పాటలో ఏముంది...?
పగలే వెన్నెల- జగమే ఊయల
నీటిలోన కలువ భామ పొంగిపూచే
ఈ అనురాగమే జీవనా రాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా ! // పగలే వెన్నెల //
భావోద్వేగాలు వెల్లువెత్తి , మానవ హృదయాల్లో పగలే వెన్నెల కాస్తేనేమిటి ? ఇంక నాతో పనేముందిలే అని చంద్రుడు ఆకాశంలోకి రాకుండా ఉంటాడా ? అయినా , చంద్రుడికి వెన్నెల కురిపించడమే తప్ప వేరే పనేమీ ఉండదా ఏమిటి ? నీటిలోని కలువ భామల్ని పలకరించడం కూడా అతని నిరంతర కార్యాకలాపమే కదా ! ఆ కలువలు మాత్రం ఏం తక్కువ ? పొద్దుకుంకింది అంటే చాలు ! జాబిలి రాక కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి
గొంతెత్తి స్వాగత గీతాలు పాడుతూనే ఉంటాయి . ఆకాశంలో విహరించే అతనెక్కడ ? నేలమీది మేమెక్కడ ? అని అవి ఏనాడూ అనుకోవు . ఎందుకంటే ప్రేమకూ అనురాగానికి దూరాలు ఉండవనే సంగతి వాటికి బాగా తెలుసు . అందుకే ఎడతెగని ఒక రాగబంధం నిరంతరం వాటి మధ్య కొనసాగుతూనే ఉంటుంది . వాటి ఎదలో తేనెజల్లు కురుస్తూనే ఉంటుంది .
కడలి పిలువ కన్నెవాగు పరుగుదీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా ! // పగలే వెన్నెల //
లోకంలో జీవచైతన్యం గల ఏదీ ఉన్న చోట ఉన్నట్లే పడి ఉండడానికి ఇష్టపడదు . అందుకే మనసును పరవశింపచేసే ఒక ఆసరా కోసం ప్రతిదీ ఎదురుచూస్తూ ఉంటుంది . ఉన్నట్లుండి , సముద్రుడి నుంచి ఏ చిన్న పిలుపో వచ్చిందనుకోండి , వారు ఆ వైపు పరుగులు తీస్తుంది రాగరంజితంగా ఎక్కడ ఏ నాదం వినిపించినా , తలను నలుదిక్కులా తిప్పుతూ నాగు శిరోనాట్యం చేస్తుంది . నిజానికి , దేహంతోనే అనికాదు .... గాలితోనూ , నీటితోనూ శబ్దంతోనూ రసార్థమైన ప్రతిదానితోనూ రాగబంధాలు ఏర్పడతాయి . హృదయాలు దేదీప్యంగా వెలిగిపోతాయి . ఆ ప్రవాహంలో లోకం పూలతోటలా మారిపోతుంది . జీవితాలు సుగంధాలతో నిండిపోతాయి .
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల రుతువు సైగచూచి పికము పాడే
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా ! // పగలే వెన్నెల //
ఆశావహమైన మనసు ఏ ప్రాణికైనా అవసరమే ! జీవికకైనా , జీవితానికైనా అదే పెద్ద ఆధారం . ఆ మనసే లేకపోతే . జీవితాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయి . గమనిస్తే , సృష్టిలో అణువణువునా ఆ చైతన్యమే కనిపిస్తుంది . అందుకే , వర్షం కురుస్తుందో లేదోనన్న అనుమానాలకు పోకుండా , ఆకాశంలో నీలిమబ్బు లేచీ లేవగానే నెమలి నాట్యం చేయడం మొదలెడుతుంది . వసంతం వస్తుందో లేదో అనేమీ శంకించకుండా ఆ రుతువు రాగానే కోయిల గొంతెత్తి పాడుతుంది . మనసు వీణలా ఝంకారాలు పలుకుతుంటే ,ఎవరి బతుకులోనైనా పున్నమే కదా పూచేది!! నిజానికి , పగలు వెన్నెల్లా అనిపించడానికైనా , లోకం ఊయల్లా అనిపించడానికైనా ఈ ఆశావహ హృదయమే కావాలి. ఆశావహమైన ఓ నిండు ఊహాజ్ఞానం కావాలి . ఆ జ్ఞానమే జీవితాన్ని రసరంజకం చేస్తుంది . లోకాన్ని రాగమయం చేస్తుంది .
---బమ్మెర-
ఈ పాట వీనుల విందు. అంతా సానుకూల ధోరణి తో సాగుతుంది. సినిమా లో ఎన్నో సార్లు వస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో సార్లు హృదయ స్పందన కలిగిస్తుంది. సినారె , సాలూరు , జానకి , కే వి రెడ్డి , అక్కినేని, జమున గార్లకు అభివందనం.
రిప్లయితొలగించండి