27, మార్చి 2021, శనివారం

స్వయంవరం సినిమా || గాలివానలో... వాననీటిలో... పాట || శోభన్ బాబు

పాటలో ఏముంది?

గానం అంటే రాగాలు ఆలపించడం మాత్రమే కాదు కదా! ప్రకృతిలోని ప్రతినాదాన్నీ గొంతులో పలికించాలి.  ‘గాలివానలో’ అన్న ఈ పాటను పాడుతున్నప్పుడు ఏసుదాసు గొంతులో  నిజంగా, ఆ వానగాలి హోరు., ఉప్పెన వరదల అలజడీ స్పష్టంగా వినిపిస్తాయి. 1982లో విడుదలైన ‘స్వయంవరం’  సినిమా కోసం దాసరి నారాయణరావు రాయగా, సత్యం  స్వరపరిచిన ఈ పాట మానవజీవితాలకు సమాంతరంగా ఎప్పటికీ అలా సాగిపోతూనే ఉంటుంది.

 గాలివానలో... వాననీటిలో...
గాలి వానలో .... వాన నీటిలో.....
గాలి వానలో ...  వాన నీటిలో ... పడవ ప్రయాణం
తీరమెక్కడో ...  గమ్యమేమిటో ...  తెలియదు పాపం
తెలియదు పాపం... ఓహోహో......

గాలీ ... వానా ఒక్కటైతే, 

సమస్త ప్రాణికోటీ, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎడతెగని వానలతో  వరదలు పోటెత్తిపోతుంటే, గుండెలు ఎగిసిపడినట్లు నదులూ, సముద్రాలూ ఉప్పొంగిపోతాయి మరి! సరిగ్గా అదే సమయంలో ఎవరైనా,  పడవ ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఎంత భీభత్సమది? కాకపోతే, ఈ తరహా ప్రకృతీ వైపరీత్యాల గురించి, దాదాపు అందరికీ ఎంతో కొంత ముందే తెలుసు. అందుకే వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న విషయంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అందువల్ల, ఎవరికి వారుగానో, సామూహికంగానో తీరం చేరే, ప్రయత్నాలూ, తీరం చేర్చే ప్రయత్నాలూ చేస్తూపోతారు. అయితే, నేలకూ, ఆకాశానికీ మధ్యే కాదు, ఒక్కోసారి గుండెల మధ్య కూడా సుడిగాలి వానలూ, ఉప్పెన వరదలూ పోటెత్తిపోతాయి. కాకపోతే ఇవి ప్రకృతీ వైపరీత్యాల్లోలా అందరిలో ఒకేలా ఉండవు. మనిషి మనిషికీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పుట్టుకొచ్చే  ప్రతి సమస్యా, ప్రతీ సంక్షోభం కనీ వినీ ఎరుగని రీతిలోనే ఉంటాయి. జీవితపు ఈ సుడిగాలి వానలో .కొందరి హృదయ సౌధం తునాతునకలైపోతుంది. ఊపిరే కాదు. జీవితమే ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

ఇటు హోరుగాలి అని తెలుసూ..... అటు వరద పొంగు అని తెలుసూ .....
హోరుగాలిలో ... వరద పొంగులో ... సాగలేననీ తెలుసూ
అది జోరువాన అని తెలుసూ.....ఇవి నీటి సుడులనీ తెలుసూ...
జోరువానలో ... నీటి సుడులలో ... మునక తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం.... 
తీరమెక్కడో ... గమ్యమేమిటో తెలియదు పాపం...  తెలియదు పాపం... ఓ... ఓ.....

అన్ని వరదలూ మనిషిని ముంచేయలేనట్లే, అన్ని వరదల్నీ మనిషి అధిగమించలేడు. అయినా, ఆ వచ్చే వరద ఎంతో ఉధృతంగా ఉందని తెలిసి తెలిసే అందులోంచే ప్రయాణించాల్సి రావడం నిజంగా ఎంత నరకం? పైగా ఈ పరిణామాలు చివరికి ఎటు తీసుకుపోతాయో, అంతిమంగా ఏమై మిగులతామో కూడా ఏమీ అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? ఆ నిస్సహాయ స్థితిలో, ఏ కూడలిలోనో, ఏ మలుపు దగ్గరో, వరదలో కొట్టుకు వచ్చే చెక్కనో, చెట్టుకొమ్మనో పట్టుకుని కాసేపు సేద తీరవచ్చేమో కానీ, అదెంత సేపు? దాన్నే తీరం అనుకుని అక్కడే బస చేయలేం కదా! మజిలీలన్నీ తీరాలు కానట్లే, తీరాలన్నీ గమ్యాలు కాలేవు మరి! ఉధృతమైన ప్రవాహంలో ఒకసారి పడిపోయాక, తిరిగి ఒడ్డుకు చేరుకోవడం అంత సులువేమీ కాదు, పైగా, ఎంతో కొంత ఆసరా అనుకున్నది కూడా ఒక్కోసారి హఠాత్తుగా చేజారిపోవచ్చు. అది చాలదన్నట్లు, అదే సమయంలో ఆ ప్రవాహం ఒక మహా సుడిగుండం వైపు తీసుకుపోనూవచ్చు.  సమస్య ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో ఏ రెండు రూపాలూ ఒక్కలా ఉండనట్లు, ఏ రెండు జీవితాలూ ఒక్కలా ఉండవు. అందువల్ల అవతలి వ్యక్తి ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్నవారైనా, వారిచ్చే సలహాలూ, సూచనలు ఇవతలి వ్యక్తికి పెద్దగా ఏమీ ఉపయోగపడవు. అందువల్ల కొట్టుకుపోతున్న ఎవరైనా, నదీ ప్రవాహాన్ని తనకు తానుగా  బేరీజు వేసుకోవలసిందే! తన జీవిత నౌకను తనదైన ఆలోచనలతో ఒడ్డుకు చేర్చే పాట్లు పడాల్సిందే! ఒకవేళ మునక తప్పదని తెలిసినా, దానికి కూడా తనదైన రీతిలో తనను తాను సిద్ధం చేసుకోవలసిందే! 

ఇది ఆశ నిరాశల ఆరాటం..... అది చీకటి వెలుగుల చెలగాటం .....
ఆశ జారినా, వెలుగు తొలగినా ఆగదు జీవన పోరాటం
ఇది మనిషీ మనసుల పోరాటం.....అది ప్రేమా పెళ్లీ చెలగాటం....
ప్రేమ శకలమై ... మనసు వికలమై ... బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం.....
తీరమెక్కడో ... గమ్యమేమిటో ... తెలియదు పాపం....
తెలియదు పాపం ..... ఓ.. ఓ... ఓ

విచిత్రం ఏమిటంటే, ప్రాణాలు నిలుపుకోవడం ఇంక అసంభవమేనని ఒక పక్కన అనిపిస్తున్నా, మనసు మాత్రం పూర్తిగా ఆశ వదులుకోదు. హృదయక్షేత్రంలో ఇక్కడే ఆశానిరాశల మధ్య ఒక అంతర్యుద్ధం మొదలువుతంది. భూమ్యాకాశాల్ని కటిక చీకట్లు కమ్మేసినా,  మొండి మనసు ఒక వెలుతురు కిరణం కోసం ఎదరుచూస్తూనే ఉంటుంది. కాకపోతే,  మధ్య కాసేపు చీకటి, కాసేపు వెలుగు వస్తూ పోతూ ఉండడం, ఒక చెలగాటంలా అనిపిస్తుంది. అయినా జీవితేచ్ఛ శక్తినంతా కూడగట్టుకుని చైతన్య దీపాలు వెలిగించే ప్రయత్నం మానుకోదు. ఈ క్రమంలోనే బ్రతుక్కీ, జీవితానికీ మధ్య , అంతస్తులకీ, అంతరంగానికీ మధ్య, బాహ్య ప్రపంచానికీ, ఆత్మలోకాలకూ మధ్య జీవన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ఇవే కాకుండా, ప్రేమకూ, ఆ ప్రేమను శాశ్వత పరుచుకోవడం కోసం జరిగే పెళ్లి ప్రయత్నాలూ ఇవి కూడా పోరాటాలే అవుతాయి.  ఈ పోరాటం మరీ తీవ్రమైనప్పుడు ఒక్కోసారి శరీరమూ, మనసూ, ఆత్మ తన శక్తియుక్తులన్నీ కోల్పోతాయి. ప్రాణం అలసి, సొలసి, డస్సిపోయి  జీవచ్ఛవమైపోతుంది. నడిచే సమాధిలా మారిపోతుంది.  తన చుట్టూ తాను తిరుగుతూ,  సూర్యుని  చుట్టూ తిరిగే  భూమిలా  తన సమాధి చుట్టూ తాను తిరుగుతూ, తన అంతర్లోకాల చుట్టూ తిరుగుతుంది. దిక్కుతోచక ఒక్కోసారి నభోనిలయాలు పిక్కటిల్లేలా గొంతెత్తి అరుస్తుంది. గోడుగోడుమని ఏడుస్తుంది. నిజమే కానీ , ఇప్పటిదాకా నడిచిన , నడుస్తున్న పరిణామాలే ఎప్పటికీ కొనసాగుతాయనుకోవడంలో ఔచిత్యం  లేదు కదా! ఇప్పుడు కళ్లముందున్నవి సరే! కంటికి కనిపించకుండా , ఊహకైనా అందకుండా , దూరదూరంగా ఏ శుభ పరిణామాలు నీ చెంతకు చేరడానికి సిద్ధమవుతున్నాయో ఎవరికి తెలుసు ? ఇప్పటిదాకా లేనిది ఎప్పటికీ రాదని ఎలా అనుకుంటాం? హృదయ ద్వారాలు సంపూర్ణంగా తెరిచి ఉంచితే , వ్యధలూ , వేదనలు లోనికి ప్రవేశించినట్టే , సంతోషాలు ఆనందాలు ప్రవేశించవచ్చు ! మనలోనైనా ఇప్పటిదాకా లేని శక్తియుక్తులు కొత్తగా ఏం పుట్టుకొస్తాయో ఎవరికి తెలుసు ? ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి . జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే అది హృదయాన్ని విశాలం చేయడమే . జీవితాన్ని ఆకాశం చేయడమే!
                                                                                                                                                          - బమ్మెర 

3 కామెంట్‌లు: