21, డిసెంబర్ 2020, సోమవారం

నా కంటిపాపలో నిలిచిపోరా పాట లిరిక్స్ విశ్లేషణ | వాగ్దానం సినిమా | ANR Songs | Telugu old songs Analysis |

పాటలో ఏముంది ?

వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది. తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి  గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది. సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం. 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత  సారధ్యం వహించారు. సుశీల, ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం.అదీ  సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. 

ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది .

నా కంటిపాపలో ..


నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా !

ప్రేమికుడే కావచ్చు. కానీ, అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి, ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు. అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది. కనుపాపల్లో పొదుగుకుంటుంది. ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ. అది ఆకాశమంత భరోసానిస్తుంది. అంతా సరే కానీ, మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు. కానీ, అలా అనిపించడంలో అర్థమే లేదు, ఎందుకంటే, లౌకికమైన విషయాలు వేరు , హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది. అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది 

నా కంటిపాపలో నిలిచిపోరా పాట
Naa Kanti Paapa lo Nilichipora Song

ఆమె :
ఈ నాటి పున్నమి ... ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
అతడు :
నెయ్యాలలో , తలపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే / నా కంటిపాపలో /


భౌతికంగా కైవసం చేసుకోవాలనుకుంటే సమస్య గానీ , భావనా లోకంలో ఎవరికి వారు ఏమనుకుంటేనేమిటి ? మొత్తంగా ఈ లోకమే తమదనుకుంటే మాత్రం అవతలి వాళ్లకు వచ్చే నష్టమేముంటుంది ? అందుకే ప్రేమికులు జాబిల్లి వెలిసింది . తమ కోసమే అనుకున్నా , ఆకాశాన్ని తమ చేతుల్లోకి తీసుకుందాం అనుకున్నా దానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనేలేదు . నిజమే ... ! ఈ లోకం ఎవరో ఒకరిద్దరి కోసం అవతరించిందేమీ కాదు . అలాగని ఎవరూ దీనికి పరాయి కూడా కాదు . ఎందుకంటే , సమస్త ప్రాణికోటి కోసం , సమస్త మానవాళి కోసం ఈ లోకం తయారయ్యింది . అందువల్ల ఈ సృష్టికి అందరూ సమాన వారసులే ఎవరైనా లోకం తమదేననీ , తమ కోసమే సృష్టించబడిందనే బావోద్వేగానికి లోనయితే , దానివల్ల అవతలి వాళ్లకు కలిగే ఏ ఇబ్బంది లేదు . పైగా , భావనాలోకంలో ఎవరైనా దేన్నయినా సొంతం చేసుకుంటే , ఇతరులకు ఏర్పడే తరుగు ఏమీ ఉండదు . ఆ విషయం అలా ఉంచితే , హృదయం పారవశ్యంలో తేలిపోయే వేళ , సృష్టిలోని ప్రతిదీ సానకూలంగానే అనిపిస్తుంది . లోకంలోని అపురూపమైన ప్రతిదీ తన కోసమే అవతరించినట్లు అనిపిస్తుంది . తామే రాజులైనట్లు  రారాజులైనట్లు అనిపిస్తుంది . ఒక్క చెమట చుక్కయినా రాలకుండా , చిల్లిగవ్వ ఖర్చులేకుండా ఏకంగా చక్రవర్తి అయిపోవడం అంటే ఇదే మరి !!
నా కంటిపాపలో నిలిచిపోరా పాట
ANR Songs

అతడు :
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా ? 
ఆమె :
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా ! / నా కంటిపాపలో /


చన్నీటి స్నానాలు , పన్నీటి స్నానాలు ఇవన్నీ మామూలే కానీ , ఈ ప్రేమికులు వెన్నెల స్నానాలు చేయడానికి సిద్ధమైపోయారు . అలా అయితేనే తాము అనుకున్న ఆనంద సీమను చేరుకోగలమన్నది . వారి ప్రగాఢ విశ్వాసం . అందుకే ఆ చుట్టూరా ఆవరించి ఉన్న మేఘాల మీదుగా నడుస్తూ , భూమికీ ఆకాశానికి మధ్య ప్రణయ రాగాల వంతెనలు వేస్తున్నారు ,  ఇప్పటిదాకా తెలియని , ఎన్నడూ కనీవినీ ఎరుగని ఆ స్వర్గధామాన్ని , ఒక నవలోకాన్ని అందుకోవడానికి వారు ఆనందంగా సాగిపోతున్నారు . 

నా కంటిపాపలో నిలిచిపోరా పాట
Vagdanam Film

ఆమె :
ఈ పూలదారులూ , ఆ నీలి తారలూ
తీయని స్వప్నాల తేలించగా
అతడు :
అందాలనూ , తీపి బంధాలనూ 
అల్లుకుందాము డెందాలు పాలించగా / నా కంటిపాపలో / 


ఎప్పటిలా నేల మీద పూల దారుల్లో నడుస్తున్నట్లే అనిపించవచ్చు . కానీ , ఒక్క క్షణాన రివ్వున ఎగిరి ప్రేమికులు ఇరువురూ నక్షత్రాల గుంపులో చేరిపోవచ్చు . అంతవరకూ సరే ! వాటి చెంత చేరిన తర్వాత తారకలేమైనా ఊరకే వదిలేస్తాయా ? ఒక రసోద్వేగానికి గురిచేస్తాయి . ఎన్నడూ చవిచూడని తీయ తీయని కలల లోకాల్లో విహరింపచేస్తాయి . వాస్తవానికి బంధాలన్నీ తీయనివేమీ కావు . ఆ మాటకొస్తే వాటిల్లో చేదు రకమే ఎక్కువ . అయితేనేమిటి ? వాటిని వడబోసి .. వడబోసి ప్రేమికుల పట్ల గల మమకారంతో తీయ తీయని బంధాలనే ఏరి కూరుస్తాయి . అంతటితో ప్రేమికుల హృదయాలు ఆనంద డోలికల్లో తేలాడతాయి . ఆ పైన ఎవరి ఆధిపత్యమో , ఎవరి అధికారమో ఏమాత్రం లేని తమదైన రాజ్యాన్నీ , సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుని  తమదైన ఏలుబడిని జీవితమంతా కొనసాగిస్తాయి .

హృదయం పారవశ్యంలో తేలిపోయే వేళ , సృష్టిలోని ప్రతిదీ సానకూలంగానే అనిపిస్తుంది

                                                          ---బమ్మెర
తెలుగు ఓల్డ్ సాంగ్స్ గీతాంజలి
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు 
7989892507 
https://wa.me/message/6YRYVO6BHLZMA1

ANR old movies, Akkineni Nageswara cinema, Akkineni Nageswara Rao,  Akkineni nageswara rao Telugu cinema,ANR Old Songs,Old Songs,
#ghantasala సాంగ్స్,Vagdanam Film, Naa Kanti Paapa lo Nilichipora Song

4 కామెంట్‌లు: