18, డిసెంబర్ 2021, శనివారం

నిదురించే తోటలోకి పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?


కమ్మటి కల ఏదో కంటావు. జీవితం ఆ కలలాగే సాగిపోవాలనుకుంటావు! అయితే, నీ జీవితం పూర్తిగా నీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ కల సగమైనా నెరవేరుతుంది. అలా కాకుండా జీవితం మరొకరి చేతుల్లోకి వెళితే మాత్రం, కథే మారిపోతుంది. అప్పుడింక నువ్వు నువ్వుగా ఉండవు. నువ్వు నీకోసం కాకుండా, మరెవ్వరి కోసమో పడి ఉంటావు. అప్పటిదాకా నీ అంతరంగానికి తెలిసిన నువ్వే నువ్వు! నీ జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత,  నువ్వేమిటన్నది ఎదుటి వాళ్లు నిర్ణయిస్తారు, వాళ్లకు ఏదనిపిస్తే అదే నువ్వవుతావు? వాళ్లకున్న ఆ స్వేచ్ఛతో అప్పటి దాకా నిన్ను దేవతవని కీర్తించిన నోటితోనే భూతం అనేయగలరు! ద్వేషం పెంచుకుని నీ పైన ఎంత బురదైనా చల్లగలరు! ఒకటి మాత్రం నిజం....., జీవితానికి సంబంధించిన అందమైన పార్శ్వన్ని మాత్రమే చూస్తూ ఉండిపోతే, ఒక్కోసారి మరో పార్శ్వం నుంచి  ఎదురయ్యే పాశవిక చర్యల పర్యవసానాల్ని తట్టుకోవడం కష్టమవుతుంది. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలోని ఈ పాట ఆ నిజాన్నే చెబుతోంది. కె.వి. మహాదేవన్‌ సంగీత సారధ్యంలో సుశీల గొంతు నిండా ఆవేదన  నింపుకుని ఆలపించిన బాణీ ఇది! ఈ పాట మరో ప్రత్యేకత ఏమిటంటే, అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ,  ఏనాడూ సినిమా పాటలు రాయని  విప్లవ కవి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైన వియోగ గీతమిది! నిలువెల్లా గాయాలే అయినా, అన్యాయాన్ని నిలదీయాల్సిందేనని చెప్పే ఆ కవిగళం ఎంతో మందికి నిలువెత్తు స్పూర్తి!!. 

నిదురించే తోటలోకి....!


నిదురించే తోటలోకి - పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి - కమ్మ్డ్డ్డటి కల ఇచ్చింది

ప్రశాంతంగా ఉంటేనే అని కాదు, తనువు అలసిపోయినా, మనసు అలసి పోయినా, నిదురపడుతుంది. ఆ నిదురలో నిన్ను నువ్వు  మరిచిపోనూ వచ్చు., లేదా ఏవో కలలు వచ్చి నీ గతాన్నంతా తిరగదోడనూ వచ్చు. ఆ గతంలో అందమైన కథలూ ఉన్నట్లే,  విషాద గాధలూ ఉంటాయి. ఆ కలలో ఒక్కోసారి,  తేనెలు కురిపించే పాటలూ వినిపిస్తాయి. పాటలాంటి మనసులూ కనిపిస్తాయి. ఒకవేళ ఎదుటివారి గుండెనిండా దుఃఖమే ఉంటే ఓ మనసు  ఆ కన్నీరు తుడవనూ వచ్చు. మరో కమ్మటి కలకు జీవం పోయనూవచ్చు. నిజానికి, ఆశే లేని వారికి నిరాశలూ త క్కువే!,  కలలే కనని వారికి కన్నీళ్లూ తక్కువే! అయితే మాత్రం, ఎక్కడ కన్నీటి పాలవుతామేమోనని ఎవరైనా కలలు కనకుండా ఉంటారా? అదీకాక, కలలనేవి మన అనుమతి తీసుకునేమీ  రావుకదా! ప్రత్యేకమైన హక్కులూ అధికారాలేమీ లేకపోయినా, మన అనుమతి లేకుండానే మనసులోకి చొరపడే స్వేచ్ఛ, చొరవా కలలకు పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే అవి మన మనసుతో ఎలాగైనా ఆటాడుకుంటాయి. 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది // నిదురించే //

ఏ కారణంగానో బోసిపోయిన ఒక ఇంట, ఎవరో వచ్చి, హరివిల్లులను తలపించే రంగవల్లులు అల్లితే ఎంత బావుంటుంది? దీనంగా పడి ఉన్న లోగిలిలో దీపాలు వెలిగిస్తే ఎంత బావుంటుంది? అయినా, రోజురోజంతా  సమూహంలో, సందడిలో తిరిగే వాళ్లుకు ఆ బోసితనం, ఆ దైన్యం ఏంతెలుస్తుంది? జీవితమే తలకిందులైన తాలూకు ఆ దైన్యం, కొందరిని  వారి చుట్టూ ఎందరున్నా ఏకాకిగానే నిలబెడుతుంది. ఆ నిలువెత్తు ఏకాకితనంలో హృదయవేణువు శూన్యమే అవుతుంది. కాకపోతే, కాలం కలిసొచ్చి,  ఒంటరి బాటసారికి మరో బాటసారి తోడైనట్లు, మౌనంగా పడి ఉన్న ఆ హృదయవేణువులోకి ఒక మమతల ఝరి ప్రవేశిస్తే మాత్రం, రసరమ్యంగా ఉంటుంది. ఆకు రాలే కాలంలో హఠాత్తుగా వసంతం వచ్చి పడినట్లు, ఆ జీవితాల్లో అద్భుతమేదో జరగాలి! అలా ఏదో జరగకపోతే, గుండెనిండా పరుచుకున్న ఆ బరువైన వ్యధలూ , బాధల్ని ఎన్నోరోజులు మోయలేం! నిజానికి, ఈ ఆత్మవే దనలూ, ఆత్మక్షోభలూ గుండె గోడల మధ్య సాగే యుద్ధాలే మరి! ‘యుద్దంలో గెలిచిన వాడి కన్నా, యుద్ధం జరగకుండా ఆపినవాడే నిజమైన విజేత’ అంటూ ఉంటారు. కానీ,  దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపడం కన్నా, మానవ హృదయాల మధ్య  సాగే యుద్ధాలను ఆపడమే ఎక్కువ కష్టం! ఎందుకంటే,  దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు బయటికి కనిపిస్తాయి.  కానీ,  మానవ అంతరంగ యుద్దాలు బయటికి కనిపించవు. ఇదే పెద్ద సమస్య! అందుకే వాటిని ఆపడం అంత కష్టం! ఒకవేళ ఎవరైనా ఆపగలిగితే, అంతకన్నా హర్షదాయక విషయం మరేముంటుంది? 

విఫలమైన నా కోర్కెలు -  వ్రేలాడే గుమ్మంలో 
ఆశల అడుగులు విననబడి - అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న, నావను ఆపండీ ....
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి.... నావకు చెప్పండి ...!!

ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన అవి కురుస్తాయన్న గ్యారెంటీ లేదుగా! కమ్ముకున్నంతసేపట్లోనే అవి కనుమరుగైపోవచ్చు కూడా! ఆత్మీయులైనా అంతే..., ఇంటి ముందు ఎదురుపడ్డంత మాత్రాన వారు ఇంట్లోకి వస్తారనేమీ లేదుగా! మనం, ఆహ్వానించినా మాట వినకుండా, చూస్తుండగానే మలుపు తిరిగి మరోదారి పట్టవచ్చు. అప్పటిదాకా ఈ వెలుగులో ఈ జీవనయానం నిశ్చింతగా కొనసాగిపోతుందిలే అని,  ఎంతో ధీమాగా ఉన్న సమయంలో ఒక్కోసారి హఠాత్తుగా చిమ్మచీకట్లు కమ్ముకోవచ్చు. అప్పటిదాకా మమతల ఝరీనాదమేదో వినిపించినట్లే వినిపించి, హఠాత్గుగా కర్ణపేయంగా భీకర ధ్వనులేవో మారుమ్రోగవచ్చు. అయితే  ఊహించని గాయాలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న ఇలాంటి సమయంలో ఒక్కోసారి ఓ అమృతమూర్తి వచ్చి ఊపిరిపోస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే, అంతలోనే ఆ రూపం మాయమైపోనూవచ్చు. ఎంత గుండె నిబ్బరం ఉంటే మాత్రం, అన్నీ అనుకున్న దానికి విరుద్ధంగానే వెళుతుంటే ఆ మనిషి ఏమైపోవాలి? వాస్తవానికి లోకంలో నేరుగా వెళ్లే దారుల కన్నా, మలుపు తిరిగేవే ఎక్కువ! దారులే కాదు కొంత మంది మనుషులూ అంతే! చిత్తచాంచల్యం వారిని స్థిరంగా ఉండనివ్వదు. నమ్ముకున్న వారిని నిలకడగా సాగనీయదు.  ఎదుటి వారి జీవితాల్ని అల్లకల్లోలం చేసే అమానుషమైన  ఇలాంటి దోరణులను ఎవరు మాత్రం ఎల్లకాలం భరించగలరు? అప్పటిదాకా నదీతరంగాలతో కాలం గడిపి, చివరికి ఆ నదికే ముప్పు తలపెట్టే వారిని  నిలదీయాల్సిన అవసరం లేదా? వాళ్లు విసిరిన బాణాలతో గాయపడిన నదీహృదయం,  ఎంత కొండశోకం పెడుతోందో గుండె బద్దలయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదా? ప్రతిసారీ పోనీలే అనుకునే వాడు,  సమాజంలో ఎలా మనగలుగుతాడు? నిజానికి  అమానుషత్వాన్ని నిలదీసే వాడే, న్యాయం కోసం పోరాడే వాడే  నిలబడతాడీ లోకంలో... !

                                                                 - బమ్మెర 

1 కామెంట్‌: