20, ఏప్రిల్ 2022, బుధవారం

ఈ జీవన తరంగాలలో పాట | జీవన తరంగాలు సినిమా | తెలుగు పాత పాటలు విశ్లేషణ |

పాటలో ఏముంది? 

చిత్రం: జీవన తరంగాలు (1973), గీతం: ఆత్రేయ, సంగీతం: జె.వి. రాఘవులు, గానం: ఘంటసాల 

లోకంలో ఏదీ ఎవరికీ సొంతం కాదు. ఏదీ ఎవరితోనూ శాశ్వతంగా ఉండిపోదు. ఇది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఎవరైనా వేటితోనో మరీ గాఢంగా పెనవేసుకుపోతుంటే, అంత మమకారం సరికాదని లోకం అప్పుడో ఇప్పుడో  చెబుతూనే ఉంటుంది. ఆ మాటలు సరిగా మనసుకు పట్టాలే గానీ, అప్పటిదాకా బిగదీసుకుపోయిన జీవన బంధాలు కచ్ఛితంగా ఎంతో కొంత సడలిపోతాయి. కాకపోతే, బంధాలన్నీ అలా  సడలిపోయాక జీవితం పట్ల ఆసక్తిగానీ, ఆరాటం గానీ ఏముంటాయి? అనిపించవచ్చు. నిలువెల్లా నైరాశ్యం కమ్ముకుంటుందేమోనన్న బెంగ కూడా పట్టుకోవచ్చు. అలా అని జీవితం నుంచి ఎవరూ పారిపోలేరు. పారిపోకూడదు కూడా. అలాంటప్పుడు ఇదంతా ఒక ఆట, ఇదో చదరంగం అనుకుంటే అప్పుడు సరదాగానే అడేయవచ్చు. ఆటలో ఎవరు ఓడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరి జీవితం ఆనందమయం అవుతుందో, ఎవరి జీవితం  విషాదకరం అవుతుందో ఏదీ ఊహించలేం! కాకపోతే ఇదో ఆట అని ముందే అనుకుంటే, ఓటమి కూడా కుంగదీయదు. విషాదం కూడా బాధించదు. ఏది ఏమైనా,  ఓటమి గెలుపులతో గానీ, సుఖ దుఃఖాలతో గానీ,  సంభందం  లేకుండా ఎవరికి వారు ఎంతో బాధ్యతగా  జీవన చదరంగాన్ని ఆడాల్సిందే! ఫలితాలు ఎలా ఉన్నా,  అన్నింటికీ  సిద్దం కావలసిందే!
                       1973 లో విడుదలైన ’ జీవన తరంగాలు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాటను జె. వి. రాఘవులు స్వరపరిస్తే, స్వరధుని ఘంటసాల జీవన గాంభీర్యాన్నంతా పొదిగి ఈ పాటను గానం చేశారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ఈ పాటను ఈ పూట మరోసారి వినేద్దాం మరి!!

ఈ జీవన తరంగాలలో...

ఈ జీవన తరంగాలలో.... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము - ఎంతవరకీ బంధ ము // ఈ జీవన తరంగాలలో //

ఎగిసి ఎగిసి పడుతూ సాగే తరంగాలు, పైపైన చూస్తే,  దేనికది వేరేవేరేమో అనిపిస్తాయి. కానీ, అవన్నీ ఆ నదిలో లేదా సముద్రంలో అంతర్భాగమే కదా! నిజానికి ఆ ఎగిసి పడే తరంగాల్లో  అహం ఏమీ ఉండదు. సముద్రమే లేకపోతే, తమకు ఈ అస్తిత్వమే లేదనే మూలసత్యాన్ని ఎగిసి ఎగిసినట్లే ఎగిసి మళ్లీ పడిపోయిన ప్రతిసారీ గుర్తు చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే, ఉన్నట్లుండి ఒక్కోసారి నది నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా పలు  రకాల విన్యాసాలు చేసిన అలలన్నీ కనిపించకుండా పోతాయి. ఉన్నట్లుండి అవి హఠాత్తుగా అదృశ్యమైపోవడం చూసిన వాటి మనసు ఎంతో కొంత అలజడికి గురికావచ్చు. అయితే,   నీటి ప్రవాహంలోకి గాలి చొరబడినప్పుడే ఈ అలలు అవతరిస్తాయనే అసలు నిజం కాస్త ఆలస్యంగానైనా  స్పురించకపోదు. చొరబడిన గాలి వెనుదిరిగిన ఫలితమే ఈ నిశ్చలత్వానికి కి కారణమని బోధపడకుండా ఉండదు. మనిషి ప్రాణమైనా అంతే కదా! ఊపిరి ఉన్నంత సేపే మానవాళిలో ఉరుకూ పరుగులు ఉంటాయి. ఊపిరి ఒక్కసారి ఆగిపోగానే అంతా నిశ్చలమైపోతుంది. అప్పటిదాకా మహోత్తుంగ తరంగంగా సాగిన జీవనది  మైదాన భూమిలా మారిపోతుంది. ఎడారిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత క్రమం ఉండనే ఉంటుంది.  జీవమే ఆగిపోయాక జీవన బంధాలన్నీ సమసిపోతాయి. అయినా,  ఎవరెంత ఆశపడితే మాత్రం ఏముంది?  భూమ్మీద మొదలైన బంధాలు మనిషి భూమ్మీద సచైతన్యంగా ఉన్నంత కాలమే ఉంటాయి. ఆ ఉపరితలం వదిలేసి, పాతాళంలోకో, ఆకాశంలోకో వెళ్లిపోయాక అన్ని బంధాలూ ఒక్క ఉదుటున తెగిపోతాయి. ఇవి ఎంత చేదునిజాలైతే మాత్రం ఏముంది? అందరూ ఈ పరిణామాలను స్వీకరించాల్సిందే. మనసును నిబ్బర పరుచుకోవలిసిందే!

కడపు చించుకు పుట్టిందొకరు - కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు - ఆ పై నీతో వచ్చేదెవరు
ఆపై నీతో వచ్చేదెవరు //ఈ జీవన తరంగాలలో // 

బిడ్డలు చెట్టంత అయ్యేదాకా కన్నవాళ్లు కళ్లల్లో పెట్టుకుని పెంచుతారు. కానీ, ఉన్న్డట్లుండి వారు హఠాత్తుగా కనిపించకుండా పోతే వాళ్లకెలా ఉంటుంది? కడుపున పుట్టిన వాడు తాము కడతేరే దాకా  తమ పంచనే ఉండాలని ఏ కన్నవాళ్లయినా కోరుకుంటారు. అది  అత్యంత సహజం!  కానీ, అందుకు భిన్నంగా తమ కళ్లముందే వాళ్లు జీవచ్ఛవాలైపోతుంటే ఎలా జీర్ణించుకోగలరు? మనసు మండినప్పుడు మనిషి చిత్రమైన వాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాం కానీ,  నిజానికి, ఆ చిత్రమైన స్థితి ఆ మనిషిది కాదు, అతని చుట్టూ ఆవరించి ఉన్న అతని జీవితానిది! అది బాహ్య ప్రపంచానికీ, అంతర ప్రపంచానికీ మధ్య నిరంతరం ఒరుసుకుపోతూ  సాగే  బండిచక్రపు ఇరుసు కదా! ఆ ఒరుసులాటలో జీవితం  ఎప్పుడు ఏ వైపు ఒరిగిపోతుందో తెలియదు.  చివరికి ఆ ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఆకులు దేనికది ఊడిపోయి ఎక్కడ  పడిపోతాయో కూడా  ఎవరూ ఊహించలేరు. విధి భీషణంగా మారినప్పుడు రక్తబంధాలన్నీ, కన్నబిడ్డలతో సహా ఎండుటాకుల్లా ఎటో కొట్టుకుపోవచ్చు. ఒక్కొక్కటిగా శూలాలై దిగుతుంటే,  త ట్టుకోలేని గుండె తడారిపోయి ప్రాణం ఆవిరైపోదా? అంతిమంగా స్మశానానికి చేరుకోవలసిందేగా, అయితే, అక్కడికి చే రవేయడానికైనా, కనీసం ఓ నలుగురైనా ఉండాలి! కన్నబిడ్డలెవరూ లేకపోయినా, ఉన్న ఆ నలుగురే  మానవ ధర్మంగా  కర్మకాండలన్నీ పూర్తి చేసి, అశ్రునయనాలతో ఆత్మకు వీడ్కోలు పలుకుతారు. మనసులో ఎవరికెంత ప్రేమ ఉంటేనేమిటి?  బహుదూరపు బాటసారి వెన్నంటి ఎవరు మాత్రం కడదాకా వెళ్లగరు? అందుకే చివరికి ఎవరికి వారు ఆ అనంతలోకాల్లోకి ఏకాకి ప్రయాణం చేయాల్సిందే!

మమతే మనిషికి బంధిఖానా - భయపడి తెంచుకు పారిపోయినా 
తెలియని పాశం వెంటబడి - రుణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది // ఈ జీవన తరంగాలలో //

కూడూ, గూడూ, గుడ్డా ఇవి భౌతికమైన బతుకునే ఇస్తాయి. కానీ అసలు మనిషి, అంటే అంతరాత్మ బతికేది మమతానురాగాల మధ్య. అయితే మధ్యలో మనసులోకి ఏ భయాందోళనలో జొరబడి మరే ఇతర కారణాల వల్లో ఈ బంధాలన్నింటికీ దూరంగా వెళ్లిపోవాలనీ అనిపించవచ్చు. తాత్కాలికంగా ఏమో గానీ, శాశ్వతంగా దూరం కావడం ఎవరికీ  సాధ్యం కాదు. భౌతికంగా ఒక వేళ దూరమైనా ఆత్మగతంగా నిరంతరం వాళ్ల మధ్యనే ఉంటారు. మనసుకలా అనిపించకపోయినా జరిగేది మాత్రం అదే! మమతల, ప్రేమపాశాల ఎత్తూ లోతుల గురించి గానీ,  వాటికున్న అపారమైన శక్తి గురించి గానీ, మనలో చాలా మందికి పెద్దగా ఏమీ తెలియదు. నిజంగా అవి అంత బలమైనవే కాకపోతే,  బంధాలకు దూరమై ఎటో వెళ్లిపోయిన వాళ్లల్లో చాలామంది చివరికి తిరిగి తిరిగి మళ్లీ  వెనక్కి వచ్చేస్తారు ఎందుకని?  ఎవరో రెక్కలు కట్టేసి,  లాక్కొచ్చినట్లు వదిలేసి వెళ్లిపోయిన చోటే వాలిపోతారెందుకుని? ఒక విషయం ఇక్కడ గమనించాలి! ప్రాణంలేని విమానాలో రాకె ట్లో  ప్రపంచాన్నంతా  చుట్టివస్తాయి కదా! పంచభూతాత్మకమై, జాజ్వల్యమానమైన ఈ  మహాప్రాణానికి ఇంకెంత వడి ఉండాలి? ఆ ప్రాణధారతో అఖండంగా వెలిగిపోతున్న ప్రేమశక్తికి ఎంత బలం ఉండాలి. కాకపోతే, ఇవేవీ, మేదోజ్ఞానానికి గానీ,  దాని తర్కానికి గానీ అంత సులువుగా అందేవి కావు.  అన్ని తర్కాలకూ అతీతమైన అంతర జ్ఞానానికీ, అందులోంచి దేదీప్యంగా వెలిగే అంతర చైతన్యానికి మాత్రమే ఇవి బోధపడతాయి! ఎవరికి వారు తమ మనసును అందుకు సిద్ధపరుచుకుంటే సరే సరి! లేదంటే  జీవితమంతా ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతారు. 

తాళి కట్టిన మగడు లే డని - తరలించుకుపోయే మృత్యువాగదు
ఈ కట్టెలు కట్టెను కాల్చక మానవు - ఆ కన్నీళ్లకు చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు // ఈ జీవన తరంగాలలో //

లోకాన్ని నడిపించే శక్తులు ఎన్నయినా ఉండవచ్చు. వాటన్నింటిలోకెల్లా అత్యంత బలీయమైనది మృత్యువేశ్రీ గమనించాలే గానీ, మృత్యువుకో నిర్దిష్టమైన విధానం,  నిఖార్సయిన తాత్వికతా కనిపిస్తాయి. ఆకాశంలోకి మేఘాలు రావచ్చు పోవచ్చు.. నక్షత్రాలు మొలవొచ్చు కనిపించకుండా పోవచ్చు. రుతువులు మారొచ్చు. వత్సరాలు మారొచ్చు. కానీ, ఉదయాస్తమయాలు మారవు కదా! వాటికో మొక్కవోని లెక్క  ఒకటుంది. ఆ మాటకొస్తే, మనిషి ఆలోచనా రీతులు మారొచ్చు. అతని మాట మారొచ్చు. మనసు ఆరాటాలు మారొచ్చు. అతని పోరాటాలు మారొచ్చు. కానీ, జనన మరణాలు మారవు కదా! వీటికి కూడా అంతే నిర్థిష్టమైన ఓ లెక్క ఉంటుంది. నిక్కచ్చితమైన ఘడియలు ఉంటాయి. అందుకే తాళి కట్టిన వాడు లేడనో, తలకొరివి పెట్టేవాడు లేడనో, మృత్యువు, అంతిమ ఘడియల్ని వాయిదా వేయదు.  అలా  ఎన్నో తెలిసి, ఎంతో ఆలోచించగలిగే మృత్యువే తన విధినిర్వహణలో ఏ సడలింపూ ఇవ్వకుండా  కఠినంగా,  అంత కచ్ఛిత ంగా ఉంటే,  ఏ ఆలోచనాలేని కట్టెలు, ఈ దేహపు కట్టెను కాల్చడంలో ఎందుకు వెనక్కి తగ్గుతాయి? అయిన వాళ్లూ, ఆత్మీయులూ కొండశోకం పెడుతున్నారని చితిమంటలు వాటికవే ఆరిపోతాయా? ఆప్తుల  కన్నీళ్లతో అవేమైనా చల్లారిపోతాయా? కాకపోతే ఇక్కడొకటి గమనించాలి. ఎంతసేపూ నిప్పు, ఒక మానవరూపాన్ని నిలువునా కాల్చి బూడిద చే స్తోంది కదా అనుకుంటామే గానీ, నిప్పు ఆ మనిషికి అలా ఓ పునర్జన్మను ప్రసాదిస్తోందన్న అసలు విషయాన్ని మనం మరించిపోతాం! కాదా మరి! లోకంలో ఏ రూపమైనా  కావచ్చు.  కాలి బూడిదైతేనే కదా అది మట్టిలో కలిసిపోతుంది! మట్టిలో కలిసిపోతేనే కదా ఎప్పుడో ఒకప్పుడు ఏదో  పాదులో కలిసి మొక్క మొలవడానికి ఆలంబన అవుతుంది. అలా ఆలంబన కావడం అంటే, అది మొక్కలో భాగం కావడమే కదా! అది  పునర్జన్మ కాక మరేమిటి?  అలా మళ్లీ మళ్లీ జన్మించి, జీవన పరంపరను అలా కొనసాగించడానికి మించి లోకంలో ఏ అస్తిత్వమైనా ఇంకా ఏం కోరుకుంటుంది? 

- బమ్మెర
3 కామెంట్‌లు:

 1. జీవిత సత్యాన్ని మానవుని జీవన విధానాన్ని చావు ఉన్నా మైమరచి జీవించే మానవ సమాజానికి కన్ను విప్పు కలిగించే విషయములు సవివరంగా
  వివరించిందినందుకు ధన్యవాదాలు సర్ శుభరాత్రి
  మంచి సందేశాన్ని అందించిన మీకు శతాది వందనాలు అభివందనాలు

  రిప్లయితొలగించండి
 2. పూలరంగారావు25 ఏప్రిల్, 2022 6:30 PMకి

  నాకు హృదయపూర్వకంగా నచ్చిన పాట (సూపర్ పాట )

  రిప్లయితొలగించండి
 3. Super sir
  Sir Nartanashala padyala gurinchi vivarana ivvagalaru
  Thank you sir 🙏

  రిప్లయితొలగించండి