31, జనవరి 2021, ఆదివారం

చిత్రం : నర్తనశాల రచన : తిక్కన సోమయాజి సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి గానం : ఘంటసాల ఏనుంగునెక్కి....

 చిత్రం : నర్తనశాల 
రచన : తిక్కన సోమయాజి
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
గానం : ఘంటసాల

                       ఏనుంగునెక్కి...





అల్లంతదూరాన అర్జునుణ్ణి చూడగానే, ద్రోణాచార్యునికి హృదయం ఉప్పొంగిపోయింది.

‘‘అడుగో అర్జునుడు... అసలే ఆకలితో చిరాకు పడుతూ ఉన్న సింహానికి, దానికి మదించిన ఏనుగుల సమూహం అలికిడి కలిగితే గుహ నుంచి ఎలా బయటికి వస్తుందో... అలా వస్తున్నాడు’’ అన్నాడు ద్రోణాచార్యుడు.

‘‘అర్జునుడే అని నమ్మకం ఏముంది? ఒకవేళ అతడే అయితే... అజ్ఞాతవాస నియమంలో పాండవులు ఓడిపోయినట్లే’’అని రారాజు మీసం తిప్పాడు.

‘‘గడువు తీరిపోయింది కాబట్టే బయటపడ్డాడు. నువ్వే తెలివి తక్కువగా బోల్తా పడుతున్నావు’’ అన్నాడు భీష్మాచార్యుడు.

రథం మీద కూర్చున్న ఉత్తర కుమారుడికి కౌరవసేనను చూడగానే వణుకు పుట్టింది. పారిపోవడం మొదలుపెట్టాడు.

అతణ్ణి ఆపి, జమ్మిచెట్టుమీద దాచిన గాండీవాన్ని దింపించి, బృహన్నల వేషాన్ని చాలించుకుని అర్జునుడు కౌరవులను ఢీకొట్టాడు.

ఇప్పుడు అందరికీ అతడు అర్జునుడే అని రూఢి అయిపోయింది.

‘వచ్చినవాడు ఫల్గుణుడు’ అని భీష్మాచార్యుడు ఆనందంగా ప్రకటించాడు. అంతేకాదు... ‘‘కురురాజా! మనం తప్పకుండా గెలుస్తామని చెప్పడం కష్టం. రాజ్యలక్ష్మి కోసం యుద్ధం చేస్తే రెండుపక్షాల వారూ ఎలాగూ గెలవలేరు. ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. వచ్చినవాడేమో ఫల్గుణుడు. వాడితో పెట్టుకుంటే ఓడిపోవడానికి సిద్ధపడాలి. లేదంటే ఒక పని చేయవచ్చు. హాయిగా సంధి చేసుకో. ఇప్పుడు కావలసింది అదే’’ అన్నాడు.

దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మీరు అర్జునుణ్ణి ఆపండి. నేను గోవులను తరలించుకుపోతాను అన్నాడు. అర్జునుడు భీష్మద్రోణులను దాటుకుని, సరాసరిగా గోవులతో పారిపోతున్న దుర్యోధనుని ముందుకు తన రథాన్ని తీసుకువెళ్లి ఆపాడు.

మామూలుగా అయితే దుర్యోధనుణ్ణి భీముడు దెప్పిపొడిస్తే వినడానికి బాగుంటుంది. రాయబారంలాంటి సీన్లలో శ్రీకృష్ణుడు మంచినీతులు చెబితే వినేవాళ్లకి ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఇవి దుర్యోధనునితో అర్జునుడు అంటున్న మాటలు. భారతంలో తిక్కన గారు రచించినది. సినిమా కోసం ఘంటసాల గానం చేసింది.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీధుల గ్రాలగలదె
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డోలగంబున నుండగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపార భోగింపగలదె
గీ. కయ్యమున నోడిపారిన కౌరవేంద్ర
వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

‘‘ఓహోయ్ కౌరవేంద్రా! కాస్తాగు. పారిపోకు. ఇలా అయితే నువ్వు కోరుకున్నట్లు హస్తినాపురానికి పట్టం కట్టుకోవడం
సాధ్యమవుతుందా? రాజధాని వీధుల్లో రెండువైపులా రాయగజ సాహిణి కదలివెళుతుంటే ఆ నడుమ పట్టపుటేనుగు నెక్కి.... రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కుదురుతుందా? రాజువై మణిమయ ఆభరణాలను ధరించి, నిండుసభను తీర్చడం సాధ్యమవుతుందా? అందగత్తెలతో కూడేవేళ ఈ ఓటమి బాధ కుంగదీయదా? కర్పూరం, చందనం, కస్తూరి వంటి సుగంధద్రవ్యాలను భోగించేవేళ ఓటమి వాసన మనసులో మెదిలితే ఏమైపోతుంది? యుద్ధంలో ఓడిపోతే ఇవన్నీ కుదరవు. కనుక నామాట విని రథాన్ని వెనక్కు తిప్పు. పారిపోవడం కంటే వీరోచితంగా పోరాడి ఓటమి పాలైతే... నీకు సుగతి కలుగుతుంది. అలా కాదు... యుద్ధంతో పనిలేదు... జూదమాడి రాజ్యాలు కబళించేసే ఆ పాత అలవాటునే అడ్డం పెట్టుకుంటా నంటావా?! నాకా అలవాటు లేదు. నాతో యుద్ధం చేయడం మినహా నీకు మరో గత్యంతరం లేదు అన్నాడు.

విరాటపర్వం పంచమాశ్వాసంలోని 204వ పద్యమిది. దీనిని ఒక్కసారి పరికించండి. ప్రతిపాదం చివరిలోనూ ‘గలదె’ అని ఉంటుంది. ‘గలవె’ అని తిక్కనగారు వ్రాయలేదు. ఈ ఒక్క అక్షరం తేడాతోనే ఇది దుర్యోధనుణ్ణి సూటిగా చేసిన దెప్పిపొడుపు కాదు అని అర్థమవుతోంది. దుర్యోధనుడు చేసిన ఎగ్గులన్నీ మనసులో పెట్టుకుని అర్జునుడు మాట్లాడడం లేదు. యుద్ధంలో ఓడిపోయినవాడికి ఏమవుతుందో మాత్రం చెబుతున్నాడు. గెలిచినా, ఓడినా వీరుడు ఎలా సుఖించగలడో, పారిపోయిన వాడి దుఃఖమేమిటో మాత్రమే చెబుతున్నాడు. అందుకే ‘కయ్యమున ఓడి పారిన’ అన్నాడు. 

‘పిరికిపందా నిన్ను పట్టుకున్నాను చూశావా?? ఇప్పుడెక్కడికి పోతావ్?’ అనలేదు. ‘మరలి ఈ తనువు విడిచి’ అన్నాడు కానీ, అర్జునుడు నిన్ను నేను సఫా చేసేస్తా అనడం లేదు. పారిపోవడం కంటే యుద్ధం చేసి ఓడిపోతే పరువు దక్కుతుందని, ‘సుగతి బడయుము’ అనే మాటద్వారా సూచిస్తున్నాడంతే. మొత్తం పద్యంలో... ‘జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము’ అన్న ఒక్కమాటనే తీసుకుని బస్తీమే సవాల్ అన్న ధోరణిలో అర్జునుడు మాట్లాడాడని కొన్నిచోట్ల అర్థతాత్పర్యాలు కనిపిస్తూ ఉండడం సమర్ధనీయం కాదు. పెద్దనాన్న కొడుకు, ప్రత్యర్ధి అయినవాడితో ఎలా వ్యవహరించాలో అర్జునుడు అలాగే వ్యవహరిస్తాడు. పైగా ఆ ముందు పద్యంలోనే ‘క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా!’ అని చెబుతూనే, నేను నీకంటే చిన్నవాణ్ణి అని అన్నగారి ముందు ఒప్పుకున్నాడు. 

అటు తర్వాత ధర్మబద్ధంగానే అర్జునుడు యుద్ధం చేశాడు. తాను ఆడకూడని ప్రలాపాలను మాత్రం ఆడలేదు. అందుకేదుర్యోధనునితో అర్జునుని మాటకు, భీముని వ్యవహారానికి తేడా ఉంటుందన్నది. అసలందుకే వింటే భారతం వినాలన్నది.
                                                                               - నేతి సూర్యనారాయణశర్మ
                                                                                (శంకరవిజయం నవలాకర్త)
                                                                                
ఫోన్ : 99517 48340
                                               
                                                                                                                         

2 కామెంట్‌లు: