4, ఫిబ్రవరి 2021, గురువారం

జీవితమే సఫలమూ పాట | అనార్కలి సినిమా | Old Telugu Songs

పాటలో ఏముంది ? 


1955 లో విడుదలై , అఖండ విజయం సాధించిన ' అనార్కలి ' సినిమాలోని పాటలన్నీ సీనియర్ సముద్రాల రాసినవే !ఆదినారాయణరావు స్వరపరిచిన అందులోని దాదాపు అన్ని పాటలూ ఆపాత మధురాలు . ప్రత్యేకించి జిక్కి పాడిన ' జీవితమే సఫలమూ ' అన్న పాట తెలుగునేలనంతా పులకింప చేసింది . నిజానికి , ఈ పాట బాణీ మూలం 1953 లో విడుదలైన ' అనార్కలి ' ( హిందీ ) సినిమా కోసం సి.రామచంద్ర స్వరపరిచినది . లతా మంగేష్కర్ పాడిన ' యే జిందగీ ఉసీకి హై ' అన్న ఆ పాట అప్పటికే దేశమంతా మారుమోగింది . అలాగని , అదే బాణీని ఆ తర్వాత జిక్కీ పాడితే అందులో ఏముంది గొప్ప అనుకోవడానికి వీళ్లేదు . అది ఇక్కడికి వచ్చేసరికి , పాట తేట తెలుగుదన్నాన్నంతా పుణికి పుచ్చుకుంది . తెలుగు గుండెల రసధ్వనులతో ఆరు దశాబ్దాలుగా ఓలలాడిస్తోంది .

జీవితమే సఫలమూ ..... 


జీవితమే సఫలమూ - రాగసుధా భరితమూ
 ప్రేమ కథా మదురమూ   // జీవితమే //
జీవితం సఫలం కావడం అంటే ఏమిటి ? అనుకున్న ప్రతిదీ నెరవేరడమా ? అప్పటికే అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమా ? ఎంత మంది జీవితాల్లో అలా జరుగుతుంది ? పైగా , యుక్త వయసు నాటికే ఇవన్నీ జరిగిపోతాయా ? లేదే ! నిజానికి , అప్పుడప్పుడే కదా ! అనుకున్న దిశగా అడుగులు పడటం మొదలవుతుంది . ఆమాత్రానికే జీవితం సఫలం అయిపోయినట్టు ఎలా భావిస్తారు . వాస్తవం ఏమిటంటే , జీవితం సఫలం కావడానికి , అప్పటికే అనుకున్నది, నెరవేరనక్కర లేదు . అనుకున్న లక్ష్యాన్ని అప్పటికే సాధించి ఉండనక్కర లేదు . ఎన్ని అడ్డుంకులు వచ్చిపడుతున్నా ఎన్ని కష్టనష్టాలు వచ్చిపడుతున్నా సరే ! మడమ తిప్పకుండా అనుకున్న దిశగా అడుగులు పడుతూ ఉంటే చాలు . జీవితం అర్ధవంతంగా వెళుతున్న భావన కలిగితే చాలు . జీవితం సఫలం అయినట్టే !
హాయిగా తీయగా ఆలపించు పాటల
వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల
అనారు పూలతోటల - ఆశదెలుపు ఆటల // జీవితమే //
వేసే ప్రతి అడుగూ అర్ధవంతంగా పడుతోందన్న ఆ ఒక్క భావన చాలు ఎడారి కూడా నందనవనంగా అనిపిస్తుంది . హృదయం రాగరంజితం అవుతుంది . మధురాతి మధురంగా ప్రేమగానం మొదలవుతుంది . అప్పుడు ఆలపించే ప్రతి పాటా వలపు మాటలతో సోయగాలు ఒలికిస్తుంది . జీవితంలో పూల కుసుమాల వేల ఆశలు మోసులెత్తుతాయి .
వసంత మధుర సీమల - ప్రశాంత సాంధ్య వేళల
అంతులేని వింతల - అనంత ప్రేమలీలల
వరించు భాగ్యశాలుల - తరించు ప్రేమజీవుల // జీవితమే // 
లోకమెప్పుడూ సుఖసంతోషాలనే కోరుకుంటుంది . కానీ , చాలా సార్లు అవి దానికి దక్కవు . అందుకే లోకం అనుక్షణం ఆత్మ క్షోభతో రగులుతూ ఉంటుంది . పైగా , తనకు దక్కనివి ఇతరులెవరికీ దక్కడానికి వీల్లేదన్నట్లు కొన్నిసార్లు తీవ్రమైన అసూయాద్వేషాలతో వ్యవహరిస్తూ ఉంటుంది . ఎక్కడెక్కడ ప్రేమ దీపాలు కనిపించినా , వెంటనే వాటిని ఆర్చేయాలని చూస్తుంది . అది గమనించి , ఎప్పటికప్పుడు దాని ఎత్తులకు పై ఎత్తులు వేసే నైపుణ్యం సాధించగలిగితే చాలు ... జీవితం వసంత మాధుర్యాలు ఒలికిస్తుంది . హృదయం ప్రశాంత సీమగా మారిపోతుంది . వేవేల ప్రేమలీలల్లో మనసు సౌభాగ్యవంతమవుతుంది . జీవితం తరించిపోతుంది  
                                                             - బమ్మెర


6 కామెంట్‌లు:

  1. మరచిపోయిన అందమైన తెలుగు పాటని మళ్ళీ పరిచయం చేశారు. ఎప్పటిలాగానే అలతి పొలతి పదాలతే ఈ మీ వ్యాఖ్యానముతో చదివినవారి జీవితాలను సఫలం చేస్తున్నారు. ధర్మ వందనాలతో

    రిప్లయితొలగించండి
  2. మధురాతి మధురం; అజరామరం.మీ విశ్లేషణ అమోఘం.

    రిప్లయితొలగించండి
  3. 'జీవితమే సఫలము' పాటకు మీరిచ్చిన వివరణ చదివిన వారి జీవితాలు సఫలమయ్యే విధంగా చక్కగా రాశారు.

    రిప్లయితొలగించండి
  4. పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు ప్రతి ఒక్కరూ తమ తమ కర్తవ్యాలను మరువక ముందే రుతుచక్రం అని నేను సగర్వంగా చెప్పగలను మనిషి స్థితిగతులను కష్టం సుఖం గురించి చాల అద్భుతంగా వివరించారు మంచి చెడు రెండు అవసరమే కష్టం వచ్చింది అంటే సుఖం అనుభవించడానికే అని నా మాటగా

    రిప్లయితొలగించండి