పాటలో ఏముంది?
మౌనముగా నీ మనసు పాడిన....!
తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే // మౌనముగా //
ఆనందముతో అమృత వాహినీ ... ఓలలాడి మైమరిచితిలే // మౌనముగా //
గలగలా మాట్లాడటం అదో స్థితి.... మౌనంగా ఉండిపోవడం అదో స్థితి... అటు ఇటు కాకుండా మాటల్నీ, మౌనాన్నీ కలగలిపి మాట్లాడటం అదో స్థితి. ఈ మూడో స్థితి కాస్త గమ్మత్తుగానే ఉంటుంది. మాట్లాడాలా ... వద్దా అనే మీమాంస ఒకవైపు, ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న రవ్వంత భయం ... ఒక వైపు చేరినప్పుడు ఇలాగే ఉంటుంది! ఒక్కోసారి సిగ్గూ బిడియాలు కూడా మాట పెగలనీయవు. ఏమైనా ఇవన్నీ పెదాలకు పెద్ద పరీక్షలాంటివే గుండె దిటవు చేసుకుని, అతి కష్టం మీద పెదాలు కదిపినా, ఆ కదలికలు వింతగానే ఉంటాయి. మాట్లాడే వారికి ముచ్చెమటలు పోస్తుంటే, ఎదుటి వారికి అది ముచ్చటగానే అనిపించవచ్చు. తరళ తరళంగా వచ్చే ఆ మాటలు ఏదో తేనెలు కురిసినట్లే అనిపించవచ్చు! అదో అమృత ధారలా కూడా అనిపించవచ్చు. ఆ అమృత వాహినిలో ఓలలాడే వారు ఇక మైమరిచిపోతే మాత్రం ఆశ్చర్యపోవలసింది ఏముంది? ఒకటి మాత్రం నిజం! ఎన్ని మీమాంసలు ఉన్నా, సిగ్గూ బిడియాలు ఎంతగా కట్టిపడేస్తున్నా, తప్పనిసరిగా చెప్పాల్సిన మాటల్ని చెప్పే తీరాలి! ఎందుకంటే, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం ఎంత ప్రమాదమో, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండిపోవడం కూడా అంతే ప్రమాదం కదా మరి!
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ, వలపు పాశమని బెదరితిలే // మౌనముగా //
ఏదో చూసి మరేదో అనుకోవడం... మనుషులకది మామూలే! ఒక రకంగా అది మనిషిని అనాదిగా పీడిస్తున్న మానసిక రుగ్మతే! ఆమె ఏదో మరియాద కోసం మందహాసం చేసిందే అనుకోండి! అది తనను ఏలుకోవడానికి చేసిన సంకేతమే అనుకుంటే ఎలా? ఉక్కపోతతో చెమట పట్టి మెడంతా చిరాకు పెడుతుంటే, జెడను పక్కకు జరిపే చిన్న ప్రయత్నమేదో చేసిందే అనుకోండి! దాన్ని వలపు పాశమే అనుకోవడం సబబేనా? ఇలాంటి తొందరపాటు ప్రతి స్పందనల వల్లే చాలా మంది యువకిశోరులు అమ్మాయిల దృష్టిలో లోకువైపోతుంటారు. ఒక్కో ముఖ కవళిక వంద రకాల భావాలను చెబుతుంది. ఇది అదేనని, అది ఇదేనని, నువ్వు ఆశించినదేదో వాళ్లకు ఆపాదించి ఊగిపోతే ఏమిటి అర్థం? జడ విసరడమో, పూలు ఎగజల్లడ మో నిన్ను ఆటపట్టించడానికైనా కావచ్చు కదా! అవన్నీ సరే గానీ, వలపు పాశమని తెలియగానే బెదరిపోయానంటాడేమిటి? కథ అలాగే ముందుకు సాగి పెళ్లి దాకా వెళితే, ఆ బాధ్యతలు ఎవడు మోస్తాడనేనా? ఏదో మాట వరుసకు ఇలా ప్రశ్సిస్తున్నానే గానీ, అంత దాకా వ చ్చిన వాడు బాధ్యతలకు భయపడతాడా? ఏది ఏమైనా వారు ఊహించుకుంటున్నది నూటికి నూరు పాళ్లూ తప్పేనని నేనేమీ అనడం లేదండోయ్! అదే అయినా కావచ్చు. అదే జరిగితే సంతోషమే! ఒకవేళ అలా జరగకపోతేనో...! ఏదో కారణంగా కథ అడ్డం తిరిగితేనో ! అది అంతులేని మనస్తాపానికి గురిచేసే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం! అంతే తప్ప ఎవరినీ నిరత్సాహపరిచే తలంపు నాలో ఏ కోశానా లేదు! అయినా, వాళ్లనుకున్నదే నిజమైతే నాకైనా, మీకైనా ఏమిటి నష్టం? పైగా లాభం కూడా! అలా వెళ్లి, నాలుగు అక్షింతలు వేసి, నిండుగా పెళ్లి భోజనం చేసి బయటపడటంలో , నిజంగా ఎంత సుఖం, ఎంత సంతోషం, ఎంత ఆనందం! తొందరలోనే ఆ శుభదినం రావాలని మనసారా కోరుకుందాం మరి!!
- బమ్మెర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి