వ్యామోహానికి భక్తికీ తేడా...
మందార మకరంద మాధుర్యమున...
బమ్మెర పోతన భాగవత పద్యం
చిత్రం : భక్త ప్రహ్లాద
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి. సుశీల
ఇదీ అసలు సంగతి... అని చెప్పగా వీలులేని రాగబంధమొకటి మనసులో ఉదయిస్తుంది. నువ్విలా మనిషిలా మారి ఈ నేలకు రావడానికి పూర్వమే ఎప్పుడో... ఏ ఆదిమయుగాలనాడో ఏర్పడ్డ జన్మబంధమది.
చిత్రం : భక్త ప్రహ్లాద
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి. సుశీల
ఆ రాగబంధమే మోహపాశమై జీవనగమనంలో నిన్ను అడుగడుగునా నడిపిస్తూ ఉంటుంది. ఆ మోహంలోనే తనువు, మనసు ఏకాగ్రం చేశావంటే... అది వ్యామోహంగా మారిపోతుంది. లోభం నుంచి పుట్టి, మదానికి దారితీసే దానికే మోహం అని పేరు. ఇప్పుడు నువ్వు చెబుతున్నదంతా చూస్తుంటే ఆ మోహంతో కూడిన మత్తత నిన్ను ఆవేశించినట్లు కనబడుతోంది. లేదంటే... అయిదేళ్ల ఈ పసివయస్సులో శరీరమంటే చీకటిగోతులతో నిండిన ఇల్లని చెప్పగలవా? విష్ణుదేవుని మనసులో నిలుపుకుని అడవులలో నివసించినా ఉత్తమమే అనగలవా? ఇదుగో ఈ మోహావేశాన్ని జీవులందరిలోనూ కలిగించడమే జనార్దనుని జగన్మాయా తంత్రం. దానిలో చిక్కుకున్న వారే కానీ, బయటపడ్డవారు లేరు. కలడు కలండనేవాడిని చూసినవాడు లేడు. కనుక ఈ మోహావేశంలో పడబోకు. నా మాట విను. మీ కులవృత్తి చేపట్టు... అని ప్రహ్లాదుని గురువులైన చండామార్కులు అనునయంగా చెప్పారు.
పొగడదగిన గుణశీలాలకు నెలవైన ఓ గురుదేవా!
నిజమేనండీ. అయస్కాంతం ముందు నిలబడ్డ తర్వాత ఇనుముకు స్వతంత్రం లేదు. అలాగే నాలో మోహావేశం
నాకు తెలియకుండానే దైవవశాత్తూ పెరుగుతోందన్నది వాస్తవమే. విష్ణుభావన నా మనసుకు మత్తెక్కిస్తోందన్నది కూడా కాదనలేను. దీనినుంచి బయటపడలేను. కానీ రసోన్మత్తతలో ముంచితేల్చే ఈ భక్తిరసాయనంలో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాను. నేను చెడిపోతానేమో అనే బెంగవద్దు. నాలోని ఈ మత్తత కేవల మూఢభక్తి కాదు. ఏది చెడ్డది, ఏది మంచిది అనే విచక్షణా జ్ఞానాన్ని విడిచిపెట్టడం లేదు. జ్ఞానమే కైవల్యమన్న సూత్రాన్ని మరువలేదు. ఒకసారి ఏ జ్ఞానం ముక్తిదాయకమవుతుందో దానిని ఎరిగిన తరువాత, వెనక్కు మరలలేని స్థితిలోనే నేనిప్పుడున్నాడు. కనుక నా ఈ ప్రవృత్తి కులవర్ధనమే కానీ, నాశనాన్ని తెచ్చిపెట్టదు. ఇంతకీ ఇప్పటి నా పరిస్థితి ఇలాంటిదని ఎలా చెప్పను?
మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
మరుగునే సాంద్ర నీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?
భూలోక కల్పవృక్షాలలో ఒకటైన మందారంలోని మకరందాన్ని తాగడానికి ఇష్టపడే తుమ్మెద, బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తూ గమ్మత్తైన వాసన కలిగివుండే రకరకాల పూలచెట్టూ తిరగనే తిరగదు. స్వర్గలోక మందాకినీ జలాల్లో హాయిగా తిరిగే రాజహంస, గంగతో పాటుగా నేలకు దిగి కాలవల్లో తిరగాడదు. చిగురు మామిళ్లు కొరికితినే కోయిల వసంతకాలం రాలేదని కొండమల్లెలు చప్పరించదు. నిండుపున్నమి జాబిల్లి జారబోసే వెన్నెల తాగి బతికే చకోరపక్షికి ఏది వెన్నెలో... ఏది మంచుతెరలోని బిందువో కచ్చితంగా తెలుస్తుంది. మనసులోని రాగద్వేషాలను, పేరాశలను విడిచిపెట్టకుండా ఏదో ఒకరకంగా లౌకిక సుఖభోగాలతో కూడిన ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు వ్యామోహంలో పడివున్నవాడే కానీ, భక్తుడు కాదు. దైవీగుణసంపన్నమైన ఉత్తమాభిరుచిని తాను పొంది, తనలోనే దైవాన్ని చూసుకోవాలంటే... భక్తిని జ్ఞానమార్గంవైపు మళ్లించడం తప్ప వేరు మార్గం లేదు.
- నేతి సూర్యనారాయణశర్మ,
శంకరవిజయం నవలాకర్త
ఫోన్ : 9951748340
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి