26, అక్టోబర్ 2021, మంగళవారం

ఓ బాటసారీ ..... నను మరువకోయీ పాట | బాటసారిసినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

బంధాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ, ? అన్ని బంధాలూ కడదాకా  కొనసాగుతాయన్న గ్యారెంటీ లేదు కదా! ఒక్కోసారి అవి ఒక అద్భుతమైన మలుపు దగ్గరే ఆగిపోవచ్చు. అలా ఆగిపోయినప్పుడు ఇంకేముంటుంది శూన్యం  తప్ప. అయితే, ఆ శూన్యాన్నీ, ఆ ఒంటరితనాన్నీ భరించడం అందరి వల్లాకాదు. ‘అంతా అయిపోయింది కదా! ఇంకెందుకు?’ అనుకుని, హృదయ ద్వారాలు మూసేసుకోవడం కూడా అందరి వల్లా కాదు. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా మరెవరో తమ హృదయ మందిరంలోకి ప్రవేశించినా, ప్రవేశించవచ్చు. వచ్చిన ఆ వ్యక్తి, గుండె నిండా ఆర్ధ్రతను నింపేయవచ్చు. ప్రాణాల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ఉన్నట్లుండి కొన్ని ఆశల్ని మేల్కొల్పవ చ్చు. అవి ఒక్కొక్క అడుగే వేస్తూ, ముందు స్నేహంగా, ఆ తర్వాత అభిమానంగా, ఆ తర్వాత ప్రేమగానూ మారవచ్చు. అదైనా స్థిరంగా ఉంటుందా? అంటే అదీ చెప్పలేం.! ఒక్కోసారి,  ఆగిపోయిన తొలి బంధంలాగే, ఇది కూడా అర్ధాంతరంగా ఆగిపోవచ్చు. ఈ పరిణామాల వెనుక సమాజం పాత్ర కూడా ఉంటే అదో పెద్ద అలజడే ఇంక!  ఇదంతా ఎందుకులే అనుకుని, సమాజపు కట్టుబాట్లకు లోబడి, గడపలోపలే ఆగిపోతే అదొక తీరు. ఒకవేళ కాదని తెగించి, గడప దాటి వెళ్లిపోతే అదో తీరు. అలా కాకుండా గడప ఇవతల  ఒక కాలు, గడ అవతల ఒక కాలు ఉంచి అక్కడే నిలుచుండిపోతే జీవితమింక  అగ్ని సరస్సే!  1961లో విడుదలైన ‘ బాటసారి’ సినిమా ఇతివృత్తమంతా  ఆ అగ్ని సరస్సుతోనే సాగుతుంది. ఆ సరస్సులో పడి దహించుకుపోతున్న  ఒక  మహిళ అంతర్వేదనను  దృష్టిలో ఉంచుకుని, సముద్రాల రాఘవాచార్య (సీనియర్‌) రాసిన ఈ పాటకు మాస్టర్‌ వేణు భావస్పోరకమైన బాణీ కూర్చారు. ఆ కీలక పాత్రపోషణతో పాటు,  భానుమతి  ఆ పాటను ఎంతో ఆర్ద్రంగా గానం చేసింది. ఇప్పటికి సరిగ్గా 60 ఏళ్ల క్రితం విడుదలైన ఈ పాటను ఇప్పటికీ జనం మరిచిపోలేదంటే ఆ కారణమేమిటో మీకు నేను వేరే చెప్పాలా? 

ఓ బాటసారీ.. ననూ మరువకోయీ ...!

ఓ బాటసారీ ..... నను మరువకోయీ 
మజీలీ ఎటైనా ... మనుమా సుఖానా

మధ్యలో కలసి, మధ్యలోనే విడిపోయే వారిని  బాటసారి అనికాకుండా ఇంకేమంటాం! కాకపోతే, సహభాటసార్లు, కలిసినడుస్తూ , కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణ కష్టాన్ని మరిచిపోవడానికే పరిమితమైతే సరే కానీ, తెలిసో తెలియకో ఒకరి హృదయంలోకి మరొక రు ప్రవేశిస్తేనో! అప్పుడింక దేని కథ దానిదే! కాకపోతే, ముందు  ఇరువురి దారులూ, తీరాలూ వేరు వేరే అయినా, హృదయ బంధం ఏర్పడ్డాక నైనా, ఇద్దరూ ఒకే బాటను ఎంచుకుని, ఇద్దరూ ఒకే తీరాన్ని చేరుకుని, ఇద్దరూ ఒకే జీవితాన్ని పంచుకుంటే అది బాగానే ఉంటుంది. అలా కాకుండా, ఏవేవో కారణాలు చెప్పుకుని,  కొద్ది కాలానికే ఎవ రి దారిన వాళ్లు వెళ్లిపోతే ఏముంటుంది?  ఆ తర్వాత నదికి ఈ దరిన ఒకరు ఆ దరిన ఒకరూ నిలబడి ‘నను మరవకోయీ ... నను మరువకోయి’ అనుకంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? తాము మోయాల్సిన భారాన్ని తాము మోయకుండా, తాము చేయాల్సిన సాహసమేదీ తాము చేయకుండా ‘నువ్వు సుఖంగా ఉంటే చాలు ... నువ్వు సుఖంగా ఉంటే చాలు’ అని ఇరువురూ అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మానవ  జీవితంలో సామాజిక నియమాల్ని తూచా తప్పకుండా పాటించడమో,  లేదా ఉల్లంఘించడ మో,  ఉల్లంఘించడం తప్పనిపిస్తే,  అధిగమించడమో ఇవే ఉంటాయి. వాటిల్లో దేన్ని ఎంచుకుంటావనేది నీ అస్తిత్వానికీ, నీ వ్యక్తిత్వానికీ లేదా సమాజం పట్ల నీకున్న అవగాహనకు సంబంధించిన విషయం. 

సమాజానికీ - దైవానికీ బలియైుతి నేను - వెలియైుతి నేను
వగే గానీ నీపై - పగ లేది దాన
కడ మాటకైనా - నే నోచుకోనా // ఓ బాటసారీ //

ఏ సమాజంలోనైనా, వ్యక్తి వ్యక్తికీ,  వేరువేరుగా అన్వయించే సూత్రీకరణలేవీ ఉండవు. సమష్టిగానే అది కొన్ని ఆలోచనలు చేస్తుంది.. తోచిన రీతిలో  కొన్ని  నీతులూ,  కొన్ని నియమాలూ రచిస్తుంది.  వాటివల్ల ఎక్కువ మందికే మేలు జరిగినా, కొద్ది మందికైనా ఎంతో కొంత నష్టం జరగకుండా ఉండదు. రైతుకు మేలు చేసే వర్షాలు, సాఽధారణ బాటసారికి పెద్ద ఉపద్రవంలా అనిపించడం సహజం. ఏది ఎలా ఉన్నా, అటు సమాజానికీ, ఇటు దైవానికీ అంటే అనంత ప్రకృతికి  బలి అయ్యే వారు ఏదో ఒక నిష్పత్తిలో ఉండనే  ఉంటారు. వారంతా బలిపీఠాలు మోస్తూ అక్కడో ఇక్కడో కనపడుతూనే ఉంటారు. ఈ నిజాల గురించి  ఆసాంతం తెలియకపోవడం వల్ల కొంత మంది ఎదుటివారిపైన నిష్టూరాలు పోతూనే ఉంటారు. ఈ నిష్టూరాల వెనుక చాలా సార్లు, విచారమే ఉంటుంది తప్ప, పగ, ప్రతీకార భావాలు ఉండే అవకాశం చాలా తక్కువ. సామాజిక అంశాలతో,  ప్రపంచ విషయాలతో ముడివడిన ఇలాంటి సంక్లిష్ట విషయాలు చాలా వరకు మనిషి అదుపాజ్ఞలలో ఉండవు. అందువల్ల  సహజంగానే అవి మనిషిని తీరని వ్యధకు గురిచేస్తాయి. హృదయాన్ని కన్నీటి సంద్రం చేస్తాయి. ఆకాశమెత్తు శోకమూర్తిని చేస్తాయి. 

శ్రుతి చేసినావు - ఈ మూగవీణ - సుధా మాదురీ చ విచూపినావు
సదా మాసిపోనీ - స్మృతే నాకు మిగిలే- మనోవీణ నీతో గొనిపోయెదోయి // ఓ బాటసారీ // 

తీగలు తెగిన వీణను సరిచేయడానికి గానీ, తీగలు భిగించి శృతిచేయడానికి గానీ,  అంత గొప్ప కళాకౌశలమేమీ అవసరం లేదు. రాగరంజితమైన కాస్తంత హృదయముంటే చాలు. మనసు పరవశించిపోవడానికి గానీ, మరొకరి వశం కావడానికి గానీ, తీయతేనియల మాటలేమీ అవసరం లేదు. రసోన్మత్తమైన పాటలూ అవసరం లేదు. నిర్మలమైన ఒక నిండు మనసు, మరొకరి మనసు నొప్పించని మంచితనం ఉంటే చాలు! అవి ఎంతటి వారినైనా, పులకింపచేస్తాయి. వారి హృదయాల్ని అమృతమయం చేస్తాయి,. ఎప్పటికీ మరిచిపోని, ఎన్నటికీ మాసిపోని జ్ఞాపకాలను సైతం అవి ఎదలోకి వంచుతాయి.  ఆ తర్వాత జీవితాలు చేరువవుతాయా, వేరువేరుగానే ఉండిపోతాయా అన్నది వే రే విషయం కానీ, ఒకరి హృదయ వీణ మరొకరి చేతుల్లో వాలిపోవడం మాత్రం ఖాయం. చేతుల్లో వాలిన రెండు వీణలూ ఒకే గూటికి చేరతాయా? ఒకరి వీణను  ఇంకొకరు  తీసుకుని చెరోదారిన వెళ్లిపోతారా అనేది కూడా ముందుగా ఎవరూ ఏమీ చెప్పలేరు. అదంతా అప్పటి ఆ హృదయోద్వేగాల పైన, సాహసోపేతమైన వారి అడుగుల పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏ కారణంగానో  ఇద్దరూ నిస్పృహలో - విస్మృతిలో పడి ఉంటే మాత్రం అదను చూసి,  కాలమే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడింక ఇరువురూ శిరసావహించి కాల నిర్ణయానుసారం నడుచుకోవడం తప్ప  ఇద్దరిలో ఎవరికీ మరో దారే  ఉండదు! 

                                                                - బమ్మెర 

1 కామెంట్‌: