24, జనవరి 2021, ఆదివారం

మౌనగీతం (1981) | పరువమా... చిలిపి పరుగు తీయకు పాట విశ్లేషణ | Telugu old songs |


పాటలో ఏముంది?

చిత్రం : మౌనగీతం (1981), రచన: ఆత్రేయ, సంగీతం! ఇళయరాజా, 

గానం: బాలు, జానకి

పరువమా... చిలిపి పరుగు తీయకు 





అతడు: పరువమా ... చిలిపి పరుగు తీయకూ
ఆమె :  పరువమా.... చిలిపి పరుగు తీయకూ 
అ :    పరుగులో ...  పంతాలు పోవకూ
ఆ::     పరుగులో .... పంతాలు పోవకూ
అ::    పరువమా.....

ఇద్దరిదీ ఒకే బాట  ఇద్దరిదీ ఒకే మాట, ఒకే పాట. అవే పరుగులు, అవే నవ్వులు అయితే, నవ్వులాటలో కోపాలు తలెత్తిన ట్లు,  పరుగులాటలో కొన్నిసార్లు పంతాలు మొదలవుతాయి. పరుగులు శరీరానికే పరిమితమైతే అది వేరు. కానీ, శరీరంతో పాటే మనసు కూడా పరుగులు తీస్తే.... అది వేరే కథ. శరీరమూ మనసూ కలిపి పరుగులు తీసేవేళ ఎంత వద్దనుకున్నా కొన్ని ఎగిసిపడే ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలు ఒక్కోసారి, తమకు ఎదురే లేదనుకుంటాయి. ఎదుటి వారి ఆలోచనల్ని గాలిలోకి  ఊదేసి తమదే సాగాలంటూ పంతాలు  పోతాయి. ఒక్కోసారి తగవుకూ సిద్ధమవుతాయి. నడివయసులోనో ఆ పై వయసులోనో అంటే అది సరే కానీ, కౌమారం నుంచి పాతికేళ్ల వయసు దాకా ప్రతి అడుగూ ఉప్పెన వరదలతో పోటీపడుతుంటాయి. అలా ఉప్పెనలతో తలపడే పరువాల్ని అదుపులో ఉంచుకోవడం అంటే అది అంత తేలికైన పనేమీ కాదు.  
అ: ఏ ప్రేమ కోసమో చూసే చూపులూ
ఏ కౌగిలింతకో చాచే చేతులూ
ఆ: తీగలై హ... చిరుపూవులై పూయా
   గాలిలో హ.... రాగాలు మ్రోగా
అ: నీ గుండె వేగాలు తాళం వేయా ..... పరువమా 
ఆ: చిలిపి పరుగు తీయకూ

ఒక్కొక్కరుగా ఉండిపోవడంలో ఒక లోటు ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే, వేరువేరుగా కాకుండా ఒక్కరైపోయే ప్రేమ కోసం ఇద్దరి ఎదురు చూడటాలూ,  మనసులే కాదు తనువులూ ఏకమైపోయే గాఢానుబంధం కోసం చేతులు చాపడాలూ ఉంటాయి. ఇవన్నీ జీవితేచ్ఛ కోసం జరిగే ఆరాటాలు. పోరాటాలే కదా! ఒకవేళ ఆ చాచిన చేతులే తీగలైపోతే, అక్కడ ఇంక పూలు పూయడంలో పెద్ద జాప్యం ఏముంటుంది? పరిసరాల్లో నిండు పరిమళాలే ఎగిసిపడుతున్నప్పుడు హృదయం గాలితో గొంతు కలపక ఏం చేస్తుంది? అక్కడ వేవేల  రాగాల ఆలాపన  మొదలవుతుంది. రాగాలు మారుమ్రోగడం సరే గానీ, అదే సమయంలో తాళం వేసేందుకు ఒకరు ఉండాలి కదా! అప్పుడు గుండెయే మృదంగ మై తాళం వేస్తుంది. 
ఆ: ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో 
   ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో 
అ : వెతికితే హ... నీ మనసులో లేదా 
   దొరికితే జత కలుపుకోరాదా 
ఆ : అందాక అందాన్ని ఆపేదెవరూ .... పరువమా 
అ : చిలిపి పరుగు తీయకూ 

ఎన్నడూ మనసు విప్పి చెప్పలేదు కాబట్టి గువ్వ గుండెను స్వర్గధామమే అనుకోగలమా? తుఫానుగాలులకూ, రాళ్ల వర్షానికీ  ఇప్పటికి అది కట్టుకున్నఎన్ని  గూళ్లు నేలకూలిపోయాయో ఎవరికి తెలుసు? రాళ్లూ ముళ్లూ లేవు కాబట్టి, చెట్టు నీడను సుఖసౌఖ్యాల సోపానం అనుకోగలమా? ఎంతెంత మంది బాటసారుల నిట్టూర్పులు ఆ చెట్టు నీడన పడి మండుతున్నాయో ఎవరికి తెలుసు? నిజానికి గువ్వ గూడూ, చెట్టు నీడా మానవ జీవనానికన్నా భిన్నంగా ఏమీ  ఉండవు. ఎక్కడైనా కష్టాలూ, సుఖాలూ కలగలిసే ఉంటాయి. గువ్వలో ఆశావెహాలు తక్కువ కాబట్టి, ఎంతో కొంత స్వర్గసుఖం ఉంటుంది.  ఆ మాటకొస్తే, ఆ మాత్రం స్వర్గం, ఆ మాత్రం నీడ మానవ హృదయంలోనూ ఉంటాయి. కాకపోతే, వాటిని వెతుక్కునే శక్తి,  అవి దొరికే దాకా వేచి చూసే ఓపిక మనకుండాలి. అంతే !!
                                                                     - బమ్మెర

ఆత్రేయ పాటలు , ఇళయరాజా తెలుగు పాటలు , 
బాలు తెలుగు పాటలు , జానకి తెలుగు పాటలు 

1 కామెంట్‌: