26, జనవరి 2021, మంగళవారం

బృందావనం (1993) సినిమా | మధురమే సుధాగానం గీతం | Telugu old songs

పాటలో ఏముంది?


బృందావనం (1993) సినిమా కోసం వెన్నెల కంటి రాసిన మృదుమధురమైన ఓ గీతం ఉంది. అత్యంత సాధారణమైన మాటలతో ఒక లోతైన భావాల్ని  వ్యక్తం చేసిన పాట ఇది.  మాదవపెద్ది సురేశ సంగీతదర్శకత్వంలో బాలు-జానకి పాడిన ఈ పాట పుట్టి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా, తెలుగు వారి గుండెలో ఇంకా అందంగా ధ్వనిస్తూనే ఉంది. మరోసారి వినేద్దామా మరి!

మధురమే సుధాగానం


మధురమే సుధాగానం - మనకిదే మరో ప్రాణం
మదిలో మోహనగీతం -  మెదిలే తొలిసంగీతం

సుధ అంటే అమృతం అనే కదా! సుధాగానం అంటే  ఆ గానం అమరమూ, శాశ్వతమూ అనే కదా! ఆ మాటకొస్తే, ఏది అమరమో, ఏది శాశ్వతమో అదే  మధురంగానూ, మనోహరంగానూ ఉంటుంది. ఏది క్షణికమో,అది వ్యధనే నింపుతుంది. ఒకవేళ ఏదైనా, తాత్కాలిక సుఖాన్నీ సంతోషాన్నీ ఇచ్చినా కొన్నాళ్ల తర్వాత అది గుండెలో ఆరని తీరని దుఃఖాన్ని నింపడం ఖాయం. సంగీతం విషయానికొస్తే, వాద్యకారులూ, గాయనీ గాయకులూ కొన్నాళ్లకు కాలగతిలోకలిసిపోయినా, వాళ్ల వాద్యవిన్యాసం, వాళ్ల గాన వైదుష్యం చిరస్థాయిగా నిలిచిపోతాయి. భౌతికంగా వాళ్లు  మనకు దూరమైనా నాదశరీరులై మనలో మాధుర్యాలు నింపుతూ, మనతోనే, మనమధ్యనే ఉంటారు. వారు ఒలికించిన మాధుర్యాలు,  మనల్ని నిరంతరం సమ్మోహితం చేస్తుంటాయి. హృదయాల్లో మోహనగీతమై ఎప్పుటికీ మెదులుతూ ఉంటాయి. 
చరణాలు ఎన్ని ఉన్నా, పల్లవొకటే కదా! 
కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా!
శతకోటి భావాలను పలుకు ఎద మారునా? 
సరిగమలు మారుతున్నా, మధురిమలు మారునా?

పదేపదే చరణాలు మారిపోతుంటే, అప్పుడు పల్లవి పరిస్థితి ఏమిటి? అనిపించవచ్చు కానీ పల్లవి ఎప్పుడూ మారదు, మారేవి చరణాలే! వేరు వేరుగా వచ్చే ఆ చరణాలు ఒక్కోసారి పల్లవికి  భిన్నంగా కూడా అనిపించవచ్చు. కాకపోతే అది పైపైన చూసినప్పుడు మాత్రమే! కాస్త లోలోతుల్లోకి వెళ్లి చూస్తే, ఆ భిన్నత్వంలో ఏకత్వమే కనిపిస్తుంది. వృక్ష కాండంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మలూ, రెమ్మలూ , పూూలు ,  కాయలూ, పళ్లూ ఆ కాండానికి భిన్నమైనవేమీ కాదు కదా! పైకి ఎగిసి వచ్చిన విభాగాలన్నిటికీ అసలు మూలం వృక్షకాండమే కదా! అందువల్ల ఎన్ని చరణాలు పుట్టుకొచ్చినా వాటన్నింటికీ మూలం ఆ పల్లవేనన్న విషయాన్ని ఎలా మరిచిపోగలం?  అయినా పల్లవి, చరణాలు అంటూ ఆ విభజన ఎందుకు? ఆ రెండూ ఒకటే కదా!. అవి అవినాభావ సంబంధం ఉన్నవే కదా! ఆ మాటకొస్తే! శరపరంపరంగా భావాలు పుట్టుకొచ్చే హృదయం మాటేమిటి? ఒక్కో గ్లాసూ తాగేయగానే కడవలోని నీరు ఖాళీ అయినట్లు, అనుదినం  భావాలు  వెలువడితే హృదయం ఖాళీ అవుతుందా? కానే కాదు. ఎందుకంటే హృదయం ఒక అనంతమైన సముద్రం. అది ఎప్పటికీ ఇంకిపోదు. అలాగే వాద్యంలోంచి, లేదా గొంతులోంచి ఎన్ని బాణీలు పుట్టుకొస్తే మాత్రం వాటన్నింటికీ మూలమైన మాధుర్యం, ఆ హృదయం ఎటుపోతాయి ? అవి ఇంకా  ఇంకా పెల్లుబుకుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ శాశ్వత తత్వం కలవి. ఈ నిజాన్ని తెలియకపోతే, ఎప్పుడో ఒకప్పుడు ఇంకిపోతాయనిపించి తీవ్రమైన దిగులూ, ఆందోళనకూ గురవుతాం. అంతులేని అశాంతికీ వ్యధకూ లోనవుతాం !
వేవేల తారలున్నా, నింగి ఒకటే కదా !
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా!
ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా! 
అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా!

ఆకాశం ఒకటే అయితే మాత్రం ఏమిటి? నక్షత్రానికీ నక్షత్రానికీ మధ్య ఎంతెంతో వ్యత్యాసం ఉంది కదా అనిపించవచ్చు. గమ్యం ఒకటే అయితే మాత్రం ఏమిటి? దారులు పూర్తిగా వేరు కదా అనిపించవచ్చు. గమ్యం ఎంత ముఖ్యమో, నడిచి వచ్చిన దారీ అంతే ముఖ్యం కదా అనికూడా అనిపించవచ్చు. కానీ, వాస్తవం ఏమిటంటే, ఈ వ్యత్యాసాలన్నీ పైపైన కనిపించేవే! . అవి లోలోతుల్లో ఉండవు. పడిలేచే తరంగాలన్నీ పైపైన కనిపించేవే! సముద్ర గర్భంలో ఈ తరంగాల అలజడి ఏమీ ఉండదు. అది నిశ్చలంగా, నిర్మంలంగా సాగిపోతూనే ఉంటుంది. ఒక తరంగం పెద్దదిగానూ, మరో తరంగం చిన్నదిగానూ ఉంటే మాత్రం ఏమయ్యింది? అన్ని తరంగాల్లోనూ ఉండేది ఒకే నీరు కదా! అందులో ఏమైనా తేడా ఉందా? ఈ సత్యాలేవీ స్పురించక  పైపై పరిణామాలకు కకావికలమైపోయే వారు పదేపదే కలతల పాలవుతారు. కన్నీరు మున్నీరు అవుతారు. అందుకే క్షణికమైన వాటిని క్షణికమైనవి గానూ, శాశ్వతమైన వాటిని శాశ్వతమైనవిగా గుర్తించే ఆ నేర్పును ఎవరికి వారు సాధించాలి.  అందుకోసం,  క్షణికమైన వాటినుంచి పక్కకు జరిగి, శాశ్వతమైన వాటి వెన్నంటి నడవడమే ఎవరికైనా ముఖ్యం. అదే జరిగితే, దివ్యమైన ఆనంద తీరాలు చేరుకోవడం ఏమంత కష్టం కాదు!!
                                                                  - బమ్మెర 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి