురిసిపోతాయి . ముసిముసిగా నవ్వుకుంటాయి . జీవితం తాలూకు ఎన్ని ఘర్షణల్లో ఉన్నాసరే మనిషి ఆ రసరమ్య భావాల్లో తేలిపోతుంటాడు .
Santaanam Film
Santaanam Film

కళకళలాడే కన్నెవదనమే - కనిపించును ఆ తారలలో ... ఓ.......
కలకాలం నీ కమ్మని రూపము కలవరింతునే నా మదిలో // చల్లని //
ప్రేమమయమైన ప్రకృతి తాలూకు ప్రేరణలతో ప్రభావితం కావడమే కాదు. పారవశ్యంలో ఉన్న మనసుకు తన ప్రేమ మూర్తి ముఖబింబం దశదిశలా కనిపిస్తుంది . నేల మీదే కాదు ఆకాశంలోనూ కనిపిస్తుంది . ఆకాశమంతా విస్తరించిన నక్షత్రాల గుంపులో కదలాడుతూ కనిపిస్తుంది . అలా లోకమంతా కనిపించే ఆమె కమ్మని రూపాన్ని జీవిత కాలమంతా తలుచుకుంటూనే ఉంటాడు . అనుక్షణం కలవరిస్తూనే ఉంటాడు . అతని కలవరింతలకూ , పారవశ్యాలకూ ప్రతిరూపమే ఈ పాట . మనసారా ఆస్వాదించండి మరి !!
''మహోన్నతమైన సౌందర్యం , లేదా అందం మనలో లీనమైపోతే జీవితానికి అంతకన్నా ఏం కావాలి ? కాకపోతే ఆ అందం మనలో లీనం కావడానికి ఏదో ఒక మూలం , ఏదో ఒక స్పూర్తి అవసరం ఒక కారణభూతం అవసరం.''

---బమ్మెర 
నీ చరణ కమలాల నీడయే చాలు పాట లిరిక్స్ విశ్లేషణ
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 
https://wa.me/message/6YRYVO6BHLZMA1

Akkineni Nageswara cinema, Akkineni Nageswara Rao, ANR Old Telugu Movies, Akkineni nageswara rao Telugu cinema,Old Songs,ANR Old Songs ,Challani Vennalalo Chakkani Kanne Song ,Santaanam Film,

24, డిసెంబర్ 2020, గురువారం

పూవై విరిసిన పున్నమి వేళ పాట లిరిక్స్ విశ్లేషణ | తిరుపతమ్మ కథ సినిమా | ఎన్టీఆర్ పాత పాటలు | Telugu Old Songs Analysis |

పాటలో ఏముంది... ?

మంద్రస్వరంలో అత్యంత మధురంగా సాగే ఒక అరుదైన పాట ఇది 1963 లో విడుదలైన తిరుపతమ్మ కథ సినిమా కోసం డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ పాటను పామర్తి స్వరపరిచారు . ఈ పాటను ఆలపించడంలో ఘంటసాల గొంతు ఒలికించిన మార్దవం అపురూపం . దాని లితంగానే దాదాపు 6 దశాబ్దాలుగా ఈ పాట రసజ్ఞుల హృదయాల్ని ఇంకా రంజింపచేస్తూనే ఉంది .
పూవై విరిసిన పున్నమి వేళ

పూవై విరిసిన పున్నమి వేళ
బిడియమూ నీకేలా బేలా! // పూవై // హృదయాల్ని పరవశింపచేసే రీతిలో ప్రకృతి వికసిస్తున్న వేళ ... జాబిల్లి పువ్వులా విరిసే వేళ... భావోద్వేగాలు వెల్లువైపోయే వేళ ... ఒక్కోసారి ప్రియురాలి హృదయం ఎక్కడలేని బిడియానికి లోనవుతుంది . అలాగని ఆ బిడియం అర్థం లేనిదేమీ కాదు . ఎందుకంటే తమ భావావేశాలు ఎంత రసాత్మకమైనవైనా కావచ్చు . కానీ , లోకం వాటిని ఆమోదిస్తుందన్న గ్యారెంటీ లేదుకదా ! పైగా ఈ రోజు ఇంత అనురాగాన్ని చూపే ప్రేమమూర్తి , ఎప్పటికీ ఇలాగే ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదు కదా మరి ! అందుకే ఏదో జంకు , ఏదో భయం , వాటిని వెన్నంటి ఏదో బిడియం .అలాగని , ఎప్పటికీ ఆ భయం అలాగే కొనసాగినా నష్టమే ! ఎందుకంటే , తాను ఆశించిన ప్రతిస్పందనేదీ రావడం లేదని భావిస్తే , అవతలి వ్యక్తి విసిగి వేసారి , వెనక్కి తగ్గవచ్చు . అపురూపమైన ప్రేమమూర్తి తననుంచి దూరం కావచ్చు . అందువల్ల ఎల్లవేళలా మోసుకు తిరగకుండా బిడియాన్ని అధిగమించడం కూడా జీవితానికి అవసరమే !
పూవై విరిసిన పున్నమి వేళ పాట
poovai Virisina Punnami Vela Song

చల్లని గాలులు సందడి చేసే
తొలితొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాలువేలు బేలా ! // పూవై // చల్లచల్లని గాలులు ప్రేమికుల మధ్య సందడి చేసినప్పుడు ఏమవుతుంది ? లోలోపల సుడివడుతున్న తొలివలపులు హృదయేశ్వరిని చేరుకోవడానికి తొందరపడతాయి . కానీ , తొందరపడి బిరబిరా అడుగులు వేస్తే ఏమువుతుందో చెప్పలేము కదా ! తొలివలపులు అంటే ఏమిటి ? జీవితాన్ని , ప్రేమ లోకాన్ని కొత్తగా చూపేవి అనే కదా ! కాకపోతే అంతకు ముందు ఏ అనుభవమూ లేని ఆ కొత్త అడుగులు ఒక్కోసారి పెద్ద విపత్తులోకి నెట్టే ప్రమాదమే ఎక్కువ .ఏమైతేనేమిటి ? పిలిచిందే తడవుగా పరుగెడితే జవరాలు తత్తరబాటుకు గురువుతుంది . అప్పుడింక ముఖ కవలికలు బయటకు కనిపించకుండా , మేలిముసుగులో తలను వాల్చేస్తుంది . అదేదో బేలతనం అన్నట్లు అతడు మాట్లాడతాడు గానీ , నిజానికి అది బేలతనం కాదు . జీవితాన్ని గురించిన , లోకాన్ని గురించిన ఒక కొత్త అవగాహనే అందుకు కారణం . అలాగని ఆ వైఖరి ఎప్పటికీ అలాగే ఉంటుదనేమీ కాదు . తనకు తాను ధైర్యం చెప్పుకుని , తనను తాను సంభాళించుకుని వాల్చిన తలను పైకెత్తడానికి ఆమెకు మరీ అంత ఎక్కువ సమయమేమీ పట్టదు . అవతని వ్యక్తి కి ఆ మాత్రం ఓపిక ఉండాలి మరి !

పూవై విరిసిన పున్నమి వేళ పాట
Thirupathamma Katha Film
మొదట మూగినవి మొలకనవ్వులు
పిదప సాగినవి బెదురు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపొదువేల ? .... బేలా ! // పూవై // వెనకా ముందు ఏమీ ఆలోచించని ముగ్ధ బాలికే అయితే , ముఖం పైన ముసిముసి నవ్వులే నాట్యమాడవచ్చు . కానీ , కాస్త ఆలోచించడం మొదలెట్టగానే లోలోన ఏదో భయం మొదలవుతుంది . ఆ పైన బెదురుచూపులేవో కదలాడతాయి . ఈ మనోభావాల పరంపర ఎలా ఉన్నా , ఆమెకు అతీసన్నిహితంగా ఉన్న అతనికి ఆ రసధ్వనులేమిటో ఒక్కొక్కటిగా తెలిసిపోతూనే ఉంటాయి . చెంతకు తీసుకునే కొద్దీ తన హృదయ స్పందనలన్నీ అతని తెలిసిపోతున్నట్లు అమె గ్రహిస్తుంది. చివరికి అప్పటిదాకా పక్క పక్కకి తొలగిపోయే ఆమె ఏమీ తోచక అతని ఎదమీద వాలిపోతుంది .
పూవై విరిసిన పున్నమి వేళ పాట
NTR Old Songs
తీయని లపుల పాయసమాని
మాయని మమతలు ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
ఇంకా జాగేలా ? బేలా ! // పూవై // మమతలే ఊయలగా ఊగిఊగి ఓలలాడే దశలో ఏముంటుంది ? తీయతీయని వలపుల్నీ ఆస్వాదించడమేగా ! అప్పటిదాకా ఇద్దరుగా కదలాడిన వారు ఒకే ఒక్కరుగా పరవశించడమేగా ! ఈ స్థితిలో ఇంకా ఎందుకు జాప్యం అంటూ ప్రియతముడు ప్రశ్నించడం మామూలే కానీ , అన్నదే తడవుగా సిద్ధమైపోవడానికి ఎన్నెన్ని ఇరకాటాలు ? ఇరువురు ఒకటైపోవడం అంటే అదేమైనా మామూలు మాటా ? ఒక్కటిగా అంటే రెండు హృదయాలు ఒక్కటి కావడం ,రెండు జీవితాలు ఒక్కటి కావడం , అంతకన్నా మించి రెండు ప్రపంచాలు ఒకటి కావడం ..నిజంగా ఇది ఎంత పెద్ద విషయం ? అప్పటిదాకా ఎన్నోసార్లు కలసి సంచరించి ఉండవచ్చు . మనసులు కలిసి , మాటలు కలిసి అంతరంగాల్లో ఎన్నో ఉత్సవాలే జరిగిపోయి ఉండవచ్చు . కానీ , రెండు జీవితాలు ఏకం కావడం అంటే అదో యజ్ఞమే ! తొలిసారిగా ఒక యాగం చేయబూనుకున్నప్పుడు వివిధ కారణాల వల్ల ఎంతో కొంత జాప్యం జరుగుతూనే ఉంటుంది . కాకపోతే , ఆ జాప్యం మరీ ఎక్కువైతే , ఇబ్బందే మరి ! ఏదో అలా అనుకుంటామే గానీ , తెలిసి తెలిసీ ఎవరూ మరీ అంత జాప్యం కానివ్విరు . అతిచేసి , చేతిలోని అమృత కలశాన్ని ఎవరు మాత్రం జారవిడుచుకుంటారు చెప్పండి !! అలా ఎప్పుడూ జరగదు .ఇది నిజం ... !!
---బమ్మెర

అందమె ఆనందం....! పాట | బ్రతుకు తెరువు సినిమా

ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 
https://wa.me/message/6YRYVO6BHLZMA1

NTR Old Songs, Thirupathamma Katha Film ,poovai Virisina Punnami Vela Song,ntr songs,

21, డిసెంబర్ 2020, సోమవారం

నా కంటిపాపలో నిలిచిపోరా పాట లిరిక్స్ విశ్లేషణ | వాగ్దానం సినిమా | ANR Songs | Telugu old songs Analysis |

పాటలో ఏముంది ?

వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది. తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి  గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది. సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం. 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత  సారధ్యం వహించారు. సుశీల, ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం.అదీ  సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. 

ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది .

నా కంటిపాపలో ..


నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా !

ప్రేమికుడే కావచ్చు. కానీ, అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి, ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు. అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది. కనుపాపల్లో పొదుగుకుంటుంది. ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ. అది ఆకాశమంత భరోసానిస్తుంది. అంతా సరే కానీ, మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు. కానీ, అలా అనిపించడంలో అర్థమే లేదు, ఎందుకంటే, లౌకికమైన విషయాలు వేరు , హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది. అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది 

నా కంటిపాపలో నిలిచిపోరా పాట
Naa Kanti Paapa lo Nilichipora Song

ఆమె :
ఈ నాటి పున్నమి ... ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
అతడు :
నెయ్యాలలో , తలపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే / నా కంటిపాపలో /


భౌతికంగా కైవసం చేసుకోవాలనుకుంటే సమస్య గానీ , భావనా లోకంలో ఎవరికి వారు ఏమనుకుంటేనేమిటి ? మొత్తంగా ఈ లోకమే తమదనుకుంటే మాత్రం అవతలి వాళ్లకు వచ్చే నష్టమేముంటుంది ? అందుకే ప్రేమికులు జాబిల్లి వెలిసింది . తమ కోసమే అనుకున్నా , ఆకాశాన్ని తమ చేతుల్లోకి తీసుకుందాం అనుకున్నా దానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనేలేదు . నిజమే ... ! ఈ లోకం ఎవరో ఒకరిద్దరి కోసం అవతరించిందేమీ కాదు . అలాగని ఎవరూ దీనికి పరాయి కూడా కాదు . ఎందుకంటే , సమస్త ప్రాణికోటి కోసం , సమస్త మానవాళి కోసం ఈ లోకం తయారయ్యింది . అందువల్ల ఈ సృష్టికి అందరూ సమాన వారసులే ఎవరైనా లోకం తమదేననీ , తమ కోసమే సృష్టించబడిందనే బావోద్వేగానికి లోనయితే , దానివల్ల అవతలి వాళ్లకు కలిగే ఏ ఇబ్బంది లేదు . పైగా , భావనాలోకంలో ఎవరైనా దేన్నయినా సొంతం చేసుకుంటే , ఇతరులకు ఏర్పడే తరుగు ఏమీ ఉండదు . ఆ విషయం అలా ఉంచితే , హృదయం పారవశ్యంలో తేలిపోయే వేళ , సృష్టిలోని ప్రతిదీ సానకూలంగానే అనిపిస్తుంది . లోకంలోని అపురూపమైన ప్రతిదీ తన కోసమే అవతరించినట్లు అనిపిస్తుంది . తామే రాజులైనట్లు  రారాజులైనట్లు అనిపిస్తుంది . ఒక్క చెమట చుక్కయినా రాలకుండా , చిల్లిగవ్వ ఖర్చులేకుండా ఏకంగా చక్రవర్తి అయిపోవడం అంటే ఇదే మరి !!
నా కంటిపాపలో నిలిచిపోరా పాట
ANR Songs

అతడు :
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా ? 
ఆమె :
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా ! / నా కంటిపాపలో /


చన్నీటి స్నానాలు , పన్నీటి స్నానాలు ఇవన్నీ మామూలే కానీ , ఈ ప్రేమికులు వెన్నెల స్నానాలు చేయడానికి సిద్ధమైపోయారు . అలా అయితేనే తాము అనుకున్న ఆనంద సీమను చేరుకోగలమన్నది . వారి ప్రగాఢ విశ్వాసం . అందుకే ఆ చుట్టూరా ఆవరించి ఉన్న మేఘాల మీదుగా నడుస్తూ , భూమికీ ఆకాశానికి మధ్య ప్రణయ రాగాల వంతెనలు వేస్తున్నారు ,  ఇప్పటిదాకా తెలియని , ఎన్నడూ కనీవినీ ఎరుగని ఆ స్వర్గధామాన్ని , ఒక నవలోకాన్ని అందుకోవడానికి వారు ఆనందంగా సాగిపోతున్నారు . 

నా కంటిపాపలో నిలిచిపోరా పాట
Vagdanam Film

ఆమె :
ఈ పూలదారులూ , ఆ నీలి తారలూ
తీయని స్వప్నాల తేలించగా
అతడు :
అందాలనూ , తీపి బంధాలనూ 
అల్లుకుందాము డెందాలు పాలించగా / నా కంటిపాపలో / 


ఎప్పటిలా నేల మీద పూల దారుల్లో నడుస్తున్నట్లే అనిపించవచ్చు . కానీ , ఒక్క క్షణాన రివ్వున ఎగిరి ప్రేమికులు ఇరువురూ నక్షత్రాల గుంపులో చేరిపోవచ్చు . అంతవరకూ సరే ! వాటి చెంత చేరిన తర్వాత తారకలేమైనా ఊరకే వదిలేస్తాయా ? ఒక రసోద్వేగానికి గురిచేస్తాయి . ఎన్నడూ చవిచూడని తీయ తీయని కలల లోకాల్లో విహరింపచేస్తాయి . వాస్తవానికి బంధాలన్నీ తీయనివేమీ కావు . ఆ మాటకొస్తే వాటిల్లో చేదు రకమే ఎక్కువ . అయితేనేమిటి ? వాటిని వడబోసి .. వడబోసి ప్రేమికుల పట్ల గల మమకారంతో తీయ తీయని బంధాలనే ఏరి కూరుస్తాయి . అంతటితో ప్రేమికుల హృదయాలు ఆనంద డోలికల్లో తేలాడతాయి . ఆ పైన ఎవరి ఆధిపత్యమో , ఎవరి అధికారమో ఏమాత్రం లేని తమదైన రాజ్యాన్నీ , సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుని  తమదైన ఏలుబడిని జీవితమంతా కొనసాగిస్తాయి .

హృదయం పారవశ్యంలో తేలిపోయే వేళ , సృష్టిలోని ప్రతిదీ సానకూలంగానే అనిపిస్తుంది

                                                          ---బమ్మెర
తెలుగు ఓల్డ్ సాంగ్స్ గీతాంజలి
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 
https://wa.me/message/6YRYVO6BHLZMA1

ANR old movies, Akkineni Nageswara cinema, Akkineni Nageswara Rao,  Akkineni nageswara rao Telugu cinema,ANR Old Songs,Old Songs,
#ghantasala సాంగ్స్,Vagdanam Film, Naa Kanti Paapa lo Nilichipora Song

19, డిసెంబర్ 2020, శనివారం

తెలుగు ఓల్డ్ సాంగ్స్ గీతాంజలి -రసహృదయులకు ఇదే మా హృదయాంజలి !! ఇదొక రసహృదయుల వేదిక

తెలుగు ఓల్డ్ సాంగ్స్

గీతాంజలి


రసహృదయులకు ఇదే మా హృదయాంజలి !! ఇదొక రసహృదయుల వేదిక పసందైన పాత పాటల హారిక

తెలుగు సినీ గీతాభిమానులకు ఇది షడ్రసోపేతమైన విందు. పాత పాటలంటే అవి ఆపాత మధురాలు కదా !
అవి రాగ , భావ , తాళాల త్రివేణి సంగమాలు. ఈ సంగమ క్షేత్రంలోకి ఇదే మా స్వాగతం !! ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ పాటలు మొదలవుతాయి అంటూ ఉంటారు . ఎందుకంటే మనసులోని లోతైన భావాల్ని చెప్పలేక, మాటలు ఎన్నోసార్లు నిస్సహాయంగా నిలబడతాయి . కొండంత అశక్తతతో వాటి గొంతు మూగబోతుంది .


సరిగ్గా అదే సమయంలో…. మేమున్నాం అంటూ పాటలు తమ గొంతు విప్పుతాయి .ఎందుకంటే , మాటలతో పోలిస్తే , పాటలది ఎప్పుడూ పైచేయే !లోతైన భావాల్ని చెప్పడానికి సాదాసీదా మాటల్నే కాదు రాగ , తాళాల్నే కాదు, కవిత్వాన్నీ , తాత్వికతను కూడా తనలో కలిపేసుకుని, తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే పాట వినగానే గుండె బరువంతా దిగిపోయినట్లు మనసు కొండంత ఊరట పొందుతుంది. అందుకే పాట మనసుకు ప్రాణ సమానమైపోయింది. అలాంటి ప్రాణ సమానమైన, కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … వారం వారం మీ ముందు ఉంచుతుంది. పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది. 


పద్యాలు సైతం ……
ఈ వేదికలో పాలుపంచుకునే అందమైన మరో అంశం కూడా ఉంటుంది. అది తెలుగు భాషలో తప్ప మరే భాషలోనూ లేనే లేని, ఒక విలక్షణమైన కావ్యప్రక్రియ … అదీ పద్యం. అత్యంత మధురమైన లలితమైన ఎన్నెన్నో పద్యాల్ని, ఈ వేదిక అప్పుడప్పుడు మీకు వినిపిస్తుంది .ఆస్వాదించండి … ఆనందించండి .

ఇదే సమయంలో ఈ లక్ష్య సాధనలో
మరింత బలంగా , నిత్యనూతనంగా సాగిపోయేందుకు అవసరమైన ఒక మహాశక్తి మాకు కలిగేలామమ్మల్ని మనసారా ఆశీర్వదించండి .
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు ఓల్డ్ సాంగ్స్