3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఓహో గులాబి బాలా పాట | మంచి మనిషి ( 1964) సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?


ప్రేమలూ... పెళ్లిళ్లు....
అంతకు ముందెప్పుడో ఈ బంధాల్లో పడి పోయిన వారికి ఈ మాటలు చాలా చాలా పాతవి. కొత్తగా, ఇప్పుడిప్పుడే ఈ బంధాల వైపు చూడటం మొదలెట్టిన వారికైతే ఇవి పూర్తిగా కొత్తవి. పైగా అపురూపమైనవి.. అద్భుతమైనవి. వాళ్ల దృష్టిలో అవి జీవితాన్ని ఒక స్వప్నసీమగా  మలిచేవి, ఒక దివ్యలోకంలోకి నడిపించేవి!! ఇంతే కాదు... భూమ్యాకాశాలను ఒక్కటి చేసేవి.. భూమ్యాకాశాలకు అతీతంగా కూడా తీసుకువెళ్లేవి ! సత్యాసత్యాల విషయాన్ని అలా ఉంచి, ఈ భావాలూ, భావోద్వేగాలు మౌలికంగా అంతకు ముందెప్పుడూ  కనీవినీ ఎరుగనివి! కాకపోతే, వాటి వెంటబడి నడుస్తున్న క్రమంలో తమ జీవితాల్లో ఏం జరుగుతోంది? తాము ఏమైపోతున్నాం? అన్న విషయాలు చాలా రోజుల దాకా అసలేమీ అర్థం కావు. ఎప్పటికో అవేమిటో అర్థమైపోయినా,అప్పటికే చాలా  మంది జీవితం చేజారిపోతుంది. ఇలా అయిపోయిందేమిటా అని వగచి వగచి, జీవితంలో ఈ తరహా విపరిణామలేవీ ఇంకా చోటుచేసుకోకముందే ఎవరైనా గట్టిగా హెచ్చరించి ఉంటే ఎంత బావుండునో కదా అనిపిస్తుంది! కథాంశాన్నీ, ఆ పాట సాగిన సందర్భాన్నీ పక్కన పెట్టి, విడిగా వింటే,  మంచి మనిషి ( 1964) సినిమాలోని ఈ పాట యువతరానికి ఒక హెచ్చరికల గుచ్చమే! దాశరధి రాసిన ఈ పాటకు ఎస్‌. రాజేశ్వరరావు, టి. చలపతి రావు సంయుక్తంగా సంగీతం సమకూర్చారు. గాయకుడు  పి.బి. శ్రీనివాస్‌ను ఎప్పటికీ మరిచిపోకుండా చేసిన అరుదైన పాటల్లో ఇదీ ఒకటి!

ఓహో గులాబి బాలా..!



ఓ,... ఓ... గులాబీ.... ఓ... ఓ..... గులాబీ....
వలపు తోటలో విరిసినదానా....
లేత నవ్వుల వెన్నె సోనా.....

అప్పుడప్పుడే వలపు తోటలో విరిసిన లేత గులాబి ..... నిజంగా ఎంత సొగ సైనది? అత్యంత సున్నితమూ, సమనోహరమూ అయిన గులాబిలో నిజంగా ఎంత భావుకతో కదా! బ్రతుకంటే దానికి హాయిగా సాగే ప్రేమ సరాగాల సమీరమే! జీవితమంటే పున్నమి వెన్నెలే! ఆనందాల ఆకాశమే! నిజానికి అది ఎవరికైనా కలగాల్సిన అత్యంత సహజమైన అనుభూతి! ఎందుకంటే, జ్ఞానులు చెప్పినట్లు, ప్రపంచంలో ఆనందమొక్కటే సత్యం! అందుకు విరుద్ధమైనవన్నీ అసత్యాలే! అవన్నీ మానవ సృష్టే! వీటివల్ల లోకంలో  రోజురోజుకూ అసత్య  పరిణామాలు  ఎక్కువై, సహజాతమైన సంతోషాలు, ఆనందాలు బాగా తగ్గిపోవడంతో...  లోకమంటే, వ్యధలూ, భాదలూ, కష్టాలూ, కన్నీళ్లే అని చెప్పాల్సిన గతి పట్టింది! కళ్లముందున్న వాస్తవాల్ని ఎవరు మాత్రం కాదనగలరు? అయితే, ఈ పరిణామాలేవీ, అప్పటికింకా ఏమాత్రం అనుభవంలోకి రాని, జీవితానికి మరో పార్శ్వం కూడా ఉంటుందని అసలే తెలియని ఓ స్థితిలో ఒక అమాయకపు గులాబి ఏం చేస్తుంది? నిర్మల హృదయంతో వెన్నెల కెరటాల పైన తేలాడుతూ, పరిమళాల్ని వెదజల్లుతుంది. ఇంకో అడుగు ముందుకేసి,  నిత్యం తన కనుసన్నల్లో కదలాడే వారి పైన అప్పుడప్పుడు నునులేత నవ్వుల్ని వెదజల్లుతుంది. పరవశాన జీవన రాగాల్ని ఒలికిస్తుంది. అయితే కొంత మంది తెలివైన వాళ్లు,  దీన్నే సొమ్ము చేసుకుంటారు. ఫలితంగా అంతా తారుమారు అయిపోతుంది. జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి! 

ఓహో గులాబి బాలా .. అందాల ప్రేమమాల...
సొగసైన కనుల దానా... సొంపైన మనసు దానా 
నీవారెవరో తెలుసుకో... తెలుసుకో... తెలుసుకో
ఓహో గులాబిబాలా .... అందాల ప్రేమమాల

తొలుత హృదయంలో పూసిన ఒక్క గులాబి, ఆ తర్వాత వేయి గులాబీలుగా విస్తరించి ఒక నిండు ప్రేమమాలగా అవతరిస్తుంది. ఆలస్యమైతే అది ఎక్కడ వాడిపోతుందోనని తొందరపడి, ఆ హృదయం తనకు బాగా సన్నిహితంగా మసలుతున్నవారి మెడలో ఆ  మాల వేసేస్తుంది. కానీ, అంతకన్నా ముందు ఆ వ్యక్తి ఎవరో, అతని మూలాలేమిటో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. మానవ ఆకారంలో ఉన్నవాళ్లంతా మానవులే అనుకుంటే ఎలా? లోకంలో మానవ ఆకారంలో తిరుగాడుతున్న మృగాలెన్నో ఉన్నాయి మరి!
మనసు స్వార్థంతో నిండిపోయిన  ప్రతి వాడూ, నేను నీ వాణ్నే అంటాడు. నేను పుట్టిందే నీకోసం అని చెబుతాడు. అలా ఎవరో చెప్పినవన్నీ నిజమేనని నమ్మేస్తే ఎలా? తానెవరో, తనవారెవరో తెలుసుకోవడం పుట్టిన ప్రతి మనిషి కనీస బాధ్యత కదా! ఆ ప్రయత్నమేదీ చేయకుండా తీయని మాటలు చెప్పే వ్యక్తిని మనసున్నవాడని భ్రమపడితే ఎంత ప్రమాదం?

కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు 
మోసం చేసీ, మీసం దువ్వే మోసకారులకు లొంగేవు... లొంగేవు // ఓహో గులాబి //

నువ్వే నేనని .... నేనే నువ్వని అదే పనిగా అద్వైత సిద్ధాంతం చెబుతుంటే, వినడానికి ఎంత మనోహరంగానో అనిపిస్తుంది. ఈ జివితంలో, ఈ లోకంలో తనకు ఇంకేం కావాలనిపిస్తుంది? ఇంకేముంది? ఉద్వేగాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, మునుపెన్నడూ చూడని మార్గాల్లో  గమ్యమే తెలియని ప్రయాణం ఒకటి మొదలవుతుంది. ఆ దశలో, తన శరీరమే తన మనసును నడిపిస్తోందా? తన మనసే తన శరీరాన్ని నడిపిస్తోందా? అసలేమీ అర్థం కాదు! వయసో లేదా మనసో, లేక రెండూ ఏకమయ్యో తెలియకుండానే  వారిని ఒక  మహా ప్రవాహంలోకి తోసేస్తాయి!  వాస్తవం ఏమిటంటే, ప్రవాహంలో  కొట్టుకుపోతున్న చాలా మందికి ఏది ఉచితమో, ఏది అనుచితమో పెద్దగా ఏమీ అర్థం కాదు! తమ భావోద్వేగాలు క్షణికమైనవా?  శాశ్వతమైనవా? ఇదీ అర్థం కాదు ఏమైనా వేవేల భావోద్వేగాల వెల్లువలో జీవనబంధాల్లోకి  ప్రవేశిస్తారు.కాకపోతే వారిలో కొందరు అనతి కాలంలోనే ఆ వెల్లువలోంచి బయటికొచ్చి, వాస్తవికంగా జీవించడం మొదలెడతారు. వారి జీవితాలు ఎంతో కొంత సాఫీగానే సాగిపోతాయి. ఆవేశమే తప్ప, పెద్ద ఆలోచనలేని కొందరి జీవితాలేమో దుర్బరంగా, శృతి మించితే, ఎంతో దుఃఖధాయకంగా గడుస్తాయి! ఈ పరిణామాల వెనుక ఆలోచనాగతమైన స్వీయ లోపాలు కొంత కారణమైతే, కొందరి విషయంలో తాను నమ్మిన వారి ద్రోహ చింతన కూడా కారణం కావచ్చు. కాకపోతే, ఆ ద్రోహుల ఉక్కు పంజాలో బాగా ఇరుక్కుపోయే దాకా చాలా మందికి ఆ నిజం తెలిసి రాదు. అయితే,  గొప్ప ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఉన్నవారు  ఆ దశలోనూ ఎదురు తిరిగి, ఎలాగోలా బయటపడతారు ఆ శక్తి కొరవడిన వారేమో ఆ కోరలకు బలైపోతారు. కొన్ని తేనె పూసిన కత్తులు ఉంటాయి. అవి నాలుక తెగేదాకా తేనెలే ఒలికిస్తాయి. కొన్ని గండు తుమ్మెదలు ఉంటాయి. అవి నిన్ను పూర్తిగా వశం చేసుకునే దాకా గందర్వగానమే చేస్తాయి,. ఆ తర్వాత చివరి రక్తపు బొట్టు కూడా తాగేసి చిద్విలాసం చేస్తాయి. 

రూపం చూసీ వస్తారు... చూపుల గాలం వేస్తారు   
రేకులు చిదిమీ - సొగసలు నులిమీ .. చివరకు ద్రోహం చేస్తారు. 
చివరకూ ద్రోహం చేస్తారు... // ఓహో గులాబి //

అసలు  సిసలైన ప్రేమ హృదయులు మరీ అంత ఎక్కువగా మాటలేమీ చెప్పరు. నిండు మనసుతో జీవితంలోకి స్వాగతిస్తారు. తెరచిన పుస్తకంలాంటి తన జీవితాన్ని కళ్లముందు ఉంచుతారు. నాటకీయంగా వచ్చిన వాళ్లే చాలా మాటలు చెబుతారు. మోహం కాదు. నీ మనసును నేను ప్రేమిస్తున్నా ... నీ ఆస్తులూ, ఐశ్వర్యాలూ కాదు, నీ వ్యక్తిత్వాన్ని నేను ఆరాధిస్తున్నా అంటూ వంచనకు వన్నెలద్ది  ఎన్నెన్ని మాటలో చెబుతారు. ఆ గొంతులోని మార్దవమో, ఆ మాటల్లోని మాధుర్యమో, అతను చెప్పిందంతా నిజమేనని నమ్మేలా చేస్తుంది. నిజానికి, అసలే నమ్మని వాళ్లను లోకంలో ఎప్పుడూ ఎవరూ వంచించలేరు. అందుకే వంచించాలనుకునే వాళ్లు, ముందు బాగా నమ్మించే  ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి నమ్మారంటే వారి పన్నాగం ఫలించినట్లే. అలా ఒకసారి వారి వ్యూహంలో పడిపోతే చాలు.. ఆ వెంటనే నీ శ్వాసను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. జీవితానికి ప్రాణాధారమైన గుండెనే తమ గుప్పిట్లోకి తీసేసుకుంటారు. చివరికి నువ్వు నువ్వుగా మిగలకుండా చేస్తారు. అందువల్ల ప్రేమలో భావావేశమే కాదు... వివేకం కూడా ఉండాలి. అదే ఉంటే, ఎప్పటికప్పుడు పరిస్థితి అర్థమైపోతుంది. ఏదో మోసం ఉందని బోధపడినప్పుడు, ఒక తిరుగుబాటు జెండా ఎగరేయడానికి మనసు సమాయత్తం అవుతుంది. చాలా మందికి ఆత్మస్థైర్యం చాలక .... ఇంకేముంది? అంతా అయిపోయింది అనుకుంటారు గానీ, ఎదురు తిరగడానికి గడువు ఎప్పుడూ ఉంటుంది. నీ జీవితాన్ని పూర్తిగా నీ చేతుల్లోకి  తిరిగి తీసుకోవడానికి నీ ప్రతి రక్తపు బొట్టూ నిత్యం నీకు తోడై, పెద్ద దిక్కై నిలుస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం!!

                                                                 - బమ్మెర 

1 కామెంట్‌: