16, జులై 2021, శుక్రవారం

పాటలో ఏముంది?




చిత్రం: కన్నె వయసు (1973) గీతం: దాశరథి, సంగీతం : సత్యం, గానం : బాలసుబ్రహ్మణ్యం

ఊహ తెలిసిన నాటి నుంచి, ఉరుకూ పరుగుల దాకా, పసివయసు నుంచి పరవళ్ల ప్రాయం దాకా ఏ హృదయమైనా,  ఎన్నెన్నో మలుపులు చూస్తూ ప్రయాణం చేస్తుంది. ఏదో పైపైన అని కాదు, పగలూ రేయీ తన కళ్లముందరి పరిణామాలన్నింటినీ  నిషితంగా గమనిస్తూనే ఉంటుంది.  ఒకప్పుడు ఎంతో అపురూపంగా ఉన్నవి, ఆ తర్వాత ఎలా ఎలా మారిపోయాయో తనకు తెలుస్తూనే ఉంటుంది.  వాటిల్లో  జవజీవాలు కోల్పోయి, జీవచైతన్యాన్ని కోల్పోయి, కలుషిత, కల్మషాల కాసారాలుగా మారిపోయినవే ఎక్కువ. మన హృదయాల్ని అవి సహజంగా, సజీవంగా ఉండనీయకపోగా ఒక్కోసారి మన తనువూ, మనసుల్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తుంటాయి. అందుకే, హృదయం ఈ శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలేవీ తాకని ఒక అతీత స్థితిని కోరుకుంటుంది. ఒక నవ్యత్వాన్నీ, దివ్యత్వాన్నీ కోరుకుంటుంది. అలాంటి సమున్నతమైన  కోరికల కొండ శిఖరమే ఈ గీతం.  1973లో విడుదలైన ‘ కన్నెవయసు’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ గీతం, సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం పాడిన నిలువెత్తు భావోద్వేగాల జలపాతం.

ఏ దివిలో విరిసిన పారిజాతమో !!



ఏ దివిలో విరిసిన పారిజాతమో... ఏ కవిలో మెరిసిన  ప్రేమగీతమో....
నా మదిలో నీవై నిండిపోయెనే...... // ఏ దివిలో /

భూమ్మీద కూడా పారిజాతాలు లభించవచ్చేమో గానీ, అవి కూడా ఇక్కడి మాలిన్యాలతో తమ సహజత్వాన్నీ, సజీవత్వాన్నీ ఎంతో కొంత కోల్పోయే ఉంటాయి కదా! ఇలాంటి స్థితిలో ఏ ఆశావహ హృదయమైనా ఏం కోరుకుంటుంది? నిర్మలమైన ఒక నవ్యత్వాన్ని కోరుకుంటుంది. కానీ,  పైకి నవ్యంగా అనిపించినా, ఎంతో కాలంగా ఇక్కడిక్కడే తిరుగుతున్నది, భూమ్మీది దుమ్మూ - ధూళీ, మసీ, రసీ పట్టి తన అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఎంతో కొంత కోల్పోకుండా ఉండదు కదా! అందుకే ఇవేవీ తాకని, వీటన్నింటికీ అతీతమైన ఒక దివ్యత్వాన్ని అందుకు ప్రతిరూపంగా  దివిలోని పారిజాతాన్ని కోరుకుంటుంది. అప్పటిదాకా లేని, ఒక నవకవి హృదయంలోంచి అప్పటికప్పుడు పుట్టుకొచ్చి,  జీవితాన్ని ప్రజ్వలింపచేసే ఒక మణిమయ ప్రేమగీతాన్ని కోరుకుంటుంది. ఆ ప్రేమగీతమేదో వచ్చి వాలి తన హృదయమంతా నిండి పోతే, రసహృదయులకు అంతకన్నా ఏంకావాలి? 

నీ రూపమే దివ్య దీపమై - నీ నవ్వులే నవ్యతారలై 
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే,.... // ఏ దివిలో //

భూమ్మీది ప్రతిదీ కలుషితమవుతుంది ... ఒక నిప్పు తప్ప.  కలుషితం చేయాలన్న కుటిలత్వంతో  ఏదైనా నిప్పు చెంత చేరినా అదే కాలి బూడిదవుతుంది. నిజానికి, నిప్పుతో ప్రత్యక్షబంధమున్న ఏదీ కలుషితం కాదు. నిప్పుతో అంటుకునే దీపమూ కలుషితం కాదు.  అందుకే, ఆ నిర్మలత్వానికీ, దివ్యత్వానికీ ప్రతిబింబంగా మనిషి దీపాన్ని వెలిగిస్తాడు. ఈ యువకిశోరానికి తన  ప్రేయసి ఒక దివ్య దీపంగానే గోచరిస్తోంది. ఆమె నవ్వులు తానున్న నేలకు కోటానుకోట్ల యోజనాల దూరంలో ఉన్న నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. కొవ్వొత్తి దీపాలో, విద్యుద్దీపాలో కాకుండా ఆమె కన్నుల్లో తాను కోరుకున్న వెన్నెల వెలుగులు విర జిమ్ముతున్నాయి. ఇక్కడున్నవన్నీ మలినభూయిష్టమే అనుకున్న  ప్రతిసారీ మానవ హృదయం ఇక్కడివేవీ దరిచేరలేని ఒక అతీత స్థితిని కోరుకుంటుంది. ఆమె రూపం దివ్య దీపంగా అగుపించడానికి గల అసలు కారణం ఇదే! 

పాల బుగ్గలను లేత సిగ్గులు ... పల్లవించగా రావే....
నీలి ముంగురులు పిల్లగాలితో... ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే // ఏ దివిలో //

జీవన చిద్విలాసాల వైపు సాగిపోవడానికి ఎవరికైనా తొలినాటి లేలేత సిగ్గులే బీజాంశాలవుతాయి. చల్లగాలులూ, పిల్లగాలులూ.....,  ముంగురులనే కాదు, హృదయ ఝరుల్ని ఆకాశం వైపు నడిపించే పుష్పకవిమానాలవుతాయి. కాలి అందియలు శ్రవణానందం కలిగించడానికి మాత్రమే కాదు కర్ణపుటాల్లో కమ్ముకున్న మకిలిని తొలగించి, ఒక దివ్యనాదాన్ని ఆలకించేలా చేయడానికి, కావలసిన సున్నితత్వాన్ని అందిస్తాయి. లోకంలో ఏదైనా పుట్టేది... పుట్టిన చోటే కడదాకా పడి ఉండడానికి కాదు కదా! ఉన్నట్లుండి, అది మనల్ని ఎక్కడినుంచి ఎక్కడికో తీసుకువెళుతుంది. అంతిమంగా అది మనల్ని చేరవేసిన స్థావరం, అప్పటిదాకా మనం కనీవినీ ఎరగనిది, కనీసం ఊహించనిదే అవుతుంది.  అదొక అతీత స్థానమే కదా! అనాదిగా మనిషి తపనంతా ఆ అతీతస్థితిని అందుకోవడం కోసమే కదా!  

నిదుర మబ్బులను మెరుపు తీగవై - కలలు రేపినది నీవే....
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే... 
పదము పదములో మధువులూరగా... కావ్య కన్యవై రావే // ఏ దివిలో //

్ఞఅప్పటిదాకా ఆకాశమంతా పరుచుకుపోయిన మేఘాలు కాసేపట్లో కనుమరుగైపోవడం ఎన్నిసార్లు చూడలేదు? వర్షించడం అనే తమ  అసలు లక్ష్యాన్ని మరిచిపోతే, అదే జరిగిపోతుంది మరి! మేఘాలను ఆ స్థితినుంచి మేల్కొల్పడానికే అన్నట్లు, వాటి  మీద ఒక్కోసారి మెరుపు తీగెలు విరుచుకుపడతాయి. వాటి లక్ష్యాన్ని, లేదా అందమైన వాటి కలల్ని గుర్తు చేయడానికే ఆ ప్రయత్నమేదో జరుగుతుంది. నేల పైన పడి ఉన్న వీణపైన ఏ నభోనిలయాల వైపో నడిపించే ప్రణవ నాదాల్ని పలికించడం కూడా అలాంటి ఒక ప్రయత్నమే! అందులో భాగంగా ప్రణయ రాగాలూ పలకవచ్చు. ప్రణయం అంటే అదేమీ గాలితనం కాదు. రెండు ఒకటిగా మారే అద్వైత స్థితే అది. పాతాళాన్నీ, నేలనూ దాటి, మేఘాలూ, నక్షత్రాలూ దాటి, గగనసీమలో జీవన ఝంకారాలు పలికించే ప్రయత్నమది. ఈ అనుభవాలూ, అనుభూతులూ అంతిమంగా అక్షరబద్ధం అయితే అదెంత సార్థకత? ప్రణయ మూర్తి అందమైన ప్రబంధమై, ఆమె ఒక మహాకావ్యంగా అవతరిస్తే అంతకన్నా ఏం కావాలి? ఈ ప్రేమికుడు అదే కోరుకుంటున్నాడు. ఆ మాటకొస్తే, నిండు హృదయమున్న ప్రతి ప్రేమికుడూ అదే కోరుకుంటాడు! ఈ స్థితిలో మనం ఎక్కువగా ఆలోచించడం ఎందుకు? తధాస్తు అనేస్తే మన బాధ్యత తీరిపోతుంది!!

                                                                     - బమ్మెర

=======================================================

9 కామెంట్‌లు:

  1. Very nice song. My mind relaxed after listening song. Thanks to Anjanna garu and Balu garu.

    రిప్లయితొలగించండి
  2. కవి హృదయాంతరాలలోకి వెళ్ళి మీరు చేసిన సత్యాన్వేషణ ఒక విధంగా దాశరధి వారు వింటే (చదివితే) తన కవితా కన్యకు జనించిన పుత్రునిలా భావించి అలవికాని వాత్సల్యంతో మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు. నాకు నచ్చిన ఎన్నో వాక్యాలు ఇక్కడ్ చెప్పలని ఉంది. కాని ఒక్కటి ఇక్కడ: నవ్యత్వం, దివ్యత్వం, సహజత్వం, అంతిమంగా, మనం చేరవలసిన అతీత అనాది మానసిక స్థితికి చేరుకోవటం అంటే ... మానవ జీవన ప్రస్థానానికి సార్థకం .. మొత్తం... ఈ అందమైన పాటలో

    రిప్లయితొలగించండి
  3. What a beautiful meaning and after hearing this song and reading this analysis we can feel proud about our sweat langauge telugu.

    రిప్లయితొలగించండి
  4. Wonderful song very nice meaning in this song superb

    రిప్లయితొలగించండి
  5. Hats off too all the team work to creat such a beautiful song👏 special thanks to Bammera garu for your heart touching analysis👍

    రిప్లయితొలగించండి