18, జూన్ 2021, శుక్రవారం

సడిసేయకో గాలి ... సడిసేయబోకే పాట | రాజమకుటం సినిమా | తెలుగు పాత పాటలు

పాటలో ఏముంది? 


నిద్ర ... నిశ్శబ్దం కవల పిల్లలే కదా ! వాటి మధ్యలోకి ఎప్పుడైనా ఏ శబ్దమో జొరబడితే అవి ఊరుకుంటాయా? అవి అడుగుమోపిన మరుక్షణమే వడివడిగా వెళ్లి వచ్చిన బాటపట్టమని చెబుతాయి. సడిసవ్వడి లేకుండా ముందుకు సాగిపొమ్మని చెబుతాయి. ఈ మాటలే దేవలపల్లి కృష్ణశాస్త్రి  కలంలోంచి పాటలుగా పుట్టుకొచ్చాయి. మాస్టర్‌ వేణు బాణీతో ప్రాణం  పోసుకున్న ఈ పాటను ‘రాజమకుటం’ సినిమా కోసం లీల లలిత  లలితంగా గానం చేసింది. శ్రోతల హృదయాల్ని లలిత లావణ్యం చేసింది. ఆద్యంతం ఆస్వాదించండి!!

సడిసేయకో గాలి ... !!
సడిసేయకో గాలి ... సడిసేయబోకే 
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే  // సడిసేయకే //

గడపదాటి అడుగు బయటపెట్టిన క్షణం నుంచి తిరిగి గడపలో అడుగు మోపేదాకా ఎన్నెన్ని ఒడిదుడుకులు?
ఎడతెగకుండా మోసిన ఎన్నెన్ని బాధ్యతలు? ఒక బాధ్యత నెరవేరింది అనుకునే లోపే మరో కొత్త బాధ్యత వచ్చిపడటం, ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపే మరో కొత్త సమస్య వచ్చిపడటం వంటివి మనిషిని   నిరంతరం ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. బాధ్యతా నిర్వహణలో, సమస్యా పరిష్కారంలో వీటివల్ల శారీరకంగా, మానసికంగా ఎంత బడలిక? అదీ చాలదన్నట్లు గాలి ఎక్కడెక్కడి నుంచో అప్పటిదాకా కనీవినీ ఎరుగని ఏవేవో సవ్వడుల్ని మోసుకొస్తుంది. ఇవన్నీ నిద్రాభంగం చేసేవేగా! వీటన్నిటినీ చూస్తుంటే,  అతన్ని అనుక్షణం కనుపాపలా కాపాడుకునే అతని ప్రాణేశ్వరి ఎంత తల్లడిల్లిపోతుంది? కాకపోతే, అన్నీ కాకపోయినా, అవరోధాల్లో కొన్నింటినైనా 
అడ్డుకునేందుకు ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది!

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదే // సడిసేయకే//

ఒక రాజ్యాన్ని స్థూలంగా చూస్తూ పోతే ఎన్ని సమస్యలు ఉంటాయో, ఒక కుటుంబాన్ని సూక్ష్మంగా చూస్తే అన్ని సమస్యలూ ఉంటాయి. అందుకే వాటన్నింటినీ ఎదురించడం, లేదా వాటికి ఎదురీదడం ఎవరికైనా పెద్ద యజ్ఞమే అవుతుంది. ఆ యజ్ఞకర్తకు తనదైన రాజ్యమూ, సామ్రాజ్యమూ లేకపోతేనేమిటి?  రత్నాలు పొదిగిన సింహాసనం లేకపోతేనేమిటి? అతడు ఏ రాజునూ తీసిపోడు. ఎందుకంటే అతడు నిర్వర్తించే బాధ్యతల రీత్యా అతడు  ఏ మహారాజుకన్నా తగ్గిపోడు. పైగా, యుద్దం చేసి గెలిచే వాడికన్నా, యుద్దమే రాకుండా నిలువరించేవాడే నిజమైన యోధుడన్నది జగమెరుగని సత్యం కదా! ఆ మాటనే మనసులో ఉంచుకుందేమో! భూపతులనూ, భూసురులనూ కొనియాడినట్టే తన స్వామినీ కొనియాడమంటోంది. రోజువారీ చిలిపి పరుగులూ,  సరదా సరాగాలూ మానేసి, ఈ అభినవ చక్రవర్తిని సేవించి తరించమని గాలితో చెబుతోంది. 

ఏటి గలగలలకే ఎగిరి లేచేనే 
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదిరిందంటే నేనూరుకోనే // సడిసేయకే //

జీవన పోరాటంలో కొందరు రాటుతేలిపోతుంటే,  మరికొందరేమో మరింత సున్నితమైపోతారు. అలాంటి వారి చెవిలో ఏ చిన్న సవ్వడి పడినా అదో పెద్ద  అలజడికి బీజం వేస్తుంది. పైగా ఏటి గలగలలంటే ఉత్త గాలి తరగలనే కాదుగా! ఏటిలో కదలాడే సమస్త ప్రాణికోటి  భావోద్వేగాలెన్నింటినో అభివ్యక్తం చేసే పదునైన గొంతుకలవి! ఆకుల విషయమూ అంతే కదా! ఆకులు తలలాడించడం అంటే అది గాలికి వంతపాడటమేమీ కాదుకదా! ఆ కదలికలు భూగర్భంలోంచి ఎగదన్నుకొచ్చే చైతన్య ప్రకంపననలు. కాకపోతే అవి ఎంత గొప్పవైనా వాటి శబ్దాలు తన ప్రియబాంధవుడి శాంతిని భగ్నం చేసేవే! వాటన్నిటినీ ఆమె ఎలా సహిస్తుంది? అందుకే అతనికి నిద్రాభంగం కలిగించే ఏ చర్యకు పాల్పడినా నేనూరుకోనని అంత కరాఖండిగా చెబుతోంది. ఊరుకోనంటే ఏంచేస్తానని ఆమె ఉద్దేశం? ఏమో ఏంచేస్తుందో ఎవరికి తెలుసు? పరమశివుణ్నే నేలపై పడదోసి ఎదపై పాదం మోపిన ఆదిశక్తి కదా మహిళ! అందుకే ఎలుగెత్తి మదిలోని మాట చెబుతోంది! అంతే కాదు...ఏటిగలగలలనూ, ఆకు కదలికలకూ  ఉసిగొలిపి  పబ్బం గడపాలనుకుంటే ఏమాత్రం కుదరదని పరుషంగానే చెబుతోంది.

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీలి మబ్బుల దాగు నిదుర తేరాదే 
విరుల వీవన పూని విసిరిపోరాదే // సడిసేయకే //

అవునూ...! తానున్న నేలా, నీరూ, గాలీ, నిప్పును వదిలేసి ఈమె ఏకంగా ఆకాశం అండ కోరుతోందేమిటి అనిపిస్తోందా? ఔనుమరి!  పైకి ఎంత నిశ్చలంగా అనిపించినా,  భూతలం పైన మానవజీవన సంఘర్షణ తాలూకు మసి రాలుతూనే ఉంటుంది కదా! అది ఎడతెగని అలజడికి ఆజ్యం పోస్తుంది. ఇక్కడి ప్రతిదీ ఆ అలజడిని మోసుకు తిరిగేదే కదా! అందుకే భూతలాన్ని వదిలేసి  ఈ తరుణి ఆకాశ మార్గం పట్టింది! మురుగు నురుగుల్లేని పండు వెన్నెల పంచ  చేరి, తన స్వామికోసం పాలపుంత లాంటి పాన్పు  కోరుతోంది

వర్షపు చినుకుకు మల్లే మబ్బులు నిద్రను కూడా కురిపిస్తాయనుకుందేమో ఆమె నీలిమబ్బుల్నీ అర్థించింది. తన స్వామి పరవశించేలా పూలగుత్తుల విసనకర్రలతో నిలువెల్లా విసరమంటోంది. సహజంగా, మూడోవారు ఎవరొచ్చినా తనకు ముప్పేనన్న అనుమానం,   ఎక్కడ తన ప్రియతముణ్ని మాయం చేస్తారోనన్న భయం ఏ జంటకైనా ఉంటాయి. అలాంటిది అవేవీ మనసులో పెట్టుకోకుండా, తనతో పాటే అతన్ని సేవించి తరించమని తనే స్వయంగా చెబుతోంది! అసూయా ద్వేషాలకు అతీతంగా ఆమె తన ఔన్నత్యాన్ని చెప్పకనే చెప్పింది.. మహిళామణుల్లో ఆమె మకుటాయమానంగా నిలిచింది!!

                                                                   - బమ్మెర 

====================================


5 కామెంట్‌లు:

  1. All time Favorite andi,master venu gari music,rajasulochana gari expressions, Leela amma tone,woderfull lyrics oka wonder andi, thank u andi maku etuvanti apatha madhuralu icchinanduku

    రిప్లయితొలగించండి
  2. సర్, మన తెలుగు పాటల చిక్కని చక్కని విశ్లెషణ లో మీది అందె వేసీన చేయి. అలతి పొలతి పదాలతో కవి గారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు. ఈ పాట మా పిల్లలకు ఎంతో ఇష్టమైనది. మీ ఈ సంకలనాలన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుంది అని నా భావన. మీకు అనేక కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి