27, జూన్ 2021, ఆదివారం

నాలుగు కళ్లు రెండైనాయి పాట | ఆత్మబలం సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

కళ్లంటే చూపునిచ్చేవి మాత్రమే కాదు కదా! అవి ఎన్నెన్నో లోకాల్ని మన ఎదురుగా నిలబెట్టేవి! మనిషిలోని భావోద్వేగాల్ని మాటల్లేకుండానే బయటపెట్టడంలో కూడా అగ్రస్థానం కళ్లదే! అలాంటి కళ్ల గురించి చెప్పే మాటలూ, పాటలూ సాహిత్య లోకంలో చాలా అరుదుగానే  కనిపిస్తాయి. అలాంటి అరుదైన ఓ సృజనాత్మక రచనను ఆచార్య ఆత్రేయ ‘ఆత్మబలం’ సినిమా కోసం చేశారు. కె.వి మహాదేవన సంగీత సారధ్యంలో సుశీల ఈ పాటను నిలువెత్తు దుఃఖాన్నీ, నిండైన నిబ్బరాన్నీ మేళవించి పాడారు. పదేపదే వింటూ,  అంత స్సారాన్ని ఆస్వాదిస్తూ పాట వెంట  పయనించండి మరి!

నాలుగు కళ్లు రెండైనాయి





నాలుగు కళ్లు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాననయ్యాను -
ఏమీ లేనిదానినయ్యాను // నాలుగు కళ్లు //

నలుగురు మనుషులు ఒకే బాట పట్టినట్లు, ఇద్దరు వ్యక్తులు ఒకే పాట పాడినట్లు భిన్నత్వం పోయి కొన్నిసార్లు అత్యంత మనోహరమైన ఏకత్వం పుడుతుంది. కాకపోతే  ఒక్కోసారి  ఆ ఏకత్వం నిలువలేని ఏవో పరిణామాలు జరిగి అంతా చెల్లాచెదురైపోవచ్చు.  ఒక  దశలో ఏమీ కాని, ఎటూ కాని విచిత్ర జీవులైపోవచ్చు ఇంతా జరిగినా గుండె నిబ్బరం ఉన్నవాళ్లు తిరిగి శక్తినంతా కూడగట్టుకుని ఒక్కొక్క అడుగే వేస్తూ మళ్లీ ప్రయాణం మొదలెడతారు.  ఆ నిబ్బరం లేని వాళ్లు మాత్రం ఉన్న చోటే పడి ఉండి, జీవితాన్ని కాలపరీక్షకు పెట్టి కన్నీరు మున్నీరవుతారు. ఈ పరిణామాల పరంపరను అలా ఉంచి అసలు మూలాల్లోకి వెళితే, తన మనసును మరెవరికో అర్పించడం అన్న మాటకు మూలార్థం ఏమిటి? మనసంటే అదేమైనా చేతికందే వస్తువా? అమాంతం తీసి ఎదుటి వారి చేతిలో పెట్టడానికి? అయినా ఈ మాటెందుకు అనాదిగా చలామణీ అవుతోంది? అసలు విషయం ఏమిటంటే, మనసునెవరికో అర్పించడం అంటే దేహంలోంచి తీసి, ఎదుటి వాళ్ల చేతిలో పెట్టడం కాదు
అవతలి వ్యక్తిని తన హృదయంలోకి స్వాగతించడం. కాకపోతే, ఆ ఇవ్వడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. కొందరు హృదయంలో సగభాగమే కేటాయిస్తే, మరికొందరు ఇంకాస్త ఉద్వేగానికి లోనై తన కోసం కాస్తంత మిగుల్చుకుని మూడొంతులూ ఇచ్చేయవచ్చు,. అదీ చాలదన్నట్లు కొందరు తనకేమీ మిగలకుండా మొత్తంగానే వారికి ఇచ్చేయవచ్చు. అడిగేవాళ్లు లేకగానీ,  నీకేమీ మిగలకుండా పోయి, మొత్తంగా నీ ఉనికే లేకుండా పోయే ఆ పని నువ్వెందుకు చేసినట్లు? అదే జరిగితే ఆ తరువాయి పరిస్థితి ఏమిటి? ఏ ఆలంబనా లేక, నిలువ నీడలేని నిరాశ్రయులవుతారు. బ్రతుకు ఉన్నా  జీవితం కోల్పోయిన నిరుపేదలవుతారు. అంతే కదా! 

కనులకు కలలే బరువైనాయి - కన్నీళ్లయినా కరువైనాయి
రెండూ లేక పండురేకులై - ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి  // నాలుగు కళ్లు //

ధారగా ప్రవహించడమే గానీ, కనీళ్లెప్పుడూ గడ్డ కట్టుకుపోవు. అదే జరిగితే ఆ తర్వాత ఆ కళ్లకింక కలలూ ఉండవు.. కన్నీళ్లూ ఉండవు. అలాగని, అందరి పరిస్థితి అంత తీవ్రంగా ఏమీ ఉండదు.  కాకపోతే, చాలా మంది  జీవితాల్లో ఈ  కలలూ, కన్నీళ్లూ కలగలిసే ఉంటాయి.  ఆ వచ్చేవి ఒకవేళ కమ్మకమ్మని కలలే అయితే, వాటితో కలిసి మనసు కలహంస నాట్యాలే చేస్తుంది. కానీ, మనిషికి వచ్చే మొత్తం కలల్లో కమ్మని కలలు ఏపాటి? అవి నాలుగో వంతైనా ఉండవు. కొందరిలో  ఆ నాలుగోవంతు ఉన్నాయే అనుకున్నా, మిగతా మూడు భాగాలూ గాధామయాలే... విషాధ గాధామయాలే మరి! ఆ మాటకొస్తే, ఆనందగాధల కన్నా విషాద గాధలే లోతైనవి, విశాలమైనవి కూడా.  కాకపోతే ఒక్కోసారి అవి మోయలేనంత బరువెక్కిపోతాయి. భారమవుతాయి. శక్తిని మించిన భారాన్ని మోసే వేళ చెమటలు పట్టి తనువంతా తడారిపోయినట్లు, ఈ శోకభారం మరీ ఎక్కువైనప్పుడు కూడా మనిషిలోని కన్నీళ్లన్నీ ఇంకిపోతాయి. కళ్లు బీటలు బారిపోతాయి. 

కదిలే శిలలా మారిపోతిని - కథగానైనా మిగలనైతిని
నిలువుగ నన్నే దోచుకుంటివి - నిరుపేదగ నే మిగిలిపోతిని 
నిరుపేదగ నే మిగిలిపోతిని // నాలుగు కళ్లు //

సుఖాంతమే అయినా, దుఃఖాంతమే అయినా,  ఏదైనా ఒక కథగా మారాలటే దాని మూలాంశమేదో బలంగానే ఉండాలి! ఆ జీవితమేదో నీదే కాబట్టి ఆ మూలాంశం బలంగా ఉందో లేదో ఇతరులకన్నా నీకే బాగా తెలుస్తుంది. అంతరంగం విషయానికే వస్తే,  నీ ఇష్టం లేనిదే,  నీ ఆమోదం లేనిదే ఎవరో వచ్చి నీ హృదయాన్ని తీసుకుపోలేరు కదా! హృదయం దోపిడికి గురయ్యేదేమీ కాదు.  కాకపోతే, హృదయాలు ఇచ్చిపుచ్చుకున్న నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోయి ఉండవచ్చు.  అవతలి వ్యక్తి తీరుతెన్నులు అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా మారిపోయి ఉండవచ్చు.  అలా మారిపోవడానికి  ఒక్కోసారి తన అధీనంలో లేని, తాను నియంత్రించలేని  ఏ బలమైన కారణాలో ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి పట్ల కొండంత సానుభూతితో అండగా నిలబడే వాళ్లు కావాలి. సానుభూతి అంటే అదేదో జాలితో జారిపడే పదార్థమేమీ కాదు. నిజమైన సానుభూతి నిఖార్సయిన ప్రేమలోంచి పుడుతుంది. అవసరమైతే ప్రాణానికి తన ప్రాణాన్ని ఫణంగా పెడుతుంది.  సానుభూతి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకే లా చూడటానికి, సమస్యను సంయుక్తంగా ఎదుర్కోవడానికి, సమిష్టిగా విజయాన్ని సాధించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. వాస్తవం ఏమిటంటే సానుభూతి కరువైపోవడం ఈనాటి అతి పెద్ద సామాజిక సమస్య!! హృదయాల్లో దీన్ని ప్రతి ఒక్కరూ సాగుచేయాలి. అద్భుతంగా పండించాలి!!

                                                                        - బమ్మెర 


18, జూన్ 2021, శుక్రవారం

సడిసేయకో గాలి ... సడిసేయబోకే పాట | రాజమకుటం సినిమా | తెలుగు పాత పాటలు

పాటలో ఏముంది? 


నిద్ర ... నిశ్శబ్దం కవల పిల్లలే కదా ! వాటి మధ్యలోకి ఎప్పుడైనా ఏ శబ్దమో జొరబడితే అవి ఊరుకుంటాయా? అవి అడుగుమోపిన మరుక్షణమే వడివడిగా వెళ్లి వచ్చిన బాటపట్టమని చెబుతాయి. సడిసవ్వడి లేకుండా ముందుకు సాగిపొమ్మని చెబుతాయి. ఈ మాటలే దేవలపల్లి కృష్ణశాస్త్రి  కలంలోంచి పాటలుగా పుట్టుకొచ్చాయి. మాస్టర్‌ వేణు బాణీతో ప్రాణం  పోసుకున్న ఈ పాటను ‘రాజమకుటం’ సినిమా కోసం లీల లలిత  లలితంగా గానం చేసింది. శ్రోతల హృదయాల్ని లలిత లావణ్యం చేసింది. ఆద్యంతం ఆస్వాదించండి!!

సడిసేయకో గాలి ... !!




సడిసేయకో గాలి ... సడిసేయబోకే 
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే  // సడిసేయకే //

గడపదాటి అడుగు బయటపెట్టిన క్షణం నుంచి తిరిగి గడపలో అడుగు మోపేదాకా ఎన్నెన్ని ఒడిదుడుకులు?
ఎడతెగకుండా మోసిన ఎన్నెన్ని బాధ్యతలు? ఒక బాధ్యత నెరవేరింది అనుకునే లోపే మరో కొత్త బాధ్యత వచ్చిపడటం, ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపే మరో కొత్త సమస్య వచ్చిపడటం వంటివి మనిషిని   నిరంతరం ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. బాధ్యతా నిర్వహణలో, సమస్యా పరిష్కారంలో వీటివల్ల శారీరకంగా, మానసికంగా ఎంత బడలిక? అదీ చాలదన్నట్లు గాలి ఎక్కడెక్కడి నుంచో అప్పటిదాకా కనీవినీ ఎరుగని ఏవేవో సవ్వడుల్ని మోసుకొస్తుంది. ఇవన్నీ నిద్రాభంగం చేసేవేగా! వీటన్నిటినీ చూస్తుంటే,  అతన్ని అనుక్షణం కనుపాపలా కాపాడుకునే అతని ప్రాణేశ్వరి ఎంత తల్లడిల్లిపోతుంది? కాకపోతే, అన్నీ కాకపోయినా, అవరోధాల్లో కొన్నింటినైనా 
అడ్డుకునేందుకు ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది!

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదే // సడిసేయకే//

ఒక రాజ్యాన్ని స్థూలంగా చూస్తూ పోతే ఎన్ని సమస్యలు ఉంటాయో, ఒక కుటుంబాన్ని సూక్ష్మంగా చూస్తే అన్ని సమస్యలూ ఉంటాయి. అందుకే వాటన్నింటినీ ఎదురించడం, లేదా వాటికి ఎదురీదడం ఎవరికైనా పెద్ద యజ్ఞమే అవుతుంది. ఆ యజ్ఞకర్తకు తనదైన రాజ్యమూ, సామ్రాజ్యమూ లేకపోతేనేమిటి?  రత్నాలు పొదిగిన సింహాసనం లేకపోతేనేమిటి? అతడు ఏ రాజునూ తీసిపోడు. ఎందుకంటే అతడు నిర్వర్తించే బాధ్యతల రీత్యా అతడు  ఏ మహారాజుకన్నా తగ్గిపోడు. పైగా, యుద్దం చేసి గెలిచే వాడికన్నా, యుద్దమే రాకుండా నిలువరించేవాడే నిజమైన యోధుడన్నది జగమెరుగని సత్యం కదా! ఆ మాటనే మనసులో ఉంచుకుందేమో! భూపతులనూ, భూసురులనూ కొనియాడినట్టే తన స్వామినీ కొనియాడమంటోంది. రోజువారీ చిలిపి పరుగులూ,  సరదా సరాగాలూ మానేసి, ఈ అభినవ చక్రవర్తిని సేవించి తరించమని గాలితో చెబుతోంది. 

ఏటి గలగలలకే ఎగిరి లేచేనే 
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదిరిందంటే నేనూరుకోనే // సడిసేయకే //

జీవన పోరాటంలో కొందరు రాటుతేలిపోతుంటే,  మరికొందరేమో మరింత సున్నితమైపోతారు. అలాంటి వారి చెవిలో ఏ చిన్న సవ్వడి పడినా అదో పెద్ద  అలజడికి బీజం వేస్తుంది. పైగా ఏటి గలగలలంటే ఉత్త గాలి తరగలనే కాదుగా! ఏటిలో కదలాడే సమస్త ప్రాణికోటి  భావోద్వేగాలెన్నింటినో అభివ్యక్తం చేసే పదునైన గొంతుకలవి! ఆకుల విషయమూ అంతే కదా! ఆకులు తలలాడించడం అంటే అది గాలికి వంతపాడటమేమీ కాదుకదా! ఆ కదలికలు భూగర్భంలోంచి ఎగదన్నుకొచ్చే చైతన్య ప్రకంపననలు. కాకపోతే అవి ఎంత గొప్పవైనా వాటి శబ్దాలు తన ప్రియబాంధవుడి శాంతిని భగ్నం చేసేవే! వాటన్నిటినీ ఆమె ఎలా సహిస్తుంది? అందుకే అతనికి నిద్రాభంగం కలిగించే ఏ చర్యకు పాల్పడినా నేనూరుకోనని అంత కరాఖండిగా చెబుతోంది. ఊరుకోనంటే ఏంచేస్తానని ఆమె ఉద్దేశం? ఏమో ఏంచేస్తుందో ఎవరికి తెలుసు? పరమశివుణ్నే నేలపై పడదోసి ఎదపై పాదం మోపిన ఆదిశక్తి కదా మహిళ! అందుకే ఎలుగెత్తి మదిలోని మాట చెబుతోంది! అంతే కాదు...ఏటిగలగలలనూ, ఆకు కదలికలకూ  ఉసిగొలిపి  పబ్బం గడపాలనుకుంటే ఏమాత్రం కుదరదని పరుషంగానే చెబుతోంది.

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీలి మబ్బుల దాగు నిదుర తేరాదే 
విరుల వీవన పూని విసిరిపోరాదే // సడిసేయకే //

అవునూ...! తానున్న నేలా, నీరూ, గాలీ, నిప్పును వదిలేసి ఈమె ఏకంగా ఆకాశం అండ కోరుతోందేమిటి అనిపిస్తోందా? ఔనుమరి!  పైకి ఎంత నిశ్చలంగా అనిపించినా,  భూతలం పైన మానవజీవన సంఘర్షణ తాలూకు మసి రాలుతూనే ఉంటుంది కదా! అది ఎడతెగని అలజడికి ఆజ్యం పోస్తుంది. ఇక్కడి ప్రతిదీ ఆ అలజడిని మోసుకు తిరిగేదే కదా! అందుకే భూతలాన్ని వదిలేసి  ఈ తరుణి ఆకాశ మార్గం పట్టింది! మురుగు నురుగుల్లేని పండు వెన్నెల పంచ  చేరి, తన స్వామికోసం పాలపుంత లాంటి పాన్పు  కోరుతోంది

వర్షపు చినుకుకు మల్లే మబ్బులు నిద్రను కూడా కురిపిస్తాయనుకుందేమో ఆమె నీలిమబ్బుల్నీ అర్థించింది. తన స్వామి పరవశించేలా పూలగుత్తుల విసనకర్రలతో నిలువెల్లా విసరమంటోంది. సహజంగా, మూడోవారు ఎవరొచ్చినా తనకు ముప్పేనన్న అనుమానం,   ఎక్కడ తన ప్రియతముణ్ని మాయం చేస్తారోనన్న భయం ఏ జంటకైనా ఉంటాయి. అలాంటిది అవేవీ మనసులో పెట్టుకోకుండా, తనతో పాటే అతన్ని సేవించి తరించమని తనే స్వయంగా చెబుతోంది! అసూయా ద్వేషాలకు అతీతంగా ఆమె తన ఔన్నత్యాన్ని చెప్పకనే చెప్పింది.. మహిళామణుల్లో ఆమె మకుటాయమానంగా నిలిచింది!!

                                                                   - బమ్మెర 

====================================


5, జూన్ 2021, శనివారం

ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా పాట లిరిక్స్ | మురళీ కృష్ణ సినిమా | ఘంటసాల పాటలు |

పాటలో ఏముంది?

అర్థవంతమైన జీవితం గడపాలనే అందరూ అనుకుంటారు. అయినా  కొన్నిసార్లు జీవితంలోకి అగ్న్జికీలల్లాంటి అపార్థాలు అనుకోకుండా వచ్చిపడతాయి. .వాటిలో కొన్ని చిన్నాచితకా నష్టాలతోనే సమసిపోవచ్చు కానీ మరికొన్ని మాత్రం, మొత్తంగా జీవన సౌధాన్నే చెల్లాచెదరు చేస్తాయి. లోకంలో ఏం చేశారన్నదే తప్ప ఏ ఉద్దేశంతో  చేశారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. అందువల్ల చాలాసార్లు అసలు నిజాలు తారుమారవుతాయి. అప్పటిదాకా రెందు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్నవారు సైతం, ఎవరికి వారై వేరైపోతారు. వారిలో కాస్త పెద్ద మనసున్నవారు, ఏదో త్యాగానికే సిద్ధపడవచ్చు. కానీ, బంధాల ఉనికే లేకుండాపోయాక, ఆ త్యాగం వల్ల ఒరిగేదేమిటి? ‘మురళీ కృష్ణ ’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాటలో ఈ భావోద్వేగాలే ఎగిసిపడతాయి. పైగా, ఈ పాటకు మాస్టర్‌ వేణు కూర్చిన  బాణీ,  ఘంటసాల గాత్రం, ఆ భావోద్వేగాలు మిన్నుముట్టేలా చేశాయి.

నీ సుఖమే నే కోరుతున్నా!!


ఎక్కడ ఉన్నా ఏమైనా .....

మనమెవరికి వారై వేరైనా....
నీ సుఖమే నే కోరుతున్నా ... నిను వీడి అందుకే వెళుతున్నా // నీ సుఖమే //

త్యాగం  గొప్పదే కానీ, అందులో చాలా వరకు విషాదమే ఉంటుంది.  అసలా త్యాగం చేయాల్సిన అవససరం ఏమొచ్చింది? అన్న విషయాన్ని పరిశీలిస్తే
ఆ విషాదమేమిటో బోధపడుతుంది.  ప్రేమికులైనా, దంపతులైనా ఏ జంటకు ఆ జంట,  తమ లోకంలో తాముగా ఉండిపోయినంత కాలం సాఫీగానే సాగిపోతుంది. అయితే అందుకు భిన్నంగా  ఒక్కోసారి వారి మధ్యలోకి మరెవరో ప్రవేశిస్తారు. ఫలితంగా కొన్నిసార్లు పూలు విరబూసినా, మరికొన్నిసార్లు అక్కడ కొన్ని మంటలు మొదలవుతాయి. ఆ మంటల వెనుక చాలా సార్లు అపోహలే మూలంగా ఉంటాయి. అయితే, అది అపోహే అని తెలిసే నాటికే జరగరానంత నష్టం జరిగేపోవచ్చు. ఎందుకంటే అపోహ తలెత్తినంత వేగంగా అసలు నిజాలు బయటికి రావు కదా! ఈ లోపే ఎన్నెన్నో పరిణామాలు జరిగిపోవచ్చు. ఫలితంగా,  మనుషులూ, మనసులూ ఎడబాసిపోవచ్చు. వారు సంకుచితత్వంతో విడిపోయినా, ఉదాత్తంగా విడిపోయినా విడిపోవడం, విడిపోవడమే కదా! అది విషాదమే కదా!


అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ, అనుకోవడమే మనిషి పనీ  // నీ సుఖమే //


అనుకోవడం ఏముంది? ఎవరు ఏమైనా అనుకోవచ్చు. అనుకోవడం అనేది పూర్తిగా మనిషి చేతిలోనే ఉంటుంది. కాకపోతే,  అనుకున్నది  అనుకున్నట్లు నెరవేర్చుకోవడం అనేది మాత్రం తన చేతిలో కొంతే ఉంటుంది. మిగతా కొంత లోకం చేతిలో, ప్రకృతి చేతిలో ఉంటుంది. రైతు ఎంతో కష్టపడి పొలం దున్నగలడే గానీ, వర్షం కురిపించలేడు కదా! అహోరాత్రులూ కష్టపడి ఒక శాస్త్రవేత్త మట్టిలోంచి జీవకణాన్ని సృష్టించగలడేమో గానీ మట్టిని సృష్టించలేడు కదా! వ్యక్తిగత శక్తి సామర్థ్యాలతోనే మనిషి అన్నీ సాధించలేడు. తన శ్రమకు బాహ్యమైనవెన్నో కలిసి రావాలి. మరో విషయం ఏమిటంటే, తాననుకున్నట్లు జరగకపోవడమే కాదు, తాననుకున్నదానికి పూర్తి విరుద్ధగా కూడా ఎన్నో జరిగిపోవచ్చు.. పలురకాల  అగచాట్లకూ, అపజయాలకూ  దారి తీయవచ్చు. కాపోతే, నేటి అపజయాలు రేపటి విజయానికి సోపానాలవుతాయి అన్న సత్యం తెలిసిన వాళ్లు అపజయాల్ని కూడా సానుకూల దృష్టితోనే చూస్తారు. జరిగేవన్నీ మన మంచికేనని  గ్రహించి ఆత్మనిబ్బరంతో వ్యవహరిస్తారు 

పసిపాపవలే ఒడిచేర్చినాను - కనుపాపవలే కాపాడినాను
గుండెను గుడిగా చేశాను - నువ్వుండలేననీ వెళ్లావు  // నీ సుఖమే //

లోకం గురించీ,  మానవ నైజాల గురించీ పెద్దగా ఏమీ తెలియనంత కాలం, ఎంత వయసొచ్చినా వారు పసిపాపల కిందే లెక్క.ఆ నిజం తెలిసిన పెద్దవాళ్లు వారిని పసిపాపల్లాగే, కనుపాపల్లాగే చూసుకుంటారు. పసిపాపలు ఏం చేస్తారు? తల్లి ఒడిలోంచి జారి జారి, ఏ మట్టిలోకో, బురదలోకో వాలిపోవాలని చూస్తారు. ఒక్కోసారి నిప్పని తెలియక చేతులూ కాళ్లూ కాల్చుకుంటారు. అలా ఏమీ జరక్కుండా,  నిప్పుల కుంపట్లలో పడిపోకుండా , హృదయ మందిరంలో సురక్షితంగా ఉండేలా తల్లులు కొన్ని ఏర్పాట్లు  చే స్తారు. అయినా,  ఎవరైనా కాదనుకుని, కావాలనే ఆ హద్దులు రాటి వెళ్లిపోతే ఎవరు  మాత్రం ఏం చేయగలరు? నిప్పని తెలిసినా, తెలియకపోయినా కుంపటిలో చేయి పెట్టాక కాలకుండా ఉండదు కదా! కొంత వయసు వచ్చాక తమ చర్యల వల్ల తలెత్తే పరిణామాల గురించి ఎంతోకొంత తెలుస్తుంది. కానీ, పరిణామాల తర్వాత వచ్చే పరిణామాల పరంపర గురించి  చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలిసే దాకా వారంతా పసిపిల్లలతో సమానమే మరి!

వలచుట తెలిసిన నా మనసునకూ - మరచుట మాత్రం తెలియనిదా?
మనసిచ్చినదే నిజమైతే మన్నించుట
యే రుజువు కదా! // నీ సుఖమే //

ప్రేమించడం తెలిసిన హృదయానికి మరిచిపోవడం మాత్రం తెలియకుండా ఉంటుందా అంటే... ఏమో  తెలియకపోవచ్చు కూడా కదా! ఎవరైౖనా,  ప్రేమించడానికి ముందు మరిచిపోయే శిక్షణ కూడా పొంది ఉంటారా ఏమిటి?  ప్రేమించడం అన్నది సహజంగానే జరిగిపోతుంది. మరిచిపోవడం అలా రాదు కదా! దానికో పెద్ద సాధన కావాలి. అలాంటి సాధన చేసే అవసరం ఒకటొస్తుందని  ఏ ప్రేమికులూ ముందే అనుకోరు. అందుకే ఆ సాధన చేయరు. ఒక వేళ నిజంగానే ఆ అవసరం వస్తే  ఆ కళను కాలం నేర్పాల్సిందే! అయినా ప్రేమించడం అంటే ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోవడం కదా! ఒక్కరైపోవడం కదా! ఇద్దరు ఒక్కరైపోయాక ఎవరు ఎవరిని మన్నిస్తారు. ఎవరు ఎవరిని మరిచిపోతారు? అన్నం తింటూ తింటూ నాలుక  కరుచుకుంటాం.! అప్పుడేం చేస్తాం?  కోపమొచ్చి పళ్లు పీకేసుకుంటామా? నాలుక కోసేసుకుంటామా? ఆ రెండూ చేయం! ఎందుకు? ఆ రెండూ మనవే కాబట్టి,  ఎంత నొప్పి అనిపించినా సహిస్తాం, భరిస్తాం అంతకు మించి ఏమీ చేయం! రెండు హృదయాలు ఒకటిగా మారాక ఒకరు మరొకరిని వేధించడమో, బాధించడమో ఉండదు. ఒకవేళ ఉంటే అది తనను తాను వేధించడమే, బాధించడమే అవుతుంది. అలాంటప్పుడు తనను తాను మరిచిపోవడం, తనను తాను మన్నించడం అర్థం లేని మాటలే కదా!

నీ కలలే కమ్మగ పండనీ -  నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ ఉండాలనీ - దీవిస్తున్నా నా దేవినీ
దీనిస్తున్నా నా దేవినీ....


ఎక్కడ ఉన్నా, ఏమైనా, ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే  కోరుతున్నా - నీ సుఖమే నే కోరుతున్నా...!


ఎంత కాదన్నా, ఎవరి లోకం వారికి ఉంటుంది. ఎవరి కలలు వారికి ఉంటాయి. ఎవరి మార్గం, ఎవరి గమ్యం వారికి ఉంటాయి. మనసున్న ఏ మనిషైనా సాటి మనిషి కలలు నెరవేరాలనే అనుకుంటాడు.  వారి ఆశలూ, ఆశయాలూ ఫలించాలనే కోరుకుంటాడు.  హృదయానికి బాగా దగ్గరి వారైతే మరీ ప్రత్యేకంగా కోరుకుంటాడు. కలలు  ఏదో నెరవేరడమే కాదు. నెరవేరిన ఆ కలల సౌధంలో వారి జీవితం  హాయిగా, ఆనందంగా గడిచిపోవాలని ఆశిస్తాడు. అదే సమయంలో తన జ్ఞాపకాలు ఆమె  హృదయ పలకంలోంచి తొలగిపోవాలని కూడా కోరుకుంటాడు. ఎందుకంటే  గమ్యాలు వేరైన వారితో కలిసి నడవడం అంటే రెండు పడవల పైన కాలుమోపడమే కదా!  అందుకే  తన మనసులోంచి మాయమైపోవాలనుకుంటాడు.   వీటన్నిటినీ మించి మనిషి ఏం పొందాడూ,  ఏం పోగొట్టుకున్నాడూ అనేదాని కన్నా,  పొందడానికీ, పోగొట్టుకోవడానికీ అతీతంగా, జీవితంలో అతడు నిరంతరం ఎదుగుతూ వచ్చాడా లేదా? అన్నదే ఎంతో - ఎంతో ముఖ్యం !!
                                                                      - బమ్మెర

అక్కినేని నాగేశ్వరరావు సినిమా పాటలు
జమున పాటలు