5, ఏప్రిల్ 2021, సోమవారం

గుఱ్ఱం జాషువా - శిశువు పద్యం | బొటవ్రేల ముల్లోకములు | తెలుగు పద్యాలు

పద్యమాధురి

మనసంతా మమతల మాధుర్యాలు నింపే ఈ పద్యం గుఱ్ఱం జాషువా రాసిన ‘ శిశువు ’పద్య ఖండికలోనిది. ఘంటసాల స్వరపరిచి, గానం చేసిన ఈ ప్రైవేట్‌ అల్బమ్‌లోని పద్యాలు సినిమా పద్యాలకు సరిసమానంగా ఆదరణ పొందాయి. విని ఆనందించండి. 

మాట రాని మహరాజు



బొటవ్రేల ముల్లోకమలు చూచి లోలోన
                     ఆనందపడు నోరులేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వ
                     న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు, విషమను వ్యత్యాసమెఱుంగ కా
                     స్వాదింప జను వెఱ్ఱిబాగులాడు
అనుభవించుకొలంది నినుమడించుచు మరం
                     దము జాలువారు చైతన్యఫలము
భాషరాదు వట్టి పాలుమాత్రమె త్రాగు
నిద్రవోవు, లేచి నిలువలేడు
ఎవ్వరెరుంగ రితనిదే దేశమో కాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు

పాతాళం, నేల, ఆకాశం అత్యంత సహజమైన ప్రాకృతిక భావన లే కావచ్చు. కానీ, కొందరి దృష్టిలో ఇవి అధమం, మధ్యమం, ఉన్నతం అనే జీవన ధశలకు ప్రతీకలు.  వీటినే కొందరు రాక్షస, మానవ, దేవలోకాలుగా చెబితే, ఇంకొందరు ముల్లోకాలుగా చెబుతారు. అయితే, తాము పాతాళంలో పడిఉన్నామనుకునే వాళ్లంతా భూమ్మీదికి రావాలనుకుంటారు. అప్పటికే భూమ్మీద ఉన్నామనుకునే వాళ్లు ఆకాశంలోకి ఎగరాలని చూస్తుంటారు. అందుకు కారణం, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అన్న బేదభావాలే. అయితే, పాలుతాగే పసిబిడ్డలకు ఈ బేదభావాలేమీ ఉండవుగా! అందుకే అన్నింటినీ ఒకటిగానే చూస్తారు.  త్రికాలాలను ఏకకాలంగా చూసే మహర్షిలా, ముల్లోకాలను ఒకే లోకంగా అనుభూతి చెందే ఆ లేత మనసు అద్వైత స్థితిని ఏమనుకోవాలి? అప్పటికి ఇంకా మాటలు రాకపోతే, మౌనర్షి అనుకోవచ్చు. లేదా మహాయోగి అనుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఇది అమృతమా... విషమా అనే మీమాంస కూడా వీరికి ఉండదు. అందుకే ఎవరు ఏమివ్వచూసినా నోరు తెరుస్తారు. ఇవ్వగానే చప్పరిస్తూ చప్పట్లు కొడతారు. విషమూ, కల్మషమూ మచ్చుకైనా కానరాని ఆ మధురఫళాన్ని ఎంత ఆరగిస్తే మాత్రం తనివితీరుతుంది? ఎల్లలెరుగని, ఏ భాషా తెలియని ఈ  పసిబిడ్డలది ఏ దేశం అనుకోవాలి? అయినా విశ్వమానవులకు దేశాల తొడుగులెందుకు? 
మన పిచ్చిగాని.......!!
                                                                    - బమ్మెర

======================================

8 కామెంట్‌లు:

  1. తేనెలూరే గాత్రం. చెరకు రసం లాంటి పదాలు.👌💐💐

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగున్నాయి సార్. ధన్యవాదములు. అభినందనలు.శుభాకాంక్షలు. 🙏

    రిప్లయితొలగించండి
  3. అమోఘం. ఎప్పుడూ విననవి, తెలియని సంగీత, సాహిత్యాలను వినిపిస్తున్నందులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. Anandamante emito ee kavitakhandika anubhavistu vinte telustundi malli maaku evi jnatiki techhinanduku danyavadamulu

    రిప్లయితొలగించండి
  5. గాత్రం అమృతం గోవినట్లుగా నుంచి

    రిప్లయితొలగించండి