25, ఫిబ్రవరి 2021, గురువారం

భక్త తుకారాం సినిమా | ఘనాఘన సుందరా పాట | Telugu old songs | Ghana Ghana Sundaraa song lyrics |

పాటలో ఏముంది ?
భక్త తుకారాం సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ' ఘనాఘన సుందరా ' అన్న ఈ పాటను ఆదినారాయణ రావు స్వరపరిస్తే , ఓంకార నాదం ప్రతిధ్వనించేలా ఘంటసాల గానం చేశారు . 

ఘనాఘన సుందరా ?

హరి ఓం ! హరి ఓం ! హరి ఓం ! 
ఘనాఘన సుందరా ! కరుణా రస మందిరా ! 
అది పిలుపో .. మేలు కొలుపో
నీ పిలుపో .. మేలుకొలుపో 
అతి మధుర మధుర మధురమౌ ఓంకారమో !
పాండురంగ పాండురంగు // ఘనాఘన సుందరా ..... //

 ఓంకారం .. అంటే విశ్వఝంకారం కదా ! 
ఆ నాదమే సమస్త జీవకోటిలో ప్రాణశక్తిని నింపుతుంది . లోకాన్ని నిద్రావస్థ నుంచి నవచైతన్యం వైపు నడిపిస్తుంది . అనాదం అత్యంత సుందరమూ , కరుణాత్మకమూ అయిన ఒక అమృతధార . అది ప్రాణికోటికి ఒక పిలుపు . కోటి గొంతుల మేలుకొలుపు . విశ్వమంతా ఘర్జిల్లే ఆ ఓంకార చైతన్యాన్ని ఎవరు ఏ పేరున పిలిస్తే మాత్రం ఏమిటి ?. ఆ నాదాన్ని ఎవరైనా దివ్యత్వం అన్నా , దైవత్వం అన్నా , అందులో దోషం ఏముంది ? మౌలికంగా ఆ దైవత్వమంతా నాదాత్మకమే . నాద శరీరాత్మకమే ! ఆ శబ్దధాతువుల్ని ఎవరైనా దివ్యమూర్తులుగా పిలిచినా అందులో వైరుధ్యమేమీ లేదు . నిజానికి , దివ్యమూర్తులుగా పిలవబడే వారంతా నాద శరీరులే ! ఓంకార నాద శరీరులే ! అందువల్ల మనసు పడి ఎవరైనా ఆ నాద మూలాల్ని త్రిమూర్తులుగా పిలిచినా , పాండురంగడిగా కొలిచినా అది దర్శనీయమే !

ప్రభాత మంగళ పూజావేళ 
నీ పద సన్నిధి నిలబడి ... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళు లిడతా.. వేడదా ! కొనియాడదా !
పాండరంగ ... పాండురంగ ...// ఘనాఘన సుందరా ... // 

పునరపి జననం , పనరపి మరణం అన్న మాటలకు జన్మాంతర పరిణామాలనే గుర్తు చేసుకోనవసరం లేదు . ప్రతి నిద్రా ఒక మరణం , ప్రతి మెలుకువా ఒక పనర్జన్మ అని గ్రహించినా చాలు . అయితే , ప్రతి మెలుకువతో పునర్జన్మం పొందిన ఆ ఉదయంప e ఘడియలు నిజంగా ఎంత మంగళ ప్రదమైనవి . అలాంటి శుభవేళలో ఏం జరుగుతుంది ? జనన మరణాల పరంపరకు మూలమైన దివ్యమూర్తికి ప్రతీకగా వెలుగుతున్న దివ్యజ్యోతి ముందు ఆత్మ వాలిపోతుంది . ఆ క్రాంతి కిరీటి పాదపీఠికపైన తలవాల్చి అర్చన చేస్తుంది . ఒక దివ్యశక్తిని స్పూర్తిగా పొంది . జీవన పోరాటానికి సంసిద్ధమవుతుంది . ఎందుకంటే అర్ధవంతమైన ప్రారంభం , మరింత అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుందని కాస్తో కూస్తో జ్ఞానసిద్ధిని పొందిన ప్రతి ఆత్మకూ తెలుసు 

గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే ! నిరతము నీ రూప  గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా ! భవహరా ! 
పాండురంగ పాండురంగ // ఘనాఘన సుందరా ... //

 భావం శబ్దాన్ని స్ఫురింపచేస్తుంది . శబ్దం భావాన్ని స్ఫురింపచేస్తుంది . శబ్దాన్నీ- అర్థాన్ని వేరు చేయడం అసాధ్యం . ప్రతీ దేహం ఒక రూపం . ఆ దేహానికి వెనుక ఒక నామం ఉంది . ఒక వ్యక్తిని తలచుకోగానే మనసులోకి అతని రూపం వచ్చి వాలుతుంది . లేదా అతని రూపాన్ని తలచుకోగానే అతని నామం స్ఫురిస్తుంది . మానవుడి మనస్సులో రూపస్ఫూర్తి లేని నామ స్ఫూర్తి ఉండదు . నామస్ఫూర్తి లేని రూపస్ఫూర్తి ఉండదు . అందుకే దివ్యత్వాన్ని , ఒక రూపంతోనూ , ఒన నామంతోనూ చూడటం ఎందరికో సహజ ధర్మంగా మారింది . అయినా , ఈ జగత్తు నామరూపాత్మకం కాక మరేమిటి ? అందుకే దివ్యత్వాన్ని లేదా దివ్యచైతన్య నాదాన్ని నామ రూపాల్నీ స్తుతించడం , ఒక దివ్య ఆరాధానా భావంతో భజించడం జీవన తత్వంగా మారిపోయింది . అయితే ఇదేదో మనిషికే పరిమితమైనది అనుకోవడానికి లేదు . నిజానికి ,విశ్వంలోని అణువుణువూ ఆ దివ్యత్వపు ధ్యానంలో పడి , ఆ దివ్య నామరూపాల్ని గానం చేయడంలో పరవశించిపోతోంది . ఎంతయినా చరాచర జగత్తునంతా నిత్యం ప్రాణమయం చేస్తున్న ఓంకార శక్తి కదా ! నామ రూపాలతో చెప్పుకుంటే దివ్యానందమూర్తి కదా ! మోక్షజీవన ప్రదాత కదా !
                                                                         - బమ్మెర

20, ఫిబ్రవరి 2021, శనివారం

పూజాఫలం సినిమా - నిన్నలేని అందమేదో | తెలుగు పాత పాటలు విశ్లేషణ | Telugu old songs

పాటలో ఏముంది ?

ఏనాడూ కనీవినీ ఎరుగనివీ ఎన్నడూ కలగననివీ అలా ఏవేవో  ఉన్నట్లుండి , కళ్లముందు కొత్త కొత్తగా కదులడం మొదలెడితే ఏమనుకోవాలి ? నిజానికి అవేవీ అంతకు ముందు ఉనికిలో లేనివి కావు . అప్పుడే కొత్తగా వచ్చి పడినవీ కావు కాకపోతే ఇన్నేళ్లూ మన మనసు వాటిని చూసే స్థితిలో లేదు కారణం ఏదైతేనేమిటిలే గానీ , ఉన్నట్లుండి ఒక్కోసారి గుండెలో ఎప్పటినుంచో మకాం వేసి ఉన్న అలజడీ ఆందోళనా మటుమాయమైపోతాయి . మనసు నందనవనంగా మారిపోతుంది . మనసుకు వేయి కళ్లు పుట్టుకొస్తాయి . గుండె పులకించిపోతుంది . ప్రకృతి ఎన్నడూ లేనంత మనోహరంగా దర్శనమిస్తుంది  . 1964 లో విడుదలైన పూజాఫలం సినిమా కోసం
డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ పాటలో పరవశాల హరివిల్లే కనిపిస్తుంది . సాలూరు రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో గండుకోకిల ఘంటసాల పాడిన ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తక్కువే !

నిన్నలేని అందమేదో !!
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో 
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో ... తీగ సాగెనెందుకో
నాలో .... నిన్నలేని అందమేదో
కళ్ల ముందు కదలాడే కమనీయ సౌందర్యాలన్నీ కొత్తగా పుట్టకొచ్చినవేమీ కాదు ఇన్నేళ్లూ నీలో ఉన్నవే . నీతో ఉన్నవే ! గమనించం కానీ , మనసు నిలిపితే లోకం ముగ్ధ మనోహరమే! నిర్మలమైన భావనాలోకంలో ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది ప్రతి కొమ్మా , ప్రతి తీగా కొత్త పెళ్లి కూతురులాగే కనిపిస్తుంది . ప్రకృతీ దేవి ఒడిలో ఓలలాడుతున్నట్లే అనిపిస్తుంది . రాగఝురుల్లో స్నానమాడుతున్నట్లే ఉంటుంది . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా !
అదొక భావోద్వేగాల వెల్లువ . అయితే ఈ భావోద్వేగాల మూలం బయటెక్కడో ఉన్నట్లు ముందు అనిపిస్తుంది . కానీ, ఆ తర్వాత అది బయటిదేమీ కాదు దాని మూలం తనలోనే ఉందని తొందరలోనే తెలిసిపోతుంది .

పూచిన ప్రతి తరువొక వధువు - పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో ...../ నిన్నలేని /
పూలు పూసే వయసొచ్చిన మొక్క పెళ్లి కూతురుకన్నా ఏం తక్కువ ? ఆ పెళ్లి కూతురు పంచే పూదెనె ఏం తక్కువ ? అవేమీ తక్కువ కాదు . వాస్తవం ఏమంటే , తన మనసు ఆ వైపు వెళ్లిందే చాలా తక్కువ . ఎందుకంటే , మనిషికి మనుషుల్ని చూడటమే ఎక్కువైపోయింది . మనిషే సమస్తం అయినట్టు . మనిషే సర్వసమగ్రం అయినట్లు ఎంత సేపూ అతని చుట్టే తిరుగడం ఎక్కువైపోయింది . మనిషి ఇతర జీవరాశుల్లో కెల్లా గొప్పే కావచ్చు . కానీ , ఆ మాటకొస్తే , సమస్త జీవకోటికీ ప్రాణదానం చేసిన ప్రకృతి మనిషి కన్నా ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ ? అయినా మనిషి దాని పైకి ఏపాటి దృష్టి సారిస్తున్నాడు ? ఎప్పుడో ఏ ఏడాదికో ఒకసారి కొందరి మనసు ఆ వైపు కాస్త వెళుతుందేమో !
కొందరైతే తమ జీవన పోరాటంలో పడి మొత్తంగా తమ జీవితకాలంలోనే ఒకసారైనా ఆ వైపు తేరిపార చూడటం జరగదు . అలాంటి వారు అనుకోకుండా ఎప్పుడో ఆ వైపు దృష్టి పెడితే ఎలా ఉంటుంది ? అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది . అన్నీ అప్పుడే పురివిప్పినట్లు , కోయిల తొలిసారిగా అప్పుడే గొంతు విప్పినట్లు అనిపిస్తాయి . పూల సోయగాలు , పూతేనియల మాధుర్యాలు తొలిసారి తెలిసి వస్తాయి ? నిత్యమూ శోభిల్లే ప్రకృతి సౌందర్యాలు ఆ రోజే తొలిసారి తెలిసొస్తాయి .

తెలినురుగులె నవ్వులు కాగా ...సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే / నిన్నలేని /
లోకంలో గలగలమని నవ్వేది , హొయలూ , ఒయ్యారాలు పోయేది మనుషులేనా ? ఇవేవీ మనిషి సొత్తేమీ కాదు . వీటిపైన మానవాళి గుత్తా దిపత్యం ఏమీ లేదు నదీ ప్రవాహంలో వచ్చే చిక్కని నురగలు నవ్వుల్లా అనిపించవా? వంకులు తిరుగుతూ పయనించే సెలయేరు నడకల్లో ఒయ్యారాలు కనిపించవా ? అనిపించకపోవచ్చు . కనిపించకపోవచ్చు . ఎందుకంటే చాలా మందికి మొత్తం తమ జీవిత కాలంలో మనిషుల్ని చూడటం ఒక్కటే తెలిసింది . అంతేగానీ , చెట్టూ , చేలూ , పుట్టా , గుట్టా , అరణ్యాలూ , మేఘాలూ , నమస్త సృష్టినీ చుట్టేస్తూ , హోరెత్తిపోయే గాలి నాదంలో ఎవరికీ రాగలయలు వినిపించవు . కనిపించని కోటి వీణల స్వరనాదాలు వినిపించవు . అలాగని అసలే వినిపించవని కూడా కాదు . వినిపిస్తాయి . కానీ , వాటిని అవేవో శబ్దాలు అనుకుంటారే గానీ జీవన రాగాలని గమనించలేరు . ఎప్పటికీ అంతేనా ? అంటే అలా ఏమీ కాదు .... మనసు కళ్లు తెరిస్తే , హృదయ కర్ణాలు విచ్చుకుంటే అవన్నీ వినిపిస్తాయి , కనిపిస్తాయి .

పసిడియంచు పైటజారా పయనించే మేఘబాలా
అరుణకాంతి సోకగానే పరశించెనే / నిన్నలేని /
పొద్దు పొద్దున్నే మేఘ బాలికలు సూర్యుడికి స్వాగతం పలకడానికి బంగారు అంచు పైటలతో వేచిచూస్తుంటాయి . అయినా , ఎవరూ వాటిని గమనించరెండుకని ? సూర్యుని తొలి కిరణాలు ఎడీపడగానే మేఘాలు పరవశించిపోవడాన్ని మనుషులు గమనించడమే లేదు .   సమస్య ఏమిటంటే ,అయితే వారు అసలు గమనించడం లేదు అని చెప్పలేం . అణువణువునా అన్నీ గమనిస్తున్నారనీ చెప్పలేం . కానీ , చాలా మంది చూసీ చూడనట్లు , గమనించీ గమనించనట్లు ఉండిపోతున్నారు . ఎందుకంటే , జీవితాలు మందగమనంతో సాగిపోతున్నట్లు , హృదయాలు కూడా మంద్రస్పందనలతో ఉండిపోతున్నాయి . ఈ మందగమనం పోయి శరవేగాన్ని పుంజుకోవాలన్నా , జడత్వం పోయి జవజీవాలు నింపుకోవాలన్నా కొన్ని జరగాలి . వేయి సూర్యుల వేడి , వేయి చంద్రుల చల్లదనం మనిషిని తాకాలి . అతని మనసును తాకాలి . వాస్తవానికి అనాదిగా రస హృదయులంతా , రసాత్మక జీవులంతా అదేపనిగా ఇదే కోరుకుంటున్నారు . అయితే వారి లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది . ఎదురు చూడాలి !! మానవ హృదయాలు మయూరాల్లా ఎప్పుడు పరివిప్పి నాట్యమాడతాయో నిరంతరం నిరీక్షించాలి !!

                                                                   -బమ్మెర

17, ఫిబ్రవరి 2021, బుధవారం

మూగ మనసులు సినిమా | మానూ మాకును కాను ! పాట | Telugu old songs Analysis |

పాటలో ఏముంది ?

మనసు బయటపడేదాకా మనిషంటే ఏముంది ? ఒక రూపమే ! రాతి స్థంభంలా , శిలా శిల్పంలా అదో ఆకారమే ! కానీ , చేనూ చేమా కాదు , పుట్టా గుట్టా కాదు ఆ రూపం మనిషేనని ,మనసున్న మనిషేనని , తెలిసేదాకా మన దృష్టి మారదు ఈ అంశమే సారంగా ఆత్రేయ 'మానూ మాకును కాను' అనే ఈ పాట రాశారు .1964 లో విడుదలైన ' మూగ మనసులు ' సినిమాలోని ఈ పాటకు కె.వి మహాదేవన్ బాణీ కూర్చారు . అయితే , ప్రతిపాటకూ ఎప్పుడూ హుందాతనాన్నే పొదిగే సుశీల గొంతు పల్లెతనపు అమాయకత్వాన్నిఈ పాట నిలువెల్లా పలికించించింది. ఆ వైవిద్యాన్ని ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే !

మానూ మాకును కాను !మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను
మామూలు మణిసిని నేను , నీ మణిసిని నేను

ఏ మనిషికైనా , తన మనసు గురించి తానే చెప్పుకోవాల్సి రావడమంత దయనీయ స్థితి మరేముంటుంది ? మానూ మాకును కాను , రాయీ రప్పను కానే కాను ' అనడంలో వాటికి మనసే లేదని గానీ , వాటికి స్పందించడమే తెలియదనే భావనేదీ లేదు . చెట్లు కూడా స్పందిస్తాయన్నది తెలియని విషయమేమీ కాదు . కాకపోతే అవి మన భాషలో మాట్లాడవు . మనసు విప్పి ఏమీ చెప్పలేవు , మనతో కలసిపోవు , మనతో కలసి నడవలేవు అదీ సమస్య . అయితే ఆ అవరోధాలేవీ లేని మనిషై కూడా మామూలు మణిసిని నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ? అవతలి వ్యక్తి తనను మామూలు మణిసిగా కూడా చూడటం లేదనే కదా !

నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆశున్నాది
కలలు కనే కళ్లున్నాయి అవి కలత పడితె నీళ్లున్నాయి // మానూ //

ఏ మాత్రం పరిచయం లేని , ఎప్పుడూ పలకరించని ఏ మనిషి గురించైనా మనకు ఏం తెలుస్తుంది ? సరేగానీ , ఆ వ్యక్తి గురించి మనకేమీ తెలియనంత మాత్రాన ఆ వ్యక్తి ఏమీ కానట్లా ? ఆ గుండెలో ఏమీ లేనట్లా ? అవతలి వ్యక్తి ఏ కారణంగానో తనకు తానుగా బయటపడకపోవచ్చు . అలాంటప్పుడు మనమైనా ఆ మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేయవచ్చు కదా ! అలా ఏమీ చేయకపోతే , మనిషిగా భూమ్మీద ఎందుకు ఉన్నట్లు ? ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటారు గానీ , తనే నోరు విప్పి , నాకూ ఒక మనసున్నాదీ అంటూ తన గురించి తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడినట్లు ? కలలు కనే తన కళ్ల గురించి , అవి కలతపడితే వచ్చే కన్నీళ్ల గురించి చెప్పాల్సిన పరిస్థితిలోకి తనను ఎవరు నెట్టేసిట్లు ? మనసున్నప్పుడు ఆశ కూడా ఉంటుంది . ఆ ఆశైనా ఎలా పుడుతుంది ? ఏదో ఆశించి కలగన్నప్పుడే కదా ! ఏ కాస్త మనసున్న మనిషైనా సాటి మనిషి ఆశలూ , కలలు ఫలించాలనే కోరుకుంటాడు . కానీ , కొందరుంటారు . వారు నిరంతరం కలల్ని కాల్చేయాలనే చూస్తారు . కళ్లను చిద్రం చేయాలనే చూస్తారు .

పెమిదను తెచ్చి పొత్తిని యేసీ - సమురును పోనీ బెమ సూపేవా ?
ఇంతా శేసి 
యెలిగించేందుకు  , ఎనకాముందులాడేవా // మానూ //

మనిషన్నాక సాటి మనుషులతో కలిసిపోక ఏంచేస్తాడు ? అయితే కలసిన మనుషులంతా మనసంతా నిండిపోరు . ఆ వచ్చిన వారిలో ఎప్పుడో , ఎవరో ఒకరు మనసులోకి ప్రవేశిస్తారు . అక్కడ చీకట్లు కమ్ముకున్నాయని తెలిస్తే ,
వెంటనే వెలుగు గురించి ఆలోచిస్తారు . ఒక దీపపంతె తెచ్చి అందులో వత్తివేస్తారు . తైలం పోసి ఇక దీపం వెలిగించడమే ఆలస్యం అన్నట్లు చేస్తారు . ఎందుకో గానీ తీరా ఆ క్షణం వచ్చేసరికి కొందరిలో ఏదో భయం పుట్టుకొస్తుంది . అప్పటికి సరే . జీవితమంతా ఆంధకారాన్ని మోయడం కష్టం కదా అనిపిస్తుంది .ఇంకా ఏదేదో ఆలోచించుకుని మెల్లమెల్లగా వెనకడుగు వేస్తారు . చివరికి వత్తి వెలిగించకుండానే తిరుగుముఖం పడతారు . అప్పటిదాకా ఏ అండాదండా లేదని వగచే మనను ఏదో ఆసరా దొరికిందంటూ గుండె దిటవు చేసుకుటున్న వేళ ఉన్నఫళాన ఆ వ్యక్తి ఎటో వెళ్లిపోతే ఏమైపోవాలి . ఆ ఆశపడ్డ మనసేం కావాలి ? అంతా భ్రమేనని సమాధాన పదాలా ? కాకపోతే అలా ఆశపడటం అనేది అవతలి వారి మనసు గురించి బాగా తెలిసే జరిగిందా ? ఏకపక్షంగా జరిగిందా ? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎవరికి వారు . తమకు తాముగా సమాధానం కనుక్కోవాలి !

మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మళ్లా  !

మనుషులంటే తోలుబొమ్మలేమీ కాదుకదా! తోలుబొమ్మలకు రూపమే ఉంటుంది. మనుషులకు మనసు కూడా ఉంటుంది. తోలుబొమ్మలతో ఆటాడుకున్నట్లు మనుషులతో ఆడుకుంటే ఎలా?మనుషులేనా చివరికి  వారి మనసులతో కూడా ఆడుకుంటే ఎలా? చేజారిపోయి కిందపడి తోలుబొమ్మ విరిగిపోయినా అదేమీ పెద్ద సమస్య కాదు. ఏదో రకంగా దాన్ని తిరిగి అతికించవచ్చు. మనసు విషయంలో అలా సాధ్యం కాదు కదా! అది ఒకసారి విరిగితే జీవితంలో ఇంక అతకదు. తెలిసో తెలియకో శరీరాన్ని ఆకలి మంటలకు గురిచేస్తే ఓ పూట తర్వాత మరపు రావచ్చు. దేహాన్ని గాయాల పాలు చేసినా ఆ గాయం మానిపోయేనాటికి ఆ ఘటన మరపు రావచ్చు. మనసు విషయం అలా కాదు కదా! సమస్య ఏమిటంటే, శరీరానికి అయ్యే గాయం బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. అవే మనసుకు తగిలిన గాయాలైతే  బయటికేమీ కనిపించవు. అలాగని పదేపదే మనసును గాయపరుస్తూ పోతే ఏమైనా ఉందా?  మనసు గాయాన్ని బయటపెట్టేవి కన్నీళ్లు మాత్రమే! అయితే నిబ్బరం ఉన్నవాళ్లు  మనసుకు ఎన్నిగాయాలు అవుతున్నా, కన్నీళ్లే రానీయరు. చివరికి ముఖంలోనైనా ఆ ఆ బాధ, ఆ దుఃఖం కనపనీయరు. ఎదుటి వారి పైన ఏ ప్రభావమూ లేదని మానసికంగా అదే పనిగా  గాయపరుస్తూ పోతే ఏమవుతుంది?  అంతిమంగా అది విరిగి ముక్కలవుతుంది. ఆ త ర్వాత ఎన్ని పాట్టు పడినా విరగిన మనసు మళ్లీ అతకదు. అది తెలిసి మసలుకున్న వాడే మనిషి. జీవితమంతా ఎవరి మనసునూ  గాయపరచకుండా బతికిన వాడే లోకంలో గొప్ప మనసున్న మనిషి. 

                                                        - బమ్మెర

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

| మందార మకరంద మాధుర్యమున... బమ్మెర పోతన భాగవత పద్యం | చిత్రం : భక్త ప్రహ్లాద

             వ్యామోహానికి భక్తికీ తేడా...


మందార మకరంద మాధుర్యమున...
బమ్మెర పోతన భాగవత పద్యం
చిత్రం : భక్త ప్రహ్లాద
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి. సుశీల


ఇదీ అసలు సంగతి... అని చెప్పగా వీలులేని రాగబంధమొకటి మనసులో ఉదయిస్తుంది. నువ్విలా మనిషిలా మారి ఈ నేలకు రావడానికి పూర్వమే ఎప్పుడో... ఏ ఆదిమయుగాలనాడో ఏర్పడ్డ జన్మబంధమది. 
ఆ రాగబంధమే మోహపాశమై జీవనగమనంలో నిన్ను అడుగడుగునా నడిపిస్తూ ఉంటుంది. ఆ మోహంలోనే తనువు, మనసు ఏకాగ్రం చేశావంటే... అది వ్యామోహంగా మారిపోతుంది. లోభం నుంచి పుట్టి, మదానికి దారితీసే దానికే మోహం అని పేరు. ఇప్పుడు నువ్వు చెబుతున్నదంతా చూస్తుంటే ఆ మోహంతో కూడిన మత్తత నిన్ను ఆవేశించినట్లు కనబడుతోంది. లేదంటే... అయిదేళ్ల ఈ పసివయస్సులో శరీరమంటే చీకటిగోతులతో నిండిన ఇల్లని చెప్పగలవా? విష్ణుదేవుని మనసులో నిలుపుకుని అడవులలో నివసించినా ఉత్తమమే అనగలవా? ఇదుగో ఈ మోహావేశాన్ని జీవులందరిలోనూ కలిగించడమే జనార్దనుని జగన్మాయా తంత్రం. దానిలో చిక్కుకున్న వారే కానీ, బయటపడ్డవారు లేరు. కలడు కలండనేవాడిని చూసినవాడు లేడు. కనుక ఈ మోహావేశంలో పడబోకు. నా మాట విను. మీ కులవృత్తి చేపట్టు... అని ప్రహ్లాదుని గురువులైన చండామార్కులు అనునయంగా చెప్పారు. 

పొగడదగిన గుణశీలాలకు నెలవైన ఓ గురుదేవా! 


నిజమేనండీ. అయస్కాంతం ముందు నిలబడ్డ తర్వాత ఇనుముకు స్వతంత్రం లేదు. అలాగే నాలో మోహావేశం 
నాకు తెలియకుండానే దైవవశాత్తూ పెరుగుతోందన్నది వాస్తవమే. విష్ణుభావన నా మనసుకు మత్తెక్కిస్తోందన్నది కూడా కాదనలేను. దీనినుంచి బయటపడలేను. కానీ రసోన్మత్తతలో ముంచితేల్చే ఈ భక్తిరసాయనంలో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాను. నేను చెడిపోతానేమో అనే బెంగవద్దు. నాలోని ఈ మత్తత కేవల మూఢభక్తి కాదు. ఏది చెడ్డది, ఏది మంచిది అనే విచక్షణా జ్ఞానాన్ని విడిచిపెట్టడం లేదు. జ్ఞానమే కైవల్యమన్న సూత్రాన్ని మరువలేదు. ఒకసారి ఏ జ్ఞానం ముక్తిదాయకమవుతుందో దానిని ఎరిగిన తరువాత, వెనక్కు మరలలేని స్థితిలోనే నేనిప్పుడున్నాడు. కనుక నా ఈ ప్రవృత్తి కులవర్ధనమే కానీ, నాశనాన్ని తెచ్చిపెట్టదు. ఇంతకీ ఇప్పటి నా పరిస్థితి ఇలాంటిదని ఎలా చెప్పను?

మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
  మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
  రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
  కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
  మరుగునే సాంద్ర నీహారములకు?

నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?

భూలోక కల్పవృక్షాలలో ఒకటైన మందారంలోని మకరందాన్ని తాగడానికి ఇష్టపడే తుమ్మెద, బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తూ గమ్మత్తైన వాసన కలిగివుండే రకరకాల పూలచెట్టూ తిరగనే తిరగదు. స్వర్గలోక మందాకినీ జలాల్లో హాయిగా తిరిగే రాజహంస, గంగతో పాటుగా నేలకు దిగి కాలవల్లో తిరగాడదు. చిగురు మామిళ్లు కొరికితినే కోయిల వసంతకాలం రాలేదని కొండమల్లెలు చప్పరించదు. నిండుపున్నమి జాబిల్లి జారబోసే వెన్నెల తాగి బతికే చకోరపక్షికి ఏది వెన్నెలో... ఏది మంచుతెరలోని బిందువో కచ్చితంగా తెలుస్తుంది. మనసులోని రాగద్వేషాలను, పేరాశలను విడిచిపెట్టకుండా ఏదో ఒకరకంగా లౌకిక సుఖభోగాలతో కూడిన ఆకలి తీర్చుకోవాలని  చూసేవాడు వ్యామోహంలో పడివున్నవాడే కానీ, భక్తుడు కాదు. దైవీగుణసంపన్నమైన ఉత్తమాభిరుచిని తాను పొంది, తనలోనే దైవాన్ని చూసుకోవాలంటే... భక్తిని జ్ఞానమార్గంవైపు మళ్లించడం తప్ప వేరు మార్గం లేదు.
                                       - నేతి సూర్యనారాయణశర్మ, 
                          శంకరవిజయం నవలాకర్త
ఫోన్ : 9951748340
                                                                               

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

అమర శిల్పి జక్కన సినిమా | ఈ నల్లని రాళ్లలో .. పాట | తెలుగు పాత పాటల విశ్లేషణ

పాటలో ఏముంది .?

పగటివేళ నక్షత్రాలు కనిపించవు . అంతమాత్రాన నక్షత్రాలే లేవని కాదుగా ! పొద్దు గుంకి ఆ వెలుగు తెర కాస్త తొలగిపోగానే వేల కాంతులీనుతూ , అనంతమైన తారా ప్రపంచం దర్శనమిస్తుంది . 
శిలాలోకము అంతే ! రాతి పొరల వెనుక అపురూప శిల్పాలెన్నో అనాదిగా అలా ఉండిపోతాయి . ఎవరో ఒక శిల్పి ,ఉలి చేతబూని చెంతచేరగానే ఆ శిలల్లో వేల ప్రకంపనలు మొదలవుతాయి. అప్పటిదాకా ఆ శిలల మాటున దాగిన సజీవ శిల్పాలన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి . ' అమర శిల్పి జక్కన సినిమా కోసం డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాసిన ఈ గీతంలో ఆ సజీవత్వాలన్నీ సాదృశ్యమవుతాయి. ఎంతో రసాత్మకమైన ఈ గీతానికి ఎస్ . రాజేశ్వరరావు సంగీతం సమకూరిస్తే , ఘంటసాల దీన్ని ఎంతో భావస్ఫోరకంగా గానం చేశారు .

ఈ నల్లని రాళ్లలో ..


ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో

“ శరీరాన్ని చూసేవారికి ... మనస్సు కనిపించదు . మనస్సును చూసేవారికి ... ఆత్మ కనిపించదు " 
అంటూ ఉంటారు . నిజమే మరి ! ఎవరైనా , మనసు లోతులు చూడాలనుకుంటే , ఆత్మ కాంతులు చూడాలనుకుంటే , వారి దృష్టి శరీరాన్ని దాటి , మనసులోకి వెళ్లాలి . ఒక దశలో మనస్సును కూడా దాటి ఆత్మలోకి వెళ్లాలి . అప్పుడే ప్రాణవంతమైన హృదయ ప్రకంపనలు కనిపిస్తాయి . హృదయంతో మమేకమై ఉన్న రసరంజిత లోకాలు తెలుస్తాయి .. నల్లనల్లని రాళ్లల్లో దాగిన కళ్ల కాంతి పుంజాలు కనిపిస్తాయి . మనసును తాకే గుండె చప్పుళ్లు వినిపిస్తాయి .

పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
మునుల వోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి || ఈ నల్లని రాళ్లలో ||

పర్వతాలెప్పుడూ ఊరి నడుమ ఉండవు . అవి అడవుల్లోనే ఉంటాయి . ఎందుకంటే ఎంతలేదన్నా , మనుషులు సంచరించే చోట ఏవో కొన్ని మానవ సంబంధమైన కక్ష్యలూ కార్పణ్యాలూ ఉంటాయి . కోపాలూ , తాపాలూ ఉంటాయి . అందుకే ఆ వాసనలు తమనెక్కడ తాకుతాయోనని పర్వతాలు మనుషులకు దూరంగా అరణ్యాల్లో వెలుస్తాయి. అరణ్యాల్లో మసలే మునీశ్వరుల్లా పర్వతాలు కూడా అరణ్యాల్లోనే బసచేస్తాయి .

కదలలేవు , మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి యలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు || ఈ నల్ల
ని రాళ్లలో ||

నిజమే ! రాళ్లు కదలలేని , మెదలేని స్థితిలోనే ఉంటాయి . కానీ , ఒకసారి ఉలి చప్పుడు వినపడితే చాలు వాటి లోలోపలి సెలయేర్లు ఉప్పొంగడం మొదలవుతాయి . విత్తనం ఏదైతేనేమిటి ? నీటి చినుకు పడేదాకా అది చిగురించదు కదా ! చంద్ర కిరణాలు పడేదాకా కలువలు వికసించవు కదా ! పర్వతాలూ అంతే , తమ హృదయం తెలిసిన శిల్పి తమను తాకేదాకా అవి కదలవూ మెదలవు . అతడు చెంత చేరి , వాటి గుండె పైన చేయి వేసేదాకా వాటి జీవనాదాలు మొదలవ్వవు పైన కఠినమనిపించును .. లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును నిశ్చలంగా నిద్రిస్తున్న మనిషిని శవం అనుకుంటే ఎలా ? అతని నాడి పట్టుకుంటే గానీ అతని ప్రాణశక్తి తెలియదు . అతని జీవచైతన్యం తెలియదు . పర్వతాలూ అంతే , పైపైన చూస్తే , పరమ కఠినంగానే కనిపిస్తాయి . ఒకసారి వాటి గుండె తోతుల్ని తాకితే చాలు . లోలోన వెన్న ముద్దలు కనిపిస్తాయి . ఏదో మృదుత్వమే అని కాదు , ఏనాడూ ఎవరికీ హాని తలపెట్టని మానవత్వం కనిపిస్తుంది . ఆ మాటకొస్తే ,పైకి మృదువుగా కనిపిస్తూనే , లోలోన కసాయి ఆలోచనలు చేసే మనిషి కన్నా శిలలే వేయి రెట్లు మేలనిపిస్తాయి . కాదంటారా ?

                                                                  --- బమ్మెర

దేశద్రోహులు సినిమా | జగమే మారినది మధురముగా ఈ వేళ పాట 
మందార మకరంద మాధుర్యమున... బమ్మెర పోతన భాగవత పద్యం

9, ఫిబ్రవరి 2021, మంగళవారం

దేశద్రోహులు సినిమా | జగమే మారినది మధురముగా ఈ వేళ పాట | తెలుగు ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్

పాటలో ఏముంది...?


జగమే మారినది మధురముగా ఈ వేళ


ప్రేమ ఎంత గొప్పదైతేనేమిటి ? ప్రేమికులు ఎంత గొప్పవారైతే ఏమిటి ?  చాలా ప్రేమలు పెళ్లి దాకా వెళ్లవు . అలా పెళ్లికాని వారంతా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారనేమీ కాదు . ఇష్టం లేకపోయినా , కొందరి పెళ్లిల్లు వేరెవరితోనో జరిగిపోతాయి . అప్పటిదాకా ప్రాణాధికంగా ప్రేమించుకున్న వారు ఒకరికొకరు పరాయిల్లా మిగిలిపోతారు . మరొకరితో పెళ్లి జరిగిపోయిన ఆ విషయం ఆ ప్రేమించిన వ్యక్తి కి తెలిసిపోయిన్నాడు , ఎలా ఉంటుంది ? హృదయం బాధతో చేదెక్కిపోతుంది . జీవితమంతా తారుమారైన ఆ స్థితిలో మనసు కకావికలమైపోతుంది . అయినా , అంతిమంగా , పరాయిదైపోయిన  ఆ ప్రేమమూర్తి పట్ల ఒక త్యాగభావన నిండిపోతుంది . నిజానికి , దేన్నయినా పొందడానికి ఆశ , ప్రేమ ఉంటే చాలు . కానీ , వదిలేయడానికే ఎంతో పెద్ద మనసు ఉండాలి . ఆ ఔన్నత్యానికి చేరుకున్న ఏ మనసైనా , ఆ జరిగిన పరిణామాలన్నింటినీ మధుర భావనతోనే చూస్తుంది . అదే సమయంలో అనుకోకుండా వారిద్దరూ ఎక్కడైనా తారసపడ్డారే అనుకోండి . అప్పుడింక మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు . అసలు మాటలే పెగలవు . ఎక్కడ మాటలు ఆగిపోతాయో ,అక్కడ పాటలు మొదలవుతాయి అంటారు కదా అలాంటప్పుడు ఒక పాటేదో మొదలవుతుంది . 1964 లో విడుదలైన దేశద్రోహులు సినిమా కోసం ఆరుద్ర రాసిన " జగమే మారినది మధురముగా ఈ వేళ " అన్న ఈ పాట సరిగ్గా ఆ తరహా భావోద్వేగాలనే చెబుతుంది . ఆ పాట ఎన్నిసార్లు విన్నా , ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉంటుంది . ఆ పాటకు సాలూరు రాజేశ్వర రావు పొదిగిన బాణీ ఘంటసాల గొంతులో పడి నిలువెల్లా తేనెలు పులుముకుంది . కొన్ని దశాబ్దాలుగా మాధుర్యాలు నింపుతూ తెలుగు వారి గుండెల మీదుగా సాగిపోతోంది ..

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా    // జగమే //

తనకు దక్కకపోతే పోయింది . ఆమె సుఖ సంతోషాలతోనే ఉందంటే అది చాలు కదా ! ఆమె ఎప్పటికీ ఆనందంగా ఉండాలనుకునే తన కలలూ కోరికలూ అలా తీరినట్లే కదా ! జగమంతా మధురంగా మారినట్లే కదా !

మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదే చేరెనూ గోరువంక రామచిలుక చెంత
అవి . అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను    
జీవితమంతా చిత్రమైన పులకింత // జగమే //   
                                                                         
నిజమైన , నిర్మలమైన మనసు నెమలిలా నాట్యం చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రేమానురాగాలతో కనిపించే జంటను చూసి ఆనందంలో తన్మయత్వాన్ని పొందుతుంది , తడిసి ముద్ద అయిపోతుంది . ఎందుకంటే ఎదిగిన మనసులకు తన పర భేదం ఉండదు . ఎదుటి వారి కష్టాలను తన కష్టంగా భావింవచడమే కాదు , ఎదుటి వారి ఆనందాన్ని చూసి తనూ ఆనందపడుతుంది . ఒక వింత పులకింతకు లోనవుతుంది .

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుక
తిరుగాడెను తేనెటీగ తీయదనము కోరి అనురాగాలా 
తేలి కమ్మని భావమే కన్నీరై నిండెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి జగమే //

మొగ్గలు అందంగా విరబూయడమే కాదు , ప్రేమికులకు , కొత్త దంపతులకు స్వాగతాలు కూడా పలుకుతుంటాయి . వారి మనసుల్ని ఉత్తేజితం చేయడానికి నలుదిశలా సుగంధాలు వెదజల్లుతుంటాయి ఆ పరిమళాలతో మత్తెక్కిపోయిన మానవ తేనెటీగెలు మాధుర్యాలను గ్రోలడంలోనే నిమగ్నమై ఉంటాయి . పురుషుల ప్రణయలోకాన్ని చూసే ఎవరి గుండెల్లోనైనా ఒక కమ్మని భావం తొణకిసలాడుతుంది . వారి మనసు ఉద్వేగానికి లోనై ఆనంద భాష్పాలు రాలుస్తుంది . అలాంటి వారిని కళ్లారా చూసి , మనసారా ఆశీర్వదించడమే మన పనైపోతుంది !!

                                                                      -బమ్మెర

6, ఫిబ్రవరి 2021, శనివారం

పూజాఫలం సినిమా | పగలే వెన్నెల- జగమే ఊయల పాట | Telugu old songs

పాటలో ఏముంది...?

ఈ శీర్షికలోని ' పగలే వెన్నెల- జగమే ఊయల ' అనే ఈ  పాటను 1964 లో విడుదలైన' పూజాఫలం ' సినిమా కోసం డాక్టర్ సి . నారాయణ రెడ్డి రాశారు . సాలూరు రాజేశ్వర రావు స్వరపరిచిన ఈ పాటను 
ఎస్ . జానకి ఎంతో రసార్థంగా పాడారు . పాట విడుదలై 5 దశాబ్దాలు గడిచినా , నేటికీ ఈ పాట రసజ్ఞుల్ని అలరిస్తూనే ఉంది .

పగలే వెన్నెల- జగమే ఊయల


పగలే వెన్నెల - జగమే ఊయల
లే ఊహలకే కన్నులుంటే ...... // పగలే వెన్నెల //

పగలంటే ఎండ అనేకదా ! ఎండ అనగానే ఎవరికైనా ఎండ కష్టాలన్నీ గుర్తుకొస్తాయి . కానీ , ఎండలు ఉంటేనే కదా వానలు కురుస్తాయి . నేల నేలంతా సస్యశ్యామలం అయ్యేది ఆ ఎండలు కురిపించే వానలతోనే కదా ! ఆ పచ్చదనాన్ని మనసారా ఒకసారి తలుచుకుంటే పగలు వెన్నెల్లాగే కనిపిస్తుంది మరి ! జగము అన్న మాట విన్నప్పుడు కూడా చాలా మందికి జగత్తులోని కష్టనష్టాలే ముందు గుర్తుకు వస్తుంటాయి .కానీ , ఆ కష్టాలే కదా అంతిమంగా సుఖాలను ఇచ్చేది . కష్టాలు , నష్టాలే కదా మనిషిని రాటుతేలేలా చేస్తాయి . జీవితంలోని ఆటుపోట్లని ఎదుర్కొనే శక్తిశాలిని చేస్తాయి . ఈ సత్యం బోధపడినప్పుడు కష్టం కష్టంలా కనిపించదు . అదొక శక్తిదాయినిలా కనిపిస్తుంది . నష్టం నష్టంలా అనిపించదు . అదొక జ్ఞానప్రదాయినిలా కనిపిస్తుంది . పైగా జగత్తు ఒక ఊయల్లా కనిపిస్తుంది . ఎందుకంటే గతం , వర్తమానం , భవిష్యత్తు అనే ఈ త్రికాలాలనూ తాకుతూ జగత్తు నిరంతరం ఊగుతూ ఉంటుంది . ఊయల వెనక వైపు పైకి వెళ్లడం గతాన్నీ , కిందికి అంటే నేలకు దగ్గరగా రావడం వర్తమానాన్ని , ముందు వైపున పైకి వెళ్లడం భవిష్యత్తును తాకడమే కదా! ఈ మూడింటితో మమేకమై సాగే జగత్తు నిజంగా ఊయల లాంటిదే ! ఎక్కడా నిలకడ లేకుండా అటూ ఇటూ సాగే మనిషి జీవనయానం మాత్రం ఊయల్లాంటిది కాదా ! ఆ భావన , ఆ ఊహ నిజంగా ఊయల్లోనే ఊపుతుంది . అయితే అందరికీ అలా అనిపిస్తుందని కాదు సుమా ! అందుకు కమ్మని మనసు ఉండాలి . దానికి ఊహలు ఉండాలి . ఆ ఊహలకు కళ్లుండాలి !

నింగిలోన చందమామ తొంగిచూచే
నీటిలోన కలువ భామ పొంగిపూచే
ఈ అనురాగమే జీవనా  రాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా ! // పగలే వెన్నెల //

భావోద్వేగాలు వెల్లువెత్తి , మానవ హృదయాల్లో పగలే వెన్నెల కాస్తేనేమిటి ? ఇంక నాతో పనేముందిలే అని చంద్రుడు ఆకాశంలోకి రాకుండా ఉంటాడా ? అయినా , చంద్రుడికి వెన్నెల కురిపించడమే తప్ప వేరే పనేమీ ఉండదా ఏమిటి ? నీటిలోని కలువ భామల్ని పలకరించడం కూడా అతని నిరంతర కార్యాకలాపమే కదా ! ఆ కలువలు మాత్రం ఏం తక్కువ ? పొద్దుకుంకింది అంటే చాలు ! జాబిలి రాక కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి
గొంతెత్తి స్వాగత గీతాలు పాడుతూనే ఉంటాయి . ఆకాశంలో విహరించే అతనెక్కడ ? నేలమీది మేమెక్కడ ? అని అవి ఏనాడూ అనుకోవు . ఎందుకంటే ప్రేమకూ అనురాగానికి దూరాలు ఉండవనే సంగతి వాటికి బాగా తెలుసు . అందుకే ఎడతెగని ఒక రాగబంధం నిరంతరం వాటి మధ్య కొనసాగుతూనే ఉంటుంది . వాటి ఎదలో తేనెజల్లు కురుస్తూనే ఉంటుంది .

కడలి పిలువ కన్నెవాగు పరుగుదీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా ! // పగలే వెన్నెల //

లోకంలో జీవచైతన్యం గల ఏదీ ఉన్న చోట ఉన్నట్లే పడి ఉండడానికి ఇష్టపడదు . అందుకే మనసును పరవశింపచేసే ఒక ఆసరా కోసం ప్రతిదీ ఎదురుచూస్తూ ఉంటుంది . ఉన్నట్లుండి , సముద్రుడి నుంచి ఏ చిన్న పిలుపో వచ్చిందనుకోండి , వారు ఆ వైపు పరుగులు తీస్తుంది రాగరంజితంగా ఎక్కడ ఏ నాదం వినిపించినా , తలను నలుదిక్కులా తిప్పుతూ నాగు శిరోనాట్యం చేస్తుంది . నిజానికి , దేహంతోనే అనికాదు .... గాలితోనూ , నీటితోనూ శబ్దంతోనూ రసార్థమైన ప్రతిదానితోనూ రాగబంధాలు ఏర్పడతాయి . హృదయాలు దేదీప్యంగా వెలిగిపోతాయి . ఆ ప్రవాహంలో లోకం పూలతోటలా మారిపోతుంది . జీవితాలు సుగంధాలతో నిండిపోతాయి .

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల రుతువు సైగచూచి పికము పాడే
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా ! // పగలే వెన్నెల //

ఆశావహమైన మనసు ఏ ప్రాణికైనా అవసరమే ! జీవికకైనా , జీవితానికైనా అదే పెద్ద ఆధారం . ఆ మనసే లేకపోతే . జీవితాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయి . గమనిస్తే , సృష్టిలో అణువణువునా ఆ చైతన్యమే కనిపిస్తుంది . అందుకే , వర్షం కురుస్తుందో లేదోనన్న అనుమానాలకు పోకుండా , ఆకాశంలో నీలిమబ్బు లేచీ లేవగానే నెమలి నాట్యం చేయడం మొదలెడుతుంది . వసంతం వస్తుందో లేదో అనేమీ శంకించకుండా ఆ రుతువు రాగానే కోయిల గొంతెత్తి పాడుతుంది . మనసు వీణలా ఝంకారాలు పలుకుతుంటే ,ఎవరి బతుకులోనైనా పున్నమే కదా పూచేది!! నిజానికి , పగలు వెన్నెల్లా అనిపించడానికైనా , లోకం ఊయల్లా అనిపించడానికైనా ఈ ఆశావహ హృదయమే కావాలి. ఆశావహమైన ఓ నిండు ఊహాజ్ఞానం కావాలి . ఆ జ్ఞానమే జీవితాన్ని రసరంజకం చేస్తుంది . లోకాన్ని రాగమయం చేస్తుంది .

                                                                  ---బమ్మెర-


4, ఫిబ్రవరి 2021, గురువారం

జీవితమే సఫలమూ పాట | అనార్కలి సినిమా | Old Telugu Songs

పాటలో ఏముంది ? 


1955 లో విడుదలై , అఖండ విజయం సాధించిన ' అనార్కలి ' సినిమాలోని పాటలన్నీ సీనియర్ సముద్రాల రాసినవే !ఆదినారాయణరావు స్వరపరిచిన అందులోని దాదాపు అన్ని పాటలూ ఆపాత మధురాలు . ప్రత్యేకించి జిక్కి పాడిన ' జీవితమే సఫలమూ ' అన్న పాట తెలుగునేలనంతా పులకింప చేసింది . నిజానికి , ఈ పాట బాణీ మూలం 1953 లో విడుదలైన ' అనార్కలి ' ( హిందీ ) సినిమా కోసం సి.రామచంద్ర స్వరపరిచినది . లతా మంగేష్కర్ పాడిన ' యే జిందగీ ఉసీకి హై ' అన్న ఆ పాట అప్పటికే దేశమంతా మారుమోగింది . అలాగని , అదే బాణీని ఆ తర్వాత జిక్కీ పాడితే అందులో ఏముంది గొప్ప అనుకోవడానికి వీళ్లేదు . అది ఇక్కడికి వచ్చేసరికి , పాట తేట తెలుగుదన్నాన్నంతా పుణికి పుచ్చుకుంది . తెలుగు గుండెల రసధ్వనులతో ఆరు దశాబ్దాలుగా ఓలలాడిస్తోంది .

జీవితమే సఫలమూ ..... 


జీవితమే సఫలమూ - రాగసుధా భరితమూ
 ప్రేమ కథా మదురమూ   // జీవితమే //
జీవితం సఫలం కావడం అంటే ఏమిటి ? అనుకున్న ప్రతిదీ నెరవేరడమా ? అప్పటికే అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమా ? ఎంత మంది జీవితాల్లో అలా జరుగుతుంది ? పైగా , యుక్త వయసు నాటికే ఇవన్నీ జరిగిపోతాయా ? లేదే ! నిజానికి , అప్పుడప్పుడే కదా ! అనుకున్న దిశగా అడుగులు పడటం మొదలవుతుంది . ఆమాత్రానికే జీవితం సఫలం అయిపోయినట్టు ఎలా భావిస్తారు . వాస్తవం ఏమిటంటే , జీవితం సఫలం కావడానికి , అప్పటికే అనుకున్నది, నెరవేరనక్కర లేదు . అనుకున్న లక్ష్యాన్ని అప్పటికే సాధించి ఉండనక్కర లేదు . ఎన్ని అడ్డుంకులు వచ్చిపడుతున్నా ఎన్ని కష్టనష్టాలు వచ్చిపడుతున్నా సరే ! మడమ తిప్పకుండా అనుకున్న దిశగా అడుగులు పడుతూ ఉంటే చాలు . జీవితం అర్ధవంతంగా వెళుతున్న భావన కలిగితే చాలు . జీవితం సఫలం అయినట్టే !
హాయిగా తీయగా ఆలపించు పాటల
వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల
అనారు పూలతోటల - ఆశదెలుపు ఆటల // జీవితమే //
వేసే ప్రతి అడుగూ అర్ధవంతంగా పడుతోందన్న ఆ ఒక్క భావన చాలు ఎడారి కూడా నందనవనంగా అనిపిస్తుంది . హృదయం రాగరంజితం అవుతుంది . మధురాతి మధురంగా ప్రేమగానం మొదలవుతుంది . అప్పుడు ఆలపించే ప్రతి పాటా వలపు మాటలతో సోయగాలు ఒలికిస్తుంది . జీవితంలో పూల కుసుమాల వేల ఆశలు మోసులెత్తుతాయి .
వసంత మధుర సీమల - ప్రశాంత సాంధ్య వేళల
అంతులేని వింతల - అనంత ప్రేమలీలల
వరించు భాగ్యశాలుల - తరించు ప్రేమజీవుల // జీవితమే // 
లోకమెప్పుడూ సుఖసంతోషాలనే కోరుకుంటుంది . కానీ , చాలా సార్లు అవి దానికి దక్కవు . అందుకే లోకం అనుక్షణం ఆత్మ క్షోభతో రగులుతూ ఉంటుంది . పైగా , తనకు దక్కనివి ఇతరులెవరికీ దక్కడానికి వీల్లేదన్నట్లు కొన్నిసార్లు తీవ్రమైన అసూయాద్వేషాలతో వ్యవహరిస్తూ ఉంటుంది . ఎక్కడెక్కడ ప్రేమ దీపాలు కనిపించినా , వెంటనే వాటిని ఆర్చేయాలని చూస్తుంది . అది గమనించి , ఎప్పటికప్పుడు దాని ఎత్తులకు పై ఎత్తులు వేసే నైపుణ్యం సాధించగలిగితే చాలు ... జీవితం వసంత మాధుర్యాలు ఒలికిస్తుంది . హృదయం ప్రశాంత సీమగా మారిపోతుంది . వేవేల ప్రేమలీలల్లో మనసు సౌభాగ్యవంతమవుతుంది . జీవితం తరించిపోతుంది  
                                                             - బమ్మెర