18, అక్టోబర్ 2021, సోమవారం

బంగరు నావ.. బ్రతుకు బంగరు నావ పాట | వాగ్దానం సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?


నౌక, దానికది గొప్పదీ కాదు.. తక్కువదీ కాదు,  దాన్ని నడిపే నావికుడి శక్తి సామర్థ్యాలను బట్టే అది తీరానికి చేరుస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. జీవితమూ అంతే..., దానికది గొప్పదీ కాదు, తక్కువదీ కాదు. మనిషి అనుభవమూ, అతని ఆలోచనా స్థాయిని బట్టే అది లక్షాన్ని సాధిస్తుందా లేదా అన్నది రుజువవుతుంది.  సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు ఏ సాదాసీదా నావికుడైనా,  నౌకను అవలీలగా తీరానికి చేర్చగలడు. అలా కాకుండా, సముద్రం అల్లకల్లోలమైనప్పుడు, అడుగడుగునా సుడిగుండాలు ఎదురౌతున్నప్పుడు నావికుడి భుజబలమెంతో, అతని జ్ఞానబలమెంతో బయటపడుతుంది. జీవితమైనా అంతే, అది సాఫీగా సాగుతున్నంత కాలం, సామాన్యుడు కూడా  అన్నీ చక్కబెట్టగలడు. అది అనుకోని రీతిలో ఒడిదుడుకులకు లోనైనప్పుడు, దారిపొడవునా అగ్నిపర్వతాలు పేలుతున్నప్పుడు అతడు ఏపాటి సమర్ధుడో ఎంత యుక్తిపరుడో తేలిపోతుంది. తను బతికి, తన చుట్టూ ఉండే నలుగురికీ ఆసరాగా నిలబడటానికి ఆమాత్రం శక్తియుక్తులు ఎవరికి వారు సమకూర్చుకోవలసిందే! 1961లో విడుదలైన ‘వాగ్దానం’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాట నిండా ఈ తాత్విక ఆంశాలే ఇమిడి ఉన్నాయి. పెండ్యాల స్వరకల్పన చేసిన ఈ రసగుళిక సుశీల గళమాధుర్యాన్ని నింపుకుని, ఆరుదశాబ్దాలుగా తెలుగువారి హృదయాకాశంలో విహరిస్తూనే ఉంది. 

బంగరు నావ.. బ్రతుకు బంగరు నావ...!!


బంగరు నావ - బ్రతుకు బంగరు నావ
దాన్ని నడిపించూ ... నలుగురికీ మేలైన త్రోవ // బంగరు నావ//

నలుగురిలోకి నడవడం అంటే మనిషి ఆకాశమైపోవడమే! తనలో తాను  ఒదిగిపోవడం అంటే,  జైలు గోడల మధ్య బంధీగా పడి ఉండడమే బ్రతుకు నావను నలుగురి కోసం నడపడం అన్నది ఆ నలుగురినేదో ఉద్దరించడానికి అని కూడా కాదు సుమా! నిత్యం నలుగురి మఽధ్య ఉన్నప్పుడే, నలుగురి గురించి ఆలోచిస్తున్నప్పుడే జీవితం చైతన్యం పొందుతుంది. ఆ చైతన్యమే మనిషికి ఒక అందమైన జీవితాన్ని ఇస్తుంది.  అదీ కాక నీకు జన్మనిచ్చిన పంచభూతాల రుణం కూడా తీర్చుకోవాలి కదా! ఆకాశం కోసం నువ్వు ఏమీ చేయలేకపోయినా, నేల, నీరు, గాలి, అగ్ని ఈ నాలుగింటినీ  నిత్యం కబళించి వేస్తున్న కలుషితాలూ, కల్మషాల నుంచి ఎంతో కొంత కాపాడటం కోసమైనా,  కోసమైనా ప్రతి మనిషీ తనవంతుగా ఎంతో కొంత చేయాల్సే ఉంటుంది. ఒకవేళ  ఆ స్థాయిలో కాకపోయినా, తన చుట్టూ ఉండే నలుగురు మనుషుల కోసమైనా, తాను చేయగలంతా చేయాలి!  నిజానికి, ఆ దిశగా నడిచే  బ్రతుకు,  బంగరు నావే కాదు, అంతకన్నా వేయింతల విలువైన వజ్రాల నావ కూడా!

అనుమానం చీకటులు,  ఆవవరించినా - అపనిందల తుఫానులూ  అడ్డగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా - నావ నడిపించూ ... నలుగురికీ  మేలైన త్రోవ // బంగరు నావ //

ఎవరో అనుమానించారనీ, అపనిందలేవో మోపారని  క్షోభించే వారు ఎంతో  మంది! వారిలో కొందరైతే ఎవరో తమ త లనరికేసిట్లే విలవిల్లాడిపోతారు. అందుకు భిన్నంగా కొందరు, మనం సత్యవంతులం, నీతిబద్దులం కాబట్టి,  ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అపనిందలు మోపినా వచ్చే నష్టమేమీ ఉండదులే! అనుకుని, ఎంతో కొంత  నిబ్బరంగానే ఉండిపోతారు. అది వారి విధానమైతే కావచ్చుగానీ, నిరంతరం అపనిందలు దూసుకువచ్చే ఆ  ద్వారాల్ని మూసేయకుండా ఎప్పటికీ అలా ఉపేక్షిస్తూ ఉండిపోవడం  క్షేమదాయకమేమీ కాదు. అందువల్ల వీలైనంత త్వరగా ఆ నోళ్లను మూయించే ప్రయత్నాలు చేయాల్సే ఉంటుంది. కాకపోతే, ఆ ప్రయత్నాలన్నీ, లాంచనంగా జరిగిపోవాలే గానీ, వాటి కోసం సర్వశక్తులూ వె చ్చిస్తూ ఉండిపోకూడదు. జీవనయానమే స్థంభించిపోయే స్థితి తెచ్చుకోకూడదు. అయినా, కాలానికి తెలియని ఘటనాఘటనలంటూ లోకంలో ఏవీ ఉండవు కదా! ఆ క్రమంలో  అవసరమైన చేపట్టే చర్యల విషయంలో అది మరీ అంత నిర్లిప్తంగా ఏమీ ఉండదు కష్టాలకు కుంగక, సుఖాలకు పొంగక, అన్ని రకాల భావోద్వేగాలకూ అతీతంగా, కాలచక్రం ఎప్పుడూ మనుముందుకే సాగిపోతూ ఉంటుంది. అందుకే కాలచక్రాన్ని జీవితానికి ఒక ఆదర్శంగా తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు.  

అనురాగం వెన్నెలలు అంతరించినా - ఆశలన్నీ త్రాచులై కాటువే సినా 
జీవితమూ జీవించి ప్రేమించుటకే - నావ నడిపించూ ... నలగురికీ మేలైన త్రోవ // బంగరు నావ //

నిజమే! లోకంలో, అంతస్తులూ, ఐశ్వర్యాలే ముఖ్యమనుకునే వారి సంఖ్యే ఎక్కువ కావచ్చు కానీ, మమతలూ, అనురాగాలే సమస్తమనుకునే వారు కూడా లోకంలో తక్కువేమీ కాదు. ఇలాంటి వీరు, అంతకు ముందు ఎంతో గొప్ప అంతస్తులో,  మరెంతో పెద్ద ఐశ్వర్యంలో తులతూగినా మనసులో ఆ మమతల స్థానం ఎప్పటికీ తగ్గనీయరు. ఒకవేళ ఏ అనివార్య కారణం వల్లో  తాము కోరుకున్న మమకారాలు,  అనురాగాలే మసైపోయిన్నాడు, వారు నిలువెల్లా కుంగిపోతారు. మమతలు పొంగే స్థానంలో విషనాగులేవో చొర బడి, ప్రాణప్రదమైన వారిని కాటువేసినప్పుడు మాత్రం, విలవిల్లాడిపోతారు. కన్నీటిపర్యంతం అవుతారు. ఒకటి మాత్రం నిజం! ఎంత పెద్ద పాము విషమైనా, దానికీ ఒక విరుగుడు ఉంటుంది. కాకపోతే అదేమిటో మనకు తెలియకపోవచ్చు. అదేదో కనిపెట్టి,  ఆ విషనాగుల కోరలు పెరికేియవలసిందే! నిజానికి,  ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, జీవితం చాలా గొప్పది!  ఆ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాల్సిందే! ఆ జీవితంలోంచి జాలువారే ఆ ప్రేమ రస ఝరుల్లో పునీతం కావల్సిందే! కేవలం మనుగడ నైపుణ్యాలతోనే సంతుష్టిని పొందకుండా, ఉన్నతోన్నతమైన  తాత్విక దారుల్లో  అడుగులు  వేయగలిగితే, జీవితం సాఫల్యమవుతుంది.  ఆ జ్ఞానం, తననే కాదు,  తన చుట్టూ ఉండే మరో నలుగురిని కూడా కచ్ఛితంగా,  కాంతి తీరాలకు చేరుస్తుంది. 

కనులున్నది కన్నీటికి కొలను లౌటకా - వలపన్నది విఫలమై విలపించుటకా? 
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా? నావ నడిపించూ... నలుగురికీ మేలైన త్రోవ // బంగరు నావ //

ప్రకృతి ఎందుకంత అంత కష్టపడి మనిషిని అంత అపురూపంగా తయారుచేసింది?  ఆ సిద్ధం చేసుకున్న ఆ వినూత్న రూపాన్ని తన వద్దే ఉంచుకోకుండా భూమ్మీదికి ఎందుకు పంపించింది.  ఈ మనిషి, తన సృష్టిలోని కోటానుకోట్ల సౌందర్యాల్నీ, దాని మాధుర్యాల్నీ, ఆమూలాగ్రం ఆస్వాదించాలని కదా!, ఆ కారణంగానే కదా మనిషికి ఇంతటి శక్తివంతమైన నేత్రాలనూ, మహాశక్తివంతమైన జ్ఞాననేత్రాలనూ ప్రసాదించింది! ఇంతా చేస్తే మనుషులు ఏంచేస్తున్నారు? వారిలో అత్యధిక సంఖ్యాకులు, ఏవేవో కారణాలు చెప్పుకుంటూ జీవితమంతా ఏడుస్తూనే గడిపేస్తున్నారు.  సంపదంతా ఽ అడుగంటిపోయిందనో, ప్రేమ విఫలమైనదనో,  ఏ అపురూప వరమో, చేజారిపోయిందనో వగచి వగచి కొడిగట్టిన దీపమవుతున్నారు. అదేమిటో గానీ, మనిషి, ప్రేమలన్నీ కడకు దుంఖాల్ని మూటగట్టుకోవడానికే నన్నట్లు, అసలు కళ్లున్నది కన్నీటి సాగరాలు కావడానికే నన్నట్లు కనలిపోతున్నాడు.  అహోరాత్రులూ ఏడుస్తూ, తన చుట్టూ ఉండేవారిని కూడా ఏడిపిస్తూ, కాలం వెలిబుచ్చుతున్నాడు. జరగాల్సింది ... ఇది కాదు కదా! తన జీవితాన్ని అందంగా మలుచుకుంటూనే, . తన తోటి నలుగురి జీవితాల్నీ అందంగా మలచగలగాలి. నిజానికి ఏ జీవితమైతే ఏమిటి... దేనికది అదో లోకమే కదా!  నువ్వు చేయూతనిచ్చి నిలబెట్టిన ఆ నాలుగు లోకాల మధ్య నువ్వు నిలబడి, ఆ గొప్ప ఆహ్లాదాన్ని పొందగలిగితే,  అంతకు మించిన ఆనందకరమైన స్థితి ఏ మనిషి జీవితంలోనైనా ఇంకేముంటుంది? 

                                                                - బమ్మెర 

3 కామెంట్‌లు: