9, ఫిబ్రవరి 2022, బుధవారం

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ పాట | రాజా సినిమా | తెలుగు పాత పాటలు | సౌందర్య పాటలు

పాటలో ఏముంది?


చిత్రం: రాజా, గీతం: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ , సంగీతం: ఎస్‌. ఏ రాజ్‌కుమార్‌, గానం: చిత్ర

గతం, వర్తమానం, భవిష్యత్తు ... వీటిల్లో రాగాలు ఆలపించని కాలమేముంది? కాకపోతే, రేపన్నది మన చేతుల్లో లేదు. మనదాకా అది రానేలేదు. వర్తమానమేమో సగం మన చేతుల్లో ఉన్నా, మిగతా సగం మన చేతుల్లో ఉండదు.  ఒక్క గతమే నిశ్చలంగా, నిర్దిష్టంగా ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉండిపోతుంది. అందుకే, అత్యధిక భావాలు, రాగాలు,  గతం మీదే ఎక్కువగా తారట్లాడుతుంటాయి. ఒక వేళ గతం వేదనాపూర్వకమే అయినా అదిప్పుడు మనల్ని వేధించదు. ఎందుకంటే దాన్నించి మనం చాలా దూరం వచ్చేశాం! అందుకే తీయని సంఘటనలే కాదు, హృదయం,  చేదు సంఘటనల్ని కూడా ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటుంది.  ఆనందంగా  పాడుకుంటుంది..  అన్ని దశల్లోనూ ఆనందంగా ఉండడమే కదా మానవ జీవితంలోని అత్యున్నత స్థితి. దాన్నే మనం అతీత స్థితి అంటాం. కారణం ఏదైనా,  కళలన్నింటికీ మనిషిని ఆ అతీత స్థితికి చేర్చడమే అంతిమ లక్ష్యమైపోయింది. 

1999 లో విడుదలైన ’ రాజా’ సినిమా కోసం ఎస్‌. ఏ. రాజ్‌కుమార్‌ సంగీత సారధ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి  రాసిన  ఈ పాటను గాయనీమణి చిత్ర ఎంత మధురంగా పాడిందీ అంటే అది ఎవరైనా విని తీరాల్సిందే!


ఏదో ఒక రాగం పిలిచిందీవేళ..!!



ఏదో ఒక రాగం పిలిచిందీ ఈవేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా 
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా 
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా 
జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు // ఏదో ఒక రాగం//

మాట ... మాటగా ఉన్నంత కాలం .... అది మిగతా అన్ని శబ్దాల్లో ఒక శబ్దమే అనిపిస్తుంది.  ఒకసారి ఆ మాట పాటగా మారిన తర్వాత, దాని లోకమే మారిపోతుంది! పాటగా మారినంత మాత్రాన అప్పటిదాకా ఉన్న భావోద్వేగాలేవీ తారుమారైపోవు. అదృశ్యమైపోవు. కానీ, అవి రూపాంతరం చెందుతాయి. ఎంతో అందంగా, మరెంతో అపురూపంగా మారిపోతాయి. ఒక్కోసారి,  అంతకు ముందున్న భావోద్వేగాలూ... ఇవీ పూర్తిగా వేరువేరేమో అన్నంతగా మారిపోతాయి. ఎలా అంటే, ఎంత చేదు కాకర అయినా, కాస్తంత బెల్లం కలపగానే కమ్మని పాకంగా మారినట్లు, ఎన్ని గాయాలున్నా, సంక్షోభాలున్నా, గతం ఒకసారి రాగబద్దమైన తర్వాత అదెంతో శ్రావ్యంగా, మధురమైన కావ్యంగా మారిపోతుంది. ఆ కావ్యగానం,  గతం.., పరిమళాల్ని వెదజల్లే కుసుమాలుగా  కావచ్చు. దీపాలు వెలిగించే తైలంగానే కావచ్చు. పెదవుల పైన చిరునవ్వుల పేరంటంగా  కావచ్చు. రాగం ఒకసారి రసాత్మకం అయిన తర్వాత, అది అమృతాత్మకం అవుతుంది.  నిట్టూర్పులు, ఓదార్పుల ఎల్లలు దాటి, భావాతీతమైన భాస్కర దీప్తిగా మారిపోతుంది. అందుకే జీవితంలో ఎన్ని ఉన్నా, ఏమైపోయినా లోకం రాగమయ ప్రపంచం నుంచి వేరైపోదు. విశ్వవీణపై నాట్యమాడే దివ్యజీవనాన్ని వదులుకోదు. 

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే 
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే 
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం // ఏదో ఒక రాగం //

మనిషికి లోకం తాలూకు జ్ఞాపకాలు వేలు, లక్షలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ, వాటన్నిటిలోకెల్లా అద్భుతమైనవి, ప్రాణాత్మకమైనవి అమ్మ జ్ఞాపకాలే .  ఎందుకంటే, మిగతా జ్ఞాపకాలన్నీ  మధ్యలో ఎప్పుడో మొదలై, మధ్యలోనే పోవచ్చు కూడా! అమ్మ జ్ఞాపకాలు మాత్రం పుట్టుకతోనే మొదలవుతాయి. ఇంకో నిజం ఏమిటంటే, పుట్టడానికన్నా ముందు అంటే, అమ్మ గర్భంలో ఉన్నప్పుటి నుంచే జ్ఞాపకాల పందిరి అల్లుకుంటుంది. మిగతా అందరి జ్ఞాపకాలు జీవితపు ఏదో ఒక సందర్భానికి సంబంధించి,లేదా ఏదో వ్యవహారానికే పరిమితమై ఉండవచ్చు. కానీ, అమ్మ జ్ఞాపకాలు మాత్రం,  మొత్తం జీవితంతో ముడివడి ఉంటాయి. జీవితమంతా వెంటాడుతూనే ఉంటాయి. ఆమె బతికున్నంత కాలమే కాదు, ఆమె గతించిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలుగా కొనసాగుతాయి.  కాకపోతే, పుట్టీపెరిగిన దేశం వదిలి ఏ విదేశాల్లోనే స్థిరపడిపోయిన కొందరి విషయంలో ఆమె తదనంతరం కాదు, ఆమె బతికుండగానే జ్ఞాపకాల్లో  చూసుకోవాల్సి రావచ్చు. ఏది ఏమైనా,  ఎంతటి మహా సౌధమైనా, సింహద్వారాల  వెనుక బంధీ అయిపోయేట్లు,  ఎంత గొప్ప గతమైనా,  అంతిమంగా అది జ్ఞాపకాల్లో బందీ కావలసిందే! 

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే 
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే 
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే 
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం  // ఏదో ఒక రాగం //
 

జీవితమంతా విస్తరించిన జ్ఞాపకాలన్నీ  ఒక ఎత్తయితే, బాల్య కౌమారాలకే పరిమితమైన జ్ఞాపకాలు మరో ఎత్తు. ఎందుకంటే, పలుమార్లు రాసి పదే పదే కొట్టేసిన కాగితం మీద మళ్లీ ఏదో రాస్తే ఎలా ఉంటుంది?  ఆ అక్షరాలు అక్కడ ఉన్నా  లేనట్లే ఉంటాయి. ఒక్కోసారి మరీ మరీ  చిట్లించి చూస్తే తప్ప ఏ వాక్యమూ స్పష్టంగా కనిపించదు. అదే తెల్ల కాగితం పైన అయితే, ఏ అక్షరానికి ఆ అక్షరం ఆణిముత్యంతా కనిపిస్తుంది. బాల్య  హృదయం తెల్లకాగితమే కదా మరి! ఆ మనోఫలకం పై పడిన ప్రతి జ్ఞాపకం అంత విస్పష్టంగా, అంత మనోహరంగా ఉంటుంది. బాల్య కౌమారాలు దాటాక పరిస్థితి వేరు.  ఒక సంఘటన జరిగిన వెనువెంటనే ఇంకెన్నో సంఘటనలు చోటుచేసుకోవచ్చు. అందుకే అవన్నీ కలగాపులగంగా ఉండిపోతాయి.బాల్యంలో అయితే  దేనికది విడిగానే ఉంటాయి. అందుకే, యవ్వనంలోనే అని కాదు, మధ్య వయసు, చివరికి వృద్ధాప్యంలో కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితం నాటి ఆ బాల్య లేదా కౌమార  సంఘటనలే తాజాగా కదలాడుతుంటాయి. కాకపోతే,  హాయిగా గాల్లో తేలుతున్నట్లుండే ఆ బాల్యంలో మనసును బరువె క్కించే ఏ హరికథలో  వినాలంటే కష్టమనిపిస్తుంది. అందుకే ఎంత వద్దనుకున్నా, కధాగానం   మధ్యలోకి కళ్లు వాలి పోతాయి. పుస్తకాలు గొప్ప భవిష్యత్తునిస్తాయని ఎవరెంత చెబుతున్నా, కొంత మంది పిల్లలకు పుస్తకాల్ని చూస్తేనే భయమేస్తుంది. చదువంటే పారిపోవాలనే అనిపిస్తుంది. ఆ వయసులో బ్రతుకు భద్రత, , జీవనాధారాల సోది లేని ఆటపాటలే అమితంగా పరవశింపచేస్తాయి. వాగూ వంపు ఒడ్డుల్లోనో, కాలువ అంచుల్లోనో దొరికే గవ్వలన్నీ ఏరుకోవడం అన్నది ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్నిస్తుంది. వాటన్నింటి తాలూకు జ్ఞాపకాలు ఒక మహా చిత్రకారుడు గీసిన కళాకండా లకు సరిసమానం . ఆ అపురూపాల్ని  అందమైన ఫ్రేముల్లో బిగించుకుని, మన హృదయ సౌధంలో ఘనంగా అలంకరించుకోవచ్చు. పగలూ రేయీ వాటిని చూస్తూ జీవితమంతా పండగ చేసుకోవచ్చు !!

                                                                   - బమ్మెర 

1 కామెంట్‌: