18, మార్చి 2021, గురువారం

‘ప్రేమనగర్‌’ సినిమా | తేటతేట తెలుగులా పాట | Telugu old songs |

 పాటలో ఏముంది?

తెలుగు తేటతనం గురించి తెలియడానికి , ‘ప్రేమనగర్‌’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ ఒక్క పాట  వింటే చాలు. పాటలోని ప్రతి పదం ఒక పాటంత అపురూపంగా వినిపిస్తుంది. ఈ గీతానికి  స్వరాలు కూర్చడంలో మహదేవన్‌  తన అనుభవమతా పెడితే, ఆ పాటకు ప్రాణం పోయడంలో ఘంటసాల,  మంద్ర-తార స్వర మాధుర్యాల మంత్రమే వేశాడు. విని తరించండి!

తేటతేట తెలుగులా.....తేటతేట తెలుగులా - తెల్లవారి వెలుగులా  
తేరులా ... సెలయేరులా - కలకలా- గలగలా
కదలి వచ్చిందీ కన్నె అప్సరా - 
వచ్చి 
నిలుచిందీ కనుల ముందరా // తేట తేట తెలుగులా //
తన మనసంతా నిండిపోయిన మగువ తనకు ప్రాణప్రదమైన మాతృభాషలా ఎదురుపడటం ఎంత అపురూపం? 

ఆ రావడమైనా అలసీ సొలసీ డస్సిపోయిన వేళ వచ్చే నడిరేయి వెన్నెలలా కాకుండా, మనసంతా క్రాంతులు నింపే  తెల్లవారి వెలుగులా కనిపిస్తె ఎంత గొప్ప ఆహ్లాధం?

హృదయ స్పందనల్ని మోసుకొచ్చే పూల తేరులా.... ఎన్నో జీవన ప్రవాహాల్ని తనలో కలిపేసుకున్న సెలయేరులా నడిచిరావడం ఎంత మనోహరం? 

అలల నాదాలే పదధ్వనులుగా రావడం అంటే అది ఇంకెంతో రసానందం. ఇంతకీ అవన్నీ కలగలిసిన ఆ హృదయేశ్వరి ఎవరు? ఒక కన్నె అప్సర. అంటే .... నవయవ్వని అనేనా ! 

ఇంకా ఎవరికీ మనసివ్వనిది అని కదా! అప్పటికే మనసిచ్చేసిన అప్సరసలు ఎంతో మంది ఉండవచ్చు. అతనికి వాళ్లతో ఏంపని? అందుకే అతడు కోరుకున్నట్లు కన్నె అప్సరే కళ్ల ముందు వచ్చి నిలుచుంది. 

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా - ఎంకి కొప్పులోని ముద్దబంతి పూవులా 
గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినదీ - పలికినదీ - పలికినదీ
చల్లగా - చిరుజల్లుగా - జలజలా - గలగలా  కదలి వ చ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలుచిందీ కనుల ముందద! // తేట తేట తెలుగులా //

ఎంకి, అప్సరలు కొందరు అంటున్నట్లు  కావ్యకన్యలే కావచ్చు. అయితే మాత్రం ఏమిటి? అవి నిజరూపాల కన్నా, వేయి రెట్లు ఉన్నతమైనవి. 

కవి మహర్షుల  కల్పనా ప్రతిమలే అయితే మాత్రమేమిటి? అవి  ఆది సృష్టికి సమాంతరంగానే నిలిచి, భావుకుల హృదయ దారుల్లోంచి సాగిపోతున్న సజీవ రూపాలు. 

అయినా ప్రకృతి చేసిన సృష్టి వద్దే ప్రపంచం ఆగిపోవాలా? పరిణామ క్రమంలో ఇంతింత మేధో శక్తి సాధించిన మనిషి తానుగా  సృజనేదీ చేయకుండా చేతులు ముడుచుని ఎలా కూర్చుంటాడు?

తననుంచి వెల్లువెత్తిన ఆ సృజనకు ప్రతిస్పందనగా, ప్రకంపనగా నదీ కెరటాలు తమవైన గీతాలు ఆలపించకుండా ఎలా ఉంటాయి? 

రెక్కలొచ్చి  ఊహలన్ని ఎగురుతున్నవి.... ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నొ రూపాలు వెలిసినవి వెలిసినవి వెలిసినవి 
వీణలా, నెరజాణలా - కలకలా - గలగలా.....కదలి వచ్చింది కన్నె అప్సరా 
వచ్చి నిలుచిందీ కనుల ముందరా? // తేట తేట తెలుగులా //

ప్రేమలు కట్టుకునే గూళ్లు, పొదరిళ్లు తెలుసు,  ప్రేమసౌధం అనడం కూడా తెలుసు. కానీ ‘ప్రేమ మందిరాలు’  అనే  ఈ మాటకు అర్థమేమిటి? ఈ మాటను  ఇంతకుముందు ఎంతమందైనా అని ఉండవచ్చు. కానీ,  ఎవరెన్ని సార్లు అన్నా  కొందరికి అది ఎప్పటికీ కొత్తగానే వినిపిస్తుంది. అసలా మాట ఎందుకొచ్చింది? అనే మీమాంస ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే, ప్రేమను ఎవరో ఒకరు దైవంగా చూడటమే జరగకపోతే,  ప్రేమ మందిరం అన్న మాటే పుట్టదనేది వాస్తవం. కాకపోతే, దైవం అనేది ఏక రూపాత్మకం కాదనే మాట కూడా ఈ సందర్బంగా చెప్పుకోవాలి. ఎందుకంటే  ముక్కోటి దేవతలు అంటూ మనకో లెక్క ఉంది కదా! ఆ లెక్క ప్రకారం ప్రేమదేవత ఎన్నెన్ని రూపాలుగానో కనిపిస్తుంది . అయినా, అంతిమంగా అన్నీ ఒకటేలే అన్న అద్వైత భావనే నిలుస్తుంది. ఏమైనా ప్రేమను ఒక దైవంగా చూడటం, ఆ దైవం కోసం ఒక మందిరాన్నే  నిర్మించడం నిస్సందేహంగా అదో దివ్య భావనే  కాకపోతే ఆ భావన అలా వచ్చి ఇలా పోయేదిగా కాకుండా అది స్థిరంగా, శాశ్వతంగా నిలిచి వెలిగేదై ఉండాలి !!

                                                                  -  బమ్మెర 

=======================================1 కామెంట్‌: