1, మార్చి 2021, సోమవారం

తెల్లవారక ముందే పల్లె లేచింది పాట | ముత్యాలపల్లకి సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ | Telugu old songs

పాటలో ఏముంది?


1977లో విడుదలైన ముత్యాలపల్లకి సినిమా కోసం మల్లెమాల రాసిన గీతమిది. సత్యం స్వర రచన చేసిన ఈ పాటను పల్లె సొగసులు అద్దుతూ సుశీల ఎంతో పారవశ్యంతో పాడింది. 


తెల్లవారక ముందే పల్లె లేచింది.


తెల్లావారక ముందే పల్లె లేచింది - తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరిచి నిద్రపోతున్న తొలికోడి - అదిరిపడి మేల్కొంది - అదేపనిగ కూసింది //తెల్లవారక//

తనవరకు సరే! పల్లెదాటి, పట్టణాలు దాటి మహానగరాలదాకా  పల్లె తాను పండించినవన్నీ పొద్దుపొద్దున్నే చేరవేయాలి కదా! లేచీలేవక ముందే పాలకోసం తల్లడిల్లే పసిబిడ్డలకోసం, తేనీటి కోసం విలవిల్లాడే పెద్దల కోసం పాలబిందెలు పరుగులు తీయాలి కదా! పల్లె కూడా అందరిలాగా బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే  ఇంకెక్కడి జనజీవన స్రవంతి? అంతా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోవడమే కదా! తన బాధ్యతలేమిటో తనకు బాగా తెలుసు కనుకే  తెల్లావారక ముందే పల్లె మేలుకుంటుంది. ఆ వెంటనే తన బిడ్డలందరినీ నిద్రలేపి  పనిపాటలకు పరుగులు  తీయిస్తుంది. అదే జరగకపోతే, లోకాన  అర్చనలూ, ఆరాధనలూ ఉండవు. టిఫిన్‌లూ భోజనాల సంగతి అలా ఉంచండి. టైముకు టీ, కాఫీలే అందవు. ఆ పరిస్థితి రావద్దనే పల్లె పొద్దుపొద్దున్నే కళ్లు నలుచుకుని రెప్పలు తెరుస్తుంది. ఒళ్లు విరిచి తన రెక్కలు విప్పుతుంది. ఈ తంతులో నా పాత్ర మాత్రం ఏం తక్కువ అన్నట్లు, పల్లెకన్నా ముందే కోడిపుంజు గొంతెత్తి సైరన్‌ మోత వినిపిస్తుంది. ప్రధమంగా పల్లెను మేల్కొలిపేది తనేనంటూ గర్వంగా నలువైపులా తలతిప్పి చూస్తుంది. ఇకనే..: పల్లె అణువణువునా ప్రాణశక్తి ప్రజ్వరిల్లుతుంది.  శ్రమైక జీవన  సౌందర్యం పల్లె పల్లెనా విలయతాండ వంచేస్తుంది.

వెలుగు దుస్తులేసుకుని సూరీడు - తూర్పు తలుపుతోసుకుని వచ్చాడు
పొడు చీకటికెంత భయమేసిందో - పక్కదులుపుకుని ఒకే పరుగు తీసింది
అది చూసీ లతలన్నీ పక్కున నవ్వాయి. - ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి // తెల్లవారక //

పగలూ రాత్రులనేవి మనకే కానీ, సూర్యునికి కాదుకదా! అందుకే విరామమే లేకుండా విశ్వమంతా నిత్యసంచారం చేస్తుంటాడు. కాస్త వెనకా ముందే గానీ, చీకటి ఏ వైపు వెళితే ఆ వైపే తనూ వెళ్లి  దానికి నిద్రలేకుండా చేస్తాడు. , దవళ  వస్త్రాలేసుకుని సూర్యుడు ధరణిపై ఏ మూలన అడుగుపెడితే,అక్కడున్న చీకటంతా పరుగులు తీయాల్సిందే! బాహ్యంగా కనపడే చీకటే అని కాదు మనిషి అంతరంగ చీకటిని కూడా అవలీలగా పారద్రోలగలడు. అందుకే ‘ తమసోమా జ్యోతిర్గమయ ’ అంటూ లోకం అతన్ని అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటుంది. 

పాలవెల్లీ లాంటి మనుషులూ - పండువెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాసి వంటి మమతలు - పల్లెసీమలో కోకొల్లలు
అనురాగం - అభిమానం కవల పిల్లలు - ఆ పిల్లలకు పల్లెటూళ్లు కన్నతల్లులు // తెల్లవారక //

పల్లెవాసులంతా పాలవెల్లిలాంటి వాళ్లనీ, వారందరి మనసులూ పండు వెన్నెల లాంటివేననే మాట. ఈ రోజుల్లో అందరికీ రుచించదు. ఎందుకంటే నగరాల్లోలాగే పల్లె హృదయాలు కూడా ఎంతో కొంత కలుషితమైన మాట వాస్తవం. ప్రపంచీకరణ ప్రభావం పల్లెల మీద కూడా పడిందనేది  వాస్తవం. ఈ నిజాన్ని పల్లెవాసుల్లో కూడా చాలా మందే ఒప్పుకుంటారు.అలాగని, ఆ ప్రభావంలో అంతగా కూరుకుపోకుండా పల్లెల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. మునపటిలా అవి నిలబదేందుకు అవసరమైన గొప్ప ఆసరా ఇచ్చిన వాళ్లు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే పై చదువుల కోసం వెళ్లిపోయిన వాళ్లంతా పట్నాల్లోనే ఉండిపోయారు.ఉద్యోగం అంటూ వెళ్లిపోయిన వాళ్లు ఊరే మరిచిపోయారు. ఏ కారణంగా వెళ్లినా, వాళ్లలో వెనక్కి తిరిగి వచ్చిన వాళ్లు ఒక్కరిద్దరికి మించి లేరు! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు . ప్రతి పల్లెకూ  వెన్నుదన్నుగా పది మంది యువకులు నిలిచినా చాలు . పల్లె ఆత్మలు ప్రాణం పోసుకుంటాయి. ఆ తర్వాత  మునుపటిలా పాలవెల్లి లాంటి మనుషులు దర్శనమిస్తారు. పండువెన్నెల వంటి మనసులు  కళ్ల ముందు కదలాడతాయి. మెల్లమెల్లగా పల్లె  బ్రతుకులు మళ్లీ అన్నివిధాలా సుసంపన్నమవుతాయి. పల్లె జీవితాలు గొప్ప శాంతివనాలవుతాయి. 
                                                                   - బమ్మెర 


2 కామెంట్‌లు: