21, ఫిబ్రవరి 2022, సోమవారం

నిదురపోరా తమ్ముడా పాట | సంతానం (1955) సినిమా | తెలుగు పాత పాటలు |

పాటలో ఏముంది?

చిత్రం: సంతానం (1955) గీతం: అనిసెట్టి, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, గానం: లతా మంగేష్కర్‌.

కళ్లు మూసుకుంటేనే అని కాదు. కళ్లు తెరిచే ఉన్నా తన్మయత్వంతో నిదుర కాని నిదురలోకి జారిపోయే వరాన్ని కళలు అందిస్తాయి. కాకపోతే, కళల శిఖరాగ్రాన్ని చేరుకున్న కళా కంఠీరవుల వల్ల మాత్రమే ఆ బాగ్యం కలుగుతుంది.  అయితే, ఆ శిఖరాగ్రాన్ని చే రుకోవడమే కాదు, దాని పైనున్న ఆకాశాన్నే అందుకున్న మహా కళాకారిణి గాన విధుషీమణి లతామంగేష్కర్‌. ఎప్పుడో  6 దశాబ్దాల క్రితం ’సంతానం’ సినిమా కోసం ఆమె పాడిన  పాట తెలుగు హృదయాలను గగన వీధుల్లో  విహరింపచేసింది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ పాట సంగీత లోకంలో ఇప్పటికీ ఒక వజ్రంలా నిలిచే ఉంది.  అనిసెట్టి రాసిన ఈ గీతానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందిస్తే, లతామంగేష్కర్‌ అనితర సాధ్యంగా పాడారు.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత రస హృదయాల్ని ఉర్రూతలూగించిన గాన సామాజ్ఞిని ఇటీవలే గందర్వలోకానికి వెళ్లిపోయింది. ఆ కళా తపస్వికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలం? అమ్మా! జన్మజన్మలకూ మీకు రుణపడే ఉంటామని అశ్రునయనాలతో అంజలి ఘటించడం తప్ప!!

నిదురపోరా తమ్ముడా !!


నిదురపో .... నిదురపో .... నిదురపో ....
నిదురపో ... నిదురపో ... నిదురపో ...
నిద్దురపోరా తమ్ముడా...  నిదురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముసమైనా మరచిపోరా // నిదురలోన //
కరుణ లేని ఈ జగానా - కలత నిదురే మేలురా // నిదుర //

దేవుడే అని కూడా కాదు. మౌలికంగా మనిషి కూడా కరుణా మూర్తే. కారణం ఏమైనా రావచ్చు గానీ, కాలగతిలో ఆ కారుణ్యం చాలా మందిలో కనుమరుగైపోతుంది . కరుణ తత్వం సన్నగిల్లిపోవడమే కాదు ... కొందరిలో పాషాణం లాంటి  ఒక కసాయితనం కూడా పేరుకుపోతుంది. వాటివల్ల అవతలి వారి మనసు అనేకానేక గాయాలపాలవుతుంది.  ఇలాంటి స్థితిగతుల్లో ఏ మనిషికైనా కమ్మకమ్మని నిదుర ఎలా సాధ్యం? కాస్తో కూస్తో పట్టినా అది కలత నిదురే! అదే నిజమైతే ఏంచేస్తాం మరి? ఆ కలత నిదురే ప్రాణానికి మోక్షదామమనుకుని నిద్రకు ఉపక్రమించాల్సిందే! పరిపూర్ణ ఆనందాన్నీ, పరిపూర్ణ ప్రశాంతతనూ కోరుకునే వారెవరూ లోకంలో నిండైన నిదురకు నోచుకోలేరు. ఎందుకంటే,  గుండెను సలిపే గాయాల నెలవైన గతాన్ని ఎవరూ, ఎప్పటికీ సంపూర్ణంగా మరిచిపోలేరు. గతం తాలూకు అనేకానేక  ఘటనలు అను నిత్యం గుండెల్ని పిండేస్తూనే ఉంటాయి. వాస్తవం ఏమిటంటే,  లోకంలో ఏదైనా సగం - సగమే లభిస్తుంది... ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు.  నచ్చిన సగం, నచ్చని సగంతో సమ్మిళితమయ్యే ఉంటుంది. ఎవరైనా దాన్ని  జీర్ణించుకోలేకపోతే,  గతం  ఏనాడూ వారిని,  గాఢనిద్రలోకి జారనివ్వదు. నిజానికి,  గతం తాలూకు ఆ జాడలే లేని జగత్తు ఎంతటి వారికైనా లభించదు. సగం తెరిచి, సగం మూసి ఉంచే రుషుల అర్ద నిమీలిత నేత్రాలు బహుషా అందుకు సంకేతమేమో మరి!. ఏది ఏమైనా, లోకంలో అన్నీ సగం సగమే లభిస్తాయన్న పరమ సత్యాన్ని ఎవరికి వారు అర్థం చేసుకోవలసిందే!. లేదంటే లోకంలో ఎవరికీ కంటిమీద కునుకు పట్టదు కంటి నిండా నిదుర మాట ఎలా ఉన్నా .. కనీసం కునుకైనా పట్టదు. !


కలలు పండే కాలమంతా - కనుల ముందే కదలిపోయే ఆ .....
లేత మనసున చిగురుటాశ - పూతలోనే రాలిపోయే // నిదుర //

అప్పుడెప్పుడో నిర్మించిన జీవన సౌధాలు, ఆ తర్వాతెప్పుడో కూలిపోవడం మనం చూస్తూ వస్తున్నదే! అయితే,  ఎప్పుడో జీవితారంభంలో కన్న కలలు ఇంకెప్పటికీ నెరవేరవని, ఏ జీవన మధ్యమంలోనో, లేదా చరమాంకంలోనో తేలిపోవడం ఎంతో మందికి అనుభవమే! అయితే,  అలా దీర్ఘకాలిక వ్యవధానంలో విషయాలు విషాదకరంగా మారడాన్ని ఎవరైనా తట్టుకోగలరు గానీ, కలలు పండే నిండు యవ్వనంలోనే అంతా చెల్లాచెదురైపోతే ఎలా ఉంటుంది? ఏమీ చేయకుండానే , ఏదీ చేతికి రాకుండానే కాలమంతా నిష్పలంగా, నిరర్ధకంగా కరిగిపోతే ఆ  హృదయం ఏమైపోవాలి? జీవితంలో ఎంతో చేయాలనీ , ఏవేవో చేయాలని ఉవ్విళ్లూరుతున్న లేలేత మనసు కదా! చిగురులాంటి ఆశ ఆదిలోనే నానా అగ్ని పరీక్షలకు ఆలవాలమైపోతుంటే ఏమిటా పరిస్థితి? పూవై పరిమళాల్ని వెదజల్లాల్సిన తరుణంలో, పండై ప్రపంచాన్ని మాధురీమయం చేయాల్సిన కాలంలో కారుమబ్బుల్లో కాటగలిగిన పక్షిలా జీవితం నిరాశా నిస్పృహల పాలై  ఊపిరాడని స్థితిలో పడిపోతే ఏమైపోవాలి? 

జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితి ఆయే 
నీడ చూపే నెలవు  మనకూ - నిదురయేరా తమ్ముడా // నిదుర //

ఎన్నో తెలిసిన మానవ సమాజంలోకి ఏమీ తెలియని శిశువు వచ్చినప్పుడు సాటి మనుషులకు కాస్తంత సానుభూతి, జాలీ ఉండాలి కదా! ఊహ తెలిసీ తెలియని వయసులోనే, నానా అగచాట్లూ పడుతుంటే, పెద్దవారు ఆ పసిప్రాణానికి ఆలంబనగా నిలబడాలి కదా! అదేమీ లేకుండా,  నిప్పుల్లోకి తోసేయాలని చూస్తే ఎలా? నిలువెల్లా చితికిపోయిన జీవితం జీవితంంలా ఉండదు కదా! ఆ జీవితం నిజంగా చితిపై చేర్చిన శవంలా ఉంటుంది.  ఈ స్థితిలో జీవన దుర్భరత్వాన్ని కాసేపైనా మరిపింపచేసే ఒక ప్రాణాధారం  కావాలి కదా! ఆ ఆధారం నిదురేమరి! అయితే ఆ నిదురే లోకంలో చాలా మందికి కరువైపోతోంది. పరిశీలిస్తే, ఈ నిదుర పట్టని పరిస్థితి వెనుక అసంతృప్తి, అసంతోషాలే ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఎన్ని అసంతృప్తులున్నా, ఎన్ని అసంతోషాలున్నా, ఒక బలమైన జీవిత లక్ష్యం ఉన్నవారిలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే, వర్తమానంలో తన ఎదురుగా ఏమున్నా, లేకపోయినా, లక్ష్య సాధుకుడైన మనిషి చేతిలో అద్భుతమైన  భవిష్యత్తు ఉంటుంది కదా ! ఆ భవిష్యత్తు గురించిన అందమైన ఊహలు, అందుకు ఎప్పటికప్పుడు వేసుకున్న కట్టుదిట్టమైన ప్రణాళికలూ ఉంటాయి. అవి కష్టాలకూ, కన్నీళ్లకూ అతీతంగా మనిషికి నిదురపట్టేలా చేస్తాయి.పెద్దవాళ్ళ విషయంలో అది సరేగాని, పసివాళ్ల మాటేమిటి? ఈ మాట పసివాళ్లకు చెప్పగలమ! అసలు అది జీవిత లక్ష్యాల గురించి ఆలోచించే వయసేనా? కాదనే అనిపిస్తుంది ఎవరికైనా! కానీ, ఒకటి మాత్రం నిజం! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు, ఆ వయసుకు తగ్గ లక్ష్యాలు ఆ వయసులో ఏర్పడితేనే మంచిది. కాకపోతే,  వాటిని తమకు తామే నిర్ణయించుకునే వయుసు కాదది . అయిన వాళ్లూ, ఆత్మీయులూ, కన్నవాళ్లూ, పెద్దవాళ్లూ,  వాళ్ల స్థాయి లక్ష్యాల బీజాలను వారి గుండెల్లో సున్నితంగా నాటాలి. అవి వారిలో గొప్ప గుండె నిబ్బరాన్ని నింపుతాయి. కలత నిదురతోనే సంతృప్తి పడేలా చేస్తాయి. కునుకుపాటు నిదురతో కూడా అవసరమైన శక్తినంతా పుంజుకునేలా చేస్తాయి!!

                                                                    - బమ్మెర 3 కామెంట్‌లు: